Friday, May 31, 2013

వికలాంగుల హక్కుల గొంతుక హెలెన్‌ కెల్లర్‌ --- పి రాజశేఖర్‌

   Sat, 1 Jun 2013, IST  

  • నేడు హెలెన్‌ కెల్లర్‌ 25వ వర్ధంతి
జీవితం నిత్యం సమ స్యలతో స్వా గతం పలు కుతున్నా, అంధత్వం అడ్డుతగిలినా, మూగ, చెవిటితనంతో కృంగిపోలేదు. అధైర్యపడకుండా, నిరాశ చెందకుండా అవరోధాలను అధిగ మించారు. లక్ష్యాలను సాధించి చిమ్మ చీకటిలో సైతం వెలుగును చూడగలిగే ధైర్యం, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం మనిషి ఉన్నతికి స్ఫూర్తి అని ప్రపంచానికి చాటి చెప్పారు హెలెన్‌ కెల్లర్‌. ఆమె వికలాంగుల హక్కుల సాధనకు జీవితాన్ని అర్పించిన గొప్ప త్యాగశీలి. 'ఇన్‌ హర్‌ స్టోరీ'కి ఉత్తమ డాక్యుమెంటరీగా 1955లో అకాడమీ అవార్డు వచ్చింది. వైకల్యం శాపం కాదు. సవాల్‌గా తీసుకోవాలని వికలాంగులను వారి హక్కుల పట్ల చైతన్యపరచేందుకు, వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ప్రేరణ కల్పించేందుకు 39 దేశాలు పర్యటించారు. ప్రగతిశీల భావాలతో అమెరికన్‌ సోషలిస్టు పార్టీలో చేరి వికలాంగులతోపాటు బాలల, మహిళల, కార్మికవర్గం హక్కులు, సంక్షేమంపై ఉపన్యాసాలు, అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ఆమె రాసిన 12 పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ముద్రించబడ్డాయి. వికలాంగుల హక్కుల పరిరక్షణకే పునరంకితమైన హెలెన్‌ కెల్లర్‌ అవివాహితగానే ఉండిపోయారు.
హెలెన్‌ కిల్లర్‌ 1880 జూన్‌ 27న ఆర్థర్‌ హెచ్‌ కెల్లర్‌, కేథరీన్‌ ఆడమ్స్‌ కెల్లర్‌ దంపతులకు అమెరి కాలోని అలబామాలో తుస్కుంబియాలో జన్మించారు. 19 నెలల వయస్సులో విపరీతమైన అనారోగ్యం మూలంగా చూపును, వినికడిని కోల్పోయారు. అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ సలహా మేరకు ఆమె పెర్కిన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది బ్లైండ్‌లో చేర్చారు. అక్కడ సల్లివాన్‌ అనే ఉపాధ్యాయురాలి వద్ద అనేక పదాలను తాకడం, వాసన ద్వారా నేర్చుకొని 1890 నాటికి చదవడం, రాయడం నేర్చుకున్నారు. 1900లో రాడ్‌క్లిఫ్‌ కళాశాలలో చేరి బ్యాచిలర్స్‌ డిగ్రీ పొందారు. 1902లో 'ది స్టోరీ ఆఫ్‌ మై లైఫ్‌' అనే పుస్తకాన్ని వ్రాశారు. టెంపుల్‌ యూనివర్శిటీ, హార్వర్డ్‌ యూనివర్శిటీ, స్కాట్లాండ్‌లోని గ్లాస్గో, జర్మనీలోని బెర్లిన్‌, భారత్‌లోని ఢిల్లీ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌ గౌరవ ఫెలోగా కూడా ఉన్నారు. ఉపాధ్యాయురాలైన సల్లివాన్‌ ఇంట్లోనే ఉంటూ అభ్యుదయ భావాలవైపు, సోషలిస్టు ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. వికలాంగులతోపాటు మహిళల, కార్మిక ఉద్యమాలను నిర్మించారు. 1924లో అమెరికాను పౌండేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అంధుల సంక్షేమం కోసం కోట్లాది డాలర్లు సేకరించారు. ది మిరాకల్‌ కంటిన్యూ అనే హాలీవుడ్‌ సినిమాలో నటించి హెలికాప్టర్‌, గుర్రం నడపడం తెలియ కపోయిన షూటింగ్‌ సమయంలో సాహసవంతంగా వాటిని నడిపి వచ్చిన డబ్బును అమెరికా పౌండేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌కు ఇచ్చారు. 1933లో నేషనల్‌ లైబ్రరీ ఫర్‌ బ్లైండ్‌కు అధ్యక్షురాలిగా ఎంపికై అనేక పుస్తకాలు బ్రెయిలీ బాషలోకి ప్రింట్‌ చేయించారు. ఆమె రచించిన పుస్తకాలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. హెలెన్‌ కెల్లర్‌ 1903 నుంచి 1965 వరకూ ఉన్న అమెరికా అధ్యక్షులందరికీ అంధులు, వికలాంగులు, మహిళలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి లేఖలు వ్రాశారు. అమెరికా అధ్యక్షులందరూ సమా ధానాలు పంపేవారు. ఆమె చార్లీచాప్లిన్‌, మార్క్‌ ట్విన్‌, గ్రాహంబెల్‌, నెహ్రూ, డేవిడ్‌సన్‌, విలియం జేమ్స్‌, తదితర నాయకులతో స్నేహం చేశారు. వారితో వికలాంగులు, సోషలిజంపై చర్చించేవారు. 1964లో అమెరికా అధ్యక్షుడు జాన్సన్‌ తమ దేశ ముద్దుబిడ్డగా హెలెన్‌ కెల్లర్‌ను ప్రకటించి ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ప్రీడం అత్యున్నత పురస్కారం అందించారు. ఆమె ఇంకా అనేక అవార్డులు అందుకున్నారు. వికలాంగుల జీవితాల్లో వెలుగును ప్రసాదించడమే కాక ప్రపంచ మార్పు కోసం 80 సంవత్సరాల వయస్సులో కూడా రోజుకు 10 గంటలు సామాజికాంశాల్లో పాల్గొనేవారు. వికలాంగులకు చేసిన సేవకు గుర్తింపుగా ప్రపంచ దేశాలు విద్యాసంస్థలకు, ప్రాంతాలకు ఆమె పేరు పెట్టాయి. 1988 జూన్‌ 1న నిద్రలోనే ప్రపంచాన్ని వీడిన హెలెన్‌ అవరోధాలు ఎన్ని ఉన్నా వాటిని మించిన అవకాలుంటాయని చాటిచెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమమైన వాటిని కంటి చూపుతో ఆస్వాదించకపోయినా హృదయంలో వాటి అనుభూతులను పొందవచ్చునని నిరూపించారు. ఈ విశ్వం ఉన్నంత వరకూ వికలాంగులకే కాకుండా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత. ఈ సమాజానికి ఒక గొప్ప రోల్‌ మాడల్‌. వికలాంగుల హక్కుల గొంతుక హెలెన్‌ కెల్లర్‌.
-పి రాజశేఖర్‌
  
Prajashakti Telugu News Paper Dated : 1/6/2013

No comments:

Post a Comment