Friday, May 3, 2013

ఉద్యమంలో కొన్ని మలుపులు ----ఫ్రొఫెసర్ హరగోపాల్,తెలంగాణ ఉద్యమ వయసు దశాబ్ది దాటింది. ఒక ఉద్యమం, ఇంత నిరంతరంగా సాగడం తెలంగాణ ప్రజల ఉద్యమ స్వభావాన్ని, పట్టుదలను చాటుతున్నది. సాధారణంగా ప్రజలు కొంతకాలంగా ఉద్యమం చేసి ఫలితాలు రాకపోతే నిరాశ చెంది, కొంచెం సినికల్‌గా మారుతారు. అప్పుడప్పుడు నిరాశ చెందినా, తెలంగాణ ప్రజలు ఉద్యమానికి దన్నుగానే నిలబడుతున్నారు. తెలంగాణ మధ్యతరగతి పాత్ర కూడా చాలా ప్రశంసించవలసిందే. జీవితంలో రాజీపడి బతుకులను ఈడుస్తున్న ఈ తరగతి, ఏ అవకాశం దొరికితే ఆ అవకాశం వెనక పరిగెడే తరగతి, ఉద్యమంతో నిలబడ్డది. ఇది సాధారణ విషయం కాదు.

ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా స్పందిస్తున్నారు. దానికి ఢిల్లీలో గతనెల 29.30 తేదీలలో నిర్వహించిన ధర్నా పెద్ద ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వీళ్ళందరికి ఏం ప్రయోజనాలు జరుగుతాయో తెలియదు కాని ఉద్యమాలను ఎలా చేయాలి, ఎలా నిలబట్టాలి అనే అంశంలో మధ్యతరగతి చాలా వరకు తర్ఫీదు పొందినట్టే. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఈ స్ఫూర్తే కొనసాగితే, ప్రజాస్వామ్య సంస్కృతి కొంతవరకన్నా బతికే అవకాశం ఉన్నది. మొత్తం ఉద్యమంలో కొంత నిరాశ కలిగించే అంశం విద్యార్థులు.భిన్న కారణాల వల్ల ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్ళిన విద్యార్థులు దానిని నిలపలేకపోయారు. ఆ మిలిటెన్సీని కాపాడుకోలేకపోయారు.విద్యార్థులు సుదీర్ఘకాలం ఉద్యమాలను చేయలేరా అనే అనుమానం కూడా కలుగుతున్నది.

తెలంగాణ ఉద్యమం కేవలం భౌగోళిక ఆకాంక్ష ఆధారంగా నడపటం సాధ్యం కాదు అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ కారణం వల్లే కావచ్చు. అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా బయ్యారం ఖనిజ సమస్య ఉద్యమంలోకి చేరింది.ఒక పదేళ్ల క్రితం రాజశేఖర్‌డ్డి హైదరాబాద్ నగరంలో పబ్లిక్ భూములను మన కళ్ళ ముందు బజారులో పెట్టి అమ్మినప్పు డు ఈ స్పందన లేదు. ఆయన నిర్భయంగా ఆ పని చేశాడు. నగరంలోని భూమి మీద తెలంగాణ ప్రజలకు హక్కులుంటాయని, భూమిని అమ్మే అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదని ఉద్యమం వాదించలేదు, అడ్డుపడలేదు. 

భూమిని అమ్మే క్రమంలో హైదరాబాద్‌ను గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ప్రత్యే క ఆర్థిక మండళ్ళు ఏర్పడితే ఎవరు ముఖం కూడా చిట్లించలేదు. మాదాపూర్‌లో విజయభాస్కర్‌డ్డి బొటానికల్ గార్డెన్స్‌లోని పచ్చటి ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లకు అప్పచెప్పితే ఎవరూ కిమ్మనలేదు. ఉదయం నడకకు వచ్చేవాళ్లే ఆ పార్కును రక్షించడానికి పోరాడుతున్నారు. దాంట్లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం వాళ్లే కాక ఇత ర రాష్ట్రాల వాళ్లు కూడా ఉన్నారు. మా కళ్ళముందే వందల పచ్చటి చెట్లను నేలమట్టంచేసి అంతటి గోతులు తవ్వారు. నిజానికి ఒక దశలో ఈ గార్డెన్ స్మశానాన్ని గుర్తుకు తెచ్చింది. చెరువులు, పార్కులు, చెట్లు, నీళ్లులేని తెలంగాణ ముఖ్యపట్టణంగా హైదరాబాద్‌ను ఊహిస్తే ఎలా ఉంటుంది. రాజశేఖర్‌డ్డి పనికట్టుకొని ఈ పని చేశాడా అని అనిపిస్తున్నది. బొటానికల్ గార్డెన్‌ను కాపాడే ఉద్యమానికి తెలంగాణ ఉద్యమం నుంచి ఆశించినంత మద్దతు రాలేదు. ఈ అంశాలన్ని మళ్లీ మళ్లీ రాయడమెందుకు అంటే ఉద్యమం దిశ గురించి మళ్లీ మళ్లీ మాట్లాడడమే.

ఇలాంటి కొన్ని ప్రధానమైన నిర్ణయాలను విస్మరించిన ఉద్యమం బయ్యారం ఖనిజ వనరుల కోసం మాట్లాడడం ఆ ఖనిజ సంపదలో తెలంగాణకు న్యాయమైన వాటా ఉందని వాదించడం ఒక చెప్పుకోదగ్గ మలుపే. బయ్యారం ఖనిజ వనరుల గురించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడినా, ఈ మొత్తం చర్చ వలన ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు. అయితే బయ్యారం వనరుల మీద అధిపత్యం ఎవరిది, సంపద న్యాయబద్ధంగా ఎవరికి చెందుతుందన్న ప్రశ్న కేవలం బయ్యారానికి సంబంధించిన అంశం కాదు. ఇది చాలా చాలా పెద్ద ప్రశ్నలతో ముడిపడి ఉంది. గిరిజన ప్రాంతాలలో ప్రజలు తమ వనరుల రక్షణ కోసం దాదాపు సాయుధ పోరాటమే చేస్తున్నారు.

ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి ‘ఈ అడవి ఎవరిది’ అని చాలా కాలం క్రితం మంచి నవల రాసింది. ఈ ఖనిజ వనరులలో స్థానికుల పాత్ర ఉంటుందని వాళ్ళ సమ్మతి అవసరముంటుందని సూత్రవూపాయంగా అంగీకరిస్తే, బయ్యారం సమస్య దేశ గిరిజన పోరాటాల సమస్యతో ముడిపడి ఉంది.నిజానికి గిరిజనులకు రాజ్యాంగంలో ఈ వనరుల విషయంలో ప్రత్యేకమైన హక్కు లు పొందుపరచబడి ఉన్నాయి. దీనికి మించి ఈ దేశ వనరులు ఈ దేశ ప్రజలవేనా అనే మరో క్లిష్టమైన సవాలు మన ముందు ఉంది. విదేశీ బహుళజాతి కంపెనీలకు ధారదత్తం చేసిన వనరుల మాటేమిటి? మన కళ్లముందు ఖనిజ వనరులను దోచుకుని విదేశాలకు తరలిస్తుంటే, అది అభివృద్ధికి సంకేతమని పాలకవర్గం బుకాయిస్తుంటే మన స్టాండ్ ఏమిటి అనే ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. ఏదిఏమైనా బయ్యారం వనరుల మీద తెలంగాణ ప్రజలకు హక్కులున్నాయని జరుగుతున్న చర్చ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పిందనే చెప్పాలి.

అలాగే ఈ మధ్య కాలంలో టీఆర్‌ఎస్ అధ్యక్షులు చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని ప్రకటించారు. కేవలం తెలంగాణ ఏర్పడితే చాలు ఆ తర్వాత మనం ఏం చేద్దామని ఆలోచించవచ్చు అనే స్థితి నుంచి నిర్దిష్టంగా ఉచిత విద్య గురించి మాట్లాడడం ఒక రాజకీయ అవసరమని భావించడం ఒక మార్పే. ఉద్యమం నిలబడడానికి ప్రజల సమస్యల గురించి మాట్లాడి వాటికి, తెలంగాణ రాష్ట్రంలో పరిష్కారాలుంటాయని అనడం మార్పే. మాట్లాడినంత మాత్రాన ఇవన్నీ చేపడతారా అని అడగవచ్చు. కానీ నా దృష్టిలో కేవలం భౌతికపరమైన తెలంగాణ డిమాండ్ నుంచి ప్రజల హక్కుల గురించి మాట్లాడడం ఒక ముందడుగు.

విద్యా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా గత మూడు దశాబ్దాలుగా విద్య సంపూర్ణం గా సామాజిక అంశంలో ఉండాలని, పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని, దాని కోసం కామన్ స్కూల్ విధానం ప్రవేశపెట్టాలని అలసిపోకుండా మాట్లాడుతున్నాం. విద్యా పరిరక్షణ ఉద్య మం ఇప్పుడు 18 రాష్ట్రాలలో జరుగుతున్నది. భిన్నమైన స్కూళ్లు, కార్పొరేటు విద్య, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల వల్ల సమాజానికి జరిగిన హాని ఇంకా ముందు ముందు కాని తెలియదు. మనిషి జేబులో డబ్బులు లేకపోవడం వల్ల, కళ్ల ముందు చనిపోతున్నా చూస్తున్న అమానుషమైన డాక్టర్లు, కామన్ వెల్త్ గేమ్స్ కోసం ప్రపంచమంతా చూస్తుండగా కూలిపోయిన బ్రిడ్జిలు, డబ్బులుంటే తప్పించి పేదవాడి పక్షాన మాట్లాడే లాయ ర్లు లేకపోవడం ఒకటి కాదు భిన్న రంగాల లో ఈ విష ప్రభావాన్ని చూడవచ్చు. వీటిని దగ్గరగా చూస్తున్న వాళ్లకు ఒక ఉద్యమ రాజకీయ నాయకుడు ఉచిత విద్య అంటుంటే ఏదో చక్కటి సంగీతం విన్నట్లు అనిపించింది. ఇంకా అలాంటి ఆలోచనలు రాజకీయ సంస్కృతిలో ఉన్నాయి అనేదే విశేషం.

మొత్తంగా తెలంగాణ ఉద్యమం ప్రజల సమస్యలను గురించి మాట్లాడడం నేర్చుకుంటున్నది. నిర్దిష్ట నిత్య జీవిత సమస్యలు మాట్లాడితేనే తెలంగాణ ఉద్యమం నిలబడుతుంది. ఈ విషయం నేను జయశంకర్‌తో చాలా సందర్భాల్లో చెప్పాను. అలాగే ఈ రోజు ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహిస్తున్న కోదండరాంతో కూడా చర్చించాం. భౌతిక తెలంగాణ అమూర్త భావన. గనులు, విద్య, వనరులు వాస్తవాలు. వాస్తవాల మీద నిర్మాణమయ్యే ఉద్యమాలు ఎంత కాలమైనా నిలబడుతాయి.ఆ విధంగా చూస్తే బయ్యారం , ఉచిత విద్య ఉద్యమం భాషలోకి రావడం ఏదో మార్పు దిశను సూచిస్తున్నది. 

ఫ్రొఫెసర్ హరగోపా


Namasete Telangana Telugu News Paper Dated : 2/5/2013

No comments:

Post a Comment