Saturday, April 6, 2013

నవీన నమూనా నిఖానామా - డా. ఎ. సునీతముస్లిం నవ దంపతులకు ఒక మార్గదర్శక పత్రం -నిఖానామా. 2005లో ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఆ కొత్త నిఖానామాను ప్రజల పరిశీలనకు విడుదల చేసింది. దానిలోని అంశాలతో విభేదించి ముస్లిం ఉమెన్స్ పర్సనల్ లా బోర్డ్, షియా పర్సనల్ లా బోర్డ్‌లు వరుసగా 2006, 2008లో కొత్త నిఖానామాలను రూపొందించాయి. ఈ నిఖానామాలపై చర్చ ముస్లిం సమాజంలో కొత్త చైతన్యానికి ప్రోది చేయడమే గాక ముస్లింల గురించి హిందువుల్లో ఉన్న మూసభావాలను తొలగిస్తోంది.
వివాహబంధంలో ముస్లిం స్త్రీలకు భర్తతో సమాన ప్రతిపత్తి ఉందా? లేదు అన్న భావన మన సమాజంలో ప్రగాఢంగా ఉంది. షా బానో లేదా ఇమ్రానా కేసులు ఆ ప్రచలిత నమ్మకానికి ప్రతీకలుగా చెప్పవచ్చు. ముస్లిం స్త్రీల ఈ శోచనీయ స్థితికి మత ప్రేరిత ముస్లిం పర్సనల్ లా (వ్యక్తిపర శాసనం), స్త్రీలపై మొత్త ంగా సమాజం, ప్రత్యేకించి ఉలేమా (మత న్యాయ కోవిదులు) కఠిన నియంత్రణే కారణమని భావిస్తున్నారు. చాలా మందికి తెలియని వాస్తవం ఒకటి ఉంది. 

ముస్లిం స్త్రీల దుస్థితికి ఏ మత ప్రేరిత వివాహ చట్టమైతే కారణమో అదే వివాహ చట్టం ఆ స్త్రీల స్థితిగతులను మార్చడానికి అవసరమైన సాధనాలనూ అందిస్తోంది. ముస్లిం దంపతులు తమ వివాహ సమయంలో సంతకాలు చేసే ఒక సాధారణ ప్రమాణ పత్రం- నిఖానామా లేదా వివాహ ఒప్పందం- గత పదేళ్ళుగా అటువంటి ప్రగతిశీల పాత్రను నిర్వహిస్తోంది. కొత్త ఆలోచనలపై చర్చలను ప్రారంభించేందుకు, వైవాహిక జీవితంలో ముస్లిం మహిళల హోదా విషయమై ముస్లిం సమాజంలో పాతుకుపోయిన విశ్వాసాలను మార్చివేసేందుకు ఆ ప్రమాణ పత్రాన్ని ఒక ఎత్తుగడగా చేసుకొంటున్నారు. 

పలు 'మత', 'లౌకిక' ముస్లిం బృందాలు ఈ ప్రయత్నాలలో భాగస్వాములు అయ్యాయి. ముస్లిం మహిళల న్యాయబద్ధమైన హక్కుల విషయమై ఒక ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రక్రియను ఆ ప్రయత్నాలు ప్రారంభించాయి. 1990 దశకం మధ్యలో ఉమ్మడి పౌర స్మృతి డిమాండ్‌ను భారతీయ జనతా పార్టీ హైజాక్ చేయడంతో మహిళా సంఘాలు దానిపై ఆశలను వదిలివేసుకోవల్సి వచ్చింది.

ముస్లిం పురుషులను మరిన్ని నిందలకు గురిచేయకుండా చిన్న వయస్సులో వివాహాలు, మెహర్ (ముస్లింలలో వధువుకు ఇచ్చే సొమ్ము) చెల్లించకపోవడం, అకారణంగా తలాక్ చెప్పడం, తలాక్ అనంతరం మనోవర్తి చెల్లింపు, భర్త బహుళ వివాహాలు, క్రూర ప్రవర్తన, స్త్రీలు ఉద్యోగాలు చేయడంపై ఆంక్షలు మొదలైన సమస్యలను పరిష్కరించుకొనే విషయంలో ముస్లిం మహిళలు ఒక సంక్లిష్ట, ప్రమాదకర పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. వారేం చేసారు? 1995లో ముంబైలో ఉజ్మా నహీద్ నేతృత్వంలోని ఒక ముస్లిం మహిళా బృందం, ముస్లిం వివాహ వ్యవస్థకు సంబంధించి అందరూ అంగీకరించే ఒక ముఖ్య పత్రంలో మార్పులను ప్రతిపాదించాలని నిర్ణయించింది. 

అదే 'నవీన నమూనా నిఖానామా'. నిఖానామా ఒకన్యాయబద్ధమైన పత్రం. అందులో మార్పులు మౌలిక ప్రభావాన్ని నెరపుతాయి. నిఖానామా ఏమిటి? నవ దంపతులకు అది ఒక మార్గదర్శక పత్రం. వైవాహిక జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, షరియా ప్రకారం భార్యాభర్తలకు ఒకరి పట్ల మరొకరికి గల విధులు, బాధ్యతలను అది విశదీకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ జారీ చేసిన ఎనిమిది పేజీల ఒక నిఖానామాలో సగం పేజీలలో దాం పత్య భాగస్వాముల వివరాలు, వారు అం తకుముందే వివాహాలు చేసుకొనివుంటే వాటి వివరాలు, కుటుంబాల వివరాలు ఉన్నాయి.

మిగతా పేజీలలో భార్యాభర్తలకు వేర్వేరుగానూ, సంయుక్తంగానూ నిర్దేశాలు ఉన్నాయి. భార్యాబిడ్డల కూడు, గూడు, గుడ్డ మొదలైన వాటి విషయంలో పూర్తి శ్రద్ధ చూపాలని, సక్రమంగా ప్రవర్తించాలని, నిర్హేతుకంగా తలాక్ చెప్పకూడదని భర్తకు, అనునిత్యం భర్తకు అనుకూలంగా ఉంటూ గృహాన్ని చక్కదిద్దుకోవాలని భార్యకు ఆ నిఖానామా నిర్దేశించింది. ఉజ్మా నహీద్ తదితరులు ఈ మార్గదర్శక సూత్రాలను విస్తరించారు. 

షరియా విధుల కింద అదనపు షరతులను ప్రవేశపెట్టారు. భర్త, భార్యపై భౌతిక హింసకు పాల్పడకూడదని, అకారణంగా భార్యను ఒంటరిగా బంధించకూడదని, ఆమె పట్ల ఏ విధంగానూ అమానుషంగా ప్రవర్తించకూడదని, కారణం లేకుండా సుదీర్ఘకాలంపాటు భార్యను పుట్టింటిలో వదిలివేయకూడదని,ఏదైనా అభిప్రాయభేదం వస్తే దుర్భాషలాడకూడదని నియమ విరుద్ధంగా మూడుసార్లు లేదా ఒకసారి తలాక్ ఉచ్ఛరించకూడదనే షరతులను వారు నిర్దేశించారు. 

మనస్పర్థలు వస్తే మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. భర్త రెండో వివాహం చేసుకోదలుచుకుంటే అందుకు మొదటి భార్య అనుమతి విధిగా తీసుకోవాలని, తలాక్ లేదా రెండో వివాహ విషయంలో మెహర్‌ను రెట్టింపు చేయాలని, భర్త ఆస్తిలో భార్యకు విధిగా వాటా ఇవ్వాలని, విడాకులు తీసుకున్నప్పటికీ భర్త గృహంలో నివసించే హక్కు భార్యకు ఉండాలని 'నవీన నమూనా నిఖానామా' నిర్దేశించింది. ఈ 'నవీన నమూనా నిఖానామా'ను 'ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ' (ఎ.ఐ.ఎమ్.పి.ఎల్.బి.)కు సమర్పించారు. ఇది, ఇస్లాంలోని వివిధ శా ఖల -సున్నీ, షియా, బరేల్వి, దియో బంద్ ఇత్యాది శాఖల ఉలే మా సంస్థ. ఈ 'నవీన నమూనా నిఖానామా'కు ఆ సంస్థ ఆమో దం లభిస్తే యావత్‌ముస్లింలు దానిని గౌరవించి అనుసరిస్తారు.

ఎ.ఐ.ఎమ్.పి.ఎల్.బి., ఈ 'నవీన నమూనా నిఖానామా'ను దేశవ్యాప్తంగా వివిధ మదరసాల పరిశీలనకు పంపించింది. హైదరాబాద్‌లోని దార్ ఉల్ ఉల్లూమ్, దార్ ఉల్ ఉల్లూమ్ సబీల్ -ఉస్-సలామ్‌తో సహా మొత్తం 54 ఉలేమాలు తమ అభిప్రాయాలను నివేదించారు. వీటన్నింటినీ న్యూఢిల్లీలోని 'ఇస్లామిక్ ఫిఖ్ అకాడమీ' 'ఇస్తిరాత్ ఫిన్ నిఖా' అనే గ్రంథరూపంలో ప్రకటించింది. ముస్లిం వివాహ వ్యవస్థ ప్రస్తుత తీరుతెన్నుల పట్ల చాలామంది ఉలేమాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే షరతులతో కూడిన 'నవీన నమూనా నిఖానామా' సంప్రదాయక నిఖానామాలోని లొసుగులు, లోపాలను సరిదిద్దగలదా? ఈ ప్రశ్ననే ఉలేమాలు చర్చించారు. దాని న్యాయబద్ధతను ఇస్లామిక్ ధర్మశాస్త్రపు హనఫి, హన్బలి, షాఫై, మాలికి సంప్రదాయాల స్ఫూర్తితో తర్కించారు. 

సంస్కరణలకు సానుకూలత చూపే ఉలేమాలు మౌలానా సైఫుల్లా రహ్మాని, మౌలానా ముజాహిదుల్ ఇస్లామ్ ఖాస్మి అభిప్రాయాలు పరిగణింపదగినవి. భారత ఉపఖండంలో అత్యధికులు అనుసరించే హనఫి సం ప్రదాయానికి తోడు, అవసరమైన చోట, మాలికి, హన్బలి సంప్రదాయాలను కూడా అనుసరించాలని వారు సూచించారు. షరతులకు లోబడ్డ నిఖానామా భావనను అంగీకరిస్తూ స్వల్ప మార్పులనూ వారు సూచించారు. 

ఇదంతా జరిగింది 1997లో. దురదృష్టవశాత్తు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆ ఆమోదిత పత్రాన్ని 2005 వరకు విడుదల చేయలేదు. బోర్డు ఆమోదిత నిఖానామాలో మూడుసార్లు తలాక్ చెప్పే విషయంలో నిర్దేశించిన నిబంధనలను తొలగించి ఒక చిన్న హెచ్చరికను చేర్చారు. వస్తురూపంలో మెహర్‌ను చెల్లించడం, కట్న కానుకలపై నిషే ధం, హింసకు వ్యతిరేకంగా నిర్దేశించిన నిబంధనలను అట్టి పెట్టారు. అయితే కొన్ని కొత్తకొత్త నిబంధనలను అందులో చేర్చా రు.

భర్త అనుమతి లేకుండా ఇంటినుంచి బయటకు అడుగు కదపకూడదనే మితవాద ప్రవర్తనా నియమావళిని ప్రవేశపెట్టారు. ఎ.ఐ.ఎమ్.పి.ఎల్.బి. ధోరణి, అభిప్రాయాలతోను, ఆ నిఖానామాలోని అంశాలతోను విభేదించి రెండు కొత్త - ముస్లిం ఉమెన్స్ పర్సనల్ లా బోర్డ్, షియా పర్సనల్ లా బోర్డ్‌లు ఏర్పడ్డాయి. ఇవి రెండు కొత్త నిఖానామాలను రూపొందించాయి. వాటిని 2006లోను, 2008లోను విడుదల చేశారు. 

ఇరాన్‌కు చెందిన అయతొల్లా సిస్టైని ఆమోదంతో షియా బోర్డ్ తన నిఖానామాను విడుదల చేసింది. 'ఖులా' (మహిళలే విడాకులకు పూనుకోవడం)అనే కొత్త నిబంధనను ఇది ప్రవేశపెట్టింది. విద్యా ఉద్యోగాలలో భార్య పురోగతిని అడ్డుకోవడంపై తీవ్ర ఆంక్షలు విధించింది.

ఉమెన్స్ బోర్డ్ నిఖానామా భార్యాభర్తలకు సవివరమైన ప్రవర్తనా నియమావళిని నిర్దేశించింది. వివాహం చేయించే ఖాజీ షరియాను సమగ్రంగా తెలుసుకున్న వాడై ఉండాలని, నవ దంపతులకు నిఖానామా గురించి సమగ్రంగా చెప్పాలని, ఏ పెళ్ళినీ బలవంతంగా చేయకూడదని వివాహ బాధ్యతల గురించి అవగాహన లేని వయస్సులో ఉన్న తరుణప్రాయ యువతీయువకుల వివాహాలకు ఒప్పుకోకూడదని, మెహర్ చెల్లించకపోవడంపై మహిళలు స్వచ్ఛందంగా క్షమించాలని, ఖురాన్‌కు తప్పుడు భాష్యాలతో క్షమించేలా చేయకూడదని ఈ నిఖానామా నిర్దేశించింది. 

అలాగే ఆధునిక భర్త ప్రవర్తించవలసిన తీరుతెన్నులను కూడా నిర్దేశించింది. ఇంటి పనులలో భార్యకు భర్త విధిగా తోడ్పడాలని స్పష్టం చేసింది. తలాక్, ఖులా ఏ విధంగా పాటించాలో కూడా అది నిర్దేశించింది. అన్ని బోర్డులు, తమ నిఖానామాలను విడుదల చేస్తూ వాటిని తమ సభ్యులందరూ ఆమోదించారని, అది ముస్లిం మహిళల ప్రయోజనాలను సమగ్రంగా పరిరక్షిస్తుందని పేర్కొన్నాయి. ముస్లింలు ఈ కొత్త నిఖానామాలను విధిగా పాటించవలసిన అవసరం లేదని, స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొన్నాయి. 

ప్రవర్తనా నియమావళి, షరతుల విషయంలో బోర్డుల మధ్య విభేదాలు విశదమయ్యాయి. ముస్లిమ్ పర్సనల్ లా బోర్డ్ మినహా మిగతా బోర్డులు మూడుసార్లు తలాక్ చెప్పడానికి వ్యతిరేకంగా స్పష్టమైన నిబంధనలను నిర్దేశించాయి. తలాక్‌ను ఎలా చెప్పాలో పేర్కొన్నాయి. ముస్లిం భార్యాభర్తలు తమ విభేదాలను మధ్యవర్తులు, దారుల్ ఖాజా ద్వారా పరిష్కరించుకోవాలని మూడు బోర్డులూ సూచించాయి.

సరే, ఈ నిఖానామాలలో ఏ ఒక్కటైనా అమలవుతోందా? ఏ మేరకు అమలవుతోంది? ముస్లిం మహిళా హక్కుల పరిరక్షణకు ఆవిర్భవించిన భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ వంటి సంస్థలు గత దశాబ్దంలో తమ సొంత జండర్ -సమన్యాయ నిఖానామాను వందలాది వివాహాలలో అమలుపరిచారు. గుజరాత్‌లోని యువ బోరా ముస్లింలు తమ వివాహాలలో ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నిఖానామాను అనుసరిస్తున్నారు. గతంలో ముస్లిం పర్సనల్ లాను సంస్కరించడానికి చేసిన ప్రయత్నాలకు ఈ నవీన నిఖానామా ప్రయత్నాలకు చాలా తేడా ఉంది. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మితవాద ముస్లింల ప్రజాభిప్రాయం బలపడడాన్ని ఇవి నిరోధించాయి. వివాహ ఆచారాల ఆచరణలో 'మత', 'లౌకిక' సంప్రదాయాల మధ్య సమన్వయానికి ఇవి దోహదం చేస్తున్నాయి. వీటివల్ల ఇస్లామిక్, లౌకిక నుడికారాలు మిళితమైపోయాయి. దీని ఫలితంగా వరకట్నాన్ని చట్ట విరద్ధమని కాక ఇస్లామేతర ఆచారంగా పేర్కొంటున్నారు. అలాగే 'మెహర్' అనేది ముస్లిం మహిళల 'హక్కు'గా పరిగణిస్తున్నారు.

షా బానో కేసు అనంతరం జెండర్‌కు సంబంధించిన అంశాలపై 'మత', 'లౌకిక' వాదుల మధ్య సంభాషణ మళ్ళీ మొదలైంది. ఫురుషాధిక్యత గల 'మత సమూహం'లోకి ముస్లిం స్త్రీలు ప్రవేశించగలిగారు. తద్వారా ముస్లిం సమాజ పితృస్వామ్య ధోరణులకు ముస్లిం స్త్రీలు బాధితులనే మూస భావనను వారు తొలగించగలిగారు. 'ఇస్లామిక్' సంప్రదాయంలో సంస్కరణలకు పట్టుపట్టి, ఆ విషయంలో కొంత మేరకు సఫలమవ్వడం ద్వారా ముస్లిం సమాజం మారదని, అది ఎప్పటికీ తిరోగామి భావాలు, ఆచరణలను విడనాడదని ప్రజల్లో ప్రచారంలో ఉన్న హిందూ కథనాల ప్రభావాన్ని తగ్గించి వేయడంలో నిఖానామా చర్చ దోహదం చేసింది. 'నవీన నమూనా నిఖానామా' యావత్ ముస్లిం ప్రజలనందరినీ ప్రభావితం చేసే అవకాశం ఎంతైనా ఉన్నది. సరైన ఆచరణాత్మక పద్ధతులను నిర్దేశించడమూ, కాలం చెల్లిన ఆచారాలపై ఆంక్షలు విధించడం మాత్రమే కాక ముస్లిం సమాజ పెద్దలు దారుల్ ఖాజా రూపంలో మధ్యవర్తులుగా వ్యవహరించేలా చేయడంలో కూడా నిఖానామాపై చర్చ విశేషంగా తోడ్పడింది.

- డా. ఎ. సునీత
(అన్వేషి)

Andhra Jyothi Telugu News Paper Dated : 7/4/2013 

No comments:

Post a Comment