Thursday, April 18, 2013

ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ చట్టం అమలుకు ఉద్యమించాల్సిందే By Digupati Rajagopal


శుక్రవారం , ఏప్రిల్ 12 ,2013


కేంద్ర,రాష్ట్ర బడ్జెట్‌లలో ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు సబ్‌ప్లాన్‌  అమలుకు  నోడల్‌ ఏజన్సీలకు చట్టబద్ధత కల్పించాలని ఐక్యపోరాటాలు ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం తప్పని పరిస్థితిలో సబ్‌ప్లాన్‌ చట్టం చేసింది. తరతరాలుగా అభివృద్ధిలో వెనుకబడిన ఈ వర్గాల అభివృద్ధి కోసం చేపడుతున్న వివిధ ప్రణాళికలు అమలుకు నిర్ధిష్టమైన యంత్రాంగం ఏర్పరచుకోవడానికి, ఆశించిన ఫలితాలు  సాధించుకోవడానికి ఈ చట్టం ఉపయోగపడగలదు. సబ్‌ప్లాన్‌ చట్టం దేశంలో మొదటగా కాంగ్రెస్‌ పార్టీ చట్టం చేసిందని రాష్ట్రప్రభుత్వం పెద్ద ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడమే కాకుండా దళితుల సమస్యలు, సంక్షేమం ఈ చట్టం వలనే అవుతుందని ఈ వర్గాలలో భ్రమలు కల్పించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ఆరాటపడుతున్నారు.
  కాంగ్రెస్‌ పార్టీ దళిత, గిరిజన సంక్షేమాలపై శ్రద్ధ ఉన్నట్లయితే ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1980 మార్చి 13న దళిత, గిరిజనుల జనాభా ప్రాతిపదికన ప్రణాళికా బడ్జెట్‌లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని ఆదేశించినప్పటికి ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని? దళిత, గిరిజన వర్గాలలో ఆలోచన రేకెత్తిస్తుంది. అంతేకాదు సబ్‌ప్లాన్‌ నిధులతో దళిత, గిరిజన అభివృద్ధికి ఖర్చు చేసేందుకు నోడల్‌ ఏజన్సీలు ఏర్పాటు చేయాలని బడ్జెట్‌ కేటాయింపులలో జనాభా ప్రాతిపదికన వచ్చే నిధులను నోడల్‌ ఏజన్సీలకు కేటాయించి ఖర్చు చేయాలని, వివిధ సంఘాలు, రాజకీయ పక్షలు చేపట్టిన ఉద్యమాలు, నిరవధిక దీక్షలు, చలో అసెంబ్లీ, శాసనసభలో చర్చ ఫలితంగా 2007 నవంబర్‌ 5న రాష్ట్ర ప్రభుత్వం జీవో 177ను విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 22.8 శాతం బడ్జెట్‌ కేటాయింపులు చూపిస్తూ, ఖర్చు చేయకుండా భారీగా కోత విధించింది. ఖర్చు చేసిన నిధులు సైతం దళిత గిరిజనులకు ప్రయోజనం లేని రంగాలకు కేటాయించింది. గత సంవత్సరము బడ్జెట్‌లో ఔటర్‌రింగురోడ్డు, హుస్సేన్‌సాగర్‌ ఆధునీకరణ, హుడా పార్కులు, గెస్టుహౌస్‌ల నిర్మాణం తదితర వాటిని 430 కోట్లు దళిత నిధులను కేటాయించింది. అన్ని శాఖలలో ఇదే పరిస్థితి ఉంది. జాతీయ ప్రణాళిక జాతీయ ఎస్‌సి,ఎస్‌టి కమీషన్‌ సూచనలు ప్రకారం దళితులకు కేటాయించిన నిధులలో కోత విధించినను దారి మళ్లించిన, ఖర్చుచేయని ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ నిధులు వచ్చే సంవత్సరము బడ్జెట్‌లో అధనంగా కలిపి కేటాయించి ఖర్చు చేయాలని సూచించింది.
 దేశ, రాష్ట్ర జనాభాలో దళిత గిరిజనుల జనాభా శాతం కంటే తక్కువ కాకుండా అదనంగా కేంద్ర, రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లలో నిధులు కేటాయించి వారి ప్రయోజనాలకే ఖర్చు చేసేందుకు కేంద్రప్రభుత్వం 1980లో ఎస్‌సిలకు స్సెషల్‌ కాంపోనెంటు ప్లాను  (ప్రస్తుతం ఎస్‌సి సబ్‌ ప్లాను) గిరిజనులకు ట్రైబల్‌ సబ్‌ ప్లానును రూపొందించింది. అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ జాతీయ ప్రణాళికా సంఘం మెంబర్‌ సెక్రటరీగాఉన్న నేటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు లేఖలు వ్రాసి 40 సంవత్సరాలు గడిచినను అమలుకు నోచుకోకపోవడం శోచనీయం. ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నా అమలు చేయకుండా ప్రభుత్వ పాలకులే వివక్ష చేసి అన్యాయం చేస్తున్నారు.దళిత గిరిజన నిధులను దోచి అగ్ర కుల, ధనిక వర్గాల ప్రయోజనాలకు ఖర్చు పెడుతున్నాయి. దళిత, గిరిజన ప్రజలు కోరుతున్న విధంగా సంపదలో వాటా బడ్జెట్‌లో కోటా అంశం సామాజిక న్యాయమనేది వాస్తవంగా అంగీకరించాలి, అమలు చేయడానికి ప్రభుత్వము ముందుకు రావాలి.
దారిమళ్లించిన, కోతపెట్టిన నిధుల సంగతేమిటి?
 మన రాష్టంలో గత 19 సంవత్సరములలో 17,970 కోట్లు కోత విధించారు. 5 వేల కోట్లు దారి మళ్లించారు, మొత్తం 21,604 కోట్లును దళితలకు ఖర్చు చేయలేదు. గత 7 సంవత్స రముల కాంగ్రెస్‌ పాలనలో 13,601 కోట్లు, అంతకు ముందు 9 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పాలనలో 4047 కోట్లు కోత విధించారు. ఈ నిధులను తిరిగి కేటాయించలేదు. అంటే గత 19 సంవత్సరముల కాలములో కోత విధించిన 28 వేల కోట్లు దశల వారిగా తిరిగి కేటాయించవలసి ఉండగా 2013 బడ్జెట్‌లో ఆ ప్రయత్నం చేయలేదు. కేవలం ఒక ప్రత్యేక చట్టం వల్లనే ఎస్‌సి, ఎస్‌టి వర్గాల సమగ్రాభివృద్ధికి ఉద్ధేశించిన నిధులు ఆయా వర్గాల ఆర్ధికాభివృద్ధికి ఆశించిన పద్ధతిలో జరుగుతుందని భావిస్తే అది ముమ్మాటికి తప్పవుతుంది. ఇప్పటికే దళితులుకు ఉన్న చట్టాలు అమలు తీరు ఏవిధంగా ఉన్నదో మనకందరికి తెలిసినదే. కాని సబ్‌ప్లాన్‌ చట్టం అభివృద్ధిలో ఒక అడుగు ముందుకు వేయడానికి బలమైన ఐక్య ప్రాతిపదిక ఏర్పడిందనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సంస్థలు, సంఘాలు, రాజకీయ పక్షాలు ఐక్య కార్యాచరణ ఉద్యమాలు, ఆందోళన ఫలితంగా రాష్ట్రప్రభుత్వం మెడలను వంచి సబ్‌ప్లాన్‌ చట్టాన్ని సాధించు కున్న మార్గం ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి చట్టం కోసం ఒత్తిళ్లు, ఉద్యమాలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇతర కులాలకంటే ఇప్పటికి దళిత గిరిజనులు వెనుకబాటే
  దేశంలో షెడ్యూలు కులాల వర్గాల్లో సుమారు 51 శాతం మంది వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. ఇతర కులాలకు చెందిన వారిలో 19 శాతం వ్యవసాయ కార్మిక కుటుంబాలుగా ఉన్నారు. దళితులలో అక్షరాస్యత 2001 జనాభా లెక్కల ప్రకా రం 54.69 శాతం ఉన్నారు. డిగ్రీ చదువులలో దళితుల సంఖ్య 8.37శాతం ఉండగా ఇతర కులాలలో 91.63 శాతం ఉన్నారు. గిరిజనులు 8.2 శాతం జనాభా ఉన్నారు. వారి నిష్పత్తి ప్రకారం హక్కులు అవకాశాలు, నిధులు, సంక్షేమ పథకాలు గిరిజనులకు లభించుట లేదు.ప్రత్యేక కాంపోనెంట్‌ ప్రణాళిక ప్రకారం దళితుల సంక్షేమానికి ఉద్ధేశించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ జనాభాలో వారి దామాషాకు అనుగుంగా ఉండాలి.ఆ అంశాన్ని కేంద్ర, రాష్ట్రప్రభు త్వం కూడా ఉల్లంఘించింది. 2006 సంవత్సరంలో ప్రణాళికా సంఘం ప్రధాన సలహాదారు నివేదికలో మొత్తం ప్రభుత్వ ప్రణా ళికల దళితులు, గిరిజనులకు చేసే కేటాయింపులలో జనాభా దామాషా ప్రాతిపదికన కేటాయించాల్సిన మొత్తం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఇటువంటి స్థితిలో జనాభా ప్రాతిపదికన ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయింపులు జరిగేలా చూడటం ప్రణాళికా సంఘం బాధ్యతని స్పష్టం చేయడం జరిగింది. కేటాయించిన గ్రాంట్లను ఇతర అవసరాలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలలోని మంత్రిత్వ శాఖలు, విభాగాలు మళ్లించకుండా అడ్డుకట్ట వేసే శాస నం లేకపోవడం వలన నిధులకు ఇతర శాఖలకు మళ్లిస్తున్నారు. నిధులను మళ్లించకుండా సమగ్రమైన చట్టం చేయవలసిన అవస రం ఉంది. దేశజనాభాలో 16 శాతం ఉన్న దళితులకు కేంద్ర ప్రణాళిక బడ్జెట్‌లో గత సంవత్సరం 50 వేల కోట్లు కేటాయిం చవలసి ఉండగా 30,500 కోట్లు ప్రతిపాదించింది. ఇప్పటి వరకు 10 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. మొత్తం 40 వేల కోట్లు కోత, దారి మళ్లింపు చేసింది. గత దశాబ్ధాలు లెక్కలు చేస్తే ఎస్‌సిలకు ఖర్చు చేయాల్సిన నిదులలో 4 లక్షల కోట్లు కోత విధించింది. 1953వ సంవత్సరం నుండి కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల బడ్జెట్‌లో ఎస్‌సి, ఎస్‌టిలకు ఖర్చు చేయాల్సిన నిధుల్లో లక్షల కోట్లు కుంభకోణానికి పాల్పడింది. రాష్ట్రంలో కోటి 50 లక్షల పై బడి ఉన్న దళితులు 75 వేల దళితవాడల, బస్తీల్లో ఉన్నారు. సగం కుటుంబాలకుపైగానే ఇళ్ళస్థలాలుగాని, ఇళ్ళుకానిలేవు. 65 శాతం దళితవాడలలో రక్షిత మంచినీటి సౌకర్యం లేదు. 85 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు, బహిరంగ ప్రదేశాలలో వెళ్లే పరిస్థితి. వీధిలైట్లు రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీహాల్స్‌ తదితర సౌకర్యాలు లేక మురికివాడలలో మురుకికంపుతో మూలుగుతున్నయి. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమహాస్టల్స్‌ సౌకర్యాలతో పాటు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు. సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి
  దళిత, గిరిజన వర్గాల యొడల చిత్తశుద్ధితో ఆలోచించేవారు ఇప్పటికే పట్టి పీడిస్తున్న 2 అంశాలను పరిశీలన చేయవలసి వున్నది. దళిత, గిరిజనులలో ప్రధానంగా సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఉన్నది. స్వాతంత్య్రం 64 సంవత్సరాలు పై బడిన దళిత గిరిజనులు సామాజిక, ఆర్థికపీడనలకు గురిఅవుతున్నారు.  ఎస్‌సి,ఎస్‌టి రిజర్వేషన్లు కేవలం ప్రభుత్వరంగ శాఖలలో మాత్రమే అమలు జరుగుతాయి. కాని నూతన ఆర్ధిక విధానాలు పేరుతో ప్రైయివేటైజేషన్‌ సాకుతో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైయివేటు కార్పోరేటర్ల పరం చేయడం వలన దళితులకు ఉద్యోగాలు, రిజర్వేషన్లు గండికొట్టే చర్యల చేపడుతున్నారు.   
  మనరాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎస్‌సి, ఎస్‌టి బాక్‌ లాగ్‌ పోస్టులు 80 వేలు ఉన్నయి, నియామకాలు చేయుటలేదు. కేంద్రప్రభుత్వ శాఖలలో లక్షలాది దళితులు, గిరిజనులకు రావల్సిన ఉద్యోగాలు నియమకాలు చేయుటలేదు. కాబట్టి ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టం మొత్తం సమస్యలను పరిష్కారమవుతాయనే ప్రచారం సరైనదికాదు.
  ఏది ఏమైనప్పటికి సబ్‌ప్లాన్‌ చట్టం అంశాలను అమలు జరిపించే విధంగా ప్రభుత్వాలు, పాలకులపై వత్తిడి తెచ్చి కొంత మేరకైన దళిత, గిరిజన సంక్షేమాన్ని కాపాడడానికి మరోసారి ఉద్యమించాల్సిందే.


Vaartha Telugu News Paper Dated : 12/4/2013

No comments:

Post a Comment