Tuesday, December 4, 2012

జోగిని ఇంకెన్నాళ్లు..?


ఇంకెన్నాళ్లు..?
inkennalu1డిచ్‌పల్లిలోని చిన్నమ్మ ... కొడుకును డిగ్రీ వరకు చదివించింది. ఎంత చదివితే ఏం లాభం..? సంస్కార హీనులైన స్నేహితులు ‘నీ తల్లి ఓ జోగిని’ అని హేళన చేశారు. ‘తంవూడెవరో తెలియని వాడివ’ని హీనంగా మాట్లాడారు. మంది మాటలు విన్న ఆ కొడుకు తండ్రి పేరు చెప్పమని తల్లిని నిలదీశాడు. ఆ బిడ్డకు తండ్రెవరో ఆమెకు తెలుసు... కానీ చెప్పలేదు. చెప్పినా... ‘నీ దగ్గరకు ఎంతో మంది వస్తుంటారు. వాడు నాకు పుట్టిన బిడ్డే అని గ్యారంటీ ఏంటీ?’ అని అతను తప్పించుకుంటాడు. ఆ అవమాన భారం భరించలేకే ఆమె చెప్పలేదు. ఫలితం... ‘నువ్వు నన్ను అక్రమంగా కన్నావు’ అంటూ కొడుకు ఆమెను వెలివేశాడు. ‘నీ ఇంట్లోకి రాను.. నీ ముఖం చూడను..’ అని అనాథను చేశాడు. దూరంగా ఉంటున్నాడు. 

కొడుకును చూడాలనిపించినప్పుడల్లా గుండె పగిలేలా రోదిస్తుందా తల్లి...
జోగిని, బసవి, మాతమ్మ, దేవదాసి... పేరు ఏదైతేనేం? దేవుడికి అంకితమివ్వడం అనే ప్రక్రియతో స్త్రీలపై జరుగుతున్న సాంప్రదాయ అత్యాచారం. ఊరిలోనివారంతా దేహాలకు దగ్గరయ్యేవాళ్లే కానీ... మనసులతో స్నేహం చేసేవాళ్లే ఉండరు. అగ్ర కులాల్లోని మగాళ్లకు వాళ్లు విలాసవస్తువులు. అందం, సత్తువ ఉన్నన్నాళ్ళు ఊరందరికీ కావాల్సిన వ్యక్తులు. అవన్నీ ఉడిగిననాడు ఎవరికీ ఏమీ కాని అనామికలు. ఇలాంటి అనామకుపూందరో ఇప్పుడు మహబూబ్‌నగర్, నిజామాబాద్, బోధన్, వరంగల్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విజయనగరం రోడ్లపై బిక్షమెత్తుకుంటూ గడుపుతున్నారు. వృద్ధాప్యంలో ఇంత తిండిపెట్టి, ఆసరా ఇచ్చేవాళ్లు లేక రోడ్లమీదనే ప్రాణం విడుస్తున్నారు. 

ఆదిలోనే బయటపడి...
inkennaluఎన్ని చట్టాలొచ్చినా.. చైతన్యం కోసం ఎన్ని కార్యక్షికమాలు నిర్వహించినా... గ్రామాల్లో జోగినీ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. ‘వాళ్లంతా గతంలో జోగినీలుగా మార్చబడ్డ వాళ్లు. ఇప్పుడా వ్యవస్థ ఉందా? లేనేలేదు’ అని కొట్టిపారేసేవాళ్లకో తాజా ఉదాహరణ ఈ రాధ సంఘటన. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం పెద్దరాజమూర్. దళితులైన బాలయ్య, హన్మమ్మల కూతురు రాధ. జోగిని అయితే వృద్ధాప్యంలో బిడ్డ తమ దగ్గరే ఉంటుందనుకున్నారు. తమ ఆలనా పాలనా చూస్తుందనుకున్నారు. మామ వరసయ్యే వ్యక్తితో తాళి కట్టించారు. ‘చదువు రానిదయితే ఏం కాదు... కాస్తో కూస్తో చదువుకున్న అమ్మాయి కదా! అని చుట్టుపక్కల వాళ్లు కంప్లయింట్ చేయడంతో అధికారులొచ్చారు. రాధను మహబూబ్‌నగర్ స్టేట్ హోంలో పెట్టారు. తరువాత అక్కడే ఎఎన్‌ఎం నర్స్ కోర్సు పూర్తి చేసింది రాధ. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. 

‘మా పిన్నిని, వాళ్ల చెల్లిని కూడా జోగినిలుగా మార్చారు. ఏమీ తెలియని పసి వయసులో వాళ్లనలా చేశారు. ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఉండటానికి ఇల్లు లేదు. ఉన్న గుడిసె మొన్న వానలకు కూలిపోయింది. వాళ్లంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఆమెకు ఫస్ట్ ఒక బాబు. తరువాత మళ్లీ కవలలు. ఆ కవలలను చూసుకోవడం కోసం బాబును స్కూల్ మానిపించింది. ఇప్పుడామె కూలికిపోతేనే ఇల్లు గడుస్తుంది. లేకపోతే లేదు. ముగ్గురు పిల్లలను పట్టుకుని ఒక్కతే నానా కష్టాలు పడుతున్నది. ఇవన్నీ వివరించి చెప్పినంక, కేసు పెట్టిన తర్వాత మా అమ్మానాన్న తప్పు తెలుసుకున్నారు. ‘తమకు తెలియక జోగినిగా చేశామని... చదువు, ఉద్యోగం, పెళ్లి అన్నీ ఇక తన ఇష్టమే!’నని చెప్తున్నరు. తమపై ఉన్న కేసు ఒక్కటి తీసేస్తే చాలంటున్నరు’ అంటూ దీనంగా చెబుతుంది రాధ. 

తొమ్మిదేళ్లప్పుడే..
మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ పేట మండలం పేరపాలకు చెందిన సత్తెమ్మది మరో కథ. గ్రామ దైవం గజ్జల మామకు కాముని పౌర్ణమినాడు జాతర జరుగుతుంది. గుడిదగ్గర మేకను బలిచ్చినట్టే చిన్నతనంలో తొమ్మిదేళ్లప్పుడు ఆమెను దేవునికి అంకితం చేశారు. పెళ్లయి పిల్లలున్న మేనమామతో తాళిబొట్టు కట్టించారు. ఇష్టమున్నంత కాలం ఆమెతో ఉన్నాడు. తరువాత వదిలేశాడు. అది మొదలు ఆమె ఊరి మొత్తానికి ఆస్తి అయ్యింది. ఎవవరో వస్తారు. తనకు తెలివొచ్చేనాటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి లేదు. అలా చేసుకుంటే అరిష్టమని ఎవరూ ముందుకు రారు. మిగిలిన ఆడవాళ్లు బజారున పడ్డ ఆడోళ్లని ఇష్టమొచ్చిన మాటలంటారు. తరువాత ఓ వ్యక్తి రెగ్యులర్‌గా వచ్చేవాడు. ‘ఏదేమైనా సరే నిన్నేలుకుంటా!’ అన్నాడు. ‘ఇప్పటికే దేవుడికి అంకితమైనవ్ కాబట్టి నేను తాళి కట్టలేను కానీ... అవసరాలన్నీ చూసుకుంటా’ అన్నాడు. ఊరంతా వెలివేసినప్పుడు దగ్గరికి వచ్చినవాళ్లే మనవాళ్లు. అలా తన దగ్గరికి వచ్చే ఆయనే అన్నీ అనుకుంది సత్తెమ్మ. రోజులు గడిచిపోయాయి. ఐదుగురు పిల్లలు పుట్టారు. 

ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరు అంధులు. గద్వాల్‌లోని హాస్టల్‌లో ఉంటున్నారు. పెద్ద కొడుకు చదువుకుందామనుకున్నాడు. బడికి పోతే ఏమని చెప్పాలె? మీ అమ్మ ఏం చేస్తదంటే ఏం చెప్పాలి? మీ నాన్నెవరంటే ఏం చెప్పాలె? కొన్నాళ్లు చదివి తెలివొచ్చాక, పిల్లల ప్రశ్నలు, వెక్కిరింపులు భరించలేక బడి బంద్ చేశాడు. బొంబాయి పోయి కార్ డ్రైవింగ్ నేర్చుకున్న అతనికి నారాయణ్‌పేట్ పిల్లను చూసి పెళ్లి చేసింది. తల్లిదండ్రీ లేని పిల్ల కాబట్టి సత్తెమ్మ బాధలను అర్థం చేసుకుంది. ఒక్క బిడ్డ పెళ్లి చేసింది. ఆ బిడ్డకు బిడ్డ పుట్టి చనిపోయింది. ఆమె భర్త పక్షవాతంతో మంచాన పడ్డాడు. ఇప్పుడు వాళ్లిద్దరి బాధ్యతపై సత్తెమ్మపైనే పడింది. అంధులైన ఇద్దరు పిల్లల బాగోగులూ ఆమే చూసుకుంటున్నది. కొన్నాళ్లు సంసారం చేసిన వాడూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఐదుగురు పిల్లలను పట్టుకుని కష్టంగా బతుకెళ్లదీస్తుంది సత్తమ్మ. ఇల్లులేదు. వాకిలీ లేదు. నా అన్నవాళ్లూ లేరు. 

దాపు లేదు.. ధైర్యం లేదు...
‘‘కంటికి నిదరరాదు. మనసుకు బాధయితది. ఉండనీకే గూడు లేదు. ఇంత ఇల్లు, ఇంత భూమో ఇస్తే కష్టం చేసుకుని బతుకుతం. గుడిసె వేసుకుని ఉంటే... తమ్ముళ్లిద్దరూ ‘భూమి మాది’ అని జగడమాడుతున్నరు. గుడిసె మాది. దేవుని పేరుమీద ఎక్కడికైనా పో!’ అని వెళ్లగొడుతున్నారు. ‘అమ్మనాయిన ఏం జేసిండ్రో మాకు తెల్వది. 

మేం పుట్టేనాటికే జోగిని అయినవు. నీకు మాకు సంబంధం లేదు’ అంటున్నరు. నేను ఎవరినడగాలి? తాళిబొట్టు కట్టినవాడినా... కొన్ని రోజులు నాతోపాటు ఉన్నవాడినా.. తోడబుట్టినవాళ్లనా? ఎవరినడిగినా ఏం లాభం లేదు. ఏమన్నా అంటే ‘మా ఆస్తి పంచుకుంటవా అని వాళ్ల పిల్లలు వచ్చి నా బిడ్డలను చంపేటట్టు ఉన్నరు. దాపు లేదు. ధైర్యం లేదు. చెల్లెళ్ల పెళ్లిళ్లకు నేనే ముందున్న. వాళ్లు హాయిగా సంసారం చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉన్నరు. ఒక్క నాకే ఈ కష్టం. ఈ శోకం ఎప్పటికీ తీరదు. ఏం పాపం జేసిన? ఎందుకూ కొరగాని దానినయిన. నా పిల్లలు ‘ఈమె నా తల్లి!’అని చెప్పుకోలేని స్థితిలో ఎందుకున్న? హాస్టల్‌లో ఉంటున్న బిడ్డ ఎప్పుడన్న నా దగ్గరికొచ్చి ఉండాలంటే ఉండలేదు. బుద్ధి తెలిసింది. ఇంటి దగ్గర ఏదన్న గొడవ జరిగే సరికల్లా ... ‘అమ్మా ఈ మాటలు వినేబదులు .. నేను హాస్టల్లోనే హాయిగా ఉంటానమ్మ. అక్కడ నాకింత తిండిపెడతారు. ఏ గోలా ఉండదు’ అంటుంది. 

బిడ్డలు కూడా నా దగ్గర మనశ్శాంతిగా ఉండలేని పరిస్థితి. ఎందుకు నాకీ శిక్ష. మిషన్ నేర్చుకున్న కుట్టు మిషన్ పెట్టుకుందామంటే... ‘అలాంటిదాని దగ్గరికా?’ అని ఎవరూ రారు. ఛాయ్ బండి పెట్టుకుంటే... ఎప్పుడు ఎవరొచ్చి ఏం గొడవ చేస్తారన్న భయమో? ఏమో! గిరాకీ వుండదు. కష్టం చేసుకుని కూడా బతకలేని స్థితి. అర్ధరాత్రి ఎవరన్నొచ్చి బెదిరిస్తరు.. వెళ్లి సర్పంచ్‌కు చెప్తే ‘ఎవరినడగాలమ్మా? వాళ్లకు పెళ్లిళ్లయి సంసారాలున్నయి. ఏమని చెప్తం? నిన్ను పెళ్లి చేసుకున్న మొగుడా! అడగడానికి?’ అంటరు. ఎవరికి చెప్పుకోవాలి? అమ్మ, అయ్య ఉన్ననాళ్లూ వాళ్లు చూసుకున్నరు. వాళ్లు పోయిన కాన్నించి నరకం. నా వయసు వాళ్లు, నాలాంటోళ్లం ఎనిమిది, తొమ్మిది మందిమి ఉన్నం. ఇప్పుడు మేం ఎవ్వరి పిల్లలను అట్ల చెయ్యనిస్తలేం. మేం చెప్పినట్లు వింటున్నరు. మళ్లీ ఎవరినీ జోగినిలు కానిస్త లేం’’ అంటూ ముగించింది సత్తెమ్మ. ఆమె ఇప్పుడు తన ఏరియాలో ఓ సామాజిక కౌన్సిలర్. ‘లంగయి, దుడకలు అంటరు. అందుకే మీ బిడ్డలను మాలాగ చెయ్యొద్దని’ జీవిత పాఠాలు బోధిస్తున్నది. 

నిలువ నీడ లేదు..
నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఒక వృద్ధురాలిని గొడ్ల చావడిలో పడేశారు. ఎందుకంటే ఆమె బాగోగులు కోడలు చూడనని చెప్పింది. ‘ఎందుకట్లా?’ అని కోడలునడిగితే ‘నా అత్త కాదు... కేవలం నా భర్తను పెంచిన వ్యక్తి ఆమెను నేనెందుకు చూస్తాన’ంది? భర్తను కదిలిస్తే ‘ఆమె నా తల్లి కాదు అత్త... జోగిని కావడంతో అన్న కొడుకునైన నన్ను పెంచుకుంది’ అని సమాధానమిస్తాడు. భార్యను కాదని ఇంట్లోకి తెచ్చుకోలేడు. పెంచిన అత్తమీద ప్రేమను చంపుకోలేక అప్పుడప్పుడు వెళ్లి ఓ ముద్ద అన్నం పెట్టి వస్తాడు. నా అనేవారు లేని ఆమె ఇప్పుడెవరికి చెందుతుంది? వృద్ధాప్యంలో ఉన్న ఆమె ఆలనా పాలనా ఎవరు చూడాలి?

ఇలా వృద్ధులైన జోగినిల పరిస్థితి అధ్వాన్నం. వాళ్లు ఆ సమయంలో సమాజానికి భయపడి పిల్లల కనలేదు. అన్న పిల్లలనో, తమ్ముడి పిల్లలనో పెంచుకున్నరు. ఉన్నన్నాళ్లూ తమకొచ్చిన పదోపరకో పెట్టి పెద్ద చేశారు. పెళ్లిళ్లు చేశారు. తర్వాత వాళ్ల జీవితాలు నరక కూపాలయ్యాయి. కన్న తల్లిదండ్రీ లేరు. తోడబుట్టినవాళ్లూ లేరు. కడుపున పుట్టిన పిల్లలు అసలే లేరు. తోడు లేదు. నిలువ నీడా లేదు. అనాథలుగా రోడ్ల మీద ప్రాణాలొదులుతున్నారు. వాళ్లలో ఎక్కువశాతం దళితులే. మిగిలిన వాళ్లు బీసీల్లోని ముదిరాజ్ ఇతర కులాలకు చెందినవాళ్లుంటారు. వీళ్లకోసమే బోధన్‌లో ‘జోగిని, దళిత్ ఉమెన్స్ ఓల్డేజ్ హోమ్’ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ వ్యవస్థ నిర్మూలనకు పనిచేస్తున్న ఎన్జీవోస్.

ఆట నుంచి పోరాటం వైపు...
వేల్పూర్‌కు చెందిన గంగమణిని ఆమెకు ఐదేళ్లున్నప్పుడే దేవునికి అంకితం చేశారు. అప్పటి నుంచి చేను, చేను తిరిగి వడ్లు అడుక్కొచ్చుకునేది. చేపలు కూడా అడుక్కొచ్చుకునేది. కష్టం చేసుకుందామన్న ఎవరూ పని ఇవ్వరు. ఆ ఊళ్లో ఈమెతోపాటు ఓ పదిహేను మంది జోగినిలుంటే ముగ్గురే వయసులో ఉన్నవాళ్లు. వీళ్లను శవాల ముందు డాన్స్‌లు చేయించేవాళ్లు. 

అలా వచ్చిన యాభయ్యో, వందో వాళ్లకు జీవనభృతి. అందుకే ఇష్టం లేకపోయినా, కష్టమైనా వెళ్లేవాళ్లు. డాన్స్‌కు ముందు మందు సీసా ఇచ్చి తాగమంటారు. అదితాగి మైకంలో ఉన్న వాళ్లపై పడి వెకిలి చేష్టలు చేస్తారు. నిండా రంగులు చల్లుతారు. ఓవైపు చచ్చిన శవముంటే... మరోవైపు బతికున్న వాళ్ల ఈ క్రీడ. అయితే శవాల ముందు ఆడటానికి బీసీ కులాలకు చెందిన జోగినీలను అస్సలు పిలవరు. కేవలం దళితులను మాత్రమే పిలుస్తారు. ఇక్కడా వివక్షే! 
ఓసారి జోగిని అయిన ఒకామె గర్భవతి అయ్యింది. ప్రసవ సమయంలో ఊరంతా కలిసి మూడు రోజుల పాటు ఆమెకు నరకం చూపారు. ఓవైపు నొప్పుల పడుతుంటే మరోవైపు ఆ పుట్టబోయే బిడ్డకు తండ్రెవరో చెప్పమని అడిగారు. తీరా ఆమె చెప్పిన తరువాత వచ్చిన ఆ వ్యక్తి ‘అది ఎంతో మందితో తిరిగింది. పుట్టే బిడ్డ నా బిడ్డే అని ఎలా తెలుస్తుంది?’ అన్నాడు. 

చివరకు ఆమె ప్రాణం వదిలింది. ఎవడి పాపమో తెలియదు మరో జోగినీ మహిళ ఎయిడ్స్‌తో చనిపోయింది. ఇవన్నీ తలుచుకున్న గంగమణి ఒళ్లు గగుర్పొడిచింది. ఓ వ్యక్తితో కలిసి ఉంటుంది. ఇప్పుడామె అందరి ఆస్తి కాదు. అలా మహిళలు జోగినిలుగా మారి ఊరందరి ఆస్తి కాకుండా పోరాటం చేస్తున్నది. తనలాంటి మరికొందరిని వెంటేసుకుని వెళ్లి కలెక్టర్‌ను కలిసింది. తలా ఎకరం భూమి ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు కొంత మంది ఆ భూమి మీద కన్నేశారు. కంప్లయింట్ చేస్తే పోలీసులను, కేసు పెడితే లాయర్లను పైసలతో తమవైపు తిప్పుకుంటున్నారు. ఎకరం భూమి ఆసరా కూడా లేకుండా చేయాలని చూస్తున్నారు. జీవనాధారం, ఆర్థిక స్వావలంబన కోసం గంగమణిలాంటి వాళ్లకు రోజూ ఘర్షణే!

తల్లిపేరు కోసం...- లక్ష్మమ్మ
laxmiమహబూబ్‌నగర్ జిల్లా ఊట్కూర్ మాది. నాకు పదేళ్లప్పుడు మేనమామతో తాళి కట్టించారు. అయితే నాకు తెలివొచ్చినంక నేను ఎదురు తిరిగిన. మళ్లీ పెళ్లయితే చేసుకోలేదు గానీ... నాకు నచ్చిన ఓ వ్యక్తితోనే ఉంటున్న. కలిసైతే బతుకుతున్నా కానీ.. అధికారికంగా కాదు. ఆయనకు భార్య, పిల్లలున్నారు. నా బిడ్డ పెద్దయ్యి పదో తరగతికి వచ్చేదాక ఏ సమస్యా రాలేదు. అయితే నా బిడ్డ పదో తరగతికి వచ్చినాక బోర్డ్ ఎగ్జామ్ మాత్రం తండ్రిపేరు లేకుండా రాయనియ్యమన్నరు. ‘తండ్రి లేనిదే పుట్టినవా? ఫాదర్ నేమ్ ఎందుకుండదు?’ అని నా బిడ్డను వేధించారు. ఇంటికొచ్చి నాకు చెప్పి ఏడ్చింది. నేను జోగినీ వ్యవస్థ నిర్మూలనకోసం పనిచేస్తున్న. నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే మిగిలిన వాళ్ల పరిస్థితి ఎలా ఉందో అనుకున్న. ‘నేను జోగినిని. తండ్రిపేరు ఎలా రాయగలను?’ అని స్కూల్ వాళ్లను అడిగితే... ‘అందరికీ ఒక రూల్. నీ ఒక్కదానికి ఒక రూలా?’ అని ఎదురు ప్రశ్నవేశారు. నేను ఆశ్రయ్ సంస్థతో కలిసి పోరాటం చేసిన. తండ్రి పేరు స్థానంలో తల్లి పేరు కూడా రాయొచ్చని 2009లో జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఇది మా విజయం.

కట్ట కవిత
ఫోటోలు: కోనేటి వెంకt

Namasete Telangana News Paper Dated: 4/12/2012

No comments:

Post a Comment