Sunday, August 19, 2012

కమ్యూనిస్టుల వైఖరి మారాలి - సి. భాస్కరరావు


అంబేద్కర్ సాహిత్యాన్ని, కృషిని సమగ్రంగా పరిశీలించి 1948 నాటి అంబేద్కర్ వ్యతిరేక తీర్మానాన్ని భారత కమ్యూనిస్టులు ఎందుకు మార్చుకోలేకపోయారు? అనే ప్రశ్నకు మాత్రమే నేను పరిమితమయ్యాను. ఆ వైఖరిని మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను.

భారత కమ్యూనిస్టు పార్టీ రెండవ మహాసభ 1948 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 6 వరకూ కలకత్తాలో జరిగింది. ఆ మహాసభ తీర్మానం ఆమోదించిన రాజకీయ థీసెస్‌లో అంటరాని వారి గురించి కొద్దిపాటి విశ్లేషణ ఉంది. అందులో 'అంటరానివారు భారతదేశంలో ఆరు కోట్ల మంది ఉన్నారు. మనదేశ ప్రజల్లోకెల్లా అత్యంత దారుణమైన దోపిడీ అణచివేతలకు గురవుతున్నది వీళ్ళే. ప్రజాతంత్ర విప్లవ పోరాటంలో వీళ్ళు శక్తిమంతమైన రిజర్వ్ శ్రేణులు. ప్రధానంగా అగ్రకుల బూర్జువా నాయకత్వాన గల కాంగ్రెస్ పార్టీ అంటరాని ప్రజాబాహుళ్యం సమస్యను ఛాంపియన్ చేయటానికి నిరాకరించింది... జాతీయ స్వాతంత్య్ర పోరాటంలో వాళ్ళను ఇముడ్చుకోవటానికి నిరాకరించింది.

అంబేద్కర్ లాంటి సంస్కరణవాద, వేర్పాటువాద నాయకులు అంటరాని జనబాహుళ్యాన్ని సార్వత్రిక ప్రజాస్వామ్య ఉద్యమం నుంచి దూరంగా ఉంచటానికి కాంగ్రెస్ వైఖరి దోహదపడింది. సామ్రాజ్యవాదం మీద ఆధారపడి దళితుల స్థితిగతులని మార్చవచ్చు అనే భ్రమను దళితులలో అంబేద్కర్ లాంటి వాళ్ళు కలిగించగలగటానికి కూడా కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణం... డాక్టర్ అంబేద్కర్, మండల్ లాంటి అంటరాని వారి అగ్రనాయకులు మంత్రులై ఇండియాలోనూ, పాకిస్థాన్‌లోనూ పాలక వర్గాలతో షరీకయ్యారు... ఆ విధంగా అంటరానివారు కాంగ్రెస్ చేతా, వారి సొంత నాయకుల చేతనూ మోసగించబడ్డారు... అంటరాని వారి ఈ నాయకులు మేడి పళ్ళని అంటరాని ప్రజలను ఒప్పించి, వారిని మనం (కమ్యూనిస్టు పార్టీ) గెలుచుకోవాలి. అంటరాని వారి ప్రయోజనాలు దోపిడీకి గురవుతున్న ఇతర ప్రజల ప్రయోజనాలతో ముడివడి ఉన్నాయని తెలియచెప్పి ప్రజాతంత్ర విప్లవ విజయం మాత్రమే అంటరాని వారిని సామాజిక వివక్ష, బానిసగిరి నుంచి విముక్తి చేస్తాయని వారిని ఒప్పించి, ప్రజాతంత్ర విప్లవంలో భాగస్వాములను చేసుకోవటం మన (కమ్యూనిస్టు పార్టీ) కర్తవ్యం.''

పై తీర్మానం రెండు అంశాలను స్పష్టంగా ప్రకటించింది. ఒకటి, కాంగ్రెస్ అంటరానివాళ్ళను దగాచేసింది. రెండు, అంబేద్కర్ దీనిని అవకాశంగా తీసుకుని అంటరానివాళ్ళను ప్రజాతంత్ర విప్లవం నుంచి దూరం చేశాడు: పాలకవర్గాలతో షరీకయ్యాడు: సామ్రాజ్యవాదంపై ఆధారపడి అంటరాని సమస్యను పరిష్కరించాలని అనుకున్నాడు: కనుక ఈ మేడిపండు పొట్టలోని పురుగులను బట్టబయలుచేసి అంటరాని జనబాహుళ్యాన్ని విముక్తి చేసే కర్తవ్యాన్ని కమ్యూనిస్టు పార్టీ చేపట్టాలి. ఈ సందర్భంగా ఆనాటి నుంచి నేటి వరకూ ఉన్న భారత కమ్యూనిస్టులు ఒక విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంది.

1922లోనో లేదా 1925లోనో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ 1948 వరకూ కుల సమస్య మీద మరీ ముఖ్యంగా వారే ఈ థీసి స్‌లో పేర్కొన్నట్లుగా అత్యంత నికృష్ట జీవన పరిస్థితుల్లో ఉన్న అంటరాని (దళితులు) వారి సమస్య గురించి ప్రత్యేకమైన పత్రాన్ని ఏమైనా రూపొందించుకున్నారా? నాకు తెలిసినంత వరకూ అలాంటి పత్రాన్ని ఏ కమ్యూనిస్టు పార్టీ 1992 వరకూ రూపొందించుకోలేదు. కనుక, ఏదో కాంగ్రెస్ అంటరాని వారిని మోసగించింది అని విమర్శించటానికి బాగానే ఉంటుంది. కానీ, తాము 1948 దాకా అంటరాని వారి కోసం ఏమీ ఎందుకు చేయలేకపోయామో, ప్రత్యేకంగా ఏ కార్యక్రమం ఎందుకు చేపట్టలేదో వారి నివేదికలలో ఎక్కడా లేదు.

ప్రత్యేక కృషి చేసిన అంబేద్కర్‌ని మాత్రం తిట్టిపోశారు. అంబేద్కర్ పట్ల ఆనాటి తమ వైఖరిని ఈ రోజు భారతదేశంలో ఉన్న మూడు డజన్ల కమ్యూనిస్టు నిర్మాణాలలో ఎవరు ఎంత సమగ్రంగా, ఎంత శాస్త్రీయంగా పునర్నిర్మాణం చేసుకున్నారు? అనే ప్రశ్న నేరుగా కమ్యూనిస్టులను అడగక తప్పదు. నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం 1992లో సిపిఐ అఖిలభారత మహాసభలో వివేకానందుడితో పాటు అంబేద్కర్‌ని కూడా సాంఘిక విప్లవకారుడిగా ప్రకటించి అంబేద్కర్ చిత్రపటాన్ని వేదికపై మార్క్సు, ఏంగెల్స్, లెనిన్ తదితర మార్క్సిస్టు ఉపాధ్యాయుల సరసన పెట్టారు. సిపిఐ(ఎం) పార్టీ మహారాష్ట్ర రాష్ట్ర కమిటీకి చెందిన ఒక నాయకుడు 1990 తరువాతే అంబేద్కర్‌పై సానుకూల దృక్పథంతో ఒక పుస్తకం రాశారు.

1988లో సిపిఐ(ఎంఎల్) రెసిస్టెన్సు పార్టీ కులం సమస్యపై ఒక తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దాదాపు అన్ని కమ్యూనిస్టు నిర్మాణాలూ తమ పంథా, కార్యక్రమాలలో కుల నిర్మూలన అనే అంశాన్ని చేర్చుకున్నారు కాని ఆ కుల నిర్మూలనకు చేయాల్సిన సైద్ధాంతిక, సాంస్కృతిక కృషి గురించి ఏ ఒక్క పార్టీ కూడా ఒక డాక్యుమెంటును ప్రచురించలేదు. ఇక అంబేద్కరు గురించిన అంచనాకు వస్తే మావోయిస్టు పార్టీతో సహా ఏ ఒక్క కమ్యూనిస్టు పార్టీ కూడా 1948 మహాసభ రాజకీయ తీర్మానం లో పొందుపరచిన తిట్ల పురాణాన్ని ఆత్మవిమర్శనాయుతంగా పునఃపరిశీలించుకుని ప్రస్తుత తమ అవగాహనను ప్రకటించలేదనేది నిస్సందేహం. అందుకనే కామోసు, దళిత ఉద్యమకారులు కమ్యూనిస్టుల కులనిర్మూలన రాతలను నమ్మలేక పోతున్నారు, ప్రశ్నిస్తున్నారు.

1985 కారంచేడులో, 1992 చుండూరులో దళితులను ఊచకోత కోసిన భూస్వాముల కులాన్ని ప్రస్థావించటమే వర్గ అవగాహన కోల్పోవటం అని దుమ్మెత్తిపోసిన ఒకానొక మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ గుండెకాయను లక్షింపేట దళితుల ఊచకోత మార్చినట్లుగా వారి రైతు కూలీ సంఘం బులిటెన్ ద్వారా అర్థమవుతోంది. వారు, అలాంటి వారు అంబేద్కర్ గురించి కూడా లోతుగా పునఃపరిశీలన చేసుకుని ఒక శాస్త్రీయమైన అవగాహనకు వచ్చి సమగ్రమైన డాక్యుమెంటును రూపొందించుకుని దళిత విముక్తి ఉద్యమ శక్తులతో ఐక్య సంఘటనలోకి వెళ్ళాలని బలంగా కోరుకుంటున్నాను.

ఇది మాత్రమే ఈ దేశంలో భూమి సమస్యను, మొత్తం సమాజంపై దళారీ బూర్జువా వర్గం, సామ్రాజ్యవాదం చేస్తున్న దోపిడీ, పెత్తనాలను రూపుమాపే సమగ్ర సామాజిక విప్లవానికి బాటను సుగమం చేస్తుందని విశ్వసిస్తున్నాను. నా భారత కమ్యూనిస్టు సోదరులు ఈ వ్యాసాన్ని అవకాశంగా తీసుకుని బురద చల్లకుండా ఉండాలంటే నిజాయితీగా నేను నమ్ముతున్న విషయాన్ని ముగింపులో చెప్పక తప్పదు. 1922-25 మధ్యకాలంలో పార్టీ ఏర్పడిన నాటి నుంచి భారతదేశ విముక్తి కోసం నిర్మించిన అనేక ఉద్యమాలలో (ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం, పునప్ర-వైల్వార్ పోరాటం, తెభాగ-వర్లీ పోరాటాలు, నేడు దండకారణ్య ప్రాంతంలో) వేలాది మంది నేలకొరిగారు.

గతకాలపు తమ అనేక వైఖరులను సమీక్షించుకున్నారు. కొన్నింటిని కొంత మంది మార్చుకున్నారు. అదే విధంగా అంబేద్కర్ సాహిత్యాన్ని, కృషిని సమగ్రం గా పరిశీలించి 1948 నాటి అంబేద్కర్ వ్యతిరేక తీర్మానాన్ని ఎందు కు మార్చుకోలేకపోయారు? అనే ప్రశ్నకు మాత్రమే ఈ వ్యాసంలో నేను పరిమితమయ్యాను. అలా మార్చుకోవాలని ఆశిస్తున్నాను.
- సి. భాస్కరరావు
ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమ కార్యకర్
Andhra Jyothi News Paper Dated : 19/08/2012 

No comments:

Post a Comment