Saturday, April 6, 2013

విద్యా హక్కు హరణం Editorial ( Prajashakti )


  Thu, 4 Apr 2013, IST  

'సంస్కరణల' యుగంలో పేద పిల్లలకు చదువు దూరమవుతున్న తరుణంలో ఆర్భాటంగా కేంద్రం తీసుకొచ్చిన ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలు అస్తవ్యస్తంగా సాగింది. విద్యా వ్యాపారంపై ప్రజల్లో వెల్లువెత్తిన నిరసనల వల్లనో, ప్రపంచబ్యాంక్‌ నిధులను ఆశించో ఎందువలనైనా సరే సర్కారు తెచ్చిన విద్యా హక్కు చట్టం పేద పిల్లలకు చదువు అందిస్తుందంటే యావత్‌ ప్రజానీకం ఆహ్వానించారు. యుపిఎ-2 ప్రభుత్వం గద్దెనెక్కిన రెండు మాసాలకే 2009 ఆగస్టు 4న పార్లమెంటులో బిల్లు పాస్‌ కాగా 2010 ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా చట్టం అమల్లోకొచ్చింది. ఆరు నుంచి 14 ఏళ్ల లోపు బాలలకు ఉచిత, నిర్బంధ విద్యనందించడం దీని ప్రధాన ఉద్దేశమనాలి. కేంద్రం 70 శాతం, రాష్ట్రాలు 30 శాతం భరించే విధంగా ఐదేళ్లకు విధి విధానాలు, మూడేళ్లకు, ఐదేళ్లకు లక్ష్యాలు నిర్దేశించారు. ఈ ఏడాది మార్చి 31కి చట్టం వచ్చి మూడేళ్లయింది. రాష్ట్రంలో ఈ కాలంలో చట్టం అమలుపై సమీక్షించగా లక్ష్యాలకు, ఆచరణకు నడుమ భారీ అగాథం నెలకొంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రమాణాలు పాటించని పాఠశాలలు మార్చి 31 తర్వాత మూతబడాల్సిందే. సరిపడా టీచర్లు, తరగతి గదులు, ఆట స్థలం, తాగునీరు, మరుగుదొడ్లు ఇత్యాది మౌలిక సౌకర్యాలు కల్పించలేని బళ్లు కొనసాగరాదు. ఇప్పటికీ ప్రమాణాలు పాటించని వేలాది పాఠశాలలు, వాటిలో చదువుతున్న లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. సుమారు 65 వేల ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చట్టం నిర్దేశించిన ప్రమాణాలకు దూరంగా సగం ఉన్నాయంటే ఈ అధోగతికి ప్రభుత్వానిది బాధ్యత కాదా? సర్కారీ బళ్ల సంగతి ఇలా ఉండగా అడ్డూ అదుపూ లేని ప్రైవేటు స్కూళ్లు ఇంకెంత అధ్వానంగా ఉన్నాయో ఊహించడానికే భయమేస్తుంది. బాలలకు కల్పించిన విద్యా హక్కును ప్రభుత్వమే హరిస్తోంది.
మూడేళ్లు అలక్ష్యం వహించిన ప్రభుత్వం గడువు ముగిశాక ఇప్పుడు తీరిగ్గా ప్రమాణాల పాటింపునకు సమయం కావాలనడం బాధ్యతా రాహిత్యం. మంగళవారం ఢిల్లీలో భేటీ అయిన విద్యారంగ కేంద్ర సలహా బోర్డు గడువు పెంపునకు నిరాకరించింది. మన రాష్ట్రానికే చెందిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పల్లం రాజు రాష్ట్ర మంత్రి పార్థసారథికి తెగేసి చెప్పడం కొసమెరుపు. మూడేళ్ల లక్ష్యాల్లో ప్రధానమైనవి ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్ల కేటాయింపు, బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థ, అనధికారిక ప్రైవేటు పాఠశాలల నిషేధం. చట్టం రూపొందించే సమయంలో సెంట్రల్‌ లా కమిషన్‌ ప్రైవేటులో పేదలకు సామాజిక వర్గాల వారీగా 50 శాతం సీట్లు కేటాయించాలని సిఫారసు చేయగా కేంద్రం పాతిక శాతానికి పరిమితం చేసింది. రాష్ట్రంలో ఇది కూడా అమలు కావట్లేదు. యాజమాన్యాలు డొనేషన్‌, క్యాపిటేషన్‌, తదితర పేర్లతో భారీగా గుంజుతున్నా, గుర్తింపులేని స్కూళ్లు ఇబ్బడిముబ్బడిగా నడుస్తున్నా అడిగే నాథుడే లేడు. అక్రమార్కులకు రూ.25 వేలు, రూ.50 వేలు జరిమానా అంటున్నా అమలు చేసేవారు కరువయ్యారు. 80 శాతం మండలాల్లో ఎంఇఒలు లేరు. ఫీజుల నియంత్రణ ఉత్తర్వు కాగితాలకే పరిమితం. డొనేషన్లు, రుసుములను హద్దుమీరి వసూలు చేస్తూ తెగ బలిసిన కార్పొరేట్లకు జరిమానాలు లెక్కలోకిరావు. ప్రభుత్వం యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్న ఉదాహరణలు కోకొల్లలు. కాగా ప్రైవేటు స్కూళ్లలో ప్రతి ఏడాదీ లక్ష మంది పిల్లలు చేరుతున్నారు. వారికి ఎనిమిదో తరగతి వరకూ ఉచిత విద్యనందించడానికి రాష్ట్రమే నిధులు భరించాలి. ప్రైవేటు అడిగే దానికి, ప్రభుత్వం ఇస్తామన్న దానికి మధ్య అవగాహన కుదరక ప్రతిష్టంభన కొనసాగుతోంది. విద్యా హక్కు చట్టం వచ్చాక ప్రభుత్వం వీలైనన్ని ఎక్కువ బళ్లు తెరవాల్సి ఉండగా వేలాదిగా మూతబడుతున్నాయి. నిర్ణీత సంఖ్యలో విద్యార్థులు, టీచర్లు, మౌలిక సదుపాయాలు లేవనే పేర ఈ మూడేళ్లలో ఐదు వేల బళ్లు మూతేశారు. ఇంకా మూస్తామంటున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గురుకుల పాఠశాలలు తెరవడంలోనూ ప్రభుత్వం విఫలమైంది.
బడి ఈడు పిల్లలను సూళ్లలో చేర్చాలని, డ్రాపవుట్స్‌ను పూర్తిగా అరికట్టాలని చట్టం చెబుతుండగా పది లక్షల మంది ఇంకా బడి బయటనే ఉన్నారు. వీధి బాలలు బాల కార్మికులుగా దుర్భర జీవితం గడుపుతున్నారు. సర్కారీ బళ్లలో మౌలిక సదుపాయాలు ఘోరం. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి కిలోమీటరుకొక ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్లకో ఉన్నత పాఠశాల ఉండాలి. ఏ స్థాయి స్కూల్లో ఎన్ని తరగతి గదులుండాలో చట్టం నిర్ధేశించింది. అయినా గదుల కొరత తీవ్రంగా ఉంది. నిరుడు 20 వేల అదనపు తరగతి గదులు మంజూరు కాగా రెండు వేలు పూర్తయ్యాయి. విద్యార్థి, టీచర్‌ నిష్పత్తి అమలు కావాలంటే ఇంకా లక్ష మంది టీచర్లు కావాలి. మరుగుదొడ్లు, తాగునీరు, మధ్యాహ్న భోజన వంట షెడ్లు లేని పాఠాశాలలు వేలల్లో ఉన్నాయి. మౌలిక వసతులు కల్పించాలని పలు మార్లు న్యాయస్థానాలు మొట్టికాయలేసినా పరిస్థితిలో మార్పు లేదు. విద్య కోసం బడ్జెట్‌లో నిధుల కేటాయింపులే తక్కువ కాగా ఖర్చు చేసే నిధుల్లో ఎక్కువ భాగం పక్కదారి పడుతున్నాయి. డిపెప్‌, సర్వశిక్షా అభియాన్‌, రాజీవ్‌ విద్యా మిషన్‌ అవినీతి, అక్రమాలకు నెలవులయ్యాయి. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, దుస్తుల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఏనాడూ అందరికీ అందింది లేదు. బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో కమిషన్‌ ఇంకా ఏర్పడలేదు. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్‌ బాలలందరికీ విద్యను ప్రధాన హక్కుగా పేర్కొనగా స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ల తర్వాత అరకొర సదుపాయాలతో చట్టం వచ్చింది. దాని అమల్లోనూ ప్రభుత్వానికి నిలువెత్తు నిర్లక్ష్యం ఆవహించిందంటే పేదలకు, విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత ఏ పాటిదో తెలియడం లేదా? కనుక ఎన్ని చట్టాలు చేస్తే, ఏ హక్కులు ప్రకటిస్తే ఫలితమేమిటి?

Prajashakti Telugu News Paper Dated : 4/4/2013 

No comments:

Post a Comment