Friday, December 14, 2012

ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌పై పాలకపార్టీల 'నయవంచన' ఎంవిఎస్‌ శర్మ


  Thu, 13 Dec 2012, IST  

  • ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని కోరుతూ ప్రజా ఉద్యమాలు జరిగాయి. కెవిపిఎస్‌ నడిపిన ఉద్యమం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు, ప్రజా సమీకరణలు ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి. అటు టిడిపిగానీ, ఇటు కాంగ్రెస్‌ కానీ సబ్‌ప్లాన్‌ అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఈ ఆందోళనల అవసరమే ఉండేదిగాదు. రూ.30,000 కోట్ల నిధులు మళ్లింపు జరిగి ఉండేది కాదు. ఎస్సీ, ఎస్టీలు ఇప్పుడున్న దయనీయ పరిస్థితిలో ఉండేవారూ కాదు. ప్రజా ఉద్యమాల ఒత్తిడికి దిగొచ్చి ప్రభుత్వం ఏదోవిధంగా స్పందించక తప్పలేదు.
''ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీలకు ఎవరైనా మేలు చేశారంటే అది ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. ఎప్పటికీ ఎస్సీ, ఎస్టీలు మాతోనే ఉంటారు.'' గ్రామీణాభివృద్ధి మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ డిసెంబర్‌ 11న శాసనమండలిలో బల్లగుద్ది మరీ చెప్పిన మాటలివి.
''ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి మేం అంకిత భావంతో పనిచేస్తున్నాం గనుకనే దేశంలోనే మొట్టమొదటిగా ఇటువంటి బిల్లు తెచ్చాం. దేశానికే ఆదర్శప్రాయంగా మనం ఉన్నాం. మా చిత్తశుద్ధిని శంకించకండి.'' ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అదే రోజున అదే సభలో చేసిన ప్రసంగంలో భాగం ఇది.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లు డిసెంబర్‌ 11న శాసనమండలిలో కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. గవర్నర్‌ ఆమోదముద్ర పడితే ఇది చట్టం అయినట్టే. ఈ చట్టంతో పదేళ్లలో సామాజిక సమానత్వాన్ని, సమతుల్యతను సాధించేయబోతున్నామని కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పలు పోతోంది. ఆ ఘనత అంతా తమకే చెందాలని, ఇంకెవ్వరికీ దక్కరాదని వాదిస్తోంది. ఆ పార్టీ నాయకులు, మంత్రులు వాదిస్తున్నట్టు ఆ చట్టం ద్వారా అంత మేలు ఒనగూరితే అభ్యంతరమేముంది? కానీ బిల్లులోని కొన్ని క్లాజులను చూస్తే ఈ బిల్లు వల్ల ఎస్సీ, ఎస్టీలకు ఒరిగేదేముంది? అన్న సందేహం కలుగుతుంది. ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పిడిఎఫ్‌) తరపున ముఖ్యమైన సవరణలను ఏడింటిని ప్రతిపాదించాము. ఆ సవరణలను ప్రవేశపెట్టడానికి సైతం అధికార పక్షం అంగీకరించలేదు. బిల్లు ఉద్దేశాలను, లక్ష్యాలను బలోపేతం చేసే ఈ సవరణలపై ముఖ్యమంత్రితో సహా ఎవరూ స్పందించలేదు. ఈ అధికారపక్షం తీరు చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధిపై కచ్చితంగా అనుమానం కలుగుతుంది.
సబ్‌ప్లాన్‌ భావన 1980 నుంచీ ముందుకొచ్చింది. జనాభాలో ఎస్సీ, ఎస్టీలు ఎంత శాతం ఉన్నారో, అంత శాతం నిధులను ప్రభుత్వం వారికి కేటాయించి వారి అభివృద్ధి కోసం ఖర్చు చేయాలన్నది సబ్‌ప్లాన్‌ ఉద్దేశం. అయితే ఈ లక్ష్యం ఏమాత్రమూ నెరవేరలేదని ప్రభుత్వమే అంగీకరిస్తున్నది. ఈ సంవత్సరం ఫిబ్రవరి - మార్చి నెలల్లో జరిగిన బడ్జెట్‌ సమావేశాలలో శాసనమండలిలో సబ్‌ప్లాన్‌పై రెండురోజుల పాటు చర్చ జరిగింది. ఆ చర్చలో కాంగ్రెస్‌, తెలుగుదేశం 'సబ్‌ప్లాన్‌ అమలు జరగకపోవడానికి కారణం మీరే అంటే ... కాదు మీరే'' అని పరస్పరం నిందించుకున్నాయి. సబ్‌ప్లాన్‌పై ప్రణాళికా సంఘం మార్గదర్శకాలు జారీచేసి 32 సంవత్సరాలైంది. ఈ కాలంలో తెలుగుదేశం 17 సంవత్సరాలు, కాంగ్రెస్‌ 15 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. సబ్‌ప్లాన్‌ అమలు పట్ల ఈ రెండుపార్టీలూ శ్రద్ధ పెట్టలేదు. ఫలితంగా రూ.30,000 కోట్లకు పైగా సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చు అవకుండా మురిగిపోయాయి లేదా ఇతర పద్దులకు మళ్లించబడ్డాయి.
పున్నయ్య కమిషన్‌ మేమే వేశామని, సిఫార్సులను ఆమోదించామని టిడిపి చెప్పుకుంటూ ఉంటే కోనేరు రంగారావు కమిషన్‌ను నియమించి సిఫార్సులను ఆమోదించినది మేమని కాంగ్రెస్‌ చెప్పుకుంటోంది. ఈ రెండు కమిషన్ల సిఫార్సులనూ ఆచరణలో నీరుగార్చారు.
ఈ నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని కోరుతూ ప్రజా ఉద్యమాలు జరిగాయి. కెవిపిఎస్‌ నడిపిన ఉద్యమం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు, ప్రజా సమీకరణలు ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి. అటు టిడిపిగానీ, ఇటు కాంగ్రెస్‌ కానీ సబ్‌ప్లాన్‌ అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఈ ఆందోళనల అవసరమే ఉండేదిగాదు. రూ.30,000 కోట్ల నిధులు మళ్లింపు జరిగి ఉండేది కాదు. ఎస్సీ, ఎస్టీలు ఇప్పుడున్న దయనీయ పరిస్థితిలో ఉండేవారూ కాదు. ప్రజా ఉద్యమాల ఒత్తిడికి దిగొచ్చి ప్రభుత్వం ఏదోవిధంగా స్పందించక తప్పలేదు. అయినా కిందపడ్డా నాదే పైచేయి అన్న చందాన కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోంది. ఎస్సీ, ఎస్టీల పట్ల మేమే మొనగాళ్లం అంటున్న కాంగ్రెస్‌ గడిచిన ఆరు దశాబ్దాల కాలంలో సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఏమీ చేయలేకపోయామని సబ్‌ప్లాన్‌ చట్టాన్ని ఇప్పుడు చేయడం ద్వారా పరోక్షంగా అంగీకరించినట్టే గదా? ఇదే ప్రస్తావిస్తే మాత్రం ఉన్న మాటంటే ఉలుకెక్కువ అన్నట్టు కాంగ్రెస్‌ మంత్రులు ఉక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారు.
మా చిత్తశుద్ధిని శంకించవద్దంటూ ముఖ్యమంత్రి పదేపదే అంటున్నారు. కానీ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు, సిపిఐ(ఎం) ఎమ్మెల్సీ సీతారాములు ప్రతిపాదించిన సవరణలన్నింటినీ తిరస్కరించారు. ఈ సవరణలన్నీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని పటిష్టం చేయడం కోసం ప్రతిపాదించినవే. చిత్తశుద్ధి ఉంటే ఈ సవరణలనెందుకు తిరస్కరించారో ముఖ్యమంత్రి చెప్పాలి.
1. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో 3వ క్లాజులో ఎస్సీ, ఎస్టీల జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఉంది. పైకి చూస్తే ఇది బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తికి మించి కేటాయించరాదు అని దీని అర్థం. దీనిపై ప్రతిపాదించిన సవరణలో ఎస్సీ, ఎస్టీల జనాభా నిష్పత్తికి తగ్గకుండా కేటాయించాలని ఉంది. దీనినెందుకు ప్రభుత్వం తిరస్కరించింది?
ఈ చట్టం లేకపోయినా ప్రతి సంవత్సరమూ సబ్‌ప్లాన్‌లో జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయిస్తూనే ఉన్నారు. అవి పూర్తిగా ఖర్చు కాకుండా మురిగిపోతూనే ఉన్నాయి. ఒక సంవత్సరం కేటాయించిన నిధులు ఏ కారణం వల్లనైనా ఖర్చుకాకపోతే ఆ నిధుల్ని తరువాత సంవత్సరపు కేటాయింపులకు అదనంగా తోడు చేయాలి. బిల్లులో జనాభా నిష్పత్తి ప్రకారమే కేటాయించాలని నిర్దేశించాక ఈ అదనపు నిధుల్ని కేటాయించడం వీలు కాదు. ఒక సంవత్సరంలో కేటాయించిన నిధులు ఖర్చుగాకపోతే అవి మురిగిపోవడమే. ఆ మేరకు ఎస్సీ, ఎస్టీలు నష్టపోవడమే. కానీ పిడిఎఫ్‌ / సిపిఎం ప్రతిపాదించిన సవరణను అంగీకరించి ఉంటే ముందటేడాది ఖర్చుకాని నిధుల్ని తరువాయి ఏడాది కేటాయింపులకు అదనంగా కలిపే వీలుంటుంది.
బడ్జెట్‌ కేటాయింపులు అదే ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసి తీరాలని చెప్పినా అది ఆచరణకు సంబంధించిన విషయం గనుక ఏవో కారణాల వల్ల, ఆటంకాల వల్ల ఖర్చు అవకపోవచ్చు. కనుక వాటిని తరువాతి సంవత్సరానికి 'క్యారీ ఓవర్‌' చేయడానికి చట్టంలో వీలుండాలి.
2. ఇప్పటివరకూ ఖర్చుకాని సబ్‌ప్లాన్‌ నిధులను గుర్తించి ఆ మొత్తాన్ని రానున్న సంవత్సరాల్లో అదనపు నిధులుగా కేటాయించాలని ఇంకో సవరణ ప్రతిపాదించాము. దీనినీ తిరస్కరించింది ప్రభుత్వం.
3. ఎస్సీలలో, ఎస్టీలలో వివిధ కులాల మధ్య, తెగల మధ్య ఉన్న అంతరాలను గుర్తించి వారిమధ్య సమతుల్యత సాధించాలని ఆరో క్లాజులో పేర్కొన్నారు. అదే క్లాజులో షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఉన్న గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని పేర్కొన్నారు. షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చకుండా ఉంచిన గిరిజన గ్రామాలు 840కి పైగా ఉన్నాయి. షెడ్యూల్డ్‌ ఏరియాలోకి వచ్చే అవకాశంలేని గిరిజన తండాలు వందలాది ఉన్నాయి. 840 గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలని, గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలని ఎన్నో సంవత్సరాల నుంచి మొరపెడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉంటోంది. ఇప్పుడీ చట్టంలోనూ వారిని పట్టించుకోలేదు. మేము ప్రతిపాదించిన సవరణను సైతం తిరస్కరించింది. అయినా గిరిజనుల పట్ల మాకే చిత్తశుద్ధి ఉందని అంటుంటే ప్రభుత్వాన్ని నమ్మేదెలా?
4. సబ్‌ప్లాన్‌ నిధుల ఖర్చును పర్యవేక్షించడం కోసం ఒక ప్రత్యేక కార్యదర్శి ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అయితే ఆ కార్యదర్శి ఆర్థికశాఖలో భాగంగా ఉండాలని అన్నారు. ఇప్పటివరకూ సబ్‌ప్లాన్‌ నిధులు సక్రమగా ఖర్చుగాకుండా ఉంటే వాటిని దారి మళ్లించింది ఆర్థికశాఖే. మళ్లీ ఇప్పుడు ఆ శాఖ పరిధిలోనే ఈ సబ్‌ప్లాన్‌ కార్యదర్శి ఉండాలంటే దానివల్ల ఒరిగేదేమిటి? అందుకే మేము సబ్‌ప్లాన్‌ కార్యదర్శికి స్వయం ప్రతిపత్తి ఉండేలా, ఆర్థికశాఖకు లోబడకుండా నేరుగా నిధులు మంజూరు చేసే అధికారం ఉండాలని సవరణ ప్రతిపాదించాము. అలాగే ఆర్థికశాఖ బడ్జెట్‌ నిధులను ఆయా శాఖలకు నేరుగా ఇచ్చే విధానానికి బదులు బడ్జెట్‌ ఆమోదం పొందగానే ఆ నిధులు సబ్‌ప్లాన్‌ఖాతాలో నేరుగా జమకావాలని ప్రతిపాదించాము. వీటినీ ప్రభుత్వం తిరస్కరించింది.
5. సబ్‌ప్లాన్‌ చట్టం అమలును పర్యవేక్షించడానికి ఒక రాష్ట్ర కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని, దానికి ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని బిల్లులో ప్రతిపాదించారు. మరి కౌన్సిల్‌లో తక్కిన సభ్యులు ఎవరు అన్నది బిల్లులో పేర్కొనలేదు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అన్ని పార్టీలూ, అన్ని పక్షాలూ కట్టుబడి ఉన్నాయి. కనుక ఈ కౌన్సిల్‌లో ముఖ్యమంత్రితోబాటు వివిధ సంక్షేమ శాఖల మంత్రులు, శాసనసభ, శాసనమండలిలోని ఫ్లోర్‌లీడర్లు సభ్యులుగా ఉండాలని సవరణ ప్రతిపాదించాం. దానినీ తిరస్కరించారు.
6. సబ్‌ప్లాన్‌ అమలులో తేడా వస్తే జోక్యం కల్పించుకోవడానికి, సరిదిద్దడానికి వీలుగా అంబుడ్స్‌మన్‌ను నియమించాలని సవరణ ప్రతిపాదించాం. నిజానికి మంత్రివర్గ ఉపసంఘం కూడా దీనిని ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వం తిరస్కరించింది. లోకాయుక్త వ్యవస్థ ఎటూ ఉంది గనుక అంబుడ్స్‌మన్‌ వేరే అవసరంలేదన్నది ముఖ్యమంత్రి వాదన. ఇది తప్పు. ముప్పై రెండేళ్లుగా సబ్‌ప్లాన్‌ ఉంది గదా? మరి ఈరోజు చట్టం ప్రత్యేకంగా ఎందుకు తేవాల్సి వచ్చింది? ఆచరణలో విఫలమైనందువల్లనే గదా? అటువంటి వైపల్యాలు మళ్లీ వస్తే వెంటవెంటనే జోక్యం చేసుకోడానికి అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ తోడ్పడుతుంది.
7. గత ఇరవై సంవత్సరాలుగా సరళీకరణ విధానాలు అమలవుతూనే ఉన్నాయి. వీటివలన అత్యధికంగా నష్టపోతున్నది ఎస్సీలు, ఎస్టీలు. ప్రాజెక్టుల భూ సేకరణలో, సెజ్‌ల భూసేకరణలో భూములు కోల్పోతున్నది వీరే. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం రద్దు వలన టౌన్లలో భూమి దొరకక శివార్లకు నెట్టివేయబడుతున్నదీ వీరే. జలయజ్ఞంలో నిర్వాసితులవుతున్నదీ వీరే. ముంపుకు గురవుతున్నవి గిరిజన గ్రామాలే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేర వేల కోట్లు కార్పొరేట్‌ విద్యా సంస్థల పరమౌతుంటే పశువులు కూడా మనలేని ఘోరమైన పరిస్థితుల్లో 'సంక్షేమ' హాస్టళ్లలో నానాపాట్లూ పడుతున్నది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే. ప్రైవేటు రంగానికి పెద్దపీట వేసిన కారణంగా, అక్కడ ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేని కారణంగా ఎస్సీ, ఎస్టీలు అన్యాయమైపోతున్నారు. మైనింగ్‌లో ప్రైవేటు శక్తుల ప్రవేశం వలన నిర్వాసితులవడమేగాక, దాని పర్యవసానంగా వాతావరణ కాలుష్యానికి బలవుతున్నదీ వీరే. సరళీకరణ విధానాల అమలు పర్యవసానంగా ఎస్సీలలో, ఎస్టీలలో పేదరికం పెరిగింది. సామాజిక అంతరాలు పెరిగాయి. ఇదంతా ప్రభుత్వం చలవే. ఈ సబ్‌ప్లాన్‌ చట్టానికున్న డొల్లతనాన్ని సరిచేయడానికి మేము ప్రతిపాదించిన సవరణలన్నింటినీ తిరస్కరించారు. పైగా తామే ఎస్సీ, ఎస్టీల తరపున నిలిచే మొనగాళ్లం అంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వారే తీరని అన్యాయం చేస్తూనే, తామే న్యాయం చేసిన, చేస్తున్న, చేయగల వాళ్లం అంటున్నారు. ఇదే కాంగ్రెస్‌ నయవంచన.
సబ్‌ప్లాన్‌ చట్టంలో ఒక భాగం మొత్తం బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు సరైన వాటా కేటాయించి ఖర్చు చేయడం, రెండో భాగం ఎస్సీలలో, ఎస్టీలలో ఉపకులాల మధ్య, వివిధ తెగల మధ్య అంతరాన్ని సరిచేయడం. మొదటి భాగాన్ని వదిలేసి రెండో భాగం మీదే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు యుద్ధం చేసుకున్నాయి. ఎందుకంటే మొదటి భాగానికి సంబంధించి రెండు పార్టీలూ యథాశక్తి ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశాయి. ఆ విషయం ముందుకు రాకుండా ఉండడానికి, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం ఎజెండాను వీలైన మేరకు రాజకీయ వివాదాస్పద అంశంగా మార్చడానికి రెండో భాగం మీదే చర్చంతా నడిచేలా చూశాయి. ఈ నాటకం కూడా ఎస్సీ, ఎస్టీలు గమనించాలి.
సామాజిక వివక్షత కేవలం ఎస్సీల సమస్యగానో, ఎస్టీల సమస్యగానో చూడడం తప్పు. దేశం, రాష్ట్రం మొత్తంగా అభివృద్ధి చెందాలంటే ఆ క్రమంలో సామాజిక అంతరాలను, వ్యత్యాసాలను, అణచివేతను నిర్మూలించడం అవసరం. ఈ అంతరాలను, వ్యత్యాసాలను, అణచివేతను పెంచివేసే సరళీకరణ విధానాలను ఓడించే ఉద్యమంలో అందరూ కలిసి ముందుకు సాగాల్సి ఉంటుంది. అందులో భాగంగా పాలక పార్టీల నయవంచనను ప్రజల ముందు బట్టబయలు చేయడం ఎంతైనా అవసరం.
(వ్యాసకర్త శానన మండలిలో పిడిఎఫ్‌ పక్ష నేత) 


సబ్‌ప్లాన్‌ చట్టం అమలును పర్యవేక్షించడానికి ఒక రాష్ట్ర కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని, దానికి ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని బిల్లులో ప్రతిపాదించారు. మరి కౌన్సిల్‌లో తక్కిన సభ్యులు ఎవరు అన్నది బిల్లులో పేర్కొనలేదు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అన్ని పార్టీలూ, అన్ని పక్షాలూ కట్టుబడి ఉన్నాయి. కనుక ఈ కౌన్సిల్‌లో ముఖ్యమంత్రితోబాటు వివిధ సంక్షేమ శాఖల మంత్రులు, శాసనసభ, శాసనమండలిలోని ఫ్లోర్‌లీడర్లు సభ్యులుగా ఉండాలని సవరణ ప్రతిపాదించాం. దానినీ తిరస్కరించారు. 
-ఎంవిఎస్‌ శర్మ
Prajashakti Telugu News Paper Dated: 13/12/2012
  

No comments:

Post a Comment