Monday, October 29, 2012

ధిక్కార పతాక కలేకూరి----డా. పి. కేశవకుమార్


ధిక్కార పతాక కలేకూరి

- డా. పి. కేశవకుమార్

అంబేద్కర్ గురించి రాసినా, ప్రజాఉద్యమాల గురించి రాసినా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రాసినా, అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న విషయాల గురించి రాసినా, ఆఫ్రికన్ కవుల గురించి రాసినా, అంతటా దళిత దృక్కోణమే కనిపిస్తుంది. తెలుగు సమాజంలో అంతగా అంబేద్కర్‌ని చదివి అర్థం చేసుకుని సగటు దళితుడికర్థమయ్యే రీతిలో చెప్పిన ఏకైక మేధావి కలేకూరి ప్రసాదనే చెప్పుకోవాలి. 

ధిక్కార కవి, ప్రజాపాటల రచయిత, దళిత విప్లవ ఉద్యమకారుడు, సామాజిక పత్రికల సంపాదకుడు, అనువాదకుడు, రాజకీయ విశ్లేషకుడు, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు, మావోయిస్టు, అంబేద్కరిస్టు, అరాచకుడు, ఆప్తవాక్యం, స్నేహకరచాలనం, ఉద్యమ యువక, మనకాలం వీరుడు కలేకూరి ప్రసాద్. విప్లవోద్యమం నుంచి దళిత ఉద్యమం దాకా- మైనారిటీ, దండోరా, తెలంగాణ, ఆదివాసీ, స్త్రీ- అస్తిత్వ ఉద్యమాలన్నింటినీ మనస్ఫూర్తిగా కౌగిలించుకొని కొండంత అండగా నిలిచిన నేటి తరం ఉద్యమకారుడు, రచయిత, ప్రజల మనిషి కలేకూరి. హిందూ మతోన్మాద, సామ్రాజ్యవాద శక్తులకి వ్యతిరేకంగా బిగించిన ఉక్కు పడికిలి కలూకూరి.

కారంచేడు దళితపోరాటం నుంచి నేటి లక్షింపేట పోరాటం దాకా క్రియాశీలకంగా అన్ని దళిత ఉద్యమ పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడమేగాక, అన్ని సాహితీ ప్రక్రియల్లో తనదైన ముద్రవేస్తూ ఒక నూతన మానవీయ సమాజం కోసం స్వాప్నికుడిగా బతుకుతున్నవాడు కలేకూరి. కలేకూరి ప్రసాద్ జీవితంలో ఎంత అరాచకంగా ఉన్నట్టు కనిపిస్తాడో అదే సాహిత్యంలోనూ, తన రచనల్లోనూ ఎంతో నిక్కచ్చిగా రాజకీయ నిబద్ధతతో ఉంటాడు. గాలివాటంగా ఎప్పుడూ ఉండడు. కెరీరిస్టుగా ఉండటమంటే అసహ్యం. భద్రమైన బతుకుల్లో ఒక్కక్షణం కూడా ఉంటానికి ఇష్టపడడు. ఆత్మగౌరవం అనే ఆయుధాన్ని ఎప్పుడూ తన వెంట బెట్టుకుని తిరిగే సంచార సాహితీ జీవి.

దళితుడంటే, ఏ సంకోచాలూ భయాలూ లేకుండా, ఊరి మధ్య నిట్టనిలువుగా నుంచొన్న అంబేద్కర్ విగ్రహంలా ఉండాలనుకుంటాడు. దళితుడంటే సృజనాత్మకతా, సాహసికత సొంత హక్కుగా ఉండే వాడనుకుంటాడు. కులవ్యవస్థ, హిందూ మతమూ, మనుధర్మంగా మనపై రుద్దిన అమానవీయత, అణచివేత, దోపిడీ మీద తిరుగుబాటు చేయడమే దళితత్వంగా కలేకూరి నమ్ముతాడు. అది దళితుల హక్కుగా కూడా చెబుతాడు. తన అన్ని రచనల్లోనూ ఈ ధిక్కారమే కేంద్రంగా ఉంటుంది. దళిత జీవనసాంద్రతనీ, గాయపడ్డ గుండెల్లో ఉండే భావోద్రేకాల్ని, ఎగిసిపడే ఆవేశాల్ని, పిడికెడు ఆత్మగౌరవం కోసమంటూ అక్షరాల్లో ఆవిష్కరించే పనిలో మునిగిపోయిన కవి కలేకూరి ప్రసాదు. 'అవమానం ఈదేశంలో విరగపండే సంపదని' గుర్తించిన కలేకూరి ఈ అమానవీయమైన పంటను తగలబెట్టేందుకూ కావాల్సినంత పదసామాగ్రీని పోగుచేసి, కవిత్వంగా, కథలుగా, పాటలగా, వ్యాసాలుగా చేసి ఆ పదాల చేత యుద్ధ కవాతు చేయించాడు.

రాయడం కోసం రాయలా. ఏం రాసినా, చేసినా ఓ మహోన్నత ఉద్యమంకోసమే. ఈ ఉద్యమాన్ని దళిత/అణగారిన జన విముక్తి కోసంగా, జీవితం, సాహిత్య సృజన, ఉద్యమంల మధ్య గీతలు చెరిపేసే సాహిత్యాన్ని జీవితమంత గొప్పగా, జీవితాన్ని సాహిత్యంగా చేసిన గొప్ప రొమాంటిక్ కలేకూరి. దళిత కవుల్లో విప్లవ, అస్తిత్వవాద కవుల్లో బలమైన గొంతు కలేకూరిది. తన రచనల్ని పోగుచేసి పుస్తకాలేసుకోకపోవడం వల్ల యూనివర్శిటీలకీ, పరిశోధకులకీ చేరకపోవచ్చేమోగానీ, ఉద్యమ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కలేకూరిది గుండె సంబంధం. జనం మధ్య నాటుకుపోయినోడిని ఎలా పరిచయం చెయ్యాలన్నది పెద్ద సమస్యే. కలేకూరి రచనలు ఏ కొలమానాలతో చూడాలన్నది మరో సవాలు.

కలేకూరి ప్రసాద్ రచనలన్నీ కవిత్వంతో నిండిపోయింటాయి. తెలుగు సాహిత్యంలో కవిగా ఎన్నో ప్రత్యేకతలున్నవాడు. చెప్పే విషయాన్ని స్పష్టంగా సూటిగా, గుండెలో గుచ్చేలా చెబుతాడు. మనకి తెలిసిన పదాల్నే ఎలక్ట్రిఫై చేసి జనం మీదకి వదులుతాడు. కవిత్వంలో యుద్ధానికే సై అంటాడు. కాంప్రమైజులుండవు. కన్నీళ్లు వుండవు. జాలిచూపుల కోసం వెతుకులాట ఉండదు. ప్రత్యామ్నాయ పురాణ ప్రతీకల మధ్య దాక్కోవటం ఉండదు. అంతా వర్తమానంలోనే పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తి, చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరి వ్యాపిస్తానంటాడు. జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తానంటాడు.

సామాన్య జనానికి కలేకూరి ప్రసాద్ పేరు తెలియక పోవచ్చేమోగానీ, తను రాసిన పాటలన్నీ తెలుసు. వరకట్న హత్యల మీద రాసిన 'కర్మభూమిలో పూసిన ఓ పువ్వా' రైతుల ఆత్మహత్యల మీద రాసిన 'భూమికి పచ్చని రంగేసినట్టు' ఇవి ప్రజల్లో పాపులర్ అయ్యాకే శ్రీరాములయ్య సినిమాలో పాటలయ్యాయి. అదే విధంగా జయం మనదేరా సినిమాలో 'చిన్న చిన్న ఆశలే చిందులేయగా'. 'కుమిలిపోయి, నలిగిపోయినా / చుండూరు గుండె గాయం. దళితా... సాగుతున్న సైనిక శపథం... ఆవేదనంతా పోరాటసైగలై ఊరూరా చుండూరు మండుతుందిలె / రక్తధారలె... ఉదయతారలై వికసించులె ఆత్మగౌవరం... దళితా' అన్నపాట ఎప్పటికీ దళితపోరాట పాటే.

చర్చిలో పాడుకునే క్రైస్తవ పాట బాణిలో ఈ పాట దళితులకి మరింత దగ్గరయింది. 'పల్లెపల్లెనా దళిత కోయిలా / బతుకుపాట పాడుచుండగా / గుండె గుండెన పోరు పుట్టగా / బతుకులోన పొద్దుపొడిచి వెలుగునిండగా / ఆహా సాగే పేదోళ్ల జాతరా / ఓహో కూలీ గుండెల్లో పండగా... ఇదో దళిత మార్చింగ్ సాంగ్.

కలేకూరి కవిత్వం, పాట వొక ఎత్తయితే, తను చేసిన అనువాదాలు తెలుగు మేథో లోకానికి మరింత దగ్గరికి చేర్చినవి. తను ఎంచుకున్న అనువాదాలన్నీ, ఎంతో సామాజిక ప్రయోజనమున్నవే. మనల్ని ఆలోచింపచేసేవే. కలేకూరి చేసిన అనువాదాల్లో స్వామిధర్మ తీర్థ రాసిన 'హిందూ సామ్రాజ్యవాదం' (1998) (History of Hindu Imperialism) అరుంధతీరాయ్ రాసిన 'ఊహలు సైతం అంతమయ్యేవేళ' (1998) (1998) (End of Imagination)కిశోర్ కుమార్ కాళే ఆత్మకథ, 'ఎదురీత' (Against All Odds) యూదులపైన జరుగుతున్న నాజీ దురాగతాలను ప్రిమొలెవీ రాసిన ఖైదీనెంబర్ 17777 (2003) ఈ రచనలన్నీ జీవితంపైన ఆశని పెంచేవి. బతుకు పోరుపైన విశ్వాసం సడలనివ్వనివి. వీటితో పాటుగా అనేక ప్రముఖుల వ్యాసాలని, వందనాశివ, ఉత్సాపట్నాయ క్, కృష్ణకుమార్, సోనాల్కర్‌ల చిన్నవ్యాసాల్ని, గొప్పరచయితలైన మహాశ్వేతాదేవి, బషీర్ కథల్ని కొన్నింటిని అనువాదం చేసేడు. ఈ అనువాదాలన్నీ హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ చొరవతో తన అభిరుచికొద్దీ చేసినవి.

25 అక్టోబర్ 1964న విజయవాడ పక్కనున్న కంచికచర్లలో పుట్టిన కలేకూరికి యాభయ్యేళ్లు. 1987లో పీపుల్స్‌వార్ పార్టీ నుండి బయటకొచ్చాక దళిత/సాహిత్య వుద్యమాలన్నింటిలోనూ తనదైన గొంతుకతో నిలబడ్డాడు. 1994లో నందిగామ నియోజకవర్గం నుండి బిఎస్‌పి నుంచి పోటీచేసి ఓడిపోయాడు. తర్వాత హైద్రాబాద్ కేంద్రంగా దళిత/సాహిత్య ఉద్యమాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. సత్యమూర్తి సారథ్యంలో నడిచిన ఏకలవ్య పత్రికకి తనవంతు సహకారాన్నందించాడు. సాక్షి ఎన్‌జివో నడిపిన పత్రికను కొన్నాళ్లు నడిపాడు. దళితులపై జరుగుతున్న అత్యాచారాలపై పెద్ద చార్జిషీటుని పుస్తకంగా తీసుకొచ్చాడు. ప్రస్తుతం 'బహుజన కెరటాలు' పత్రికకు గౌరవ సంపాదకులుగా వున్నాడు. ఈ పత్రికకు శ్వాస, డైరెక్షన్ కలేకూరే. గత పదేళ్లుగా కలేకూరి అనేక విషయాలపై రాసిన వ్యాసాలన్నీ ఇందులోనే అచ్చయ్యాయి.

ఈ సంకలనంలోని వ్యాసాలు అంబేద్కర్ గురించి రాసినా, ప్రజాఉద్యమాల గురించి రాసినా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రాసినా, అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న విషయాల గురించి రాసినా, ఆఫ్రికన్ కవుల గురించి రాసినా, అంతటా దళిత దృక్కోణమే కనిపిస్తుంది. ఈ వ్యాసాలు రచయిత అవగాహనా, జ్ఞానపరిధినీ, అణచివేతకూ, అవమానాలకీ గురవుతున్న ప్రజానీకం విముక్తికోసం, వాళ్ళను తన రచనల ద్వారా చైతన్యపరచాలన్న తపన బలంగా కనిపిస్తుంది. అనేక విషయాలపైన అవగాహనతోబాటు, అర్థవంతంగానూ పాఠకుడి గుండెకి తగిలేలా ఎలా చెప్పాలో అలాగే చెప్పేడు. సిద్ధాంత గాంభీర్యం కనిపించదు. జ్ఞానప్రదర్శన కనిపించదు. గాఢమైన భావాన్ని, ఆవేశాన్ని చిన్నచిన్న మాటల్లో, చిక్కనైన భావుకతతో చెబుతాడు కలేకూరి.

ఈ సంకలంలోని వ్యాసాలను గమనించినట్టయితే ఎక్కువ భాగం అంబేద్కర్ జీవితం గురించి, ఆయన రచనల గురించి విశ్లేషణాత్మక వివరణలతోబాటు సమకాలీన సమాజాకి ఉద్యమాలు, మరీ ముఖ్యంగా దళిత ఉద్యమాలు అంబేద్కరిజాన్ని ఎలా అన్వయించుకోవాలో సూటిగా, సృజనాత్మకంగా చెప్పడం జరిగింది. తెలుగు సమాజంలో అంతగా అంబేద్కర్‌ని చదివి అర్థం చేసుకుని సగటు దళితుడికి అర్థమయ్యే రీతిలో చెప్పిన ఏకైక మేధావి కలేకూరి ప్రసాదనే చెప్పుకోవాలి. అంబేద్కరంటే ఒక సంపూర్ణ సామాజిక పరివర్తనను ప్రతిపాదించి ఆచరించిన విప్లవకారుడంటారు.

దళిత ప్రజానీకాన్ని తన రచనల ద్వారా చైతన్యపరుస్తూ, దళిత ఉద్యమ నిర్మాణాల్లో ప్రధానపాత్ర వహిస్తూ, దళిత ఉద్యమతీరు తెన్నులపైన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఎటువంటి సంకోచాలు లేకుండా ప్రకటించినవాడు కలేకూరి. భూమికోసం, అత్యాచారాల నిరోధం కోసం, గౌరవప్రదమైన జీవితం కోసం వనరులపైన, రాజ్యాధికారంలోనూ వాటా సాధించడం కోసం ఒక సమగ్ర దళిత ఉద్యమం రూపొందలేదంటాడు. సమగ్ర వ్యూహం మాట బుద్ధుడెరుగు, కనీసం పది సంవత్సరాలకు ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా తయారుచేసుకోలేని దయనీయస్థితిలో ఈనాడు దళిత ఉద్యమముందని వాపోతాడు. మనం విజయాలనెన్నైనా చెప్పుకోవచ్చు. కానీ లోపాలను గుర్తించి సవరించకపోతే ఏ ఉద్యమమైనా మరణిస్తుందని హెచ్చరిక కూడా చేస్తాడు.

ఆయన మాటల్లోనే, మనం చేయాల్సిందల్లా రాయడమే. బాగారాయడం. వాళ్ళ ప్రమాణాల్లో, వాళ్ళ ఆమోదం కోసం కాదు. పువ్వులు వికసించినట్లు, నవ్వులు రాలినప్పుడు గుండెలు మండినట్లు, గట్లు తవ్వేటప్పుడు కందిమోడు గుచ్చుకుంటే గుండెలు కలుక్కుమన్నట్లు అప్పటిదాకా కళకళలాడిన పల్లెపల్లెంతా స్మశానమై, పీనుగుల పెంటగా తయారైతే కోట్ల పిడికిళ్ళు ఒక్కసారిగా బిగుసుకొని ఒక బ్రహ్మాండమైన మెరుపు మెరిసినట్లు, మన భాషలో మనం రాయాలి. మన ప్రమాణాలతో మనం రాయాలి.

కొత్త సూర్యుడిని చూడలేని వాళ్ళు కళ్ళు మూసుకుంటే మూసుకోనీ, వెన్నెల నవ్వితే వళ్ళు మండిపోయే వాళ్ళు మాడి మసైపోనీ, మనం చేయాల్సిందల్లా బతుకే ఎడతెగని పోరాటమై పోయిన మన బతుకు మనం బతుకుతున్నంత సహజంగా రాయడమే. పల్లెపల్లెనా దళిత కోయిల పాట పాడినట్లు, గుండె గుండెనా పోరు మంటలు రాజుకున్నట్లు, జాతర జాతరగా దళిత సమూహాలు ఈ గడ్డ గుండెల మీదుగా ఊరేగింపై నడిచి పోతున్నట్లుగా మనం రాయాలి. మనది ఓడిపోయిన మానవుల తుది విజయగీతం. ఇది దళితయుగం. దళితసాహితీయుగమనీ పిడికెడు ఆత్మగౌరవంతో వెయ్యిగొంతుకలతో నినదించిన ఓ ధిక్కార పతాకమా నీకు సలామ్‌లు.

- డా. పి. కేశవకుమార్
(కలేకూరి ప్రసాద్ 50వ జన్మదినోత్సవం సందర్భంగా 'బహుజన కెరటాలు' ప్రచురించిన కలేకూరి రచనల సంకలనం 'పిడికెడు ఆత్మగౌరవం కోసం' ముందుమాటలోని కొన్ని భాగాలు)

Andhra Jyothi News Paper Dated : 29/10/2012 

No comments:

Post a Comment