Thursday, July 19, 2012

మొద్దుబారిన సమాజం--Namasete Telangana Sampadakiyam



అస్సాంలోని గువాహటిలో ఇటీవల టీనేజీ బాలికను ఓ మూక వెంటాడి వేధించిన విషాద ఘటనను సభ్య ప్రపంచం తీవ్రంగా నిరసించింది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా బలంగానే వ్యక్తమైంది. అయితే ఈ ఘటన సందర్భంగా, ఆ తరువాత భిన్నపక్షాలు వ్యవహరించిన తీరు అనేక నైతిక ప్రశ్నలకు తావిస్తున్నది. ఈ వార్తను సేకరించిన విలేకరి మొదలుకొని పోలీసులు, ముఖ్యమంత్రి, జాతీయ మహిళా కమిషన్ దర్యాప్తు బృందం మొదలైన వారంతా వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉన్నది. దుండగులు బాలికను వేధించడం మొదలుపెట్టినప్పుడు విలేకరి తమ సిబ్బందిని పిలిపించి చిత్రీకరింపచేసిండు. టీవీ చానెల్ ప్రసారం చేయడం వల్లనే ఈ ఘోరం ప్రపంచానికి తెలిసింది. తాము చిత్రీకరించడం వల్లనే దోషులను గుర్తించడం సాధ్యమైతున్నదని విలేకరి అంటున్నాడు. ఇంత వరకు పాత్రికేయ విధినిర్వహణలో తప్పు పట్టవలసిందేమీ లేదు. కానీ ఆ పాత్రికేయుడు ఒక మనిషిగా వ్యవహరించాడా అనేదే ఇక్కడ ప్రశ్న. అరగంట సేపు బాలికపై అనేక విధాలుగా రౌడీలు ఎగబడుతుంటే ఆపడానికి తన వంతు ప్రయత్నం చెయ్సాల్సింది. పోలీసులకు సమాచారం అందించాలె. అట్లా అని ఏదైనా ఘోరాన్ని చిత్రీకరించినందుకు తమకు ఎందుకు సమాచారం అందించ లేదని పోలీసులు విలేకరిని వేధించడం కూడా సమర్థనీయం కాదు. పాత్రికేయులే స్వయంగా కొన్ని నైతిక, మానవీయ విలువలు పాటించాలె. ఇట్లా మానవీయంగా వ్యవహరించిన ఉదంతాలు ఉన్నాయి. వియత్నాంపై అమెరికా అతి క్రూరంగా నాపామ్ బాంబులు కురిపిస్తున్నప్పుడు విలపిస్తూ పరుగెత్తుతున్న బాలికను హుయాన్ కాంగ్ ఉత్ ఫోటో తీశాడు. ఈయన ఫోటో వల్ల వియెత్నాంలో తమదేశం సాగిస్తున్న దారుణానికి అమెరికా ప్రజలే చలించి పోయి, యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. అయితే ఈ పాత్రికేయుడు ఫోటో తీయడంతో తన పని అయిపోయిందనుకోలేదు.

బాలికకు వైద్య సహాయం అందించాడు. సంక్షుభిత సూడాన్‌లో- తిండి, నీళ్ళు లేక బలహీనంగా పడి ఉన్న శిశువును తినడానికి ఒక పీతిరి గద్ద రావడాన్ని ఫోటోక్షిగాఫర్ కెవిన్ కార్టర్ గమనించాడు. ఆ గద్ద శిశువు దగ్గరికి రావడానికి ఇర వై నిమిషాలు పట్టిందట. కెమెరా సిద్ధంగా పెట్టుకున్న కార్టర్ ఫోటో తీసుకుని వెళ్లిపోయాడు. ఈ ఫోటో తీసినందుకు అతడికి 1994లో పులిట్జర్ బహుమతి వచ్చింది. అయితే ఆ బాలిక గతేమయిందని అడిగినప్పుడు ఏమో తెలువదు అన్నాడు. అంటే ఫోటో తీసిన తరువాత ఆమెను పట్టించుకోనే లేదు. కార్టర్ ప్రవర్తన తీవ్ర విమర్శలకు గురైంది. కార్టర్ కూడాఎంతో మనోవేదనను అనుభవించి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యమాలపై పోలీసులు విరుచుకుపడుతున్న సందర్భాలలో, యుద్ధారంగంలో వార్తలు సేకరిస్తున్న పాత్రికేయుల పరిస్థితి అడకత్తెరలో పోకముక్క తీరుగ ఉంటుంది. వృత్తి ధర్మం నిర్వర్తించడమంటే సాహసమే. ఉదాహరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై పోలీసుల దాడి సందర్భంగా విలేకరులు నిర్వహించిన పాత్ర ప్రశంసనీయమైనది, ఆదర్శనీయమైనది. అయితే అన్ని సందర్భాలలోనూ వృత్తి ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించి, మానవత్వాన్ని మరిచి పోవడం క్షమార్హం కాదు. ఇటువంటి సందర్భాలలో పోలీసులు పాత్రికేయులను ఇరికించాలని చూడడం కూడా తప్పే. గువాహటి సంఘటన తరువాత బాలికపై దాడికి రెచ్చగొట్టింది విలేకరే అని ఒక సామాజిక కార్యకర్త ఆరోపించడం గమనార్హం. ఇందులో నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి. అయితే దర్యాప్తు పూర్తి కాకముందే అస్సాం ముఖ్యమంత్రి బహిరంగంగా టీవీ చానెల్‌పై, విలేకరిపై విమర్శలు చేయడం పద్ధతి కాదు. టీవీ చానెల్ ఎడిటర్ రాజీనామా చేయవలసి వచ్చిందంటే తెర ముఖ్యమంత్రి ఒత్తిడి పనిచేసిందనే అర్థం చేసుకోవాలె. ఈ టీవీ చానెల్ ఒక మంత్రిది కావడం గమనార్హం.


మహిళలపై అత్యాచారం జరిగిందనగానే ఆ ఘటనపై స్పందించి ప్రాచుర్యం పొందాలనుకోవడం మరో వికృత పరిణామం. రాజకీయ నాయకులు ఇదే అదను అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఘటనను వాడుకుంటున్నారు. జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ సభ్యురాలు అలకా లాంబ బాధిత బాలికను (ముఖంపై ముసుగు కప్పినప్పటికీ) విలేకరుల సమావేశంలోకి తీసుకురావలసిన అవసరం ఏమొచ్చింది? ఆ సందర్భంలో బాలిక ఎంత మనోవేదనకు గురయి ఉంటుంది! పైగా అలకా లాంబ బాధితురాలి పేరు కూడా వెల్లడించింది. ముఖ్యమంత్రి కార్యాలయం బాలిక ఫోటోను బయటకు విడుదల చేసింది. దాడి దృశ్యాలను ప్రసారం చేసిన టీవీ చానెల్ కూడా ఆమె పేరును బయట పెట్టింది. సభ్యతగల ఈ మనుషులు రౌడీ మూకకు తీసిపోకుండా బాలికను వేధించారు. పోలీసులు దాడి సమాచారం అందగానే రాలేదు. వెంటనే వెళ్ళడానికి మేమేమైనా ఏటీఎం అనుకుంటున్నారా అని ఒక పోలీసు అధికారి వ్యాఖ్యానించాడు. ఇటువంటి దాడులు జరుగుతూనే ఉంటాయని, టీవీలు హడావుడి చేశాయని పోలీసుల స్పందన! నడివీధిలో ఇరవై మందికి పైగా టీనేజ్ బాలికను దాదాపు అరగంట సేపు నిర్భయంగా వెంటాడి వేధించడం ఎట్లా సాధ్యమైంది. పోలీసులు వచ్చి ఆమెను తరలిస్తున్న సమయంలో కూడా ఈ కీచకులు ఎగబడుతూనే ఉన్నారంటే వారెం త నిర్భయంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పాలకవర్గంలో భాగమైన వ్యాపార- రాజకీయ లాబీల అండ లేకుండా రౌడీ మూకలు మనుగడ సాగించలేవనేది తెలిసిందే. అంటే మొత్తం సమాజానికి సమాజమే మహిళలను గౌరవించే సభ్యతను, సంస్కారాన్ని కలిగి లేదు. అందుకే రౌడీలు నడి బజారులో బాలికపై వేటకుక్కల్లా ఎగబడగలిగారు. సమాజం కొన్ని సందర్భాలలో స్పందిస్తున్న తీరు మొత్తంగా నిరాశ కలిగిస్తున్న అంశం. స్పందన లు కోల్పోయిన సమాజాలు మరణ శయ్యపై ఉన్నట్టు లెక్క. ఆధునికానంతర యుగంలో మనుషులు మాయమైపోవడం, మానవీయతలు కరువవడం ఇప్పటి అసలు రుగ్మత. 
Namasete Telangana News Paper Dated : 19/07/2012 

No comments:

Post a Comment