Sunday, April 21, 2013

బహుజన మహిళలూ.. బహుపరాక్ ! - జ్వలిత



'బహుజనం లోపించిన స్త్రీవాదం' అవసరమైన చర్చ. సునీత స్త్రీవాదాన్ని విస్తృతార్థంలో చూద్దాం' అని రాసినా, విమల 'ప్రాంతీయ దృక్పథాల్లోంచి చూద్దాం' అన్నా అందులో సూడో ఐక్యత కొంత, షాడో ఆధిపత్యం మరింత తొంగిచూస్తూనే ఉంది. పేర్లే తేడా. బహుజన మహిళల కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నాం అని చెప్పుకుంటున్న సంస్థలు బి.సి మహిళల కోసం ఏమి చేశారు? ఒకరిద్దరు దళిత మహిళల రచనలు ప్రచురించి చేతులు దులుపుకున్నారు.

అన్ని రంగాలతోపాటు సాహిత్యపరంగా కూడా ఎదిగింది ఆధిపత్య వర్గపు మహిళలే. వారసత్వంగాగాని, మరొకరకంగాగాని వారే నిలబడగలిగారు. నిలబెట్టబడ్డారు, ఆ వర్గాల పురుషుల వల్లనే. విశ్వవిద్యాలయాల్లో, పీఠాలు, ప్రభుత్వ శాఖల్లో ఆ మహిళల ఆధిపత్యాన్ని బహుజన మహిళలపై ప్రయోగింపజేశారు. ఆ విధంగా ఆ మహిళలు సాధికారతను సాధించినట్లుగా, సమాన హక్కులు సాధించినట్లుగా చెప్పుకున్నారు. ఆ అవకాశం బహుజన మహిళలకు లేదు. బానిసలకు బానిసలైన వారికి అది సాధ్యపడదు.

అయినా ఆధిపత్య వర్గాలు బహుజన మహిళల కోసం ఏదో చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. విమల తన వ్యాసంలో 'తెలంగాణ మహిళా డిక్లరేషన్ ప్రకటన' వివిధ దృక్కోణాల్లో బలంగా చెప్పింది అన్నారు. అంతకు ముందునుంచే తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన బహుజన మహిళా గళాలున్నాయి. అవన్నీ 'గాయాలే గేయాలై' కవితా సంపుటిలో రికార్డయినాయి. వాటిని గుర్తించడానికి వీరి ఆధిపత్య భావజాలం అడ్డుపడుతుంది. ఈ మధ్య హైదరాబాద్‌లో జరిగిన 'తెలంగాణ మహిళా ప్రభంజనం'ను ఒక రాజకీయ మహిళావర్గం హైజాక్ చేసిన ఉదాహరణ ఉండనే ఉంది. బహుజన మహిళలను ఒక్కరిద్దరిని కలుపుకొని వారికి కూడా ద్వితీయ ప్రాధాన్యతనిచ్చి ఏదో ఉద్దరిస్తున్నామంటే ఎలా?

ఆదివాసీ మహిళల గురించి ప్రాజెక్టుల పేరున, రీసెర్చ్‌ల పేరున ఆధిపత్య మహిళలే స్టడీ చేస్తారు. వారి కోణంలో రాసినవే రికార్డవుతాయి. ఆదివాసీ మహిళల భాగస్వామ్యం ఉండదు. విమల రాసినట్లు, అమెరికా మహిళ పిలుపునందుకొని ఎన్‌జివో లు చేసే హంగామా, బహుజన మహిళల పట్ల చూపితే లాభ మేముంటుంది! విదేశీ గుర్తింపులు, అవార్డులు, రివార్డులు, విదేశీ, స్వదేశీ ఆర్థిక వసతులు లభించవు కదా! మరో కొత్త అంశం గమనించాలి: ఇప్పుడే ఎదుగుతున్న దళిత మహిళలను బీసీ, మైనారిటీ మహిళలపైకి పురిగొల్పుతున్నారు. ఈ కుట్ర ఇలాగే కొనసాగితే బహుజన ఐక్యత ఆవిరైపోతుంది. అది ఆధిపత్య మహిళలకు మరో విజయమే అవుతుంది.

విస్మరణ అంటు జాడ్యమై బహుజన మహిళలను అణిచివేయకుండా ఉండాలంటే ఎవరి కుట్రలకో మనం పరికరాలుగా మారకుండా జాగ్రత్త పడవలసిన అవసరం బహుజన మహిళలకున్నది.
- జ్వలిత
99891 98943 

Andhra Jyothi Telugu News Paper Dated: 22/4/2013

No comments:

Post a Comment