Saturday, August 4, 2012

భావికి సామాజిక శాస్త్రాల బాటలు--ప్రొ. లక్ష్మీ లింగం


భావికి సామాజిక శాస్త్రాల బాటలు

మన సమాజంలో సామాజిక శాస్త్రాలు చదువుకున్న వారి కొరత చాలా ఉంది. ఐటీ రంగం వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగింది. సమతౌల్య సమాజానికి అత్యంత అవసరమైన సామాజిక శాస్త్రాల అధ్యయనం కోసం ఉద్దేశించిన విశ్వవిద్యాలయం టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్). ఈ సంస్థ తాజాగా హైదరాబాద్‌లో ఒక క్యాంపస్‌ను ప్రారంభించింది. ఈ క్యాంపస్ డైరక్టర్ ప్రొఫెసర్ లక్ష్మీ లింగంతో ఈ వారం ముఖాముఖి..


ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంపై ఐటీ ఎలాంటి ప్రభావం చూపింది? దీని వల్ల ఎలాంటి నష్టాలు ఏర్పడుతున్నాయి?
ఐటీ బాగా ఊపందుకున్న తర్వాత విద్యారంగంలో కొన్ని మార్పులు వచ్చాయి. మార్కెట్ డిమాండ్‌కు తగినట్లుగా గ్రాడ్యుయేట్లను తయారు చేయాలనే భావన బాగా పెరిగింది. దీనితో అనేక కాలేజీలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ కాలేజీలలో నేర్పే విద్యకు, బయట అవసరాలకు మధ్య చాలా తేడా ఉంది. దీనితో కాలేజీలో చదివినవారికి మళ్లీ ఆరు నెలల నుంచి ఏడాది పాటు శిక్షణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక కాలేజీ నుంచి డిగ్రీ తీసుకొని బయటకు వచ్చిన వ్యక్తి వెంటనే ఉద్యోగంలోకి ప్రవేశించినా అతనికి శిక్షణ తప్పనిసరి అయిపోయింది. ఇలా శిక్షణ తీసుకొని పనిచేయటం మొదలుపెట్టిన ఉద్యోగులలో నెమ్మది నెమ్మదిగా అసంతృప్తి పెరుగుతుంది. సాధారణంగా ఐటీలో ఎవరికీ పూర్తి బాధ్యత ఉండదు. వారికి కేటాయించిన భాగాన్ని మాత్రమే వారు పూర్తి చేయాల్సి ఉంటుంది. మిగిలిన విషయాలపై అవగాహన ఉండదు. దీనితో చాలా మంది ఉద్యోగులు అసంతృప్తి చెందుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటు ఉద్యోగస్తులకూ సంతృప్తి ఉండదు. అటు వారికి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలకూ సంతృప్తి ఉండదు.



ప్రస్తుత సమాజంలో సామాజిక శాస్త్ర అధ్యయన అవసరం ఏ మేరకు ఉంది?
శాంతియుతంగా, ప్రగతిశీలకంగా ఉండే సమాజం ఏర్పడాలంటే సామాజిక శాస్త్రాల అవసరం చాలా ఉంది. ఉదాహరణకు మన సమాజంలో ఉండే అసమానతలకు కులం, మతం, వర్గం, ఆదాయం- ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. వీటన్నింటినీ అర్థం చేసుకొని, వాటిని నిర్మూలించటానికి పనిచేసినప్పుడు ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఒక డాక్టర్ ఉన్నాడనుకుందాం. మన దగ్గర వచ్చే అనేక రకాల వ్యాధులకు సమాజంలో అసమానతలు కూడా ఒక కారణమనే విషయం తెలిసిన తర్వాత అతను వైద్యం చేసే పద్ధతి భిన్నంగా ఉంటుంది. ఇవేమీ తెలియకుండా ఏదో ఒక స్పెషలైజేషన్‌లో పీజీ చేసేసి ఒక క్లినిక్ పెట్టాడనుకుందాం. 



అలాంటి డాక్టర్ల వల్ల సమాజానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇదే విధంగా బాగా తెలివైన ఒక కుర్రాడు ఐఐటీ పూర్తి చేసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరిపోయాడనుకుందాం. ఇలాంటి వారి వల్ల సమాజానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారికి కూడా సామాజిక శాస్త్రాలపై అవగాహన అత్యవసరం. ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే చాలా మంది గుర్తిస్తున్నారు. ఇటీవల గ్రామీణాభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన ఫెలోషిప్‌లను, మన ప్రధాన మంత్రి ప్రకటించారు. వీటికి దరఖాస్తు చేసిన వారిలో అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు. పటిష్ఠమైన భారతదేశం ఏర్పడాలంటే ఇలాంటి వారందరూ సమాజంలో సమస్యలను అర్థం చేసుకొని వాటికి పరిష్కారాలు చూపించాల్సిన అవసరం ఉంది. 



శాంతియుతంగా, ప్రగతిశీలకంగా ఉండే సమాజం ఏర్పడాలంటే సామాజిక శాస్త్రాల అవసరం చాలా ఉంది. మన సమాజంలో ఉండే అసమానతలకు కులం, మతం, వర్గం, ఆదాయం- ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. వీటన్నింటినీ అర్థం చేసుకొని, వాటిని నిర్మూలించటానికి పనిచేసినప్పుడు ఒక మంచి సమాజం ఏర్పడుతుంది.
ప్రొ. లక్ష్మీ లింగం



సమాజంలో ఉన్న అన్ని కోణాలను అర్థం చేసుకొని వాటికి తగిన విద్యా వ్యవస్థను మనం ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయాం? దీని వెనకున్న కారణాలేమిటి?
దీనికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. మన విద్యా వ్యవస్థ ప్రస్తుత అవసరాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటుంది. భవిష్యత్తు అవసరాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టదు. సమకాలీన సామాజిక అంశాలు భవిష్యత్తులో ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనే విషయాన్ని కూడా గమనించదు. దీని వల్ల మన విద్యా వ్యవస్థ శాఖోపశాఖలుగా విడిపోయింది. ఒక శాఖలో శిక్షణ పొందిన వారికి ఇతర శాఖల గురించి తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు కామర్స్ చేసిన వ్యక్తికి అది తప్ప వేరే ఇతర విషయాలేమీ తెలియవు. చరిత్ర చదివిన విద్యార్థి ఆ విషయాలను తప్ప మరే ఇతర అంశాలను ఆలోచించలేడు. దీని వల్ల సమకాలీన సమాజంలో జరిగే అంశాలపై వీరు ఎవ్వరూ స్పందించలేరు. ఆ ప్రభావం సమాజాభివృద్ధిపై ఉంటుంది.



పిల్లలు ఏ కోర్సుల్లో చేరాలనే విషయంలో తల్లితండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. ప్రస్తుత పరిస్థితి ఏర్పడటానికి వారు ఏ మేరకు కారణమవుతున్నారు?
తల్లితండ్రులను తప్పు పట్టడం కూడా సరికాదు. వారు తమ బిడ్డలు జీవితంలో ఎటువంటి కష్టాలు పడకూడదనుకుంటారు. ఎక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటాయో ఆ కోర్సుల్లోనే వారిని చేర్చాలనుకుంటారు. ఉదాహరణకు ప్రస్తుతం అమెరికాలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి తమ బిడ్డలు అక్కడ సెటిల్ కావాలని కోరుకుంటారు. దానికి తగిన విద్యను అభ్యసించాలనుకుంటారు. కేవలం ఐటీలో మాత్రమే కాకుండా మిగిలిన వాటికి కూడా అవకాశాలు ఉన్నాయని తెలిసినప్పుడు తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తుంది.



మిగిలిన విశ్వవిద్యాలయాలతో పోలిస్తే టీఐఎస్ఎస్‌లో బోధనాంశాలు భిన్నంగా ఉంటాయా? వాటి వెనకున్న ఉద్దేశాలేమిటి?
పాఠ్యాంశాలన్నీ సమకాలీన సమాజంలో ఉన్న పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. గణితం, రసాయన శాస్త్రంతో సహా విద్యార్థులకు అవసరమైన మౌలిక విషయాలన్నింటినీ బోధిస్తాం. అంతే కాకుండా వారికి ఫీల్డ్ ఎక్స్‌పోజర్ ఉంటుంది. ఉదాహరణకు చాలా యూనివర్సిటీలలో- కోర్సు చివర ఫీల్డ్ విజిట్‌లు ఉంటాయి. అవి కూడా చాలా వరకూ విహారయాత్రలకు వెళ్లినట్లే ఉంటాయి. కాని టీఐఎస్ఎస్ ముంబాయి క్యాంపస్‌లో వారానికి రెండు రోజులు ఫీల్డ్ విజిట్‌లు ఉంటాయి. వివిధ కోర్సులు చేసేవారు-వారి సంబంధిత రంగాలకు చెందిన సంస్థలలోకి వెళ్లి పనిచేస్తారు. దీని వల్ల ఆయా సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో, వాస్తవ పరిస్థితులు ఏమిటో వారికి తెలుస్తాయి. చాలా సార్లు కోర్సు పూర్తయిన వెంటనే విద్యార్థులకు వారు ముందు పనిచేసిన సంస్థల్లోనే ఉద్యోగాలు వస్తాయి.
- ఇంటర్వ్యూ: సి.వి.ఎల్.ఎన్. ప్రసాద్
Andhra Jyothi News Paper Dated : 05/08/2012

No comments:

Post a Comment