Monday, July 9, 2012

సమానత్వ శ్రమ విభజనే మార్గం - రంగనాయకమ్మ

నేను రాసిన 'అస్తవ్యస్త సంస్కర్తలు' (ఆంధ్రజ్యోతి, మే 15) వ్యాసానికి స్పందనగా వచ్చిన వ్యాసాలన్నీ చూశాను. ఆ వ్యాసాల్లో వున్న చాలా అంశాలు, నా 'దళిత సమస్య...' పుస్తకంలో ప్రస్తావించినవే. అవే చర్చలు అనంతంగా సాగనక్కరలేదు కాబట్టి, అలాంటి వాటిని కొన్నిటిని వదిలేసి, మిగిలిన వాటికే పరిమితమవుతాను. 'రంగనాయకమ్మకి పిచ్చి' అని తేల్చి ఆనందించేవాళ్ళకి, వాళ్ళ ఆనందం వాళ్ళకి ఉండనిస్తాను. 'రంగనాయకమ్మ, మార్క్సిజం తనకే తెలుసనుకుంటుంది' అని ఒకరూ; 'ఆమె, తన నిజమైన వర్గంలోకీ, నిజమైన కులంలోకీ, వెళ్ళిపోయింది' అని ఇంకొకరూ; అటువంటి కడుపుమంట వ్యాఖ్యానాలు ఎన్ని కురిసినా, అవి కుల సమస్య మీద చర్చలు కాలేవు. ప్రతీ వంకర వాదానికీ, తిన్నని జవాబులు ఉంటాయి.

కానీ దినపత్రిక పరిధిలో అదంతా అనవసరం. నా '... సంస్కర్తల' వ్యాసంలో వున్న ప్రధానమైన అంశం, 'కుల నిర్మూలన' సమస్యలో, అంబేద్కర్ మార్గానికీ, మార్క్సు మార్గానికీ, తేడా!

'ఈ దేశంలో, వర్గాలే కాదు, కులాలూ ఉన్నాయి' అని ఒక వాదం. కులాలు లేవని ఎవరన్నారు? కులాల సంగతి అందరికీ తెలిసిందే. ఉన్న 'వర్గాలకు' పరిష్కారం ఏమిటీ, ఉన్న 'కులాలకు' పరిష్కారం ఏమిటీ - ఇదే ఇక్కడి సమస్య! 'ఈ దేశంలో, కులమే వర్గం; వర్గమే కులం' అని ఇంకో వాదం! అంటే, 'వర్గమూ, కులమూ, ఒకటే' అనడం ఇది! 'వర్గం' అంటే ఏమిటో, 'కులం' అంటే ఏమిటో, వాటి సంబంధాలు ఏమిటో, స్పష్టత లేని వ్యాఖ్యలు ఇవి!

ఈ చర్చలో, అసలు ప్రశ్నలు రెండే. 1) రిజర్వేషన్లతో అవసరం లేకుండా, అందరూ సమానులుగా జీవించడానికి, ఎలాంటి పరిస్థితులు ఉండాలి? 2) కులాంతర వివాహాలు విరివిగా జరుగుతూ, కుల భేదాలు అంతరించడానికి, ఎలాంటి పరిస్థితులు ఏర్పడాలి? ఈ 2 ప్రశ్నల సారాంశమూ ఒకటే. చర్చ, ఈ అంశాల మీదే జరగాలి. ఎదుటి వాళ్ళకి పెట్టే శాపనార్ధాల్ని ఎంచుకోవడం మీద కాదు.

*"కుల నిర్మూలన' కోసం, హిందూ మత గ్రంధాల్ని నిషేధించడం అంబేద్కర్ మార్గం'' అంటారు ఒకరు. హిందూ మత గ్రంధాల నిషేధమే జరగాల్సిన మార్గం అయితే, దళిత ప్రజలే రాజ్యాధికారంలోకి వచ్చి, దళిత నియంతృత్వం తెచ్చి, ఆ నిషేధం పెట్టవచ్చు. అయితే దానితో, కుల భేదాలు అంతరించవు.

* మతం కావలసిన వాళ్ళకి, మూర్ఖ నమ్మకాల్ని నేర్పే ఏ మతం కన్నా, హేతువాదాన్ని చెప్పే బుద్ధుడి మతం మంచిదే. కానీ బుద్ధుడు చెప్పినవి ఎన్ని ఉత్తమ సూక్తులైనా, వాటిని సాధించే మార్గం - అష్టాంగ మార్గమే. ఆ మార్గం, ఆ సూక్తుల్ని సాధించలేదు. ఆనాటికి అంత కన్నా మార్గం లేదు. అది బుద్ధుడి పరిమితి.

* 'కమ్యూనిస్టులు ఆర్ధికమే మూలం - అంటారు, అది కుత్రిమం' అని, ఒక విమర్శ. ఆర్ధికం - అనే అంశంలో ఉత్పత్తి సంబంధాలూ, ఆస్తి హక్కులూ, యజమానీ శ్రామిక సంబంధాలూ, శ్రమ దోపిడీ, దాని శ్ర మ విభజనా - ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అన్నిటికీ కలిపి క్లుప్తమైన పే రు-ఆర్ధికం. మానవ సంబంధాలకు, గుణమూ రూపమూ ఇచ్చేది అదే. అది అసమానత్వాలలో వుంది కాబట్టి, దాన్ని సమానత్వం చేసుకోవాలి.

* 'బ్రాహ్మణులే, కుల విధానాన్ని పుట్టించారు' అనేది అంబేద్కర్ సిద్ధాంతంగా, దాన్ని సమర్ధిస్తూ చెపుతోంది ఒక వ్యాసం. బ్రాహ్మణులే కులాల్ని పుట్టించడం అంటే, ముందు బ్రాహ్మణులు వుండి (ఫలానా ఒక వృత్తి గల వారు ఉండి), వారు మత గ్రంధాలు రాసి, ఆ గ్రంధాల్లో చెప్పిన నియమాలతో, కులాల్ని, లేదా 4 వర్ణాల్ని, పుట్టించారు - అనుకుంటే, దాన్ని చర్చించవలసిందే. కులాలు ఇంకా పుట్టక ముందే, బ్రాహ్మణులూ (ఒక వృత్తి వారూ), ఇతర వృత్తుల వారూ ఉన్నారంటే, కులాల కన్నా ముందే వేరు వేరు శ్రమలూ, వృత్తులూ, జరుగుతూ వున్నాయనీ, ఆస్తి సంబంధాలు ఏర్పడి ఉన్నాయనీ, అర్ధమే.

ఒక ఫలానా వృత్తి వారే కులాల్ని పుట్టించారంటే, అలా చెయ్యడానికి వారికి ఆధారంగా వున్నదీ, ఇతర వృత్తుల వారికి ఆధారంగా లేనిదీ, ఏదో ఒక విషయం వుందని అర్ధమే. ఒక వృత్తి మనుషులు, 'మేం బ్రాహ్మలంగా ఉంటాం' అన్నంత మాత్రానే, మిగతా వాళ్ళు చాకళ్ళుగా, మంగళ్ళుగా, కుమ్మర్లుగా ఉండడానికి ఒప్పుకోరు. కానీ, ఒకరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కులాల విధానం పుట్టుకొచ్చిందంటే, అది ఒకరి ఇష్టాయిష్ఠాలతో జరిగింది కాదనీ, ఆనాటి శ్రమ సంబంధాల వైరుధ్యాల పరిస్థితి అలా వుందనీ, అర్ధమే.

* ఆ రకమైన అనేక చర్చనీయాంశాల్లో, 'విప్లవకారులెవరు మరి?' అని వెంకటేశ్వర్లు గారు అడిగిన ప్రశ్నకి (మే 23) నేను తప్పకుండా జవాబు చెప్పాలి. విప్లవకారులు ఎవరా? - విప్లవం చేసే వాళ్ళే. విప్లవం చెయ్యని వాళ్ళు, విప్లవకారులు అవరు కదా? 'విప్లవం' అంటే, దానికి అంబేద్కర్ చెప్పే విప్లవంగా వెంకటేశ్వర్లు చూపించే అర్ధమూ వుంది; మార్క్సు చెప్పే అర్ధమూ వుంది. మార్క్సు ప్రకారం అయితే, ఈనాడు అమలులో వున్న పెట్టుబడిదారీ దోపిడీ ఆస్తి హక్కుల్ని రద్దు చేసి, ఆ ఆస్తుల్ని సమాజపరం చేసి, ప్రతి మనిషీ శ్రమ చెయ్యాలనే మార్గంలో, మానవుల మధ్య సమాన శ్రమ సంబంధాలు ఏర్పరచడమే, విప్లవం!

దోపిడీని వ్యతిరేకించని చర్చ ఏదీ, మార్క్సు చెప్పే విప్లవం అవదు. ఆ విప్లవ చర్యల్లో, ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలనేది, మొదటి మార్పు అయితే, ఆ శ్రమ చెయ్యడంలో కూడా కొన్ని మేధా శ్రమలూ, కొన్ని శారీరక శ్రమలూ కూడా డ్యూటీల ప్రకారమే చెయ్యాలనేది, మరో మార్పు! ఒక మనిషి ఎప్పుడూ మేధా శ్రమే, ఇంకో మనిషి ఎప్పుడూ శారీరక శ్రమే చేసే దోపిడీ సమాజాల శ్రమ విభజన, 'సమానత్వ శ్రమ విభజన'గా మారకపోతే, మనుషులందరూ ఏదో ఒక శ్రమ చేసే వారే అయినా, వారి శ్రమల విలువల్లో ఎక్కువ తక్కువలూ, వారి జీవన పరిస్థితుల్లో తారతమ్యాలూ, పాత రకంగానే వుండిపోతాయి. శారీరక శ్రమల సెక్షన్లకు విముక్తి అనేది, అప్పుడూ కూడా అబద్దమే అవుతుంది. అంటే, మార్క్సిజం చెప్పే 'ఆర్ధికం' అనేది, కేవలం పేదలకు భూములు పంచడమో, లేదా భూముల్ని జాతీయం చేయడమో మాత్రమే చేసే సిద్ధాంతం కాదు. అన్ని రకాల అసమానతల్నీ, శతృ వైరుధ్యాల్నీ, పరిష్కరించగల మార్గం అది.

* 'ఇప్పుడు వున్న కమ్యూనిస్టు పార్టీలు దళితులకు నచ్చకపోతే, వారే ఒక పార్టీ పెట్టుకుని, దాన్ని విప్లవకరంగా నడుపుకోవాలి' అని నేను అన్నదానికి, వెంకటేశ్వర్లు, 'ఇంత వరకూ మన సమాజాన్ని విప్లవ పరిస్థితులవైపు తీసుకువెళ్ళే ప్రయత్నాలు జరగలేదని ఆమె భావిస్తున్నారా?' అన్నారు. అది నా భావనగా చెప్పింది కాదు. దళిత నాయకులు అలా భావిస్తున్నారు కాబట్టి, వారు అప్పుడేం చెయ్యవలసి వుంటుందో చెప్పాను. నచ్చితేనే కలిసి పనిచెయ్యాలి. ఎంత ప్రయత్నించినా ఐక్యత సాధ్యం కాకపోతే విడిపోవాలి. అదే చెప్పాను.

* 'పార్టీ వారు సత్యమూర్తిని బైటికి పంపారు' లాంటి వాదనలు ఇక్కడ బొత్తిగా అనవసరం. వాళ్ళు పంపారో, ఆయనే వెళ్ళారో, అది ఇక్కడ వాదించి నిర్ణయించే విషయం కాదు. నేను కమ్యూనిస్టు పార్టీల చరిత్రల గురించీ, చర్యల గురించీ, నా వ్యాసంలో ఎక్కడా మాట్లాడలే దు. నా కోణం-మార్క్సిజం. చర్చ జరిగితే, ఆ సిద్ధాంతం మీదే జరగాలి.

* 'ఇండియాలో దోపిడీ వర్గం అంటే ఎవరు?' అని, ఒక ప్రశ్న. ఇండియాలో అయినా, ఇంకెక్కడైనా, భూమి కౌళ్ళూ, వడ్డీ లాభాలూ తినేదే - దోపిడీ వర్గం. ఆ దోపిడీ చట్టాల ద్వారా పాలించేది, దోపిడీ ప్రభుత్వం. అదనపు శ్రమని గానీ, అదనపు విలువని గానీ, పోగొట్టుకునేది, శ్రామిక వర్గం. ఏ దేశంలో అయినా, శతృ వర్గ లక్షణాలు అవే. సమాజానికి అదే మౌలిక శతృ వైరుధ్యం. దానితో పాటు, ప్రత్యేక సమస్యలు కూడా వుంటాయి. ఇండియాలో కుల విధానం, శ్రమ సంబంధాలతో లంకెలు పడి వున్న విధానం. ఈనాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభజనలతో వున్న కులాలలో అత్యధిక సంఖ్య, ఉత్పత్తి సాధనాలు లేని వారు. అట్టడుగు శారీరక శ్రమలకు బందీలైన వారు. వారి ఆర్ధిక, సాంఘిక దుస్థితికి కారణం, శ్రమ సంబంధాలలో వారు ఆ రకపు పాత్రలో వుండడం! అవే కులాలలో దోపిడీదారులు కూడా వుంటారు.

అది తక్కువ సంఖ్యే అయినా, ఆ కులాల్లో కూడా దోపిడీ వర్గం వుంటుంది. అగ్ర కులాల్ని తీసుకుంటే, అక్కడ కూడా అందరూ దోపిడీదారులు కారు. అక్కడ కూడా వేతన శ్రామికులూ, నిరుద్యోగులూ, నిరుపేదలూ, వుంటారు. కానీ అక్కడ కొంత అధిక సంఖ్య, మేధా శ్రమల్లో వుంటారు. కొంత సంఖ్య, కొన్ని రకాల శారీరక శ్రమల్లో వున్నా, అట్టడుగు శారీరక శ్రమల్లో మాత్రం వుండరు. ఈ శ్రమ సంబంధాలూ, దానిలో వున్న శ్రమ విభజన పరిస్థితులూ, రకరకాల కులాల రూపంలో, కులాల పేర్లతో కనపడుతోన్నా, అందులో అసలు విషయం, మనుషుల్ని ఉత్పత్తి సాధనాలు వున్నవారి గానూ - అవి లేని వారి గానూ; మేధా శ్రమల వారి గానూ - శారీరక శ్రమల వారి గానూ, విభజించి వుంచేవి, వర్గ పరిస్థితులే. ఇవే వర్గ పరిస్థితులు అన్ని దేశాల్లోనూ వుంటాయి. వాటి ప్రభావాలు వేరు వేరు రూపాల్లో వుంటాయి. కులాలు లేని దేశాల్లో కూడా, అట్టడుగు శారీరక శ్రమలకే అంకితమైన సెక్షన్లు వుంటాయి. అది, కుల విధానం వల్ల వచ్చిన సమస్య కాదు. అక్కడ ఆ సమస్య పరిష్కారానికి ఏది మార్గమో, కులాల పేరుతో వున్న అట్టడుగు శారీరక శ్రమల మానవుల విముక్తికి కూడా అదే మార్గం. విప్లవ శ్రమ విభజనే ఆ మార్గం. మౌలిక సమస్యల పరిష్కారాల మార్గంలోనే ప్రత్యేక సమస్యల పరిష్కారాలు కూడా సాధ్యమవుతాయి. కొన్ని సమస్యలకు, దోపిడీ పరిస్థితుల్లో కూడా సంస్కరణల ద్వారా కొంత పరిష్కారం సాధ్యమవుతుంది.

'పురుషాధిక్యతా - స్త్రీల బానిసత్వం' అనేవి, వర్గ సంబంధాలతోనూ, అందులో 'ఇంటి పనీ - బైటి పనీ' శ్రమ విభజనతోనూ, ముడిపడి సాగే విషయమే. అయినా, స్త్రీల సమస్యల్లో, వారి విద్యలూ, బాల్య వివాహాలూ, వితంతు వివాహాలూ వంటి కొన్నిటిని, సంస్కరణల ద్వారా, కొంత వరకైనా పరిష్కరించడం సాధ్యమే. కానీ, 'వ్యభిచారం' వంటి సమస్యని పరిష్కరించడం గానీ, స్త్రీ-పురుష అసమానతల్ని పూర్తిగా పరిష్కరించడం గానీ, శ్రామిక వర్గ విముక్తి కన్నా ముందు సాధ్యం కాదు. అలాగే, కులాల సమస్యని తీసుకుంటే, సంస్కరణల ద్వారా, 'అస్పృశ్యత' వంటి సమస్యని పరిష్కరించవచ్చు; కులాంతర వివాహాల్ని కూడా నూటికో కోటికో ఒక్కొక్క దాన్ని సాధించవచ్చు. కానీ, మొత్తం కుల విధానాన్నే మార్చివేసేటంతగా కులాంతర వివాహాలు జరిగే పరిస్థితుల్ని, శ్రామిక వర్గ విముక్తి కన్నా ముందు సాధించడం సాధ్యం కాదు.

ఒక అగ్ర కులంలో అయినా, ధనికులకూ - పేదలకూ మధ్య పెళ్ళి జరగదు. వేరు వేరు అగ్ర కులాల మధ్య కూడా, రెండూ అగ్ర కులాలే అయినా, ధనికులకూ - పేదలకూ మధ్య పెళ్ళి జరగదు. పెళ్ళిళ్ళ విషయంలో అదే జనరల్ సూత్రం. కులాలు లేని మతాల్లోనూ, జాతుల్లోనూ, దేశాల్లోనూ కూడా, ఎక్కడైనా చూడండి! అట్టడుగు శారీరక శ్రమల వ్యక్తులకూ, మేధా శ్రమల వ్యక్తులకూ, వివాహ, కుటుంబ సంబంధాలు ఏర్పడవు. అంటే, అడుగు కులాల బీద పరిస్థితులూ, వారు అడుగు శారీరక శ్రమలకు మాత్రమే బందీలై వుండే పరిస్థితులూ, మారకపోతే, కులాంతర వివాహాలూ జరగవు; కులాల విధానం రద్దూ జరగదు.

* 'శ్రామిక వర్గ పార్టీకి, శ్రామిక వర్గ కులాల వారు నాయకులుగా వుండాల్సిన అవసరం లేదా? ఇదేనా మార్క్సిస్టు వర్గ పోరాటం? ఇటు వైపుకేనా రంగనాయకమ్మ దృష్టి పెట్టమంటున్నారు?'-వెంకటేశ్వర్లు ప్రశ్న. దృష్టి పెట్టమని నేను చెప్పేది, 'మార్క్సిజం' మీద! 'శ్రామిక వర్గ పార్టీకి నాయకత్వం' అనేది, శ్రామిక వర్గ చైతన్యమూ, ఆ సిద్ధాంతావగాహనా, ఆ కృషీ, వంటి అంశాల్ని బట్టి వుండాలి. ఆ లక్షణాలు ఎవరికి ఎక్కువగా వుంటే, వాళ్ళే నాయకత్వ స్థానంలోకి సహజంగా వెళ్ళాలి.

ఆ లక్షణాలు, అడుగు కులాల వారికో, పై కులాల వారికో, తప్పనిసరిగా వుంటాయనడానికి లేదు. ఏ కులంలో అయినా, శ్రమ చేసే మనుషుల్లో వున్న సుగుణం - శ్రమ చెయ్యడం ఒక్కటే. అది తప్ప, మిగతా అన్ని అంశాల్లోనూ, శ్రామికులంతా, భూస్వామ్య, బూర్జువా సమాజాల్లో పుట్టి పెరుగుతూ, అవే భావాలతో కిక్కిరిసి వున్నవారే. శ్రమ చేసే మనిషికి, శ్రమ దోపిడీకి గురి అవుతున్నానని తెలిసే వరకూ, ఆ హృదయంలో ఏ విప్లవ భావ బీజమూ మొలకెత్తదు. అంటే, అడుగు కులాల వారు, ఆ కులాల్లో పుట్టినందుకే, తమ పుటకతోనే, విప్లవకారులుగా వుంటారనేది పెద్ద భ్రమ!

- రంగనాయకమ్మ
(ఇంకా వుంది) 
Andhra Jyothi News Paper Dated : 10/07/2012

No comments:

Post a Comment