Friday, July 13, 2012

దళితులు ఏం చెయ్యాలి? - కంచ ఐలయ్య

లక్షింపేట వంటి సంఘటనలను నివారించేందుకు భోపాల్ డిక్లరేషన్‌లో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిలో మొదటిది కుల హింసను, కుల అహింస ద్వారా ఆపలేమని గుర్తించడం, కుల హింసను ప్రతిఘటించి అవసరమైతే ప్రతి హింసను అమలుపర్చగల దళిత మిలిషియాలను గ్రామస్థాయిలో తయారుచెయ్యడం... పై కులాలకు భయం ద్వారా మానవత్వాన్ని నేర్పాల్సిందేకాని, మాటలు, కేసులు, రాజ్యంలోని సంస్థల ద్వారా మానవత్వాన్ని నేర్పలేమని దళితులపై దాడుల ఘటనలన్నీ చెబుతూనే ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా లక్షింపేటలోని దళితుల్ని తూర్పుకాపులు నరికి చంపడంపై రాష్ట్రం అట్టుడుకుతుంది. అక్కడి కొట్లాట భూమితో ముడివడివుంది. కారంచేడులో దళితుల్ని కమ్మలు చంపింది చెరువు నీటి సమస్యపై; చుండూరులో దళితుల్ని రెడ్లు చంపింది దళిత స్త్రీలపై తమ హక్కు చెక్కు చెదరకుండా ఉండాలనే భావనతో. ఈ అన్ని సందర్భాల్లో దళిత సంఘాలు చాలా పోరాటాలు చేశాయి. కారంచేడు సంఘటన రాష్ట్రంలోని పోరాటాల చరిత్రనే మలుపు తిప్పిందని మనందరికీ తెలుసు. ఈ ప్రతి పోరాటంలోనూ దళితుల్ని శూద్ర అగ్రకులాలు చంపాయి. శ్రీకాకుళంలో చంపినవారు బిసిలుగా రిజర్వేషన్లు అనుభవిస్తున్నవారు కావడం ఒక ప్రత్యేక చర్చనీయాంశం. బీసీలు కూడా దళితుల్ని ఇలానే చంపుతారు అనే చర్చ జరుగుతూనే ఉంది.

బిసిల, ఎస్సీల మధ్య కొట్లాట జరిగినా చంపబడేది దళితులే. ఇంతవరకు మన రాష్ట్ర చరిత్రలో గాని, దేశ చరిత్రలో గాని కులాల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు కింది కులాల వారు పై కులాల వారిని చంపిన దాఖలాలు లేవు. ఆయా కులాల సంఖ్యతో సంబంధం లేకుండా మెట్టు, మెట్టుగా ఉన్న పై, కింది కులాల మధ్య తగువొస్తే పై కులాల వారు కింది కులాల వారిని చంపగలుగుతున్నారు. ముఖ్యంగా దళితులు వారి సంఖ్య ఎంత ఉన్నా తమ పై కులం పై దాడిచేసి వారిని చంపింది చరిత్రలో కనిపించడం లేదు. వ్యక్తి స్థాయిలో ఇక్కడో, అక్కడో ఏ దళితుడైనా తనకంటే పై కులస్తుడిని చంపి ఉండవచ్చు గాని, కులంగా దాడిచేసి చంపిన ఘటనలు లేవనే చెప్పాలి. కుల దొంతర్లలో పై కులం కింది కులం వారిని ఎందుకు చంపగలుగుతుంది? కింద కులం పై కులం వారిని ఎందుకు చంపలేదు? ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది?

ఈ విధంగా పై కులస్తులు చంపగలగడం, కింది కులస్తులు చంపబడడం అనేది వారి శారీరక బలంపై మాత్రమే ఆధారపడిలేదు. సహజంగా శారీరక బలం దళితులలోనే ఎక్కువ. ఒకే గ్రామంలో వారు మిగతాకులాల కంటే తక్కువ అయినప్పటికీ, ఒకే గ్రామంలో బ్రాహ్మణులలోనో, కోమట్లలోనో లేదా గోదావరి జిల్లాల్లో రాజులతోనో, చాలా గ్రామాల్లో కమ్మలతోనో, రెడ్లతోనో పోల్చి చూస్తే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. అయినా అగ్రకులాల వారు చంపబడరు, కాని దళితులు మాత్రం చంపబడతారు. దీని వెనుక సామాజిక బలం, ఆ సామాజిక బలాన్ని రూపొందించే ఆధ్యాత్మిక బలం నిరంతరంగా, గ్రామ గ్రామానా పనిచేస్తూ ఉంటాయి.

హిందూ కుల వ్యవస్థ పై కులానికి మానసిక బలాన్ని, కింది కులానికి మానసిక బలహీనతను వ్యవస్థాగతంగా రూపొందించింది. ఈ అణిచివేతకు, కుల హత్యలకు రాజ్యం పరిష్కార మార్గాలను చూపుతుందని భావించాం. ప్రజాస్వామిక వ్యవస్థలో దళితులకు కొన్ని రక్షణ కవచాలు ఉన్న మాట వాస్తవమే. కాని పై కులస్తులు క్రింది కులస్తుల్ని చంపగలిగే సామాజిక వ్యవస్థను ప్రజాస్వామిక వ్యవస్థ కూడా మార్చలేకపోయింది. ఈ అంశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కుల అణిచివేత చరిత్ర ఒకే పద్ధతిలో ఉన్నది. మన రాష్ట్రంలోని పెద్ద ఘటనలను పరిశీలించినా, మహారాష్ట్రలోని ఖైర్లాంజి వంటి కేసులు చూసినా బీహార్‌లో దళితుల హత్యలను చూసినా ఈ నమూనా ఒక్క తీరుగానే ఉంటుంది.

రాజ్యం, పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థలు కూడా కులమయమైనవే కనుక వాటి ద్వారా పూర్తిస్థాయి వ్యవస్థాగత రక్షణ దళితులకు దొరకడం కష్ట సాధ్యం. ఆధ్యాత్మిక వ్యవస్థలో కనీస మార్పు కూడా లేనప్పుడు దొంతర్ల వారీ మానసిక ధైర్యం, మానసిక అధైర్యం యథా తథంగా కొనసాగుతున్నాయి. మానసిక ధైర్యం చంపగలుగుతుంది. మానసిక అధైర్యం చాలా సులభంగా చస్తుంది. ఈ స్థితి మారకుండా పై కులస్తులే చంపుతారు, కింద కులస్తులు చంపబడుతారు.

వారికి ఆస్తులు, చదువు, అధికారాన్ని అనుభవించే సత్తాకూడా దొంతర్ల వారీగానే ఉంటాయి. కుల విలువల్లో భాగంగా సమాజం కూడ చంపే వారిని గౌరవిస్తుంది. చచ్చిపోయే వారిని పట్టించుకోదు. ఈ విధంగా చంపే వారికి గౌరవం, చంపబడేవారికి అగౌరవం హిందూ ఆధ్యాత్మిక సిద్ధాంతంలో భాగం. ఇక్కడ దేవుడి పేరు 'నరసింహుడు' అని ఉంటుంది. అది చెడ్డపేరుగా చూడబడదు. ప్రతి పై కులస్తులూ తమ కింది కులస్తులకు 'నరసింహులే'. ఇది కుల తాత్వికతలో భాగం. రాజ్యాంగబద్ధ వ్యవస్థ చనిపోయిన వారికి కొంత డబ్బు, చంపిన వారికి కోర్టు శిక్ష విధిస్తామనే ప్రకటనలు చేస్తుంది. ఒక్కొక్కసారి ఆ పనులు చేస్తుంది. ఒక్కొక్కసారి చెయ్యదు.

కానీ కుల హత్యలకు పరిష్కారం రాజ్య రెస్పాన్స్‌లో లేదు. ఇటువంటి సంఘటనలను సంఘ స్థాయిలో ఆపేందుకు భోపాల్ డిక్లరేషన్‌లో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిలో మొదటిది కుల హింసను, కుల అహింస ద్వారా ఆపలేమని గుర్తించడం, కుల హింసను ప్రతిఘటించి అవసరమైతే ప్రతి హింసను అమలుపర్చగల దళిత మిలిషియాలను గ్రామస్థాయిలో తయారుచెయ్యడం. గ్రామస్థాయిలో దళితులు తక్కువ తిండి తింటారు, ఎక్కువ పనిచేస్తారు. తిండి వనరు పెరిగిన కొద్ది వారి శారీరక శక్తి ఇంకా పెరుగుతుంది. ఇక్కడే ఆధునిక రాజ్యం వారికి కుటుంబ స్థాయిలో, బడిస్థాయిలో తిండి వనరును పెంచాలి. వారి శారీరక, మానసిక శక్తి ఎంత పెరిగితే అంత సమాజానికి మంచిది.

సాధారణంగా దళితులు ప్రకృతి శక్తులను లొంగదీసుకునేప్పుడు చూపిన ధైర్యసాహసాల్ని తమ కంటే పై కులాల వారు తమ మీద దాడి చేస్తున్నప్పుడో, తమను హింసిస్తున్నప్పుడో చూపరు. క్రూర మృగాల్ని చంపగలరు కాని, అగ్రకుల శత్రువును చంపలేరు. కలరా వ్యాధితో చనిపోయిన శవాల్ని పూడ్చిపెట్టి ఆ కలరా వ్యాధిని ధైర్యంగా ఎదుర్కోగలరు కాని కులం అనే హంతక వ్యాధిని ఎదుర్కోవడానికి విపరీతంగా భయపడుతారు. ఒక వేళ గ్రామ స్థాయిలో దళిత వాడల ఆత్మ స్థైర్యాన్ని పెంచడానికి దళిత మిలిషియాలను తయారు చేసినా అవి వాటిపై కుల హింసను ఎదుర్కోవడంలో సమస్యలుంటాయి. కానీ తిడితే తిడుతారు, కొడితే కొడతారు, చంపితే మనల్ని కూడా చంపుతారు అనే భయం దొంతర్ల వారీ కుల వ్యవస్థలో పై కులాల్లో ఏర్పడకుండా ఇవి ఆగవు.

పై కులాలకు భయం ద్వారా మానవత్వాన్ని నేర్పాల్సిందేకాని, మాటలు, కేసులు, రాజ్యంలోని సంస్థల ద్వారా మానవత్వాన్ని నేర్పలేమని యీ ఘటనలన్నీ చెబుతూనే ఉన్నాయి. పై కులాలకు దొంతర్ల వారీగా కింది కులాలను మనం తిట్టొచ్చు, కొట్టొచ్చు చంపవచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చింది హిందూ దేవుళ్ళు. ఈ దేవుళ్ళను మించిన దేవుడిని దళితుల మధ్య ప్రవేశ పెట్టాలి. దేవుళ్ళే 'నరసింహులు'గా ఉన్నప్పుడు వారిని అనుసరించే మానవులు నరరూప దయ్యాలౌతారు. మానవ సమానత్వాన్ని రూపొందించే దేవుడు ఇందుకు భిన్నంగా ఉంటాడు. దళితుల్లో ఇప్పుడున్న ఆలోచనా సరళిలో దేవుడు మా పక్షాన ఉన్నాడనే ధైర్యం అసలే లేదు.

మానవులందరూ సమానమనే దేవున్ని నమ్ముకొని, బానిసలు, శ్రామికులు, వ్యాధిగ్రస్తులు, అణిచివేతలకు గురయ్యే వారు ఎన్నో పోరాటాలు, యుద్ధాలు చేశారు. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లో మానవ సంబంధాల్ని బాగా మార్చివేశారు. భారతదేశంలో దళితుల జీవితంలో మాత్రం ఆ మౌలిక ధైర్యం ఇంకా ఒక రూపం తీసుకోలేదు. దళితులకు భూమి కావాలి, ఇండ్లు కావాలి, చదువు కావాలి. కాని వీటన్నిటిని తమ చుట్టూ ఉన్న వనరుల నుంచి రూపొందించుకోవాలి. ఇవన్నీ వారి కష్టంతో వాళ్లు సంపాదించుకునేవే. వాటిని సంపాదించుకునే శ్రమ శక్తి మిగతా వారి కంటే ఎక్కువే ఉంది. కాని తమ దేవుళ్ళు వారికా హక్కు లేదంటున్నారు. శ్రమ చేసేవారికి శ్రమ ఫలితం దక్కడానికి వీలులేదనే వాడు దేవుడు కాదు, దయ్యం. అంటే వారి పాలిటి దయ్యాలు, పై కుల మెట్లకు దేవుళ్ళయ్యారు. మూడు వేళ ఏండ్ల నుంచి ఈ 'దైవ శాసనం' ఉనికిలో ఉంది. నిజానికి అది 'దయ్య శాసనం'. అది వారికి అధైర్యాన్ని, మిగతావారికి, మెట్లు, మెట్లుగా దైర్యాన్ని పెంచుకుంటూ పోయింది.

ఇప్పుడు వారికా ధైర్యాన్ని పూర్తిగా నూరిపోసే దేవుడు కావాలి. ఆర్యులు భారతదేశం వచ్చి కుల వ్యవస్థనూ, అంటరానితనాన్ని రూపొందించాక దొంతర్ల వారీ బానిసత్వ భావజాలం భారతీయుల నరనరాన జీర్ణించుకున్న ఫలితమే ఈ పై కులాల వారి చంపుళ్ళు, కింది కులాలవారి చావులు. ఇదొక మానసిక ఆధిపత్యం, బానిసత్వం శరీర జవసత్వాల్లోకి, తద్వారా, సమాజ జవసత్వాల్లోకి నిండుగా ఎక్కింది. ఇదే లక్షణం రాజ్యానికి కూడా ఉంటుంది. రాజ్యం ఈ మనుషుల చేతుల్లోనే ఉంది కదా!

ఆర్యులు మన దేశం వచ్చి హంతకులని దేవుళ్ళుగా, ఈ హత్యల్లో చనిపోయేవారిని రాక్షసులుగా కట్టుకథలన్నీ రాయకముందే ఇజ్రాయిల్, ఈజిప్టులకు మధ్య జరిగిన చారిత్రక సంఘటన కథ ఒకటుంది. ఈజిప్టులో ఫరాహో అనే రాజు ఇజ్రాయిలీ జ్యూలు అందర్నీ తన బానిసల్ని చేసుకుంటాడు. మోజెస్ అనే బానిస గొర్రెల కాపరికి ఏ ఆకారం లేని దేవుడు ఇజ్రాయిలీ బానిసల్ని విముక్తి చేసే మార్గం చూపిస్తాడు. మోజెస్‌తో పాటు అతని తమ్ముడు ఆరన్‌లకు బానిస విముక్తి విద్యలన్నీ నేర్పుతాడు, దేవుడు. అందులో ముఖ్యంగా ఫరాహోతో వాళ్ళిద్దరూ ఈజిప్షియన్ భాష మాట్లాడగలగడం.

మోజెస్, ఆరన్ ఒకరోజు వెళ్ళి దేవుడు జ్యూలు అందర్నీ విడిచిపెట్టమని చెప్పాడు. అలా చెయ్యని ఎడల దేవుడు నీ రాజ్యాన్ని నానా అనర్థాలకు గురిచేస్తాన ని చెప్పాడు అని చెబుతారు. ఫరాహో వారిని లెక్కచేయడు. దేవుడు ఇజ్రాయిల్ని బానిసత్వం నుంచి విముక్తి చెయ్యనందుకు ఈజిప్టులోని నీటినంతా రక్తంగా మార్చుతాడు దేవుడు. అయినా ఫరాహో లెక్కచెయ్యడు. మొత్తం ఈజిప్టు కప్పలమయం చేస్తాడు. రాజు ఇంటి నిండా, పడక గది నిండా కప్పలు ఉంటాయి. ఐనా అతను లెక్క చెయ్యడు.

అయినా ఈజిప్టునంతా దోమలమయం, ఈగలమయం చేస్తాడు ఐనా అతడు లెక్కచెయ్యడు. చివరికి దేవుడు ఇజ్రాయిల్ బానిసల్ని 'పాస్ఓవర్' చేస్తూ (వారిని మినహాయిస్తూ) ఈజిప్టులో కొత్తగా పుట్టిన మనిషి, జంతువుల పసికందులను చంపిస్తాడు. అప్పుడు ఫరాహో భయపడి ఇజ్రాయిలీ బానిసల్ని వారి పశువులతో పాటు విడుదల చేస్తాడు. ఇలా విడిపించబడ్డ ఇజ్రాయిలీ ప్రజల ఎక్సోడస్ మొదలౌతుంది. అంటే విముక్తి చెందిన ఇజ్రాయిలీ ప్రజలు తిరిగి తమ దేశం వస్తారు.

పై కథ ఏం చెబుతుంది? అక్కడ దేవుడు దుర్మార్గపు రాజును, బానిస యజమానులపై హింస ప్రయోగించి బానిసలను విడిపించాడు. ఈ దేశపు హిందూ ఆధ్యాత్మిక చరిత్రలో ఇటువంటి కథ ఒక్కటి కూడా లేదు. మనుషుల్ని (దళితుల్ని, దళితేతరుల్ని) బానిసలుగా నిరంతరంగా ఉంచడం కోసం దేవుళ్ళు హింస చేస్తారు. వారిపై ప్రతి హింస చెయ్యగలిగే అంతకన్నా పెద్ద దేవుడ్ని ఇక్కడి చరిత్ర పుట్టనివ్వలేదు. ఇక్కడి కుల వ్యవస్థ పుట్టనివ్వదు.

లక్షింపేటలు, కారంచేడులు, చుండూరులు, ఖైర్లాంజీలు ఇక్కడ జరక్కుండా ఉండాలంటే ఇక్కడో పెద్ద దేవుడు పుట్టాలి. అతను కొంత కాలమైనా ప్రతిహింస చెయ్యాలి. మానవ చరిత్రలో దేవుడు ఆపినన్ని హత్యల్ని రాజ్యం ఆపలేకపోయింది. మానవుల మధ్య ప్రతి పని చేయడంలో, చేయకుండా ఉండడంలో దైవ భీతి పనిచేస్తుంది. ఇక్కడ అగ్రకుల హంతకులకు ఆ భీతి ఎన్నడూ లేదు. వాళ్ళకు వాళ్ళ దేవుళ్లు కింది వాళ్ళను చంపటమే న్యాయమని చెప్పారు. ఈ దుర్మార్గులకు వాళ్ళు నమ్ముతున్నది దేవుడ్ని కాదు, దయ్యాల్ని అని ఆధ్యాత్మిక విలువల్ని తల్లకిందులుగా చెప్పి నమ్మించగలగాలి. అలా వారిని నమ్మించడం కూడా చాలా కష్టమైన పని.

అలాగని చంపేవారికి, చంపబడేవారికి రాజ్యం ఏం చెయ్యాలి అనే అంశాన్ని చర్చింకుండా ఉండలేము. కులవ్యవస్థనూ, అంటరానితనాన్ని రూపుమాపేందుకు నేపాల్ రాజ్యం చూపిన చొరవ కూడా ఇక్కడి రాజ్యం చూపడం లేదు. అక్కడి కమ్యూనిస్టులు, మావోయిస్టుల్లో సీతారాం యేచూరిలు, గణపతులు, రామకృష్ణలు కాక ప్రచండులు పుట్టుకొచ్చారు. ఈ రాజ్యాన్ని మార్చాలన్నా ఇక్కడ చాలామంది ప్రచండులు పుట్టాల్సి ఉంది. దళిత కులాల నుంచి హత్యకు గురై చనిపోయినవారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇది కూడా సరిపోదు. వారి పిల్లలకు ఇంగ్లీషు మీడియం రెసిడెన్షియల్ స్కూల్లో విద్య, కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక మంచి ఉద్యోగం తప్పకుండా ఇవ్వాలి. ఇవి ఏవీ నేను పైన చెప్పిన దేవుడి పనికి సరితూగవు.

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత
Andhra Jyothi News Paper Dated : 13/07/2012 

No comments:

Post a Comment