Tuesday, January 3, 2012

ప్రజల భాగస్వామ్యంతోనే మార్పు



నిజమైన ప్రజాస్వామ్య వాదులైతే, అన్నా బృందం ఈ అవినీతి అంశం మొత్తాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాలి. ప్రజలలో, నీతిని నిజాయితీని పెంచే చైతన్యం తేవటం కోసం కృషి చేయాలి. ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రభావాలకు లోనవకుండా ప్రజలు తమ ఓటు హక్కును నీతీ, నిజాయితీ, నిబద్ధత కలిగిన అభ్యర్థులనే ఎన్నుకొనేలా వారిని చైతన్య పరచాలి... మార్పు అనేది ప్రజలలో నుంచే, వారి ద్వారానే రావాలి. అదే ప్రజాస్వామ్య పద్ధతి. 

ఎన్నికలలో పాల్గొనే 75 కోట్ల భారతీయుల రాజకీయ విచక్షణా సామర్థ్యాన్ని శంకించేటట్లయితే, అన్నా, ఆయన అనుచరులూ 'ప్రజాస్వామ్యవాదులు' ఎలా అవుతారు? పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్‌లలో ఒక పద్ధతి ఉందని వార్తా కథనాల ద్వారా తెలుస్తుంది. వాళ్ళ క్షేత్రస్థాయి కమిటీల్లో చర్చించి, ఏయే గ్రామాలలో ఎవరెవరు 'ఇన్ఫార్మర్లో' లేదా ఉద్యమ శత్రువులో నిర్ణయించి, అటువంటి వారిని మొదటి హెచ్చరికగా చచ్చేంతగా కొడతారు. ఆ తరువాత మళ్ళీ 'చర్చించి', కాళ్ళూ చేతులూ నరికేస్తారు. అప్పటికీ 'వాళ్ల తీరు మారలేదు' అని నక్సలైట్లకు వారి కమిటీ చర్చల్లో అనిపిస్తే, వాళ్ళను కాల్చి చంపేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత, 'ప్రజలే వారిని శిక్షించారని' కరపత్రాలు పంచిపెడతారు. 

తమ పద్ధతులను నక్సలైట్లు 'నూతన ప్రజాస్వామ్య విప్లవం'గా వర్ణించుకుంటారు. మరి వారిదీ ప్రత్యక్ష ప్రజాస్వామ్యమేనా? అన్నా బృందంవారు, 'ప్రజల తరఫున' పోరాడుతున్నామని చెప్పుకుంటూ, 'మేము సూచించిన విధంగా లోక్‌పాల్ బిల్లు పాస్ చేయకపోతే, మేము నిరాహారదీక్ష చేసి చచ్చి పోతాము, ఎంపీలను వారి ఇళ్ళ నుంచి బయటకు రానీయము' అని అనటంలో, తమ ఆలోచనలే మంచివి; ప్రజలు డబ్బుకి మద్యానికి బానిసలు; వాళ్ళకు ఆలోచించటం రాదు; అందువలన ప్రజల తరఫున మేమే ఆలోచించి, ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో చెబుతాము' అనే ఆధిపత్య ధోరణి ఉంది. దీనికీ, నక్సలైట్ల పద్ధతులకీ పెద్ద తేడా లేదు. 

రెండవది- వేరు అభిప్రాయానికీ లేదా ఆచరణ మార్గానికీ అవకాశమే లేని ఒక మౌలిక అంశం: 'మన దేశ పరిస్థితులలో, ప్రజాస్వామ్య పరిపాలనా పద్ధతిలో ప్రజల అభిప్రాయాన్నీ తీర్పునూ ప్రతిబింబించే ఏకైక మార్గం-ఎన్నికలు; వీటికి ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. ఉంటే అది ప్రజాస్వామ్యం కాదు' అనే విషయం. నిజమే. మన దేశంలోనే గ్రామస్థాయిలో 'గ్రామసభ' అనే ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంది. దీని క్రింద, గ్రామంలో ఉండే ఓటు హక్కు కలిగిన వారందరూ గ్రామసభ సభ్యలు. కొన్ని అంశాలపై గ్రామ సభ నిర్ణయం తీసుకుంటుంది. ఇటువంటి ప్రక్రియ గ్రామం కన్న పై స్థాయిలో సాధ్యం కాదు. విభిన్న కులాలూ మతాలూ వాటికున్న చారిత్రక పరిస్థితుల దృష్ట్ట్యా, గ్రామ స్థాయిలో కూడా కొన్ని షరతులకు లోబడే ఈ గ్రామ సభ పనిచేస్తుంది. 

అతి చిన్న దేశమైన స్విట్జర్లాండ్‌లో, పరిపాలనా విభాగాలైన 'కాంటన్'లలో, మన 'గ్రామసభ' లాంటి 'పౌరసభ' వ్యవస్థ ఉందనీ, అది పరిపాలనా నిర్ణయాలు తీసుకుంటుందనీ తెలుస్తూంది. ఇంకొక పద్ధతి రిఫరెండమ్. దేశ లేదా ప్రాంత పరిపాలనలో ఉత్పన్నమయ్యే ఏదైనా ఒక ముఖ్య అంశం మీద , 'అవును లేదా కాదు' అనే రెండే రెండు మార్గాలపై ప్రజల తీర్పును ఈ పద్ధతిలో కోరుతారు. అనేక పశ్చిమ యూరప్ దేశాలలోనూ, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లోనూ ఈ పద్ధతి అమలులో ఉంది. ఈ పద్ధతిలో రెండు ముఖ్య సవాళ్ళు ఉన్నాయి. దేశ రాజకీయ, పరిపాలనా ప్రక్రియల్లో ఎదురయ్యే ఎటువంటి అంశాలను ప్రజల తీర్పుకై పెట్టే నిర్ణయాన్ని తీసుకునే అధికారం ఎవరికి ఉండాలి, అన్నదీనూ. మొదటి వర్గానికి ఉదాహరణ: ఎంత తీవ్రంగా చర్చించబడిన విషయాలైనా ఒకప్పుడు దేశాన్ని పట్టి కుదిపేసిన అంశాలైనా, రిజర్వేషన్లు, అయోధ్యలో రామమందిరం వంటి అంశాలను ఎట్టి పరిస్థితిలోనూ రిఫరెండం వంటి ప్రజాతీర్పుకై తీసుకు వెళ్ళలేము. 

రెండవ వర్గానికి వస్తే అటువంటి నిర్ణయాధికారం దేశం మొత్తం మీదనే అత్యున్నత ప్రజాధికార సంస్థ అయిన పార్లమెంటు చేతిలోనే అది ఉండాలనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ అనేక మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలున్న మన దేశంలో, వాటి మధ్యన ఉన్న చారిత్రక పరిస్థితుల నేపథ్యంలో, 'రిఫరెండం' అనే 'ప్రజా తీర్పు' పద్ధతి మన దేశానికి ఏ మాత్రం సమంజసమైనది కాదు. అటువంటి పద్ధతితో దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కనుక, మన దేశ పరిస్థితులలో, ప్రజాస్వామ్య పరిపాలనా పద్ధతిలో ప్రజల తీర్పును ప్రతిబింబించే ఏకైక మార్గం, ఎన్నికలు. దీనికి ప్రత్యామ్నాయం చూడటం మొదలుపెడితే, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, దేశ సమగ్రతనూ పునాదుల స్థాయిలో తిరిగి కోలుకోలేని విధంగా నాశనం చేయటమే అవుతుంది. 

ఎన్నికలే ప్రజాస్వామ్య పద్ధతికి ఏకైక మార్గంగా భావించటానికి ఇంకొక నేపథ్యం కూడా ఉంది. ఎంత పటిష్టమైన ప్రజాస్వామ్యమైనా, ఆ దేశ ప్రజలు ఎంత ఎక్కువగా చదువుకుని, పూర్తి రాజకీయ అవగాహన ఉన్నవారైనా, నూటికి 95 మంది ప్రజలు తమ ఎక్కువ శాతం సమయం లేదా దాదాపు పూర్తి సమయాన్ని తమ తమ దైనందిన జీవిత విషయాలు, సమస్యల గురించే వెచ్చిస్తారు. రాజకీయ అంశాల విషయంలో, సార్వత్రక ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రమే, తమకున్న రాజకీయ అవగాహనతో ఓటు వేసి తమ వంతు పాత్ర నిర్వహిస్తారు. గత కొన్ని ఎన్నికలను చూస్తే, దేశంలో సగటున 30 నుంచి 40 శాతం ప్రజలు, ముఖ్యంగా చదువుకున్న వారు, పట్టణాలలో ఉండే వారు, పౌరులుగా తమకున్న 'ఎన్నికలలో ఓటు వెయ్యవలసిన కనీస బాధ్యత'ను కూడా విస్మరిస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లో, తాము జరిపే నిరసన ప్రదర్శనలకు ఒక యాభై వేల మంది ప్రత్యక్షంగా వచ్చి, కొన్ని లక్షల మంది ఫోన్ల ద్వారా మద్దతు తెలిపినంత మాత్రాన, ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉన్న దేశంలోని 99 శాతం ఇతర ప్రజలు కూడా పరోక్షంగా తమ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారని చెప్పటం అన్నా బృందం వారి శుష్క ప్రచారం మాత్రమే. ఇది ఏ మాత్రం రుజువు లేని ప్రచారం. అనేక దశాబ్దాలు మనం బ్రిటిషు వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా, స్వాతంత్య్రం కోసం పోరాడినది 'మనల్ని మనమే' పాలించుకోవటానికి. మనలోనే కొద్ది మంది అత్యంత మేధావులనో, నిస్వార్థ పరులనో ఎంపిక చేసి వాళ్ళకు నియంతృత్వ అధికారాలు కట్ట బెట్టటం కోసం కాదు. 

కనుక అన్నా హజారే, ఆయన సహచరులు నిజంగా ప్రజాస్వామ్యవాదులైతే, వాళ్ళకు తమ ఆశయాలపై పూర్తి నిబద్ధత, నమ్మకం ఉంటే, పార్లమెంటును బెదిరించటం, ఒత్తిడి చేయటం మానేసి, ప్రజల వద్దకు వెళ్ళాలి. రాజకీయ పార్టీలలో సానుకూలత కలిగించటానికి, ప్రజలలో ఈ విషయమై అవగాహన కలిగించడానికి, అవసరమైతే ఒక నూతన రాజకీయ పక్షంగా అవతరించి సాధారణ ఎన్నికలలో ఈ విషయమై ప్రజల తీర్పు కోరటానికీ వెళ్ళాలి. దీనికై అయిదేళ్ళు పట్టవచ్చు. పదేళ్ళు కూడా పట్టవచ్చు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు 'కర్మణ్యే వాధికారస్తే మాఫలేసు కదాచన' అని అన్నాడు. కానీ, అన్నా బృందం, ప్రజాబాహుళ్యంతో ఎటువంటి ప్రయత్నమూ చేయకుండానే, అడ్డ దారుల ద్వారా ఫలితం పొందాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అడ్డదారులుండవు. అన్నా ఒక మాట అన్నారు: 'ఇది రెండవ స్వాతంత్య్ర సంగ్రామం' అని. 

ఇది నిజంగా స్వాతంత్య్ర సంగ్రామమే అయితే ప్రజల వద్దకు వెళ్ళకుండా, ప్రజలను భాగస్వాములుగా చేయకుండా, ప్రజల తీర్పు కోరకుండా, తాను నిరాహార దీక్ష చేసి రాజకీయ నైతిక బ్లాక్ మెయిలింగ్ ద్వారానే ఈ సంగ్రామంలో విజయం సాధించగలనని అన్నా అనుకుంటున్నారా? గాంధీజీ బ్రిటిషు వారిపై 'మీరు ఈ దేశం విడిచి వెళ్ళండి; భారత్‌కు స్వరాజ్యం ఇవ్వండి' అని నిరాహార దీక్షలు చేశారా? ప్రజలలో సత్యనిష్ఠనీ, అహింసాయుతమైన పట్టుదలనూ మేల్కొలిపేందుకే గాంధీజీ నిరాహారదీక్షలు చేసేవారు. కనుక, ఒక విజ్ఞుడు వ్యాఖ్యానించినట్టు అన్నాది 'సత్యాగ్రహం' ఏ మాత్రమూ కాదు, అది 'దురాగ్రహమే'. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా, అన్నా, ఆయన బృందం దేశం నలుమూలలా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళవలసిన అవసరం ఇంకొక విధంగా కూడా ఉంది. తమ ఉద్యమంలో, ప్రస్తుతం అన్నా, ఆయన బృందమూ, 'అవినీతి' అనే పదానికి చాలా సంకుచితమైన అర్థంతో ముందుకు వెళుతున్నారు. 

వారి ఉద్దేశంలో 'అవినీతి' అంటే, 'ప్రభుత్వంలో పనిచేసే వారు తమ స్వార్థం కోసం ప్రజల నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేయటం' అని. కానీ , ఇది 'అవినీతి'కి పూర్తి నిర్వచనం కాజాలదు. ప్రజా జీవితంలో 'అవినీతి' అన్న దానికి పూర్తి భాష్యం బహుశా ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేయవచ్చు: 'ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా, తనకు న్యాయంగా లేదా చట్టపరంగా రావలసిన మొత్తం లేదా విలువకన్న ఎక్కువ పొందటం; లేదా, తన వద్దకు చేరిన మొత్తం లేదా విలువలో, తనకు చెందని మొత్తాన్ని, అది న్యాయంగా ఎవరికి చెందుతుందో వారికి ఇచ్చి వేయకుండా తన వద్దనే ఉంచుకోవటం'. ఈ సందర్భంగా, అన్నా బృందానికి బహుశా తెలిసి కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే 'అవినీతి' పై తమ చర్చలోకి తీసుకురాని విషయం, అది ఎంత కటువుగా ఉన్నప్పటికీ, చెప్పాలి. అవినీతి అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలిస్తే, మన దేశ జనాభా మొత్తం మీద కనీసం 60 నుంచి 70 శాతం మంది ప్రజలు ఏదో ఒక విధంగా అవినీతికి పాల్పడుతున్నవారే. 

కనుక, ఏ విధంగా చూసినా, తాము నిజమైన ప్రజాస్వామ్య వాదులైతే, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న వారయితే, అన్నా బృందం ఈ అంశం మొత్తాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాలి. అన్ని రంగాలలోనూ ఉన్న అన్ని రకాలయిన అవినీతిని నిర్మూలించటానికి ప్రజల సహకారం, మద్దతూ కోరాలి. ప్రజలలో, నీతిని నిజాయితీని పెంచే చైతన్యం తేవటం కోసం కృషి చేయాలి. ఎటువంటి అవినీతినైనా ప్రశ్నించే చైతన్యాన్ని, ధైర్యాన్నీ, ప్రజలలో కలిగించాలి. ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రభావాలకు లోనవకుండా ప్రజలు తమ ఓటు హక్కును నీతీ, నిజాయితీ, నిబద్ధత కలిగిన అభ్యర్థులనే ఎన్నుకొనేలా వారిని చైతన్య పరచాలి. దీనికి ఐదేళ్ళు లేదా పదేళ్ళు పట్టవచ్చు. ఒక దేశ చరిత్రలో అది చాలా స్వల్పకాలం. కానీ, మార్పు అనేది ప్రజలలో నుంచే, వారి ద్వారానే రావాలి. అదే ప్రజాస్వామ్య పద్ధతి.
- డాక్టర్ సి.బి.ఎస్.వేంకటరమణ
రచయిత ఐఎఎస్ అధికారి. అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి
(ఈ వ్యాసం మొదటి భాగం 'అన్నా నైతిక నియంతృత్వం' మంగళవారం సంచికలో ప్రచురితమయింది)
Andhra Jyothi News Paper Dated 03/01/2012

No comments:

Post a Comment