Wednesday, May 30, 2012

నూతన కమిటీ పేదరికాన్ని సరిగ్గా నిర్వచిస్తుందాం?కళ్లకు కనిపించే వాస్తవమే కాదు, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నిపుణుల అంచనాలు ప్రణాళికా సంఘం, ప్రభుత్వం చెప్పే పేదరిక అంచనాలకన్నా చాలా ఎక్కువగా ఉన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయినా ప్రభుత్వం తన తప్పుడు లెక్కలనే కొనసాగిస్తూ వస్తున్నది. అలాంటి అంచనాల పట్ల తాజాగా పెద్ద ఎత్తున వ్యక్తమయిన నిరసన ఫలితంగా కొత్తగా ఓ కమిటీని ప్రభుత్వం నియమించక తప్పలేదు. ఈ కమిటీ అయినా తన పనిని సక్రమంగా నెరవేరుస్తుందా అన్న విషయాన్ని వేచిచూడాలి.
పేదరికాన్ని నిర్వచించేందుకు ఇటీవల ప్రభుత్వం నూతనంగా ఒక నిపుణుల కమిటీని నియమించింది. కొద్ది నెలల క్రితం ప్రణాళికా సంఘం పేదరిక రేఖ గురించి సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ పట్ల ప్రజల్లోనూ, నిపుణుల్లోనూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావడంతో ఇప్పుడు కొత్తగా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యక్షులు సి రంగరాజన్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో మరో నలుగురు సభ్యులుంటారు. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ మహేంద్రదేవ్‌, సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీకి చెందిన కె సుందరం, మహేష్‌ వ్యాస్‌, ప్రణాళికా సంఘం మాజీ సలహాదారు కెఎల్‌ దత్తా ఈ కమిటీలోని ఇతర సభ్యులు. ఇలాంటి హేమాహేమీలతో ఏర్పడిన ఈ కమిటీ తన పనిని సమర్థవంతంగా నిర్వహించి వాస్తవానికి అద్దం పడుతుందని ఆశించవచ్చు. అయితే గతంలో పేదరిక రేఖను నిర్ణయించిన వారు కూడ ఎంతో పేరు ప్రఖ్యాతులున్నవారే. అయినా పేదరికానికి వారు రూపొందించిన కొలబద్దలు, వాటి ఆధారంగా వేసిన అంచనాలు ఏ మాత్రం విశ్వసనీయంగా లేవని రుజువయింది.


1970వ దశకం తొలి సంవత్సరాల నుంచి భారత దేశంలో పేదరిక అంచనాలు తయారవుతూ వస్తున్నాయి. వీటి ప్రకారం దేశంలో పేదరిక రేఖకు దిగువన ఉన్న జనాభా 1973లో 54.9 శాతం నుంచి 1978లో 51.8 శాతానికి, 1983లో 44.5 శాతానికి, 1987లో 38.9 శాతానికి, 1993లో 36 శాతానికి, 2004-05లో 25.7 శాతానికి తగ్గుతూ వచ్చిందని ప్రభుత్వం చెబుతున్నది. కానీ కళ్లకు కనిపించే వాస్తవాలకూ, ఈ లెక్కలకూ ఏ మాత్రం పొసగడం లేదన్నది ప్రతి ఒక్కరి అభిప్రాయం. అయినా నిపుణులు మాత్రం ఏవేవో సిద్ధాంతాలను, సూత్రాలను వల్లెవేస్తూ పేదరికం తగ్గుతూ వస్తున్నదని అంటున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం వాటినే ప్రాతిపదికగా తీసుకుంటున్నది.
పేదరికానికి కొలబద్దలను నిర్ణయించే కమిటీలను కూడా ప్రభుత్వం సకాలంలో నియమించడం లేదు. వారు చేసిన సిఫార్సులను సైతం వెనువెంటనే అమల్లో పెట్టడం లేదు. ఉదాహరణకు 1979లో పేదరిక రేఖను నిర్ణయించిన ప్రభుత్వం, 1993లో కానీ లక్డావాలా కమిటీని నియమించలేదు. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం పేదరికాన్ని అంచనాగట్టేందుకు టెండూల్కర్‌ కమిటీని దశాబ్దం దాటిన తర్వాత 2005 చివరలో నియమించింది. ఆ కమిటీ 2009లో తన నివేదికను సమర్పించింది. ఆ సిఫార్సులను 2011లో ప్రభుత్వం ఆమోదించింది.
ఓ మనిషి బ్రతకడానికి కనీసం ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం అవసరం అవుతుంది అని లక్డావాలా కమిటీ అంచనా వేసింది. పట్టణ ప్రాంతాలలో అయితే 2,400 కిలో కేలరీల శక్తిని, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2,100 కిలో కేలరీల శక్తిని కనీసం అందించే ఆదాయమున్న ప్రతి ఒక్కరూ పేదరిక రేఖకు ఎగువన ఉన్న వారిగానే లక్డావాలా కమిటీ నిర్థారించింది. ఆ తర్వాత ఈ ఆదాయాన్ని ధరల సూచీ ఆధారంగా పెంచుతూ వస్తున్నారు. టెండూల్కర్‌ కమిటీ కూడా ఇదే విధంగా 2004-05 కు పేదరిక రేఖను నిర్ణయించింది. దాన్ని ప్రాతిపదికగా తీసుకునే పట్టణ ప్రాంతాలలో పారిశ్రామిక కార్మికుల వినియోగ ధరల సూచీ ప్రకారం, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మికుల వినియోగ ధరల సూచీ ప్రకారం పేదరిక రేఖను సవరించామని ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ అహ్లూవాలియా చెప్పుకొచ్చారు. ఆ విధంగా గ్రామీణ ప్రాంతాలలో కనీసం రోజుకు రూ.26, పట్టణ ప్రాంతాలలో రూ.32 ఆదాయం లభించే వారిని పేదరిక రేఖకు ఎగువన ఉన్నవారిగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. కాని ఇలాంటి బూటకపు పేదరిక రేఖ పట్ల అన్ని వైపుల నుంచీ పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. దీనితో ఈ లెక్కలు తీసిన పద్ధతిని సమర్థించుకుంటూనే, వీటిని పేదరిక రేఖకు ఎగువన ఎందరు ఉన్నారు, దిగువన ఎందరు ఉన్నారు అని అంచనా వేయడానికి మాత్రమే వినియోగించుకుంటామని, వీటిని సంక్షేమ పథకాల అమలులో ప్రాతిపదికగా తీసుకోబోమని అహ్లూవాలియా వివరణ ఇచ్చారు.
పేదరికంపై ప్రభుత్వ అధికారిక అంచనాలకు, అనేక మంది స్వతంత్ర నిపుణుల అంచనాలకు అసలు పోలికే ఉండటం లేదు. జాతీయ శాంపుల్‌ సర్వేలాంటి వాటి ఆధారంగా వేసే లెక్కలు సైతం పేదరికం ప్రభుత్వం అంచనాల కన్నా చాలా ఎక్కువగా ఉన్నదని చెబుతున్నాయి. తాజా జాతీయ శాంపుల్‌ ప్రకారం పేద ప్రజలు మొత్తం జనాభాలో 77 శాతం ఉంటారు. దేశం మొత్తం మీద కేవలం 23.5 కోట్ల మంది మాత్రమే కనీస ఆదాయాన్ని పొందుతున్నారు. 83.5 కోట్ల మందికి సహాయం అవసరమవుతుంది. 2010 మానవాభివృద్ధి నివేదిక ప్రకారం సైతం భారత దేశంలో పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు 55.4 శాతం. బీహారులో అయితే అత్యధికంగా 61.4 శాతం కుటుంబాలు పేదరిక రేఖకు దిగువన ఉన్నాయి.


మనవాళ్లు పదేపదే వల్లించే ప్రపంచబ్యాంకు భారత దేశంలో పేదరికంపై వేసిన అంచనాలు చూస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. 2005 నాటికి రోజుకు 1.25 డాలర్ల కన్నా తక్కువ ఆదాయం లభించే వారిని ప్రపంచబ్యాంకు పేదలుగా పరిగణిస్తుంది. దీని ప్రకారం భారతదేశంలో పేదరిక రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 1981లో 42.05 కోట్లు, 1990లో 43.55 కోట్లు, 2005లో 45.58 కోట్లు ఉంది. 2005కు ప్రణాళికా సంఘం అంచనా వేసిన పేదల సంఖ్య 30.2 కోట్ల కంటే ఇది చాలా ఎక్కువ. జనాభాలో పేదల శాతం తగ్గుతూ వస్తున్నదని ప్రపంచబ్యాంకు గుర్తించింది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం పేదల శాతం 1981లో 51.3 శాతం నుంచి 1990లో 51.3 శాతానికి, 2005లో 41.6 శాతానికి తగ్గుతూ వచ్చింది. అయితే ఈ తగ్గుదల రేటు అంతకంతకూ తగ్గుతూ వస్తున్న విషయాన్ని కూడా ప్రపంచబ్యాంకు గమనించింది.
ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) లెక్కలయితే ప్రభుత్వానికి మరీ ఆశాభంగం కలిగిస్తాయి. ఆసియాలో సగటు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఎడిబి రోజుకు 1.35 డాలర్లను కనీస ఆదాయంగా నిర్ణయించింది. దీని ప్రకారం 2005లో భారత దేశంలో పేదల సంఖ్య 62 నుంచి 74 కోట్ల వరకూ ఉంటుందని ఎడిబి అంచనా. ఆసియాలో ఒక్క నేపాల్‌ తర్వాత పేదల శాతం అత్యధికంగా ఉన్న రెండవ దేశంగా భారత్‌ను ఎడిబి గుర్తించింది. నేపాల్‌లో పేదల శాతం 55.8 శాతం కాగా, భారత్‌లో 54.8 శాతం, బంగ్లాదేశ్‌లో 42.9 శాతం, కంబోడియాలో 36.9 శాతం, భూటాన్‌లో 31.8 శాతం, ఫిలిప్పైన్స్‌లో 29.5 శాతం, పాకిస్తాన్‌లో 24.9 శాతం, ఇండోనేషియాలో 24.1 శాతం, వియత్నాంలో 16 శాతం, శ్రీలంకలో 9.9 శాతం పేదలున్నట్లు ఎడిబి గుర్తించింది. చైనా మాత్రం ఈ జాబితాలో చోటుచేసుకోలేదు. ఎడిబి అంచనాల ప్రకారం భారత దేశం యుఎన్‌డిపి లక్ష్యంగా పెట్టినట్లు 2015 నాటికల్లా 1990 నాటి పేదరికంలో సగాన్ని తగ్గించాలంటే, ఏడాదికి 2 శాతం చొప్పున పేదల శాతం తగ్గాల్సి ఉంటుంది. ప్రస్తుత ధోరణి చూస్తే అలా తగ్గడం అసాధ్యమనిపిస్తుంది. ఒకవేళ అలా తగ్గిందని అనుకున్నా పేదలు అప్పటికీ 32 శాతంగా ఉంటారు.


కళ్లకు కనిపించే వాస్తవమే కాదు, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నిపుణుల అంచనాలు ప్రణాళికా సంఘం, ప్రభుత్వం చెప్పే పేదరిక అంచనాలకన్నా చాలా ఎక్కువగా ఉన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయినా ప్రభుత్వం తన తప్పుడు లెక్కలనే కొనసాగిస్తూ వస్తున్నది. అలాంటి అంచనాల పట్ల తాజాగా పెద్ద ఎత్తున వ్యక్తమయిన నిరసన ఫలితంగా కొత్తగా ఓ కమిటీని ప్రభుత్వం నియమించక తప్పలేదు. ఈ కమిటీ అయినా తన పనిని సక్రమంగా నెరవేరుస్తుందా అన్న విషయాన్ని వేచిచూడాలి. పేదరికాన్ని అంచనా వేసేటప్పుడు కేవలం వినియోగ వ్యయాన్నే కాకుండా, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని కమిటీ ఛైర్మన్‌ రంగరాజన్‌ చెబుతున్నారు. బతకడానికి అవసరమయ్యే కనీస ఆహారం మాత్రమే కాకుండా, గృహ సదుపాయం, విద్య, ఆరోగ్యం, తదితర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో పలువురు నిపుణులు చెబుతూ వస్తున్నారు. అయినా ప్రభుత్వం పేదరికాన్ని తగ్గించి చూపడంలో భాగంగా ఇలాంటి విస్తృతమైన విధంగా పేదరికాన్ని అంచనా గట్టేందుకు పూనుకోవడం లేదు.


నూతన కమిటీ ఏర్పాటును ప్రకటించే సమయంలో కేంద్ర ప్రణాళికా సహాయమంత్రి అశ్వనీ కుమార్‌ మాటలు గమనిస్తే అలాంటి ఆశలకు తావుండదేమో అనిపిస్తుంది. పేదరికాన్ని అంచనా కట్టే పద్ధతులను మార్చుకోవాలని చెబుతూనే, అలాంటి పరిస్థితికి దారితీసిన పరిస్థితుల గురించి ఆయన చెప్పిన ధోరణి ఎగతాళి చేసేట్లుగా ఉంది తప్ప చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించదు. 'నేడు పేదరికం పట్ల ప్రజల అవగాహనలోనే పెద్ద మార్పు వచ్చింది. ఇరవై పైసలు పెట్టి పోస్టు కార్డు రాసే బదులు మొబైల్‌ ఫోన్లను వినియోగిస్తున్నాము. ప్రతి ఒక్కరూ రీబాక్‌ జోళ్లు ధరిస్తున్నారు. సైకిళ్లకు బదులు స్కూటర్లపై ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు సమస్య రోటీ, కపడా, మకాన్‌ కాదు, రీబాక్‌లు, కమిటీలు' అని ఆయన మాట్లాడుతున్నాడంటే ప్రభుత్వం పేదల పట్ల ఎంత చిన్నచూపుతో ఉందో అర్థం చేసుకోవచ్చు.
-గుడిపూడి విజయరావు
Prajashakti News Paper Dated : 30/05/2012 

No comments:

Post a Comment