Saturday, April 27, 2013

వృద్ధుల బాధ్యత పాలకులదే - డా. సి. కాశీం



'పసిపాప లాంటి వృద్ధాప్యంలో
నిబ్బరంగా నిలబడి
చిరుగాలి సితారా సంగీతాన్ని
పలికించే వేళ, పలవరించే వేళ
జీవితమా!
నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు!'

అని శివసాగర్ 80 ఏళ్ల వృద్ధాప్యంలో యవ్వనాన్ని రొమాంటిక్‌గా పలవరించారు. ప్రతివృద్ధుడు ఇలా కోరుకోవటం సహజం. కానీ ప్రకృతిలో ఇది సాధ్యం కాదు.
ప్రతి మనిషికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మూడు దశలు ంటాయి. బాల్యం, యవ్వనంలో ఉండే సంతోషం వృద్ధాప్యంలో సాధ్యం కాదు. మనిషి జీవితంలో ఏ విధంగా చూసినా ఈ చివరి దశ కష్టభరితమైంది. విషాదకరమైనది. కానీ వృద్ధులు ఒక గతానికి సాక్ష్యం. ఆ గతం తాలూకు తీపి, చేదు గుర్తులను వర్తమానానికి అందించే వాహిక వృద్ధులే. గతం భుజాల మీద నిలబడి వర్తమానాన్ని వీక్షిస్తూ, భవిష్యత్‌ను కలగనాలనే అవగాహన ప్రతి మనిషికి ఉండాలి. అప్పుడే వృద్ధుల పట్ల మన సామాజిక బాధ్యత గుర్తుంటుంది.

ఇక ప్రపంచీకరణ విధానాలు అమలవుతున్న ఈ ఇరవై సంవత్సరాలలో మానవ విలువలు డాలర్ కట్టల కింద నలిగిపోతున్న పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తుంది. విలువల రాహిత్యం అన్నిచోట్ల పెరిగింది. ఆస్తికోసం కన్న తల్లిదండ్రులను రోడ్డు పాలుచేసే, లేదా చంపేసే దుర్మార్గం దాపురించింది. ఎలక్ట్రానిక్ వస్తువుల వలన దూరాలు తగ్గాయి. కానీ ముసలి తల్లిదండ్రులకు పిల్లలకు మాత్రం దూరం మరింత పెరిగింది. కవరేజి లేని ప్రాంతాలలో ముసలి వాళ్లను ఉంచాలనే ధోరణి పెరిగిపోయింది. కారణాలు ఏవైనా సమాజానికి ఇది మం చిది కాదు. మనమలు, మనమరాండ్రతో హాయిగా నవ్వుతూ ఉండవల్సిన వయసులో చెట్టుకిందో, బస్టాండులో, ఫ్లై ఓవర్ కిందో, ఫుట్‌పాత్ మీదనో తల దాచుకోవటమనే దౌర్భాగ్యం రావటం ఈ వ్యవస్థ కుళ్లిపోతుందనడానికి నిదర్శనం. మనల్ని కనీపెంచిన వాళ్లను రోడ్డుపాలు చేస్తే, రేపు మనం కనీపెంచిన వాళ్లు కూడా అదే పని చేస్తారనే ఎరుక ఉండాలి. రక్తబంధం బాధ్యతను తీర్చుకోవటం కనీస ధర్మం. అయితే సమస్యకు ఇదొక పార్శ్వం.

అనాథలు, ఆర్థిక స్థోమత లేని వృద్ధులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. సంక్షేమ రాజ్యమని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా ఉండాలి. 'తల్లిదండ్రుల, సీనియర్ పౌరుల పోషణ, సంక్షేమ చట్టం 2007' ప్రకారం ప్రభుత్వమే వృద్ధుల బాధ్యతను తీసుకోవాలి. ఈ చట్టంలోని మూడవ అధ్యాయం ప్రకారం (1) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలి. అందులో 150 మందికి ఆశ్రయం కల్పించాలి. (2) ప్రభుత్వ ఆసుపత్రులలో సీనియర్ పౌరుల కోసం పడకలు ఏర్పాటు చేయాలి. (3) సీనియర్ పౌరులకు వేరుగా క్యూ పద్ధతిని ఏర్పాటు చేయాలి. (4) చట్టంలోని సదుపాయాలను ప్రభుత్వం మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. (5) జిల్లా మేజిస్ట్రేట్‌కు ఈ చట్టం అమలు పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది. (6) సీనియర్ పౌరుల సంరక్షణ బాధ్యతను బుద్ధి పూర్వకంగా విస్మరించిన వ్యక్తులకు మూడు నెలలు జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా విధించవచ్చు. ఈ అంశాల అమలు పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధి ప్రదర్శించిన దాఖలాలు లేవు.

మన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నియమించిన మోహినీగిరి కమిటీ నివేదికను అమలుచేయాలి. వితంతువుల సమస్యల అధ్యయనానికి మరో కమిటీని నియమించాలి. వీరి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయటం వలన కూడా సమస్యలను పరిష్కరించటం సులభమవుతుంది.
వృద్ధుల పరిస్థితి ఇలా ఉంటే వితంతువుల పరిస్థితి మరీ ఘోరం. నా అనేవారు లేక, తోడు లేక గుండె చెరువై జీవిస్తుంటారు. భర్త చనిపోయి, బంధువుల నిరాదరణకు గురై, కన్నబిడ్డల సాదుకోలేక అనేక ఇబ్బందులు పడుతుంటారు. వీరి బాధ్యత కూడా ప్రభుత్వం చూడాలని అనేక చట్టాలు చెబుతున్నాయి. కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి.

- డా. సి. కాశీం
(ఏప్రిల్ 28న వృద్ధుల, వితంతువుల యుద్ధభేరి సందర్భంగా)

Andhra Jyothi Telugu News Paper Dated : 28/4/2013

No comments:

Post a Comment