Friday, May 4, 2012

నిబద్ధత లేని 'నెలబాలుడు' - చెరుకూరి సత్యనారాయణ



శ్రీకాకుళం గిరిజనోద్యమంతో ఉత్తేజితులమై విద్యార్ధి ఫెడరేషన్ నుంచి విప్లవోద్యమం వైపు ఆకర్షితులైన తొలిరోజుల్లో 'కె.జి. సత్యమూర్తి కాల్చివేత' వార్తతో కన్నీటి పర్య ంతమయ్యాం. కొత్తగా కవిత్వం రాస్తున్న రోజులు కనుక ఒక ఎలిజి రాసుకున్నాను. కొత్తబ్రష్‌కి, ఎర్రరంగు పొడికి పని చెప్పి గుంటూరు గోడలన్నీ 'సత్యమూర్తీ జోహార్లు' అని రాసిన కొన్ని రోజులకు, ఆ చనిపోయింది సత్యమూర్తి కాదని కొల్లిపర రామనరసింహారావని తెలిసింది. సం తోషం - బాధ ఒకేసారి అనుభవించాం. 

కొల్లిపర రామనరసింహారావు ప్రముఖ సినీ దర్శక, నిర్మాత కె.బి. తిలక్ స్వంత తమ్ముడు. 1971 సెప్టెంబర్‌లో హైద్రాబాద్‌లో జరిగిన విరసం రెండవ మహాసభల్లో నేనూ జుగాష్‌విలి ఆ సంస్థ సభ్యులుగా చేరాం. అప్పటికే ఓల్గా, కిరణ్, బుర్రకధ నాజర్‌లు మా జిల్లా నుంచి సభ్యులుగా వున్నారు. ఆ తర్వాత సంవత్సరం కొత్తపల్లి రవిబాబు, టి.ఎల్.నారాయణ, మండవ రామారావులు చేరారు. అందరం కలిసిన జిల్లా శాఖకు నేను కన్వీనర్‌ని. 

నక్సలైట్ గ్రూపుల్లో వున్న విభేదాలన్నీ విరసం లోపల ప్రతిఫలిస్తుండేవి. మెజారిటీ సభ్యులు చారుమజుందార్ గ్రూపుగా వుండేవారు. వరవరరావు, చెరబండరాజు, త్రిపురనేని, కె.వి.ఆర్, చలసాని, ఐ.వి. తదితరులు ఈ గ్రూపుకి నాయకులుగా ఉండేవారు. నాగిరెడ్డి గ్రూపుకు నేను ప్రాతినిధ్యం వహిస్తుండేవాణ్ణి. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, డా.యం.వి.ఆర్.లు మాకు మద్దతిస్తుండేవాళ్ళు. పుల్లారెడ్డి గ్రూపుగా మా నుంచి చీలిన గ్రూపుకి కాశీపతి, కిషన్‌రావు, అట్లూరి రంగారావులు ప్రాతినిధ్యం వహిస్తుం డేవారు. ఈ నేపధ్యంలో 1973 వేసవిలో విరసం రాజకీయ పాఠశాల హనుమకొండలో జరిగింది. అప్పుడే సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించారు. 

కొత్తగా విరసంలో చేరేందుకు కొన్ని దరఖాస్తులు వచ్చాయి. అం దులో రెండు దరఖాస్తుల్ని నేను వ్యతిరేకించాను. వాటిలో ఒకటి సత్యమూర్తిది, రెండోది నల్లూరి రుక్మిణిది. అప్పటికి కరపత్రం లాంటి చిన్న రచన కూడా చేయని వాళ్ళని రచయితల సంఘంలో చేర్చుకోకూడదని నా వాదన. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొని తర్వాత కాలంలో ఈమె అన్ని సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసి పుస్తకాలుగా ప్రచురించారు. 

ఆనాటి యం.యల్. పార్టీ రాష్ట్ర నాయకునిగా వున్న వ్యక్తి అన్ని పార్టీలు కలసి వున్న సంస్ధలో సభ్యునిగా ఉండటం సహేతుకం కాదని సత్యమూర్తి గారి అప్లికేషన్‌ని వ్యతిరేకించాను. వాళ్ళకున్న సంఖ్యాధిక్యతతో అవి ఆమోదింప జేసుకోవటం వారికి పెద్ద సమస్య కాకపోయినా 'ఏకగ్రీవం' అనిపించుకోవటానికి నాకెంతో ఇష్టుడైన చెరంబడరాజుని, నేనెంతో గౌరవించే కె.వి.ఆర్.ని నాపై ప్రయోగించి నన్ను 'సైలెంట్' చేయగలిగారు. 

శివసాగర్, రెంజిం, ఆజాద్, పార్వతి, నటరాజమూర్తి, శివుడు, నటరాజు పేర్లతో 'సృజన', 'పిలుపు' పత్రికల్లో తిరగబడుకవులు వేసిన 'మార్చ్' సంకలనంలోను మహాద్భుతమైన కవితలు వచ్చేవి. ఇవన్నీ కలిపి గెరిల్లా పేరుతో ఒక సంపుటిగా వచ్చాయి. ఈ కవులెవరో తెలుసుకోవటానికి వరవరరావు ద్వారా చేసిన ప్రయత్నం ఫలించలేదు. తెలియదని అబద్ధం చెబుతున్నా తేల్చుకోలేనంత అమాయకంగా ముఖం పెట్టటం ఆయనకు స్వతహాగా వున్న కళ. సత్యమూర్తిగారి విరసం సభ్యత్వాన్ని వ్యతిరేకించే నా టికి ఈ పేర్లన్నింటితో రాస్తుంది ఆయనే అనే విషయం తెలియదు. 'ఝుంఝుం'లో వచ్చిన నరుడో! భాస్కరు డా! ఒక్కటే ఆయన రచనగా కొంత ప్రచారం జరిగింది. 

రాజకీయాల్లో స్థిరత్వం లేకపోయినా, కనీసం కవిగానైనా మిగిలి వుంటే శివసాగర్ తెలుగు కవిత్వాన్ని ఎంత సుసంపన్నం చేసేవాడో! నినాదాన్ని కవిత్వీకరించాడో లేక శివసాగర్ కవితా వాక్యాలే నినాదాలుగా మారాయో గాని ప్రింటులో 300 పేజీలున్న శివసాగర్ కవితల్లో కనీసం 300 నినాదాలు ఏరవచ్చు. 

తెలుగు కవిత్వంలో తిట్టు కవిత్వం అనాది నుంచి వస్తుందే. శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరధి, మల్కిభరాం (జ్వాలాముఖి) లాంటి ఆధునిక కవులు ఇందులో నిష్ణాతులు కాని 'ఉద్యమం నెలబాలుడు' లాంటి గొప్పశిల్పం మరెవరూ ప్రయోగించలేరు. విప్లవం కులం రంగు పూనుకున్న తదుపరి మనుషుల స్థాయితో పాటు కవిత్వం స్థాయి కూడా తగ్గుతుందని, గొప్ప శిల్పానికి గొప్ప వస్తువు, ప్రేరణ కూడా కావాలని శివసాగర్ లాంటి మహాకవులు కూడా నిరూపించారు. 

'కవిగా జీవిస్తే చాలదు, మనిషిగా జీవిస్తేనే కవిగా జీవించినట్లు' అన్న విశ్వకవి రవీంద్రుని మాటలు ఖచ్చితంగా సత్యమూర్తి గారికి అన్వయించాలి. కవిగా శివసాగర్ ఎంత స్థిరత్వాన్ని ప్రదర్శించాడో, సత్యమూర్తిగా అంత నిలకడ లేని వ్యక్తిగా కనిపిస్తాడు. నాణేనికి ఒక పక్క మాత్రమే చూపిస్తున్న ఆంధ్రజ్యోతి వరుస కథనాలు చూశాక కొన్ని విషయాలు పాఠకుల దృష్టికి తేవటం న్యాయమనిపించింది. విద్యార్ధిగా వున్నప్పుడు విద్యార్ధి ఫెడరేషన్‌లో పనిచేసి గుడివాడలో పార్టీలో, విశాలాంధ్ర పత్రికలో పనిచేసి జీవన సమరంలో ఉపాధ్యాయునిగా పనిచేసిన సత్యమూర్తి నక్సల్‌బరి ఉద్యమ ప్రారంభదినాల్లో గుత్తికొండ బిలం సమావేశంలో ముఖ్యభూమిక వహించారు. 

ఒకనాటి తన గుడివాడ సహచరుడు, కమ్యూనిస్టు పార్టీ నుంచి బహిష్కరించబడి లక్సెట్టిపేటలో వ్యవసాయం చేసుకుంటున్న కొండపల్లిని మళ్ళీ ఉద్యమంలోకి ఆహ్వానించటంలోనూ, నాయకత్వం వహింప చేయించటంలోనూ, దానికోసం ఇతరుల్ని ఒప్పించటంలో కృతకృత్యుడయ్యారు. కొండపల్లితో కలిసి సంవత్సరాల తరబడి చారుమజుందార్ గ్రూపుకి నాయకత్వం వహించటంలోనూ, పీపుల్స్‌వార్ గ్రూపుని నిర్మించటంలోనూ కీలకంగా వ్యవహరించి కొండపల్లి అరెస్టు తర్వాత ఆ పార్టీ కార్యదర్శిగా వుండి తర్వాత కాలంలో కొండపల్లితో విభేదించాడు. కేంద్ర కమిటీ నుంచి, పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి తొలగించబడ్డాడు. కేంద్ర కమిటీ సభ్యుణ్ణి బహిష్కరించే అధికారం లేదంటే అసలు కేంద్రకమిటీనే కొండపల్లి రద్దుచేశాడు. 

ఇతర రాష్ట్రాలలో వున్న కొన్ని గ్రూపుల్ని కలిసి ఒక నిర్మాణం చేయాలని విఫల ప్రయత్నం గావించాడు. ఆ సమయంలోనే ఉదయంలో త్రిపురనేని శ్రీనివాస్, కె.శ్రీనివాస్ తదితరులకిచ్చిన ఇంటర్వ్యూలో విషయాలన్నీ బహిర్గతపర్చి సంచలనం కలిగించారు. విరసం సభల ద్వారా మళ్ళీ బహిరంగంగా వచ్చి, నాగిరెడ్డి గ్రూపు నుంచి బయటకొచ్చిన ఉ.సా, రవిమారుతి, ఉపేంద్ర, రామారావుల్తో కలిసి మార్క్సిస్టు - లెనినిస్టు సెంటర్ అనే పేరుతో ఒక సంస్థ నెలకొల్పి, 'ఎదురీత' పత్రిక నడిపారు. తర్వాత గుంటూరు జిల్లా నిడుమర్రులో 'సామాజిక విప్లవ వేదిక' పేరుతో ఒక సంఘం నడిపారు. 

పరిటాల రవి, పోతుల సురేష్(రమాకాంత్)లతో స్నేహం చేసి అనంతపురం జిల్లాలో ఆర్.వో.సి. నడిపారు. వాళ్ళతో కూడా సరిపడక బహుజన సమాజ్ పార్టీలో చేరారు. అక్కడా ఇమడలేక బహుజన రిపబ్లిక్ పార్టీ పెట్టుకున్నారు. చండ్ర పుల్లారెడ్డి రెండో భార్య నిర్మలచే బహిష్కరింపబడ్డ ప్రజాప్రతిఘటన గ్రూపుకు, పురుషోత్తమరాజు (చలమన్న) మరణంతో నాయకుడు లేకపోతే దానికి నాయకునిగా 'రిక్రూట్' చేసుకోబడ్డాడు. వాళ్ళచే వెళ్ళగొట్టబడి, గుంటూరు చేరి అక్కడ సూరీడు పార్టీ పేరుతో మళ్ళీ దళితపార్టీని నెలకొల్పాడు. దాని నుంచి కూడా బహిష్కరించబడి అనారోగ్యంతో పిల్లల దగ్గరకు చేరాడు. 

విప్లవోద్యమం పట్ల గాని, కుల సమస్య పట్ల గాని చిత్తశుద్ధితో పనిచేసాడని చెప్పుకుంటున్న వ్యక్తి, ఇంత చపలచిత్తంగా ప్రవర్తించటానికి కూడా విప్లవోద్యమంలో పనిచేసిన కులమే కారణమా? ఈ నిలకడలేనితనం కూడా ఒక వ్యక్తి సవ్యసాచిత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చా? జీవితంలో కొంత కాలం మంచిగా పనిచేయటం, కొంతకాలం త్యాగపూరితంగా పనిచేయటం వ్యక్తిని విప్లవకారుడిగా గుర్తింప చేస్తాయా? మనిషికున్న రెండో పార్శ్వాన్ని చూపించకపోవటం ఉద్యమం పట్ల అభిమానం వున్నవాళ్ళు ఆ ఉద్యమానికి హాని చేసినట్లు కాదా? జీవితాం తం కమ్యూనిస్టుగా కొనసాగిన వాళ్ళే నిజమైన విప్లవకారులని మావో అన్నమాట నిజం కాకపోతే నాలాంటి లక్షలమంది విప్లవకారులతో తెలుగుదేశం నిండిపోతుంది. 

- చెరుకూరి సత్యనారాయణ
Andhra Jyothi News Paper Dated : 05/05/2012 

No comments:

Post a Comment