Wednesday, January 18, 2012

ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య మేదీ? - డాక్టర్.ఎం.ఎఫ్.గోపీనాథ్



"నేను మతం వద్దనటం లేదు'' ఎడ్మండ్ బర్క్ అన్నట్లు నిజమైన మతం సమాజానికి పునాది వంటిది. వేదాలు, శాస్త్రాలు, పురాణాల ను నిషేధించాలి. వీటిల్లో ఏలాంటి అంశాలనైనా బోధిస్తే శిక్షించాలి.''
- డా.బి.ఆర్.అంబేద్కర్ 

"కులాన్ని అంటరానితనాన్ని నిర్మూలించటానికి హిందూ శాస్త్రాల సహకారం తీసుకోవటం బురదను బురదతో కడగటం లాంటిది.''
- సంత్‌రాంజి 

ఈ నెల 7వ తేదీ 7.30 గంటలకు, విజయవాడలో 23వ పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో ఎమెస్కో ప్రచురణకర్తలు, ప్రచురించిన కంచ ఐలయ్య 'హిందూ మతానంతర భారత దేశం' అనే పుస్తకాన్ని పవిత్ర అనే దళిత విద్యార్థిని ఆవిష్కరించింది. పుస్తకాన్ని పరిచయం చేసి వ్యాఖ్యానించవలసిందిగా నన్ను, ఎమెస్కో అధినేత విజయ్‌కుమార్ కోరారు. నేను ఆ గ్రంథాన్ని సమీక్షిస్తూ ఇలా పేర్కొన్నాను: 'ఏ దేశంలోనైనా మెజారిటీ మతస్థులు, మతోన్మాదులుగా మారితే అది ఫాసిజానికి దారితీస్తుంది. పౌర జీవనాన్ని కలుషితం చేసి, అనాగరికంగా తయారుచేసి ప్రజల జీవనాన్ని దుర్భరం చేసి ధ్వంసం చేస్తుంది. 

ఇందుకు ఉదాహరణ 2002లో గుజరాత్‌లో జరిగిన అమానుష మారణకాండ. మైనారిటీ మతస్థులు మతోన్మాదానికి గురైతే ఆ దేశ పౌర జీవనం మీద దాని ప్రభావం పరిమితంగా ఉంటుంది. అందుకే భారత్‌లో హిందూ మతం, పాకిస్తాన్‌లో ఇస్లామ్, రోమ్‌లో కాథలిసిజమ్ ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యానికి కంకణబద్దులై ఉండాలి. ఆయా దేశాల్లో వారు మతోన్మాదులు కాకూడదన్నాను. ఈ దేశాల్లో ఆయా మెజారిటీ మతాలు ప్రజాస్వామీకరించబడకపోతే అవి నాశనం అవుతాయి. హిందూ మతం ఇప్పుడు ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది'. ఇంకా ఇలా అన్నాను: 

'రుగ్వేదంలోని పదవ మండలంలోని పురుషసూక్తం బ్రహ్మ నోటి నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు జన్మించారని చెబుతుంది. ఒకవేళ అదే నిజమని నమ్మేట్లయితే బ్రహ్మ నోటి నుంచి మోసకారులు, భుజాల నుంచి రౌడీలు, తొడల నుంచి దోపిడీదార్లు, పాదాల నుంచి సంపద సృష్టికర్తలైన ఉత్పత్తి కులాలు పుట్టారని నేనంటాను. రామ్ మనోహర్ లోహియా బ్రాహ్మణ్స్ లూటెడ్ ద మైండ్ అండ్ బనియా లూటెడ్ ద బెల్లీ ఆఫ్ ఇండియా అన్నారు. 

ఒకే సమయంలో పైవాడి కాళ్లు పట్టుకోవడానికి, క్రింది వాడి జుట్టు పట్టుకోటానికి వెసలుబాటు కల్పించింది బ్రాహ్మణిజం. ఈ ధోరణి మారాలన్నారు...' ఈ దశలో కొందరు పెద్ద ఎత్తున గొడవ చెయ్యటం మొదలుపెట్టారు. నేను అన్న మాటలు ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పమన్నారు. స్టేజీ ఎక్కి నానా రభస చేసారు. ఇంతకూ ఎవరు వీళ్లు? గాంధీని చంపిన గాడ్సే వారసులు... ఓ పుస్తకావిష్కరణ సభలో ఇంత అరాచకాన్ని సృష్టించవలసిన అవసరం ఉందా? 

హిందూ మత గ్రంథాలన్నిటిలోనూ శ్రామిక కులాలను, ఉత్పత్తి శ్రేణుల్ని నీచాతినీచంగా చిత్రించిన ఉదంతాలు ఎన్నో. మూడున్నర వేల సంవత్సరాల నుంచి వేదాల్లో, బ్రాహ్మణాల్లో, పురాణాల్లో, మనుధర్మస్మృతిలో వీళ్లను నీచమానవులుగా అంటరానివాళ్లుగా, చూడరానివాళ్లుగా ముద్రవేశారు. విద్యకు, విత్తానికి, గౌరవానికి దూరంగా నెట్టివేశారు. ఈ అణగదొక్కిన చరిత్ర వీళ్ల ముందుంచుకుని మీ మత గ్రంథాలు శ్రామికుల్ని అణిచివేశాయన్నందుకే ఉలిక్కిపడ్డారు. కానీ రాబోయే కాలంలో ఈ శ్రామిక కులాలవారు ఇంతకన్నా పకడ్బందీగా వాళ్ల ఆకృత్యాల్ని ఎండగట్టబోతున్నారు. అప్పుడేం చేస్తారు? 

భారతదేశం మొత్తంగా ఇప్పుడు సామాజిక విప్లవ దిశగా కదుల్తుంది. మూడున్నరవేల సంవత్సరాల్లో 500 సంవత్సరాల బౌద్ధాదీన భారతదేశాన్ని మినహాయిస్తే మిగిలిన కాలం భారతీయ చరిత్ర, అన్ని రంగాల్లో వెనుకబడ్డదే. 'పక్కనున్న చైనాతో పోల్చుకుంటే, మనం వెనుకబడ్డాము' అని 99వ సైన్స్ కాంగ్రెస్‌లోనూ, మరో సమావేశంలో పోషకాహార లోపంతో, తక్కువ బరువుతో 50 శాతం పైగా భావిభారత పౌరులు జన్మిస్తున్నారని స్వయంగా భారత ప్రధాన మంత్రే ఒప్పుకున్నారు. ఈ వెనుకబాటుతనానికి కారణం ఎవరు? హిందూ మైండ్‌సెట్ అనేది నిర్వివాదాంశం. 

గిడసబారిన ఈ హిందూ మైండ్‌సెట్‌ను సరిచేయడమే సామాజిక విప్లవంలో ప్రధానమైన, కీలకమైన అంశం. అంటే భారతదేశానికి సంబంధించి, ఇప్పుడు అమల్లో ఉన్న బ్రాహ్మణీయ హిందూ భావజాల పునాదిగాగల సామాజిక అమరికను, ఉన్న బ్రాహ్మణీయ భావజాల పునాదిగా గల సామాజిక అమరికను బలప్రయోగం ద్వారా లేదా బలవంతంగానైనా మార్చడమే సామాజిక విప్లవం. అయితే ఈనాటి బ్రాహ్మణీయ సామాజిక అమరికకు పునాది అయిన బ్రాహ్మణీయ తత్వ విచారం వందల వేల యేళ్ల నుంచి నిరంకుశంగా, నిరాఘాటంగా ఎటువంటి మౌలిక మార్పులు లేకుండా కొనసాగటానికి గల కారణమేమిటి? 

ఇది వైదిక/బ్రాహ్మణీయ హిందూ మతం గొప్పతనమా? కానే కాదు... బ్రాహ్మణీయ భావజాలంలోని కుటిల స్వార్థాలే దీనికి మూల కార ణం. మౌలికంగా ఇది "పీడకుల, స్వార్థపరుల, పరాన్న జీవుల స్వర్గం.'' అభివృద్ధి నిరోధకులకు వ్యక్తిగా గాని, సమూహంగాగాని, బ్రాహ్మణవాదంలో పదిలమైన స్థానం దొరుకుతుంది. పై వాడికి భయపడటం, కిందివాణ్ణి అణచిఉంచడం, ప్రతీది 'బుద్ధి కర్మానుసారిణి' అని మభ్యపెట్టడం, హేతుబద్ధ ఆలోచనలను నియంత్రించడం, దీని ప్రత్యేకత... బ్రాహ్మణీయ సమాజ అమరిక ఏర్పాటుకు, కొనసాగింపుకు మూల స్థంభాలైన స్వార్థం, దోపిడీ, దేవుడు, మతగ్రంథాలు; 

ఈ నాలుగు స్తంభాల్ని బలప్రయోగంతోనైనా కూల్చకుండా కులనిర్మూలన అంటే సామాజిక విప్లవం సాధ్యం కాదు. 1970ల నుంచి బ్రాహ్మణిజం బ్రాహ్మణుల చేతుల్లో నుంచి పైకెగబాకిన శూద్రకులాల చేతుల్లోకి సహజంగానే జారిపోయింది. బ్రాహ్మణిజం గుప్తరాజుల కాలం వరకు, ఆ తర్వాత పీష్వాల కాలంలో బ్రాహ్మణుల చేతిలో పదిలంగా ఉంది. అప్పటి వరకు బ్రాహ్మణిజానికి మైండ్ పవరే (బుద్ధి బలం) ఉంది. పైకెగబాకిన శూద్ర కులాల చేతుల్లోకి బ్రాహ్మణిజం వచ్చిన తర్వాత, దానికి మైండ్ పవర్‌తోపాటు, మజిల్ పవర్ (కండబలం) తోడైంది. 

కంచ ఐలయ్య రాసిన 'హిందూ మతానంతర భారతదేశం'లోని ప్రధానమైన అంశాలు: ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ఉండాలి; ఆధ్యాత్మి క ప్రజాస్వామ్యం లేనందువల్లే భారతదేశంలో శ్రామిక కులాలు అణచివేయబడ్డాయి; హిందూ మతానికి, సైన్స్‌కు సఖ్యత కుదరనందువ ల్ల భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వెనుకంజ వేస్తున్నది; హిం దూ మతం ప్రజాస్వామీకరించబడకపోతే అదే అంతరించిపోతుంది. ఈ అంశాల్లో అవాస్తవాలున్నాయా? వాస్తవంగా ఐలయ్య తన పుస్తకంలో దేవుడి ఉనికిని ప్రశ్నించలేదు. 

ఒక మతానికి కొమ్ము కాయలేదు. తనది మధ్యే మార్గం. క్రీ.శ. 312 వరకు క్రీస్తు మతం ప్రజల తరపున పనిచేసింది. క్రీ.శ. 312లో కాన్‌స్టాంటిన్ అనే రోమన్ చక్రవర్తి చాణక్యంతో అది చక్రవర్తుల మతంగా రూపాంతరం చెంది సైన్స్‌ను, ప్రజా ఉద్యమాలను అడ్డుకుంది. మళ్లీ పదహారో శతాబ్దంలో మార్టిన్ లూధర్ సంస్కరణోద్యమం ఫలితంగా కొంతమేర ప్రజాస్వామీకరించబడ్డది. శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలను అడ్డుకోకుండా సంయమనం పాటించడంతో, ఆ రంగాల్లో క్రిస్టియన్ సమాజం ఊహించని అభివృద్ధిని సాధించింది. 

అదే సమయంలో ఇస్లామిక్ సమాజం కాలానికనుగుణంగా మారనందున గతంలో తాము సాధించిన సాంకేతిక విజ్ఞానాన్ని ముందుకు తీసుకుపోవడంలో విఫలమైంది. అంతేకాదు ఆధ్యాత్మిక రంగంలో క్రిస్టియన్ సమాజం ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని ఆచరించినందువల్లే క్రిస్టియానిటీ 'వ్యాపించే గమనాన్ని' (స్ప్రెడ్డింగ్ క్యారక్టర్) సంతరించుకుని వేగంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ఉంది. హిందూమతం, కనీసం భారతదేశంలోనైనా బ్రతకాలంటే అది తనను తాను సంస్కరించుకోవటం ఒకటే మార్గం. తనను తాను సంస్కరించుకోవాలంటే తన చుట్టూ తాను విధించుకున్న శృంఖలాలను తెంచుకోవాలి. వేదాల్లో, బ్రాహ్మణాల్లో, పురాణాల్లో ప్రవచించిన 'అసమానత' సిద్ధాంత పునాది నుంచి కులాల నుంచి అది బయటపడాలి. 

కనీసం ఇతర మతాలలాగనైనా 'దేవుని ముందు మానవులందరూ సమానులే' అన్న ప్రాథమిక ఆధ్యాత్మిక సూత్రాన్ని అంగీకరించాలి. రుగ్వేదంలోని పదవ మండలాన్ని తొలగించుకోవాలి. 'గీత'లోని కులాల ఏర్పాటు సిద్ధాంతాన్ని వదులుకోవాలి. వాటి ఆధారంగా ఏర్పాటైన కులవ్యవస్థను నిర్మూలింప బూనుకోవాలి. అంతిమంగా బ్రాహ్మణిజానికి విడాకులివ్వాలి. హిందూ మతానికి 'కులం' పునాది అన్నాడు గాంధీ. కానీ కులం, వైదిక బ్రాహ్మణీయ హిందూ మతానికి పునాది మాత్రమే. బ్రాహ్మణిజాన్ని వదిలించుకున్న హిందూమతానికి మాత్రం కాకూడదు. 

కంచ ఐలయ్య గత రెండు దశాబ్దాలుగా భారతదేశ ప్రజల చరిత్రను అణచివేయబడ్డ కులాల కోణం నుంచి విశ్లేషిస్తున్నారు. గతించిన చరిత్రను తలక్రిందులు చేసి రాస్తున్నారు. ఇదే అసలైన చరిత్ర. చరిత్రను చదివే ముందు చరిత్రకారుడి ఉద్దేశ్యాన్ని, నేపథ్యాన్ని గమనించాలంటాడు ఇ.హెచ్.కార్. భారతదేశ చరిత్రను చదివేటప్పుడు ఇక్కడి చరిత్రకారుల కులవర్గ పునాదిని పాఠకులు దృష్టిలో ఉంచుకోవాలి. ఇందుకు ఒకే ఒక ఉదాహరణ- 2010లో మార్క్సిస్టు మేధావి, సిపిఎం జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి దశావతారాలు మానవ పరిణామ క్రమాన్ని వివరిస్తాయంటాడు. 

కానీ 150 సంవత్సరాల క్రితమే మహాత్మా జ్యోతిరావు ఫూలే ఇదే దశావతారాల్ని ఆర్యుల దండయాత్రలకు ప్రతీకలంటారు. మొదటిది : మార్క్సిస్టు మేధావి అనబడే బ్రాహ్మణుడి విశ్లేషణ. రెండోది : శూద్రుడి సామాజిక విశ్లేషణ. ఏది వాస్తవం? అందుకే కుల సమాజంలో కులాతీత మేధావులుండరు అంటాను. హిందూ సమాజాన్ని సంస్కరించే బాధ్యతను ఐలయ్య రాసిన ఈ పుస్తకం తీసుకుంది. ప్రొ.ఐలయ్య హిందూ మతానికి ఒక విధంగా ఎనలేని సేవలందిస్తున్నట్టే. అందుకేనేమో ఎమెస్కో పబ్లిషర్స్ 'పోస్ట్ హిందూ ఇండియా' అనే ఇంగ్లీషు పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేసి ప్రచురించారు. ఈ రహస్యాన్ని కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో హిందూ సమాజం ఉంది. 

ఐలయ్య పుస్తకాన్ని హిందూ మతం మీద ప్రేమ ఉన్న ప్రతి వ్యక్తి చదవాలని నేను సిఫార్సు చేస్తున్నాను. చదవటమే కాదు, తన నిత్య జీవితంలో తాను చేస్తున్న తప్పుల్ని తెలుసుకుని మతోన్మాదిగా కాకుండా మనిషిగా బ్రతకటానికి, కలుషితమైన తన ఆలోచనలను సవరించుకోవటానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. హిందూ మతానికి ఈ పుస్తక రచన ద్వారా ఐలయ్య చేసిన సేవలకు గాను హిందూ సమాజం ఎంతో రుణపడి ఉంటుందని భావిస్తున్నాను. 

- డాక్టర్.ఎం.ఎఫ్.గోపీనాథ్
కార్డియాలజిస్ట్, మేనేజింగ్ ట్రస్టీ - ఫూలే- అంబేద్కర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఖమ్మం
Andhra Jyothi News Paper Dated 19/1/2012 

No comments:

Post a Comment