Friday, May 10, 2013

వివక్షల కొలిమిలో 'ఇఫ్లూ' - గుర్రం సీతారాములుముదస్సిర్ కమ్రాన్ ముల్లా అన్న పేరు జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో ఈ మధ్యకాలం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. 29 ఏళ్ల ముద స్సిర్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (ఇఫ్లూ) యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న స్కాలర్. గత నెల 2వ తేదీన హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకొని చనిపోయాడు. యూనివర్శిటీలో ముదస్సిర్ ఒక మిత్రునితో గొడవ పెట్టారు. ఆ గొడవను సర్దుబాటు చేయకుండా ఒక ప్రొఫెసర్ పోలీసు స్టేషన్ దాకా తీసుకెళ్ళాడు. ఈ విషయంపై పోలీసులు ఒక అర్ధరాత్రి ఇఫ్లూ హాస్టల్‌లోని ముదస్సిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని అవమానంగా భావించిన ముదస్సిర్ ఉరి వేసుకుని చనిపోయాడు. ముదసిర్ చనిపోయి సరిగ్గా నెలరోజుల తర్వాత అంటే మే ఒకటో తేదీన తమిళనాడుకు చెందిన మరో ముస్లిం విద్యార్థి అరబిక్ స్టడీస్‌లో పరిశోధన చేస్తోన్న మహమద్ మొహిద్దిన్ కూడా ఉరేసుకొని చనిపోయాడు. తమిళనాడు మదురై నుంచి వచ్చిన మొహిద్దిన్ గత మూడేళ్ళుగా ఇక్కడ అరబిక్ డిపార్ట్‌మెంటులో పరిశోధన చేస్తున్నాడు. తెల్లవారితే అతని పరిశోధన పీహెచ్‌డీ వైవా పరీక్ష, ఇంకో రెండు రోజుల్లో అతని ముప్ఫై మూడో జన్మదినం. యూనివర్సిటీ దగ్గరలో ఉన్న మసీద్‌లో ప్రార్థన పూర్తయ్యాక నిద్రపోయి అర్ధరాత్రి ఉరేసుకొని చనిపోయాడు. అతని పీహెచ్‌డీ వైవా పరీక్ష ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. ప్రొఫెసర్లు ఆయన వైవా పరీక్షను కావాలని జాప్యం చేయడం వల్ల విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

ముదసిర్ కమ్రాన్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముదసిర్ ఆత్మహత్యకు పోలీసులే బాధ్యులని, అది రాజ్యం చేసిన హత్య అని యావత్ కాశ్మీరీలు బంద్ నిర్వహించారు. హర్తాళ్ళు, బంద్‌లతో కాశ్మీరు లోయ దాదాపు మూడు రోజులపాటు దద్దరిల్లింది. ఆ అల్లర్లను అదుపుచేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. అతని అంతిమ యాత్రలో లక్షలాది మంది పాల్గొన్నారు. ఉపాధ్యాయ-విద్యార్థి సంబంధాలు ఒకప్పుడు మానవీయంగా ఆదర్శంగా ఉండేవి. కానీ ఇప్పుడు అలా లేవు. ఉపాధ్యాయులు విద్యార్థి కులం, మతం బట్టి వాళ్ళతో మెలుగుతున్నారు. ఒకవైపు వివిధ ప్రాంతాలకు చెందిన రైతాంగం నానా కష్టాలకోర్చి తమ పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఉన్నత చదువులు చదివించేందుకు వారిని పట్నం పంపిస్తున్నారు. మరోవైపు వ్యవస్థీకృతమైన రాజ్య హింసకు భయపడి ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు దక్షిణాది రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు ముఖ్యంగా కేంద్రీయ విశ్వవిద్యాలయల్లో చదివేందుకు వస్తున్నారు. 

అలాంటి వారు ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో కుల, మత వివక్షలకు, ఆత్మన్యూనతలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గడిచిన రెండేళ్ళలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకోవడాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సంక్షుభిత కాలంలో మండల్ కమిషన్ వెలుగులో చుండూరు, కారంచేడు రగిల్చిన కసితో వచ్చిన స్ఫూర్తి నేడు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పురి విప్పింది. ఈ స్ఫూర్తికి వ్యతిరేకంగా అనేక శక్తులు వివిధ రూపాల్లో విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముదసిర్, మెహమద్ మొయిన్ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ఒక్క ఇఫ్లూలోనే కాదు అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కుల, ప్రాంత వివక్షకు గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

కల్లోల కాశ్మీరు నుంచి వచ్చి నిప్పుల వాగులా మండుతున్న తెలంగాణలో ప్రాణం పోవడం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అక్కడే కాదు, ఇక్కడ కూడా దేశ సరిహద్దులో ఉన్నట్లు ఉంటుంది. ఒకడు మంచి వాడా ద్రోహా అనే విషయం అతను పుట్టిన ప్రాంతం, మతం, కులం బట్టి నిర్ణయిస్తున్న సంక్షుభిత కాలం ఇది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పుల్వామా జిల్లా పరిగం గ్రామానికి చెందిన ముదస్సిర్ ఖమ్రాన్ ముల్లా ఇఫ్లూలో ఇద్దరు కాశ్మీరీ విద్యార్థుల్లో ఒకడు. ఇద్దరి మధ్య కొంతకాలంగా వస్తున్న గొడవలను సామరస్యంగా పరిష్కరించడంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సరిగా వ్యవహరించ కపోవడంతో ఈ దారుణం జరిగింది. అతను చనిపోయాక అతను మానసిక దౌర్బల్యంతో బాధపడుతున్నాడని, హోమో సెక్సువల్ అని ప్రచారం జరిగింది. కాశ్మీర్‌లోని సామాజిక వాతావరణం నేపథ్యంలో ముదస్సిర్ సున్నిత మనస్కుడు అన్నది నిజమే. అతని బాల్యం ఒక అనిశ్చితి మధ్య అభద్రతల మధ్య గడచింది. అతని నవ యవ్వనం నిత్యం తుపాకీ పహరా నీడన న డిచింది. అలాంటి యువకుడితో యూనివర్శిటీ బా«ధ్యులు మొరటుగా, దూకుడగా వ్యవహరించారు. ఇది క్షంతవ్యం కాదు.

నేడు ఇఫ్లూలో జోహార్ ముదసిర్ అమర్ రహే అన్న నినాదాలు వినిపిస్తున్నాయి. అతని సహచరులు నిన్నటి దాకా జరిగిన క్రికెట్ టోర్నమెంటులో అతను చేసిన కామెంటరీని తలచుకొని వలపోతలో ఉన్నారు. క్రికెట్ గ్రౌండ్ అంతా కొవ్వొత్తులను వెలిగించి దేశ విదేశాల విద్యార్థులు ముదసిర్‌కు నివాళులర్పించారు. గడచిన నెల రోజులుగా ఇఫ్లూ నినాదాలతో మార్మోగుతోంది. ముదసిర్ మరణం ఈ దేశ విద్యా వ్యవస్థలో దిగజారిన విలువలకు పరాకాష్ఠ. రోజంతా చదువులో పడి ఇఫ్లూలోని సాగర్ స్టోర్‌లో సేద తీర్చుకొనే ప్రాంతం ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. 'ఆక్యుపై సాగర్ స్క్వేర్' అన్న ఉద్యమం అక్కడ ఊపందుకుంది. కవితలు, పాటలతో ఆ ప్రాంతమంతా పల్లవిస్తోంది. అతని చావుకి కారణాలు అర్థం కావాలంటే కల్లోల కాశ్మీరీ బాల్యం అర్థం కావాలి. చిత్రహింసల కొలిమిని చూస్తోన్న కాశ్మీరీ యువత దీనత్వం, మానసిక స్థితి అర్థం కావాలి. చేయని నేరానికి మిలటరీ క్యాంపుల్లో నలుగుతోన్న శరణార్థుల కన్నీటి గాథలు అర్థం కావాలి. 'అల్లా అందరిని చక్కగా చూస్తాడని, ఆయన దృష్టిలో అందరూ సమానమే'అని ముదస్సిర్ నువ్వు వల్లించే విశ్వమానవతా స్ఫూర్తి ఎందుకో ఇక్కడా కొరవడింది. 'సామూహిక భావాల సంతృప్తి' అన్న ఒక సమర్థన ఇప్పుడు నిన్ను నీతోనే ఉరి వేసుకునేలా చేసింది....

- గుర్రం సీతారాములు
ఇఫ్లూలో పరిశోధక విద్యార్థి 

Andhra Jyothi Telugu News Paper Dated: 11/5/2013 

No comments:

Post a Comment