Saturday, May 5, 2012

ప్రపంచీకరణ బడుగు యువత భవిత?---డేవిడ్,



devid
నూతన ఆర్థిక విధానాలు ప్రభుత్వ రంగాన్ని రోజు రోజుకి కుదించి వేస్తున్నాయి. ఉన్న ఉపాధి హరించుకుపోతోంది. పాలకులు చెబుతున్న ప్రైవేటు, విదేశీ పెట్టుబడులలో పెరుగుదల కనిపిస్తోంది. కానీ ఉపాధికి మాత్రం పెరగడం లేదు. ప్రైవేటు పెట్టుబడి వీలైనన్ని తక్కువ ఉద్యోగాలను, తక్కువ వేతనాలను ఇచ్చే ఉద్యోగాలును మాత్రమే సృష్టిస్తోంది. దీని వలన యువత విపరీతంగా నష్టపోతోంది. ఈ ప్రక్రియలో మొదట బలవుతున్నది దళిత యువతే. తరతరాల నుంచి అణచివేతకు గురై విద్య, ఉద్యోగాలకు దూరంగా ఉంచిన దళితులు రాజ్యాంగం కల్పించిన రాయితీల కారణంగా వాటిలోకి ప్రవేశించగలిగారు. ప్రస్తుతం ప్రభుత్వాలు తెస్తున్న సంస్కరణలు రాజ్యాంగం దళితులకు కల్పించిన భద్రతను సవాలు చేస్తున్నాయి. 

1990లో ప్రకటించిన పారిశ్రామిక విధానంలో ఆరు నుంచి ఎనిమిది రకాల పరిశ్రమలను మాత్రమే ప్రభుత్వ ఆజమాయిషీ కింద ఉంచి మిగిలిన వాటికి ప్రైవేట్‌ సంస్థలను అనుమ తించింది. ప్రస్తుతం మిగిలినవాటిని కూడా ప్రైవేట్‌వారికే అప్పగించి తను తప్పుకునే ప్రయత్నాలలో ఉంది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్న దళితులు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాలలో వాటా పొందుతున్న వారు నేడు చేతి వృత్తులు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో దళిత యువత భవిష్యత్తు ఆందోళనలో పడు తోంది. ప్రస్తుతం పాలకులు సంస్కరణలతో అభివృద్ధిని నిలిపివేసి స్వాతంత్య్రానికి పూర్వపు రోజులను ప్రసాదించబోతున్నారా అనే అనుమానం కలుగుతోంది.

2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ర్టంలో దాదాపు కోటి యాభై లక్షల మంది దళితులున్నారు. వారిలో 10 లక్షల మంది దారిద్య్ర రేఖకు ఎగువన ఉండగా, మిగిలిన కోటీ నలభైలక్షల మంది రెక్కల కష్టంపై ఆధారపడుతున్నారు. దళితులలో అక్షరాస్యత దాదాపు 40 శాతంఉన్నా 10 నుండి 15 శాతం మాత్రమే ఉద్యోగాలకు అర్హత సంపాదించగలుగుతున్నారు. రిజర్వేషన్ల వల్ల విద్య, ఉద్యోగాలలో చోటు సంపాదించుకున్న ఈ సెక్షనే ప్రస్తుతం దళితులో కొంత మెరుగైన జీవితం గడుపుతున్నది. మిగిలిన వారిలో ఎక్కువమంది వ్యవసాయ కార్మికులుగా, దిగువస్థాయి కార్మికులుగా జీవితాలు వెళ్ళదీస్తున్నారు. ప్రస్తుతం జనాభాలో 4 శాతం ఉన్న ప్రభుత్వోద్యోగాలు ప్రభుత్వ విధానాలవల్ల రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. ఫలితంగా దళితులలో యువకులకు ఉపాధి మార్గాలు మూసుకుపోతున్నాయి.

ప్రైవేటీకరణ వల్ల ప్రత్యేకంగా, అతి ఎక్కువగా నష్టపోతున్నది దళిత యువతే. రాష్ర్టంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న దళిత నిరుద్యోగులు 9.5 లక్షల మంది ఉన్నారు. మిగిలిన వర్గాలలో ఇంతకంటే ఎక్కువ మందే ఉన్నా ఈ పరిస్థితి లేదు. వారు ప్రభుత్వోద్యోగాలపై ఎక్కువ ఆశ పెట్టుకోకుండా వేరే ఉద్యోగాలు, వ్యాపారాలు చూసుకుంటున్నారు. ప్రభుత్వోద్యోగాలలో వారి ప్రతిభకు తగ్గ రీతిలో ప్రాతినిధ్యం లేదన్న అసంతృప్తి ఉంది. వారు తమకున్న పరిచయాల ద్వారా, కొంత కష్టపడి ఇతర రంగాలలో రాణించగలుగుతున్నారు. ప్రైవేటు రంగంలో ఉన్న ఉద్యోగితను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ప్రైవేటు సంస్థలలో దళితులు ప్రధానంగా నైపుణ్యంలేని కార్మికులుగా ఉండగా, దళితేతరులు యాజమాన్య, గుమస్తా స్థాయిలలో ఉంటున్నారు.

డిగ్రీలు చదివిన తరువాత దళితులకు ప్రభుత్యోద్యోగాలు రాకపోతే ఆటో డ్రైవర్లుగానో రాడ్‌ బెండింగ్‌ వర్కర్లుగానో, మరే ఇతర సాధారణ కార్మికులుగా నో స్థిరపడుతున్నారు. మళ్ళీ ప్రభుత్యోగాలు వస్తేనే వారి జీవితాలకు వెలుగు. లేదంటే కింది స్థాయి వృత్తులలో స్థిరపడలసిందే. వీరికి వస్తే ప్రభుత్యోగాలు- లేదంటే మరే ఉద్యోగాలూ రావడం లేదు. పరిశ్రమలు అధికంగా ప్రైవేటు రంగంలో వస్తున్నాయి. వీటిలో రిజర్వేషన్లకు స్థానం లేదు. దళితులకు అక్కడ ప్రవేశం అసాధ్యమవుతోంది. స్వదేశీ పరిశ్రమలు, వీదేశీ కంపెనీల అనుబంధ సంస్థలు, ఏజెన్సీలు అన్నీ అగ్రవర్ణాల చేతుల్లోనే వెలుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న, కొత్తగా ఏర్పడుతున్న పరిశ్రమలు దాదాపు పూర్తిగా దళితేతర వర్గాల చేతుల్లోనే ఉన్నాయి. ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రతిభతో బాటు బంధుత్వాలు, పరిచయాలే అర్హతలుగా పనిచేస్తున్నాయి. 

చదువు పూర్తిచేసుకున్న అగ్రవర్ణాల యువత వాటితో ఉద్యోగాలు దక్కించుకో గలుగుతున్నారు. అగ్రవర్ణాల కోటల్లోకి దళితుల ప్రవేశం ఎలా సాధ్యం? అంతేకాక అగ్రవర్ణాలలో ఇన్నాళ్ళుగా ఉన్న రిజర్వేషన్‌ వ్యతిరేకతను కూడా బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. దళితుల చేతులలో ఉపాధిని ఇవ్వగలిగే పరిశ్రమలు గానీ, భూఖండాలు గానీ లేవు. ఫలితంగా వారికి ఉపాధి లభ్యత ఇబ్బందిగా మారింది. రాజ్యాంగం దళితులకు కల్పించిన రక్షణలు ప్రపంచీకరణ గాలివానకు కుప్పకూలుతున్న తీరిది! అగ్రవర్ణాలకున్న సంంధాలు, పరిచయాలు వారిని కొంత మేరకు రక్షిస్తుండగా, దళిత యువకులను మాత్రం దుర్భర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం ఇస్తున్న టీచర్‌, పోలీసు ఉద్యోగాలు కూడా రాకపోతే వీరు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. రానున్న కాలంలో ఈ పరిస్థితిని కూడా చూడవచ్చు.

ప్రపంచీకరణ ఫలితాల గురించి తెలుసుకుంటున్న దళితులు ఈ ప్రపంచీకరణే తమ పరిస్థి తికి కారణమంటున్నారు. ప్రపంచీకరణ వల్ల వేగంగా ప్రభుత్వ రంగం హరించుకుపోతోందన్న ఆందోళన వీరిలో కనిపిస్తోంది. ఉత్పత్తిలో ప్రభుత్వ పాత్ర తగ్గి మార్కెట్‌ శక్తుల పాత్ర పెరగడం వల్ల దళిత యువకులకు అవకాశాలు రోజు రోజుకూ కుంచించుకు పోతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచీకరణ వల్ల దళితులకు మేలు జరుగబోతోందని, అమెరికా నుంచి వచ్చిన దొరలు అక్కడి నల్లవారిని చూసినట్లే దళితులను ఉద్ధరిస్తారని, కనుక బహుళజాతి సంస్థలను ఆహ్వానించాలని చంద్రభాను ప్రసాద్‌ వంటి దళిత మేధావులు చెబుతున్నారు. కానీ ఆమెరికన్లు తమ దేశంలో చేసుకున్న చట్టాలనే విదేశీయులు చేస్తే ఊరుకోరన్న విషయం ఆయనకు తెలియనట్లుంది. ఆమెరికాలో ఉన్న పెటేంట్‌ చట్టం, గుత్తాధిపత్య వ్యతిరేక చట్టం వంటివి విదేశాలు చేస్తే అమెరికా సహించదు. తన పౌరులను ప్రేమగా చూసుకునే అమెరికా పాలకులు ఇతర దేశాల పట్ల వివక్షతోనే ఉంటున్నారన్నది స్పష్టం. వారు ఇక్కడ వ్యాపారం కోసం బలం, బలగం ఉన్న భూస్వాములు, జాతీయ పెట్టుబడిదారుల వైపే ఉంటారన్నది సత్యం. అంతే కాక అమెరికాలో నల్ల జాతి ప్రజలు సుధీర్ఘ పోరాటం నడిపిన తర్వాతే వారికి విముక్తి లభించింది కాని బహుళ జాతి సంస్థల దయా దాక్షిణ్యాల వల్ల కాదు.

అయినా ఇప్పటికీ అక్కడ నల్లజాతి వారిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. నల్లవారు ఎక్కువగా కిందిస్థాయి ఉద్యోగాలలో, సైన్యంలో పనిచేస్తున్నారు. సంపద ప్రధానంగా తెల్లజాతివారి చేతుల్లో ఉండగా నల్లవారు గెట్టోలుగా పిలిచే మురికివాడల్లో జీవిస్తున్నారు. దీనిని బట్టే బహుళజాతి సంస్థలు దళితుల ప్రయోజాలకు అనుకూలమని చేస్తున్న ప్రచారం- ఎవరికి అనుకూలమో తేల్చుకోవచ్చు.ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించని దళిత సంస్థలు నేడు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కావాలని కోరుతున్నాయి. సంస్థలలో ఉన్న కార్మికుల ప్రాథమిక హక్కులనే లాక్కోజూస్తున్న ప్రభుత్వాలు కొత్తగా దళితులకు రిజర్వేషన్లు ఇస్తాయని అనుకోలేము. ప్రైవేట్‌ యాజమాన్యాల మెప్పు కోసం బరితెగిస్తున్న ప్రభుత్వాలు ఇటువంటి సాహసోపేత నిర్ణయాలను ఎట్టి పరిస్థితిలోను తీసుకోవు. ఎందుకంటే పరిశ్రమాధిపతుల నుండి ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత ఎదురు కావచ్చు. 

ప్రస్తుతం ప్రభుత్యోద్యోగాలు లేక, ప్రైవేటు ఉద్యోగాలు రాక దళిత యువకుల భవిష్యత్తు అంధకారమయమవుతోంది. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ ప్రమాదం నానాటికీ పెరుగుతున్నది. రాబోయే రోజులలో ప్రపంచీకరణ ప్రదర్శించబోయే విశ్వరూపం దళిత యువతీ యువకుల భవిష్యత్తును పూర్తిగా నాశనం చేయక ముందే దానిని ప్రతిఘటించి తిప్పికొట్టాలి. దళిత యువత ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమాలలో పాలు పంచుకోవాలి.

Surya News Paper Dated : 06/05/2012 

No comments:

Post a Comment