Wednesday, December 11, 2013

'అణగారిన' దృష్టికోణంలో చరిత్ర - డా. కాలువ మల్లయ్య

దేశచరిత్ర చూసినా/ఏమున్నది గర్వకారణం?/నరజాతి చరిత్ర సమస్తం/పరపీడన పరాయణత్వం' అని అంటూ 'తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు?' అని ప్రశ్నించారు మహాకవి శ్రీశ్రీ. అయినా జరుగుతున్నదేంటి? రాజుల, రాణుల, నాయకుల చరిత్ర మాత్రమే చరిత్రగా పుస్తకాలకెక్కుతుంది. వాటినే చరిత్రగా చదువుకుంటున్నాం. ఆ యుద్ధాల్లో అసువులు బాసినవారు కాని, దేశ నిర్మాణంలో చెమటోడ్చి ప్రాణాలర్పించిన వారు కాని, చారిత్రక భవన నిర్మాణాల్లో ప్రాణాలు కోల్పోయిన సామాన్యులుకాని చరిత్రకెక్కడం లేదు. ప్రజలే చరిత్ర నిర్మాతలని బరువైన మాటలు చెప్పబడినా చరిత్ర నిర్మాణంలో ప్రజల పాత్రను పట్టించుకున్నవారు లేరు. అంతే కాకుండా రాజుల కాలం నాటి చరిత్రను హిందూ అగ్ర వర్ణ చారిత్రక దృష్టితోనూ, తర్వాతి చరిత్రను ఆంగ్లేయుల పాశ్చాత్య దృష్టికోణంతోనూ రాయడం జరిగింది. ఏ కాలంలోనూ ఈ దేశంలోని సామాన్య మానవుడు, నిజమైన చరిత్ర నిర్మాతలు, సంపదల సృష్టికర్తలైన అణగారిన జాతుల వారు చరిత్ర పుటల్లోకి ఎక్కలేదు.
రాజులు, రాణులు మాత్రమే కాదు సామాన్యులమైన మనమందరం కూడా చరిత్రకెక్కదగిన వారమేనని సాహిత్య ఆధారాల ద్వారా వెయ్యేండ్ల తెలుగువారి సాంఘిక చరిత్రను 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర'గా రాసిన మొట్టమొదటి ప్రజాస్వామిక చరిత్రకారుడు సురవరం ప్రతాపరెడ్డి. అయితే ఇది కేవలం సాంఘిక చరిత్ర మాత్రమే. ఆయా కాలాల్లో ప్రజల ఆచార వ్యవహారాలు, అలవాట్లు, పనిముట్లు, ఆహార విహారాదులు మన సాహిత్య గ్రంథాల్లో వర్ణించిన తీరును ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఇది మాత్రమే కాదు ప్రజలను చరిత్ర నిర్మాతలుగా నిలబెట్టడానికి ఆయా కాలాల్లో సాంస్కృతిక, ఆర్థిక, చారిత్రక నిర్మాణంలో ప్రజల త్యాగాలను, ప్రజల పాత్రను వాస్తవ దృష్టితో రాసినప్పుడు అది ప్రజల చరిత్ర అవుతుంది. చరిత్ర నిర్మాతల చరిత్ర అవుతుంది. అలాంటి చరిత్రలు ఇంతవరకూ రాలేదు. అలాగే తెలంగాణ చరిత్ర విషయంలోనూ కోస్తాంధ్ర అగ్రవర్ణ దృష్టి కోణమే రాజ్యమేలుతుంది.
అల్లూరి సీతారామరాజును గ్లోరిఫై చేయడం, కొమురం భీంను విస్మరణకు గురిచేయడం, కోస్తాం ధ్ర సంస్కృతీ ఆచార వ్యవహారాలను, పండుగలను ఉన్నతీకరించడం, బతుకమ్మ లాంటి ప్రధాన పండుగలను కూడా విస్మరించడం వెనుక కూడా ఇదే దృష్టి కోణముంది. అలాగే రెండూ రాచరిక పాలనలే అయినా రాయల పాలనను స్వర్ణయుగంగా ఉన్నతీకరించి నైజాం పాలనను ఫ్యూడల్ పాలనగా చిత్రించడం కూడా ఇందులో భాగమే. నిజానికి రజాకారుల విజృంభణను మినహాయిస్తే నిజాం పాలన ఏ ఇతర రాజుల పాలనకూ తీసిపోదు. కోస్తాంధ్ర చరిత్రకారులకు ఆంగ్లేయుల పాలనలో ప్రజాస్వామ్యం, ఆధునికత కనిపించడం, నిజాం పాలనలో ఉన్న మంచినేమాత్రం గుర్తించకుండా చివరి రోజులనే చరిత్రగా రాయడం వెనక ఉన్నది కూడా ఆధిపత్య భావనయేనన్నది వాస్తవం. భారతదేశానికే సాయుధ పోరాట వారసత్వాన్ని అందించిన తెలంగాణ పోరాటాన్ని కొందరు కేవలం నైజాం వ్యతిరేక పోరాటంగా చిత్రించడం కూడా ఇందులో భాగమే. ఏదిఏమైనా చరిత్ర రచనలో ఎవరి వాటా వాళ్ళకు ఇవ్వడంలో అగ్రవర్ణ, పాలక వర్గాల దృష్టి కోణం నుంచి తప్ప అణగారిన జాతుల దృష్టికోణం అన్ని కాలాల్లోను విస్మరణకు గురవుతూనే ఉంది. సాహిత్య, సాంస్కృతిక, సాహిత్య, చారిత్రక రంగాలన్నిటిలోనూ ఇదే పద్ధతి కొనసాగుతుంది.
ఇటీవలి కాలంలో మంద కృష్ణ మాదిగ నిర్వహించిన 'అమరుల తల్లుల కడుపుకోత' మహాసభ ఇలాంటి విషయాలెన్నిటినో బయటకు తెచ్చింది. చరిత్రలో అణగారిన వర్గాల స్థానం గురించి ప్రశ్నించేట్టు చేసిం ది. స్వాతంత్య్రానంతర కాలంలో కాని, అంతకు ముందుకాని తెలంగాణ లో వేలాది మంది అణగారిన జాతుల ప్రజలు బలిదానాలు చేశారు. తెలంగాణ కోసం, భూమికోసం, భుక్తికోసం, ఫ్యూడల్ వ్యవస్థ నిర్మూలన కోసం తమ ప్రాణాలను అర్పించారు. నైజాం వ్యతిరేక, భూపోరాటాల సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల బలిదానాలతో పాటు ఎంతో మంది అణగారిన కులాల వారు బలయ్యారు. ఈ వర్గాల వారు, ఎవరి పాలన ఉన్నా గ్రామాల్లో దొరల పీడనను అనుభవించారు. అయితే వీళ్ళకు ఆ తర్వాతి చరిత్రలో లభించిన స్థానం ఏమిటి? స్వాతంత్య్రానంతరం కానీ, అంతకు ముందు కాని ప్రత్యేక తెలంగాణ పోరాటంలో చనిపోయిన 369 మందిలో మూడువందల మందికి పైగా పీడిత కులాలకు చెందిన వారే. నలభైఏళ్ళుగా తెలంగాణలో జరుగుతున్న భూపోరాటాల్లోనూ ఈ వర్గాలవారే మెజారిటీ ప్రజలు సమిధలుగా మారారు. అయితే వీటన్నింటిలోనూ నాయకత్వం, పోరాటఫలాలు దక్కించుకున్నది అగ్ర కులాలవారే. చరిత్రలో వీళ్ళకు లభించిన స్థానం దాదాపు శూన్యం. గత పన్నెండేళ్ళుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతస్థాయిలో కొనసాగుతుంది. వెయ్యినుంచి పన్నెండు వందల వరకు విద్యార్థులు, యువకులు ఈ ఉద్యమంలో మరణించారు.
ఇంతమంది త్యాగా ల ఫలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతుంది. ఈ ఉద్యమంలో మరణించిన వాళ్ళంతా ఎవరు? రేపు తెలంగాణ వస్తే వీళ్ళకిచ్చే నివాళి ఏమిటి? వీళ్ళ ప్రాణ త్యాగాలకు కట్టే విలువేమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది కడుపుకోత మహాసభ. వీటికి సమాధానాలను వెతుక్కున్నేట్టు చేసింది. మంద కృష్ణ మాదిగ ఏ ఉద్దేశంతో, ఏ ప్రయోజనం కోసం కడుపుకోత మహాసభ నిర్వహించినా చరిత్ర నిర్మాణంలో అణగారిన జాతులకు ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రశ్నించేట్టు చేసింది. ఆ మహాసభలో మాట్లాడిన అమరుల తల్లుల మాటలు అక్కడున్న వేలాది మంది హృదయాలు ద్రవించేట్టు చేశాయి. అందరి కనుగడ్ల నిండా కన్నీళ్లను నింపాయి. చాలా మందిని భోరు భోరున ఏడ్చేట్టు చేశాయి. తెలంగాణ అమరవీరుల గురించి అందరూ ఆలోచించేట్టు చేసాయి.
ఓ దిక్కు వేలాది మంది తెలంగాణ తల్లులు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తనయులకోసం కడుపుకోతతో అలమటిస్తుంటే సీమాంధ్ర తల్లులు తమ కుమారులు, కుమార్తెల భవిష్యత్తు ఏమిటని హైదరాబాద్‌లో ఉద్యోగాల గురించి మాట్లాడటం ఎంత అసహజమో అర్థమవుతుంది గదా. హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాలవారి లాగే తమ బిడ్డలూ ఉద్యోగాలు చేసుకోవచ్చన్న విషయం వాళ్ళకు తెలియదా? హైదరాబాద్‌లో సీమాంధ్రులు ఉద్యోగం చేసినంతమంది రేపటి సీమాంధ్ర రాజధానిలో తెలంగాణ వాళ్లు ఉద్యోగాలు చేయడానికి సీమాంధ్ర తల్లులు ఒప్పుకుంటారా? ఓ దిక్కు సీమాంధ్ర తల్లులు అసహజమైన డిమాండ్ల తో తెలంగాణను అడ్డుకుంటానికి ప్రయత్నిస్తుంటే సీమాంధ్ర నాయకు లు చేస్తున్నదేమిటి? పొట్టిశ్రీరాములు త్యాగాన్ని వేయిమంది+369 మంది త్యాగాలకంటే గొప్పదిగా ప్రచారం చేయడం ఎంత అమానుషం? తెలంగాణ తల్లుల కడుపుకోతను పట్టించుకోకుండా అమరవీరుల త్యాగాలకు ఏ మాత్రం విలువీయకుండా తమ ఆధిపత్యం కోసం, ఆర్థిక దోపిడీ కోసం సీమాంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకోవాలని చూడటం వెనుక ఎంత మోసకారితనముంది? హైదరాబాద్‌తో తెలంగాణ పౌరులకున్న నాలుగువందల పైచిలుకు ఏండ్ల పేగు బంధాన్ని కాదని, యాభై ఏండ్లు రాజధానిగా ఉన్న కర్మానికి యు.టి.చేయాలని వాదించడం సీమాంధ్ర రాజకీయల కుట్రలో భాగమే కదా. ఇలా సీమాం ధ్రులు వెయ్యి మంది ప్రాణ త్యాగాలను, అంతకు ముందు జరిగిన నాలుగువందల మంది ప్రాణ త్యాగాలను కించ పరచటం ఎంత అమానుష చర్యో అర్థమవుతుంది కదా! వీళ్ళంతా తెలంగాణలోని అణగారిన జాతుల ప్రజలేనన్నది కాదనలేని సత్యం.
చరిత్రలో అణగారిన జాతులకు తగిన స్థాన మివ్వాలన్నా, వారి త్యాగాల రుణం చెల్లించుకోవాలన్నా చరిత్రను ఆధిపత్య జాతుల, ఆధిపత్యకులాల దృష్టి కోణంలోంచి కాకుండా అణగారిన జాతుల, కులాల దృష్టి కోణంలోంచి రాయాలి. ప్రపంచరిత్రను పాశ్చాత్య తెల్ల జాతుల వారి దృష్టికోణం లోంచి కాకుండా పీడిత, నల్ల జాతులవారి దృష్టి కోణంలోంచి రాసినప్పుడే సరైన న్యాయం జరుగుతుంది. అలాగే భారత దేశచరిత్రను పాశ్చాత్య, బ్రాహ్మణీయ, ఆర్యజాతుల దృష్టికోణంలోంచి కాకుండా దేశీయ, ద్రావిడ, పీడితకులాల దృష్టి కోణం లోంచి చూసి తీరాలి. తెలంగాణ చరిత్రను కూడా ఇలాంటి దృష్టి కోణం లోంచి చూడాలని అమరుల తల్లుల కడుపుకోత మహాసభ రుజువు చేసింది. అదే సరైన చారిత్రక దృష్టికోణమవుతుంది. మానవీయ దృష్టి కోణమూ అవుతుంది. అందుకోసం సీమాంధ్ర రాజకీయులు, ప్రజలు మరిన్ని బలిదానాలు జరుగకుండా తెలంగాణ ప్రక్రియ వేగవంతం కావడానికి అడ్డంకులు వేయకూడదు. తెలంగాణ లోని రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశమున్నా అణగారిన జాతుల్నుంచి వచ్చిన వ్యక్తి పీడిత కులాల అధికారం, సామాజిక న్యాయం ధ్యేయంగా, సిద్ధాంత బలంతో ముఖ్యమంత్రి అయి తీరాలి. ఆ దిశగా రాజకీయాలు నడవాలి.
తెలంగాణ వస్తే అణగారిన జాతుల, పీడితకులాల వారి బతుకులు బాగుపడుతాయని తెలంగాణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలు త్యాగం చేసిన వెయ్యి మంది అమరుల పేరు మీద అమరుల స్మారక పార్కును ఏర్పాటు చేయడం సముచితమైన చర్య. ఇందులో వెయ్యిమంది అమరవీరులు విగ్రహాలను ఏర్పాటు చేసి దాన్ని పర్యాటక స్థలంగా తీర్చి దిద్దాలి. దీన్ని త్యాగమూర్తుల స్ఫూర్తిదాయక కేంద్రంగా రూపొందించాలి. మొదటిసారి జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోవడానికి కారకుడైన అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీదున్న పార్కును అమరవీరులు స్మారక పార్కుగా తీర్చిదిద్దడమే సరైన చర్య. అంతేకాకుండా హైదరాబాద్ నడిబొడ్డులో అమర వీరుల స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయాలి. అమరుల కుటుంబాలకు తెలంగాణ రాజ్యాధికారంలో తగిన పాత్ర ఇవ్వాలి. మొత్తంగా సిద్ధాంత బలంతో కూడిన సామాజిక న్యాయ తెలంగాణ ఏర్పడినప్పుడే అమరుల త్యాగాలకు సరైన నివాళి ఇచ్చినట్టువుతుంది. ఇలాంటి తెలంగాణ చరిత్ర రచన, చరిత్ర నిర్మాణం, చరిత్ర నిర్మాణంలో అణగారిన జాతుల దృష్టి కోణం భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ప్రపంచ చరిత్ర నిర్మాణానికి మార్గదర్శకమవుతుంది. అందుకోసం అమరవీరుల పార్కు స్ఫూర్తి ప్రదాతగా ఉండేట్టు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సంతకం పార్కు నిర్మాణంకు సంబంధించిన ఫైలు మీద చేసి తీరాలి.
-డా. కాలువ మల్లయ్య


Andhra Jyothi Telugu News Paper Dated : 11/12/2013 

No comments:

Post a Comment