Tuesday, January 24, 2012

హిందూ ఫాసిజమే భారత్‌కు హాని



- ప్రొఫెసర్ భంగ్యా భూక్యా

'ఆత్మవిమర్శా? అంతర్యుద్ధమా?' (జనవరి 17, ఆంధ్రజ్యోతి) అన్న వ్యాసంలో హిందూ మతంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా హిందూ మత సంస్థలకు, మేధావి వర్గాలకు, ప్రభుత్వానికి రిటైర్డ్ ఐపిఎస్ అధికారి కె.అరవిందరావు (పూర్వ డిజిపి) కొన్ని సలహాలు, సూచనలు చేశారు. అయితే ఈ వ్యాసం మొత్తాన్ని పరిశీలిస్తే అందులో అయన హిందూ ఫాసిస్టు ధోరణి, పోలీసు తత్వం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. 

కంచ ఐలయ్య తన 'హిందూ మతానంతర భారతదేశం' ద్వారా దేశంలో అంతర్యుద్ధాన్ని పురిగొల్పుతున్నారన్నది అరవిందరావు ప్రధాన ఆరోపణ. హిందూయిజం 'చచ్చి పోయింది లేక చచ్చి పోతోందనే' ఐలయ్య వాదనతో నేను పూర్తిగా ఏకీభవించను. కాని హిందూయిజమే ఈ దేశంలో అన్ని సమస్యలకు మూలకారణం అనే వాదనతో ఏకీభవిస్తాను. ఈ విషయాన్నే ఐలయ్య తన పుస్తకంలో చాలా బలంగా చెప్పారు. 

అణగారిన కులాలు, జాతులు ఈ దేశానికి మహోన్నతమైన జ్ఞానాన్ని, ఉత్పత్తిని అందిస్తుండగా అగ్రకులాలు మాత్రం మోసం చేయటమే పెట్టుబడిగా చేసుకొని అణగారిన కులాలను దోపిడీ చేస్తూ వారి జ్ఞానాన్ని వారిది కాకుండా చేశాయి. ఆ శ్రమజీవుల సంపదను వారికి దక్కకుండా చేశాయి. ఐలయ్య తన పుస్తకంలో ప్రధానంగా చెప్పిందేమిటంటే - ఈ దేశంలో జ్ఞానం అజ్ఞానంగా, అజ్ఞానం జ్ఞానంగా చలామణి అవుతుంది; దీనిని తిరగరాయటం ద్వారానే అణగారిన కులాల్లో మనో ధైర్యాన్ని నింపగలం. హిందూ మతం పేరుతో ప్రచారమవుతున్న బ్రాహ్మణ వాదాన్ని బొంద పెట్టడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. 

అనాదిగా ఎన్నో దాడులు ఎదుర్కొన్నా హిందూ ధర్మం/మతం మన దేశంలో ఇంకా బలంగా ఉండడానికి కారణం ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన సమన్వయ దృక్పథమే అని అరవిందరావు చెప్పారు. ఇది ఆయన అవగాహనా రాహిత్యమే. ఈ విషయాన్నే చాలామంది పదే పదే ఉటంకిస్తుంటారు. వాస్తవానికి ఆర్యుల తరువాత ఈ దేశంపై దండెత్తి వచ్చిన (పారశీకుల నుంచి బ్రిటిష్ వారి వరకు) ఏ ఒక్కరూ హిందూ మత సంప్రదాయాల్ని కించపరచడం కాని, ధ్వంసం చేయటం కాని చేయలేదు. ముస్లిం రాకతోనే హిందూ మతం పుట్టింది. 

అంతకు ముందు హిందూ అనే పదమే వాడుకలో లేదు. హిందూ ప్రాచీన దేవాలయాలన్నీ ముస్లిం పాలకుల కాలంలోనే నిర్మించబడ్డాయన్న వాస్తవాన్ని గుర్తించాలి. ముస్లిం పాలకులు కూడా వాటిని ప్రోత్సహించారు. ముస్లింలు రాకముందు ఈ దేశంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ లేదన్న సంగతి చారిత్రక సత్యం. భద్రాచలం రాముల వారి గుడి ఒక ముస్లిం పాలకుని కాలంలోనే నిర్మించబడ్డ సంగతి మరువరాదు. 

హిందూయిజానికి ఏ ఫిలసాఫికల్ పునాదులు లేవు. ఉన్నదల్లా హింసాత్మకమైన ఫాసిస్టు ఫిలాసఫీనే. క్రైస్తవం, ఇస్లాం లేక మరి ఏ మతం తీసుకున్నా మానవత్వమే ప్రధాన భూమికగా చేసుకొని నిర్మించబడ్డాయి. ఇస్లాం పవిత్ర గ్రంథమైన 'ఖురాన్'ను చదివితే ఎటువంటి కరుడుకట్టిన తీవ్రవాది (పోలీసు భాషలో) అయినా మానవతావాదిగా మారగలడు. 

ఖురాన్‌లోని ప్రతి పుట కూడా ఒక వ్యక్తి ఏ విధంగా మంచి మనిషిగా జీవింపవచ్చో చెబుతుంది. అలానే బైబిల్ కూడా. మరి హిందూ పురాణాలు, భగవద్గీత ఏం చెబుతున్నాయి? హింస, ఆధిపత్యం, అణచివేత, దోపిడీ గురించే వర్ణనలు ఉంటాయి. ప్రతి హిందూ దేవుడు ఎవరో ఒకర్ని (శూద్రులను) చంపటానికే పుడతాడు. 

హిందూయిజంలోని ఈ హింసాత్మక స్ఫూర్తే ఈ దేశానికి ప్రధాన శత్రువు. కంచ ఐలయ్య మాత్రం కాదు. ఈ దేశంలో టెర్రరిజానికి మొదట పునాదులు వేసింది హిందూయిజమే. పోలీస్ డిజిపిగా పనిచేసిన అరవిందరావుకు ఈ విషయం తెలియదని నేను అనుకోను. జాతీయోద్యమకాలంలో వచ్చిన తీవ్రవాదానికి స్ఫూర్తినిచ్చింది భగవద్గీతయే. జాతీయ తీవ్రవాదులుగా ముద్రపడ్డ తిలక్ మొదలుకొని అరవింద ఘోష్ వరకు హిందూ ఫాసిస్టు హింసతోనే స్ఫూర్తి పొందారు. చివరకు జాతిపిత మహాత్మా గాంధీని హతమార్చింది కూడా ఒక హిందూ ఫాసిస్టు అన్న విషయాన్ని మరువకూడదు. ఈ ధోరణులు రోజురోజుకు విస్తరించి, మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. 

హిందూ మతం ఉదార తత్వాన్ని చూసి మనమందరం గర్వ పడాలంటారు అరవిందరావు. హిందూ మతంలో ఉదారత ఉంటే ఈ రోజు దేశంలో ఉన్న ముస్లింలు, క్రైస్తవులు ఎందుకు అభద్రతా భావంతో జీవిస్తున్నారు? ఎందుకు వారిపై ప్రతిరోజు ఏదో ఒక మూలన దాడులు జరుగుతున్నాయి? అసలు వారి సంస్కృతిని, చరిత్రను సమానంగా గౌరవిస్తున్నామా? హిందూయేతర మతస్థుల చరిత్ర, సంస్కృతి గురించి మన పాఠశాలల్లో మచ్చుకైనా బోధిస్తున్నామా? 

ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే. పరమతాన్ని గౌరవించే చరిత్ర హిందూ మతంకు లేదు. బౌద్ధ మత వ్యాప్తిని చూసి తట్టుకోలేక పుష్యమిత్ర శుంగుడనే బ్రాహ్మణ సేనాని చివరి మౌర్య చక్రవర్తిని హతమార్చాడు. చంపింది ఒక్క చక్రవర్తినే కాని ఈ సంఘటన మహత్తరంగా విరాజిల్లుతున్న బౌద్ధ మతాన్ని తుద ముట్టించి బ్రాహ్మణ వాదాన్ని పునర్నిర్మించింది. ఈ పునాది మీదనే గుప్తులకాలంలో బ్రాహ్మణుల స్వర్ణయుగం విలసిల్లింది. 

ఇటువంటి సంఘటనలు హిందూ పురాణాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. ఈ పురాణాలు కట్టు కథలే అయినప్పటికీ వీటి ప్రభావం భారత సమాజంపై చాలా బలంగా ఉంది. ఈ కథలన్నీ శూద్ర, అతి శూద్ర, ఆటవిక జాతులను, స్త్రీలను అణచి వేయటానికే రాయబడ్డాయి. ఒక ఆటవికుడు విలువిద్యలు నేర్చుకోవద్దని ఏకలవ్యుడి బొటన వేలును నరికి వేయించటం, ఒక శూద్రుడు వేదాలు చదువకూడదనే ఆంక్షతో శంభూకుడిని హతమార్చడం, ఒక శూద్రుడు పాలకుడు కాకూడదని బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేయడం కొన్ని ఉదాహరణలు మాత్రమే. 

మరి అణగారిన కులాలు, జాతులు ఏమని గర్వపడాలి? వారి వంశీయులను మట్టుబెట్టిన హిందూ ఫాసిజంను చూసి గర్వపడాలా? అసలు అరవిందరావు బ్రాహ్మణుడుగా హిందూ పురాణాలను చూసి గర్వపడగలరా? గర్వంగా చెప్పుకోదగిన ఒక్క హిందూ దేవుడైనా ఉన్నాడా? శ్రీరాముడు ఏ విధంగా కౌసల్యకు జన్మించాడో వారి పిల్లలకు చెప్పగలరా? 

అంతా ఎందుకు వెంకటేశ్వర సుప్రభాతాన్ని తెలుగులోకి తర్జుమా చేసుకొని కుటుంబ సమేతంగా వినగలరా? మన ఊరి భాషలో చెప్పాలంటే రామాయణం ఒక రంకు, భారతం ఒక బొంకు. ఈ కథలు మన పిల్లలకు చెప్పితే మన ఆడపిల్లలు బైట తిరగగలరా? ఈ పురాణాలన్నీ అణచివేత గూర్చి చెప్పుతుంటే వీటిని చూసి ఎలా గర్వపడగలం? హిందూయిజంకు ప్రజాస్వామిక పునాదులు లేకపోవటం వల్లనే విదేశాలకు వ్యాప్తి చెందలేక పోవటమే కాక దేశంలోనే కోట్లాది ప్రజలకు దూరంగా ఉంది. 

ఐలయ్య ఎందుకు హిందూ మతాన్నే నిందిస్తున్నారని అరవిందరావు ప్రశ్నించారు. మేధావులు కులానికి, మతానికి, దేశానికి అతీతంగా ఆలోచిస్తారు. అయితే ఒక వరవడి ఏమంటే దోపిడీకి, పీడనకు గురవుతున్న ప్రజల పక్షాన నిలబడుతారు. అలా నిలబడే వారిని 'ఆర్గానిక్ ఇంటలెక్చ్యువల్' అంటారు. ఐలయ్య ఈ కోవకు చెందినవారు. హిందూ ఫాసిజంకు బలవుతున్నది అణగారిన కులాలు, ముస్లిం, క్రైస్తవులే కాబట్టి ఐలయ్య టార్గెట్‌గా హిందూయిజమే ఉంటుంది. 

దళిత ఉద్యమాలను, మానవహక్కుల ఉద్యమాలను అరవిందరావు పరోక్ష యుద్ధంతో ముడిపెట్టి చూడడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. అది ఆయన తప్పుకాదు. మన విద్యా విధానం తప్పు. మన విద్యా విధానం మనల్ని మనుషులుగా తీర్చిదిద్దడం లేదు. కేవలం ఆడ్మినిస్ట్రేటర్స్, టెక్నోక్రాట్స్‌గా తయారుచేస్తుంది. మరో వైపు ఈ దేశ మతంగా ప్రచారం పొందుతున్న హిందూయిజం మానవతా విలువలకు దూరంగా ఉంది. ఈ పరిస్థితుల నుంచే దళిత, మానవ హక్కుల ఉద్యమాలు వచ్చి ఈ దేశంలో అంతరిస్తోన్న మానవ విలువలను నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. 

విచిత్రం ఏమంటే మానవహక్కుల గూర్చి అడిగితే రాజ్యం, వారిని ఫాసిస్టులు, టెర్రరిస్టులుగా ముద్ర వేస్తుంది. ఈ ఉద్యమాలు దేశాన్ని, జనాన్ని విచ్ఛిన్నం చేయటం లేదు. విచ్ఛిన్నమయిన బతుకుల్లో కొంత ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నాయి. ఒక విధంగా రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక విలువలను, హక్కులను ప్రజల్లోకి తీసుకొనివెళ్ళి వారికి ఈ వ్యవస్థ మీద కొంత నమ్మకాన్ని కల్గిస్తున్నాయి. ఈ ఉద్యమాలే లేకుంటే ఐలయ్య చెప్పే అంతర్యుద్ధం ఈ దేశంలో ఇప్పటికే వచ్చి వుండేది. 

అరవిందరావు చెప్పినట్లు విదేశీ విచ్ఛిన్నకర శక్తులను దేశంలోకి ఆహ్వానిస్తున్నది దళిత, మానవ హక్కుల సంఘాలు కాదు. ఈ దేశ బడా పెట్టుబడిదారులు, హిందూ ఫాసిస్టులే ఆ పనిచేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను విచ్ఛిన్నం చేసి విదేశీ సంస్థలను ఆహ్వానిస్తున్నది ఎవరు? ఈ రోజు ప్రజల జీవితాలను ధ్వంసం చేస్తున్నది బహుళజాతి సంస్థలు కాదా? అణు ఇంధన సహకార ఒప్పందం దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడం కాదా? పౌర ప్రయోజనాలకు ఉద్దేశించిన అణు ఇంధన సాంకేతికతలను సైనిక ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమనేది చాలా సులువన్న విషయం అరవిందరావుకు తెలియందికాదు. 

భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారకుడైన వ్యక్తిని చట్ట విరుద్ధంగా స్వదేశానికి వెళ్ళిపోవడానికి మన పాలకులే సహకరించలేదా? రేపు అమెరికా మన దేశంపై అణ్వస్త్ర దాడి చేస్తే దిక్కెవరు? ఈ దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేస్తున్నది హిందూ ఫాసిస్ట్‌లు, పెట్టుబడిదారులే అన్న విషయం అరవిందరావు గుర్తించాలి. దళిత, మానవహక్కుల ఉద్యమాలు ఈ దేశంలో సాంఘిక, రాజకీయ, ఆర్థిక, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి. 

- ప్రొఫెసర్ భంగ్యా భూక్యా
ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ
Andhra Jyothi News Paper Dated 25/1/2012 

No comments:

Post a Comment