Wednesday, December 11, 2013

సామాజిక శాస్త్రాల ఊసేదీ? - డాక్టర్ మనోహరి వెలమాటి

సామాజిక శాస్త్రాల అవసరం, ప్రాధాన్యం మానవ సంబంధాలు ఉన్న అన్ని రంగాలతోనూ పెనవేసుకుని కనిపిస్తున్నా ఆ శాస్త్రాలకు ప్రోత్సాహం కొరవడింది. తత్ఫలితంగా ఒక కొత్త సమాజాన్ని నిర్మించగల ఎందరో గాంధీలను, గురజాడ అప్పారావు వంటి రచయితలను, వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తలను మన సమాజం కోల్పోతోంది.
ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ సామాజిక శాస్త్రాల అభివృద్ధి తప్పనిసరి. సామాజిక శాస్త్రాలకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అనే దానిపై అక్కడి సమాజ పురోగతి కూడా ఆధారపడివుంటుంది. మన చరిత్ర పుటలను చూస్తే సామాజిక శాస్త్రమనేది మానవజాతి అభివృద్ధిలో అంతర్లీనమైన భాగం. అభివృద్ధిచెందిన దేశాల విశ్వవిద్యాలయాలలో సామాజిక శాస్త్ర పరిశోధనా సంస్కృతికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. సామాజిక శాస్త్రాలకు ఎందుకు ప్రాధాన్యమివ్వాలంటే వాటి విజ్ఞానం మెరుగైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుంది. అందరికీ సామాజిక శాస్త్రాల ఉపయోగం కనిపించకపోవచ్చు.
ఎందుకంటే వాటి ప్రభావం దీర్ఘకాలంలో కాని తెలియదు. మనం రోజువారి సమస్యలు ఎదుర్కోవటంలో అతి పెద్ద సవాలు సాంకేతికపరమైనదో లేక మేనేజ్ మెంట్ సంబంధమైనదో కాదు. ప్రజలు, వారి వైవిధ్య సంస్కృతులు, ఇష్టాలు, ప్రాధాన్యాలు, అవసరాలను డీల్ చేయటమే అతిపెద్ద సవాలు అని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇప్పుడున్న ఎన్నో రాజకీయ, సామాజిక సమస్యలకు చారిత్రక రెఫరెన్స్ తో ఒక అర్థవంతమైన విశ్లేషణను ఇవ్వగలిగినవారు చరిత్రకారులు. పురావస్తు శాస్త్రవేత్తలే లేకపోతే భారతదేశపు మహోన్నత సింధులోయ నాగరికత గురించి ప్రపంచానికి తెలిసి ఉండేదా? స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎందరో దేశభక్తులు, సమాజ హితం కోరుతూ ప్రజలను ఉత్తేజపరిచి పోరాటాలను జరిపిన నాయకులు, రచయితలు సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేసిన వారే. జాతిని ప్రభావితం చేసిన ఎందరో మహానుభావులు నడిచింది సామాజిక శాస్త్రాల బాటలోనే. వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రజల ప్రవర్తనపై పథకాల ప్రభావం - ఈ కోణాలన్నిటినీ సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు.
తద్వారా అవసరమైన పథకాలను సూచించి, మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడతారు. ఒక ఇంజనీర్ , సాంకేతిక పరిజ్ఞానంతో ఒక మరుగుదొడ్డి నిర్మాణ ం చేయగలవచ్చు. కాని దాన్ని సంఘం ఆమోదించేలా చేసి, పారిశుధ్యాన్ని సాధించటానికి కార్యక్రమాలను రూపకల్పన చేసే సామాజిక శాస్త్రవేత్త లేనిదే అబివృద్ధి అసాధ్యం. మానవ జాతి ఏ దిశలో ప్రయాణం చేస్తుంది, భవిష్యత్ తరాలు ఏ క్రమంలో ఉండబోతున్నాయని విశ్లేషణ చేస్తూ మానవ జాతి లాభపడేలా సంఘాన్ని ఒక త్రాటిపై నడిపించడానికి కృషి చేసేవే సామాజిక శాస్త్రాలు.
కాని ఇప్పుడు పరిస్థితి ఏంటి? మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో మానవీయ, సామాజిక శాస్త్రాలు అంటే చిన్న చూపు. ఒక విశాల దృక్పథంతో శాస్త్రీయంగా సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేద్దామనుకునే విద్యార్థులకు రాష్ట్రంలో చాలా తక్కువ విద్యావకాశాలు ఉన్నాయి. ఉన్న కొద్ది అవకాశాల విషయమై కూడా విద్యార్థులకు అవగాహన లేదు. చాలా కళాశాలల్లో సామాజిక శాస్త్రాలు, పాఠ్యగ్రంథాల పరిజ్ఞానం తప్ప ప్రయోగాత్మక పద్ధతులతో బోధనా విధానాలు లేని తరగతి విద్యగానే పరిమితమయ్యింది. రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అర్హతలు లేని అభ్యర్థులు బోధన చేస్తున్నారు. సుశిక్షితులైన విద్యార్థులుగా సంస్థలు వారిని మలచలేకపోతున్నాయి. సామాజిక శాస్త్రాలలో పట్టా తెచ్చుకున్నా సరైన ఉపాధి అవకాశాలు లేక మళ్ళీ సాఫ్ట్‌వేర్ కోర్సులలోనో, మరే ఇతర రంగంలోనో ఉపాధికి శిక్షణ పొందుతున్నారు. ఈ కోర్సులకు డిమాండ్ తగ్గిపోవడంతో డిగ్రీ స్థాయిలో సైన్సెస్, మేనేజ్ మెంట్, కంప్యూటర్స్, అకౌంట్స్ కోర్సులు తప్ప కళాశాలలు సామాజిక శాస్త్రాల ఊసే ఎత్తటం లేదు. విశ్వవిద్యాలయాల్లో పీజీ స్థాయి నుంచి తప్ప బాచిలర్స్ స్థాయిలో కోర్సులు ఉండవు. దూరదృష్టిలేని ప్రభుత్వ విధానాల వల్ల ఇంజనీరింగ్ కళాశాలలు అవసరానికి మించి పెరుగుతూ వచ్చాయి.
ఆర్ట్స్ కోర్సులు చతికిల బడ్డాయి. ఈ క్రమంలో సామాజిక శాస్త్ర విద్య ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వం, సమాజం దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ప్రసిద్ధ ఆంగ్ల న్యూస్ మాగజిన్ ప్రతి ఏటా నిర్వహించే సర్వేలో భారతదేశంలోని టాప్ 10 ఆర్ట్స్ కళాశాలల్లో ఏ ఒక్క కళాశాల ఆంధ్రప్రదేశ్‌లో లేదు. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబై మహా నగరాలలో బ్రిటిష్ వారి హయాంలో ఏర్పాటైన స్టీఫెన్స్, లయోలా, ప్రెసిడెన్సీ తదితర కళాశాలలే ఇప్పటికీ ప్రముఖంగా కనిపిస్తాయి. మన రాష్ట్రంలో కూడా సామాజిక శాస్త్రాల అధ్యయనం ఎక్కువగా క్రిస్టియన్ కళాశాలల్లో కనిపిస్తుంది. గత ఏడాది హైదరాబాద్‌లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోసల్ సైన్సెస్ శాఖను ప్రారంభించడం ఒక మంచి పరిణామం.
సాఫ్ట్‌వేర్, సెల్‌ఫోన్ టెక్నాలజీ రంగాలలో దేశం రాణిస్తూ ఉండొచ్చు. కాని నిరక్షరాస్యత, అజ్ఞానం, విలువలులేని విద్యా విధానాలు, బాల్యవివాహాలు, పేదరికం, అనారోగ్యం, పారిశుధ్యలోపం, స్త్రీ వివక్ష లాంటి సామాజిక రుగ్మతలతో బాధపడుతూ సమాజం మానవీయ పురోగతి సాధించలేదు. మనుషులుగా సమాజంలో మనం హీనస్థితిలో ఉండి, ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెంచుకున్నా లాభమేమిటి? విలువలుపోయి విద్యా వ్యవస్థ దిగజారుతుంటే దానికి తగిన సూచనలిచ్చి సమాజ నిర్మాణానికి తోడ్పడగల విద్యావేత్తలు మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? వివిధ రంగాలలో మహిళలు పురోగమిస్తున్నా రోజూ వారిపై ఆటవికంగా జరుగుతున్న అత్యాచారాలు చూసి అయినా సమాజ రుగ్మతలకు చికిత్స చెయ్యాల్సిన సామాజిక శాస్త్రవేత్తల అవసరం గుర్తుకురావడం లేదా? యాంత్రిక జీవన విధానాలతో ఈ పోటీ ప్రపంచంలో నెట్టుకు రాలేక, తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ మనస్తాపం చెందుతున్న యువతకు, పెద్దలకు ధైర్యం చెప్పగల మానసిక శాస్త్రవేత్తలు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? ప్రత్యేక రాజకీయవాదాలతో సామాజికంగా, ఆర్థికంగా కుంటుపడుతున్న రాష్ట్రానికి సరైన పరిష్కార మార్గాలు చూపగల రాజకీయ విశ్లేషకుల కొరత కనిపించట్లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే సామాజిక శాస్త్రాల అవసరం, ప్రాధాన్యం మానవ సంబంధాలు ఉన్న అన్ని రంగాలతోనూ పెనవేసుకుని కనిపిస్తుంది. కాని ఆ శాస్త్రాలకు ప్రోత్సాహం లేక, ఒక కొత్త సమాజాన్ని నిర్మించగల ఎందరో గాంధీలను , గురజాడ అప్పారావు వంటి రచయితలను, వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తలను రాష్ట్రం కోల్పోతోంది.
ప్రస్తుతం మనం పలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాం. మన రాష్ట్రానికి, సమాజానికి ఒక దిశను నిర్దేశించగల ఎందరో యువ సామాజిక శాస్త్రవేత్తల అవసరం చాలా ఉంది. మన రోజువారీ జీవితంలో ఎంతో కీలకపాత్ర వహిస్తూ మానవజాతి మనుగడకు అద్దంపట్టే సామాజిక శాస్త్రాలను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమయింది. సామాజిక శాస్త్రాలను ఆకర్షణీయ అకడమిక్ చాయిస్‌గా అభివృద్ధి చెయ్యాలి. రాష్ట్రంలో ఆర్ట్స్, హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్‌ను పునరుద్ధరించటానికి ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్తలతో కూడిన ఒక కమిటీని నియమించాలి. మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాలలో సామాజిక శాస్త్రాలకు స్పెషల్ కోటా ఇవ్వాలి. విశ్వవిద్యాలయాల్లోని సామాజిక శాస్త్ర విభాగ వ్యవస్థను, వసతులను సంస్కరించాలి. యువ సామాజిక శాస్త్రవేత్తలను సమాజానికి అందించగల వ్యవస్థలుగా ఆర్ట్స్ కళాశాలలకు కొత్త రూపానివ్వాలి. సంబంధిత జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అకడమిక్ సంబంధాలు పెంపొందించుకోవాలి. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అనుబంధంగా ఈ కళాశాలలు పనిచెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సామాజిక శాస్త్ర పరిశోధనా సంస్థలను ప్రారంభించి, వాటికి అవసరమైన నిధులు కేటాయించాలి.
నాలుగు గోడల మధ్య కేవలం లెక్చర్ విధానంతో సామాజిక శాస్త్రాలను బోధించడం శాస్త్రీయ పద్ధతికాదు. విద్యార్థుల్లో స్వతంత్ర సంక్లిష్ట ఆలోచనా ధోరణి తీసుకురావటానికి అవసరమైనబోధనా విధానాలను ఉపయోగించని పక్షంలో సామాజిక శాస్త్రాల అధ్యయనం సార్థకం కాదు. సమకాలీన సమస్యలకు సులువుగా అనుసంధానించుకోగల సిద్ధాంతాల, విధానాలకు పాఠ్యాంశాలలో ప్రాధాన్యమిస్తే సామాజిక శాస్త్రాల అధ్యయనం అధిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. సామాజిక శాస్త్ర విద్యలో విద్యార్థులకు పరిశోధనా పద్ధతులలో శిక్షణ ఇవ్వటం ఒక కీలక విషయం. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు ఏ విధంగా లాబ్‌లో ప్రయోగాత్మకంగా సబ్జెక్ట్‌ను అధ్యయనం చేస్తారో సామాజిక శాస్త్రాల అధ్యయనం కూడా సమాజమే పరిశోధనాలయంగా సాగాలి. కేస్ స్టడీస్, క్షేత్రస్థాయి విచారణ వంటి బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థులకు ప్రయోగాత్మక శిక్షణ కూడా అందించవచ్చు.
విశ్వవిద్యాలయాలు, ఆర్ట్స్ కళాశాలలు స్థానిక కమ్యూనిటీతో గట్టి అనుబంధంతో పనిచెయ్యాలి. ఆ ప్రాంత ప్రజల వికాసం, ప్రాంతాభివృద్ధి లో విద్యార్థులకు కీలక బాధ్యత ఇస్తూ వారికి అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలు, వనరులను ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహాయంతో కళాశాలలు పనిచేయగలగాలి. మన దేశం, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఎన్నో సమకాలీన సామాజిక, ఆర్థిక సవాళ్ళను ఛేదించడంలో ఈ యువ సంపద ఎంతో ముఖ్య పాత్ర వహించగలదు. విద్య, ఆరోగ్యం, పారిశుద్యం, మహిళా సాధికారత, పర్యావరణం, గిరిజన వికాసం, నేర నియంత్రణ... ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో యువ సామాజిక శాస్త్రవేత్తలను విద్యార్థి దశనుంచి భాగస్వాములను చేసే విధంగా ప్రభుత్వం సంస్థాగత నిర్మాణం చేపట్టాలి. ప్రభుత్వ సంస్థలు/ డిపార్ట్‌మెంట్ల కార్యకలాపాల లో యువతను భాగస్వాములుగా చేసి పని చేస్తే ప్రభుత్వానికి అవసరమైన మానవ వనరులు లభించటంతో పాటూ, సామాజిక అవగాహన, స్పృహ కలిగిన యువతను మనం సమాజానికి అందించవచ్చు. రక్షణ రంగానికి పెట్టే ఖర్చుతో సమాన బడ్జెట్‌ను విద్యకు కూడ ఖర్చు పెట్టాలని స్వతంత్ర భారత దేశ మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సూచించారు. 1964 నాటి కొఠారి కమిషన్ నుంచి నేటి వరకు అనేక విద్యా కమిషన్లు జీడీపీలో ఆరు శాతం విద్యకు కేటాయించాలని సూచించాయి. అందుకు భిన్నంగా కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో నాణ్యమైన చదువు అందుబాటులో ఉంటే మంచి చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్ళవలసిన అగత్యం ఉండదు. పాతికేళ్ళ లోపు వయస్సుగల 56 కోట్ల యువ జనాభా ఉన్న భారతదేశంలోని యువ వనరులను సమాజాభివృద్ధికి తోడ్పడే వైవిధ్య కోర్సులలో సరైన విద్య-ఉపాధి అవకాశాలతో ప్రోత్సహిస్తే, అది మానవాళి సంక్షేమానికి ఒక గొప్ప ముందడుగు అవుతుంది.
ప్రముఖ అమెరికన్ పాత్రికేయుడు థామస్ ఫ్రైడ్‌మన్ భారత్, చైనాలు ఎదుర్కొంటున్న అత్యధిక జనాభా సమస్యని ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: 'ఏదేశమైతే అంతకంతకూ పెరుగుతోన్న జనాభాను 'డెమొగ్రఫిక్ డివిడెండ్'గా విజయవంతంగా మార్చుకోగలదో ఆ దేశమే 21వ శతాబ్దంలో అభివృద్ధిలో అగ్రగామిగా ఉంటుంది'. అలాంటి దిశగా మన ప్రభుత్వాలు అడుగులు వేయాలి. అప్పుడే విద్యార్థులను ఇతరుల అభిప్రాయాలు, హక్కులను గౌరవిస్తూ సామాజిక బాధ్యతతో దేశ సమగ్రాభివృద్ధికి తోడ్పడగల పౌరులుగా తీర్చి దిద్దగలగడం సాధ్యమవుతుంది.
- డాక్టర్ మనోహరి వెలమాటి
సురాజ్య ఉద్యమ సమన్వయకర్త


Andhra Jyothi Telugu News Paper Dated : 12/12/2013 

No comments:

Post a Comment