Sunday, December 16, 2012

అంతర్జాతీయ సాహితీ వేదికపై తెలుగు ముస్లిం కవి - ఖాదర్ మొహియుద్దీన్



సెప్టెంబరు 11 తరవాతనే మైనారిటీ డిస్కోర్స్ తేలికగా అర్థమవ్వడం మొదలయ్యింది. అమెరికాలోని మైనారిటీల స్వరం అటు సాహిత్యంలోనూ, ఇటు పబ్లిక్ స్పేస్‌లోనూ బాగా వినిపించడం మొదలయ్యింది. చాలా కాలంగా ఇస్లాం అంటే కొందరు మతాచార్యుల గుప్పిట్లో బందీ అనే భావనని ప్రపంచం పెంచి పోషిస్తూ వచ్చింది. అది వొక్కసారిగా బద్దలయి, ఇస్లాంలోని అభ్యుదయ శక్తులు ముందుకొచ్చి- ప్రతిఘటనని వ్యక్తం చేశాయి. ఇది మన దేశంలో కూడా జరగాల్సి వుంది. ఇస్లాంలో వున్న అభ్యుదయ శక్తులు బలపడితే తప్ప- ముస్లిం సమాజాలకు విముక్తి లేదు -అంటున్నారు అఫ్సర్. 

ఖమ్మంజిల్లాలో ఒక మారుమూల గ్రామం అయిన చింతకాని ఊరుబడి నుండి టెక్సాస్ యూనివర్సిటీ దాకా అతని నడక, మేధో యాత్రలో ఆలోచనల్ని ప్రోది చేసుకొనే క్రమం అంత సులువునా జరిగింది కాదు. తండ్రి కౌముది నించి అభ్యుదయ సాహిత్య వారసత్వం తల్లి వేపు కుటుంబం నించి వామపక్ష రాజకీయాల ప్రభావం.. వీటన్నీటి పునాది మీద నిర్మించుకున్న అస్తిత్వ వేదన అఫ్సర్. అమెరికాలో ఉన్నా తన వూరితో ముడిపడిన మూలాల వెతుకులాట అఫ్సర్. అవే అఫ్సర్‌ని కవిగా, కథకుడిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా ముందుకు నడిపిస్తున్నాయి. స్థానికత మాత్రమే ప్రపంచీకరణకి సమాధానం అనే దృక్పథం వేపు తీసుకువెళ్లాయి. సూఫీ కథనాల మీద రాయబోతున్న కొత్త పుస్తకానికి సంబంధించి పరిశోధనలో భాగంగా ఇటీవల మన రాష్ట్రం వచ్చి వెళ్లిన అఫ్సర్ హైదరాబాద్‌లో జరిగిన వివిధ సాహిత్య సమావేశాలలో తన పరిశోధన విషయాలను, సాహిత్య అనుభవాలను పంచుకున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో- వొక అమెరికన్ విశ్వవిద్యాలయం నించి డాక్టరేట్ తీసుకున్న తొలి తెలుగు కవి అఫ్సర్. అస్తిత్వ ధోరణుల మీద చర్చని అంతర్జాతీయ వేదిక దాకా తీసుకు వెళ్తున్న విమర్శకుడు...

ముఖ్యంగా స్థానికత, మౌఖిక రీతులు దేశీయ మౌఖిక కథనాలు దర్గా సూఫీ సంస్కృతుల మీద ఎన్నో అంతర్జాతీయ పత్రికలలో ఆసక్తికరమైన పరిశోధనా వ్యాసాలను రాసారు. స్థానిక కథనాలు అస్తిత్వ నిర్మాణంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయో చెప్తూ, వివిధ అంతర్జాతీయ సదస్సులలో తన స్వరం వినిపించారు. సాహిత్య సాంస్కృతిక రంగాలలో మైనారిటీ డిస్కోర్సుకి వొక సిద్ధాంత బలాన్ని తీసుకురావడం తన ప్రధానమైన ప్రయత్నమని ఆయన అంటారు. పీర్ల పండగ మీద ఆయన ఇంగ్లీషులో రాసిన పుస్తకం త్వరలో వొక అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ద్వారా అచ్చు కానుంది. కథకుడిగా మొదలెట్టి వొక అంతర్జాతీయ స్థాయి పరిశోధకుడిగా అఫ్సర్ సాగించిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన లేవనెత్తిన పలు అంశాలు ఇంకా చర్చకు దారితీయబోతున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్సర్‌తో గుర్రం సీతారాములు (డాక్టోరల్ ఫెలో ఇంగ్లీష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం, ఫోన్: 99516 61001) జరిపిన ఇంటర్వ్యూ-

? బాబ్రీ మస్జిద్ లేదా సెప్టెంబర్ 11 లాంటి ఒక సంక్లిష్ట సందర్భంలో మీరు ఇస్లాంను ఒక టెర్రరిస్టు బూచిగా చూపించిన అమెరికన్ సొసైటీలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా? సమస్య అమెరికా మాత్రమే కాదు. మన దేశంలోనూ అలాంటి సమస్యలు వున్నాయి. అలాంటి ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. వొకే అమెరికా, వొకే ఇండియా అనే జాతీయవాద భావన ప్రమాదకరం ఎప్పుడయినా! అమెరికా భిన్న సంస్కృతుల కలయిక. ఆ భిన్నత్వాన్ని చెరిపేసి 'వొకే' అమెరికా అన్న భావనని పెంచే ప్రయాత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అదృష్టవశాత్తూ దీనికి ప్రజల నించి సమ్మతి లేదు. అలాంటి ఎకోన్ముఖీకరణ మన దేశంలోనూ జరుగుతోంది. అయితే మన దేశంలో దానికి తగినంత ప్రతిఘటన లేదు.

ఇక రెండో విషయం: వలసలో ఎప్పుడూ కొన్ని కష్టాలూ, సాహసాలూ వుంటాయి. అది ఖమ్మ నించి హైదరాబాద్ కావచ్చు. హైదరాబాద్ నించి ఢిల్లీ కావచ్చు. దేశం నించి ఇంకో దేశం కావచ్చు. అయితే అదృష్టం బాగుండి నేను పనిచేసిన యూనివర్సిటీలు -అప్పుడు విస్కాన్సిన్, ఇప్పుడు టెక్సాస్- రెండూ వొక విధంగా కొంచెం బహుళ సాంస్కృతిక వాద అనుకూల ప్రదేశాలు. ఇంకో కొత్త సంస్కృతిలోకి అడుగెట్టినప్పుడు కొన్ని అస్తిత్వ సమస్యలు ఎదుర్కోక తప్పదు -అది అమెరికా అయినా, ఉత్తర భారతమైనా, మన పొరుగు వూరే అయినా. ఆ సంస్కృతికి సంబంధించిన అంశాలు కొన్ని మనల్ని సవాల్ చేస్తాయి. వాటిని ఎదుర్కొని నిలబడడం కష్టమే కానీ అసాధ్యం కాదు. నేను అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజు వెల్చేరు నారాయణరావు అన్న మాట ఇప్పటికీ బాగా గుర్తు పెట్టుకుంటా- 'అంతర్జాతీయ అస్తిత్వం చాలా సాహసంతో కూడుకున్నది. మీరు చాలా పెద్ద సాహసానికి సిద్ధపడాలి. వొక తెలుగుకవిగా మీరు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మాత్రమే ఇక్కడ సరిపోవు. చాలా కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వుంటుంది. ఇప్పటిదాకా నేర్చుకున్నది మరిచిపోవాల్సి వుంటుంది కూడా.'

అయితే నేను స్థానికతని బాగా నమ్మే వ్యక్తిని. ఆ స్థానికత నేను పెరిగిన చిన్న వూరు చింతకానిది అయినా, అమెరికాలోని ఆస్టిన్ ది అయినా.. నేర్చుకోవాల్సింది/మారాల్సింది చాలా వుంటుందన్న వాస్తవికతకి నేనెప్పుడూ సిద్ధమే. అలాగే నా లోపల వొక జంగమ ప్రవృత్తి కూడా వుంది. అందుకే వొక కవితలో 'జంగమం నా ఇలాకా' అని రాసుకున్నా. అలాంటప్పుడు నాకు కృత్రిమ స్థావరాలు సృష్టించే అడ్డుగోడల మీద నమ్మకం లేదు. అలాంటప్పుడు ఇబ్బందులు పడడమూ వుండదు. ? సెప్టెంబర్ 11 తరవాత ఇస్లాం ప్రపంచంపై అమెరికా రాజ్యం అవలంబించిన విధానంపై దేశంలోని బుద్ధిజీవుల నుండి రావాల్సినంతగా ప్రతిస్పందన రాలేదు. దాన్ని ప్రస్తుత మైనార్టీ డిస్కోర్సు ద్వారా ఎలా అర్ధం చేసుకోవచ్చు?

అంతర్జాతీయ స్థాయిలో మేధావులు స్పందించినంత తీవ్రంగా మన దేశంలోని బుద్ధిజీవులు దీనిమీద స్పందించలేదన్నది వాస్తవం. దానికి ప్రధానమైన కారణం: మనం సెప్టెంబర్ 11 అనంతర ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడమే! మొత్తంగా ప్రాపంచిక దృక్పథాన్ని మార్చడంలో దీని ప్రభావాన్ని మనం ఇప్పటికీ అంచనా వేసుకోలేకపోతున్నాం. అసలు మైనారిటీ డిస్కోర్సు వొకటి వుందన్న చైతన్యం అమెరికాలోనూ/ఇతర దేశాల్లోనూ కలిగింది ఈ సెప్టెంబరు 11 తరవాతనే! అమెరికాలో రాజ్య విధానాలకూ, ప్రజలకూ మధ్య వున్న వైరుధ్యం బాగా అర్థమయింది కూడా దీని తరవాతనే. ఈ వైరుధ్యం అర్థమయిన తరవాత మైనారిటీ డిస్కోర్స్ తేలికగా అర్థమవ్వడం మొదలయ్యింది. అమెరికాలోని మైనారిటీల స్వరం అటు సాహిత్యంలోనూ, ఇటు పబ్లిక్ స్పేస్‌లోనూ బాగా వినిపించడం మొదలయ్యింది. అలాగే, ఇస్లాం అంటే ఏమిటో అందులో ఎంత విభిన్నత వుందో తెలిసి వచ్చింది. చాలా కాలంగా ఇస్లాం అంటే కొందరు మతాచార్యుల గుప్పిట్లో బందీ అనే భావనని ప్రపంచం పెంచి పోషిస్తూ వచ్చింది. అది వొక్కసారిగా బద్దలయి, ఇస్లాంలోని అభ్యుదయ శక్తులు ముందుకొచ్చి- ప్రతిఘటనని వ్యక్తం చేశాయి. ఇది మన దేశంలో కూడా జరగాల్సి వుంది. ఇస్లాంలో వున్న అభ్యుదయ శక్తులు బలపడితే తప్ప- ముస్లిం సమాజాలకు విముక్తి లేదు.

? అలాగే ఇక్కడ తెలుగులో మైనారిటీ డిస్కోర్సు ఒక సంకుచితత్వంలోకి పోయింది అంటే ఆ వాదాన్ని సమర్థవంతంగా తీసుకెళ్లడంలో మైనారిటీ కవుల లోపాన్ని ఎలా అంచనా వేస్తారు? ఇంతకు ముందే చెప్పినట్టు- ఇప్పుడు అంతర్జాతీయ సాహిత్యం అంతా వొక మైనారిటీ డిస్కోర్స్‌ని వెతుక్కుంటోంది. అంచులలో వున్న జీవన దృశ్యాల ఆవిష్కరణ అన్ని భాషల్లోనూ కనిపిస్తోంది. తెలుగులో ఈ ప్రక్రియ మొదట ప్రారంభమయినంత బలంగా కొనసాగలేకపోతోంది. దానికి ముఖ్య కారణం: అది కవిత్వం గుప్పిట్లో వుండిపోవడమే! ఈ విషయంలో వొక్క దళిత స్త్రీవాదులే కొంత మినహాయింపు. దళిత స్త్రీవాదులు తరవాతి దశలో వచనంలోకి చేసిన ప్రయాణం గొప్ప మలుపు నా దృష్టిలో. అది మిగిలిన మైనారిటీ వాదులకి ఆదర్శం కావాలి. ముఖ్యంగా ముస్లిం వాదులకి! ముస్లిం వాదం ఇప్పుడు రాస్తున్నది తక్కువ. వివాదాలు ఎక్కువ అన్నట్టుగా వుంది. వ్యక్తిగత అహంకారపూరిత రాజకీయాల వల్ల ముస్లింవాదంలోని బలం బలహీనతగా మారుతోంది. ఈ రాజకీయాలు మానేసి, ముస్లిం రచయితలు నిజంగా సృజనాత్మకత మీద దృష్టి పెడితే బాగుంటుంది. సృజనాత్మకత విషయంలో నాకు దళిత వాదం సృష్టించిన మాడల్స్ బాగా నచ్చాయి. ఏ వాదానికయినా ఆ వాదం పరిధిలోకి వచ్చే నిజ జన సమూహాలతో ఆత్మీయ సంబంధం వుండాలి. తెలుగు ముస్లిం రచయితలకు -ముఖ్యంగా కవులకు- వాళ్ల తక్షణ సమూహం అంటే ముస్లింలతో దగ్గిర సంబంధాలు లేవు. అది వాళ్ల రచనల్లో కూడా కనిపిస్తున్న లోపమే! అలా సమూహ సంబంధం లేని సాహిత్యం డొల్లగా వుంటుంది.

? ఆధునికత, ఉత్తరాధునికత తదితర భావజాలాల మీద పనిచేసిన మీరు తరవాత స్థానికత గురించి మాట్లాడడం మొదలెట్టారు. మీ విమర్శనీ, పరిశోధననీ తెలుగు సమాజం సరిగా అంచనా వేయలేకపోయిందని మీరు భావిస్తున్నారా?

స్థానికత అత్యాధునికతలో ప్రధానమైన కోణం. 1991లో వెలువడిన నా 'ఆధునికత-అత్యాధునికత' వ్యాసాలు మళ్లీ చదివితే ఆ వాదంలో స్థానికత పాత్ర ఏమిటో తెలుస్తుంది. తెలుగు సమాజం వీటిని ఎలా అంచనా వేస్తుంది అన్నది నాకు అంత పట్టింపు లేదు. నేను చెప్పాలనుకున్నది నేను చెప్తున్నాను. అంతే! కానీ, ఆ వ్యాసాలు వెలువడినప్పుడు, తరవాత నేను అస్తిత్వ వాదాల మీద రాసినప్పుడు కూడా అనుకూల/వ్యతిరేక స్పందనలు గట్టిగానే వచ్చాయి. అయితే, నేను కవిని అన్న విషయం మీరు మరచిపోతే తప్ప, విమర్శకుడిగా నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాదు. స్థానికత అనేది ఇప్పటికిప్పుడు అవసరమైన సాహిత్య ప్రమాణం అని ఇప్పటికీ నేను అనుకుంటున్నా- అది ప్రవాస స్థానికత కూడా కావచ్చు. అమెరికా తెలుగు రచయితలు ఇటీవలి కాలంలో వెతుక్కుంటున్న ప్రవాస స్థానికత కూడా ఇందులో భాగమే. ? దక్కనీ సమాజం దాదాపు 11 వందల ఏళ్ల పాటు సూఫీ ప్రభావంలో ఉంది. ఈ క్రమంలో మీరు చేస్తున్న దర్గాలు సూఫీ సంస్కృతుల మీద పరిశోధన మైనారిటీ డిస్కోర్సుకు ఏ విధంగా దోహదపడుతుందని భావిస్తున్నారు?

దక్కనీ సమాజ అధ్యయనాలలో మనం అంతగా పట్టించుకోని రంగం: సూఫీవాదం. సూఫీ అనగానే మనం రూమీ దాకా వెళ్తున్నాం కానీ, మన పక్కనే వున్న సూఫీల జోలికి మాత్రం పోవడం లేదు. మన స్థానికత మీద మనకి అంత శ్రద్ధ లేదనడానికి ఇదొక వుదాహరణ. నేను ఈసారి ట్రిప్‌లో ఆంధ్ర, తమిళనాడు, కర్నాటకలలో అనేక సూఫీ స్థలాలు తిరిగా. తిరిగిన చోటల్లా కుప్పలు పడి వున్న చరిత్ర కనిపిస్తున్నది. అది మనకు తెలియని మన చరిత్ర. కానీ, సాధారణ ప్రజానీకానికి ఈ చరిత్రకి సంబంధించిన చైతన్యం వుంది. లేనిదల్లా, చదువుకున్న మనలోనే! మనం కులాలుగా, మతాలుగా చీలిపోయాం.

విడదీసే అంశాల మీద వున్నంత ఆసక్తి మనల్ని కలిపే అంశాల మీద లేదు. సూఫీ వాదం అందరినీ కలిపే సంస్కృతి. రూమీ గురించి కాదు, మన గ్రామాల సూఫీల గురించి ముందు నేర్చుకోవాలి. మైనారిటీ డిస్కోర్సుని బలంగా వినిపించిన వాళ్లు మొదట సూఫీలే! ఇవాళ మనం మాట్లాడుకుంటున్న చాలా అంశాలు ఆ రోజుల్లో వాళ్లు మాట్లాడారు. వాటి వర్తమానికతని మనం అర్థం చేసుకోవాలి. ? మీ పరిశోధనలో మీకు ఆసక్తికరంగా తోచిన విషయాలు వివరిస్తారా? 

చాలా వున్నాయి. ముఖ్యంగా, మానవ సంబంధాల గురించి సూఫీలు చెప్పిన విషయాలు, ప్రేమని వొక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా వాళ్లు దర్శించిన పద్ధతి. ఇటీవలి నా కవితల్లో ఆ ప్రేమ భావనకి సంబంధించిన భిన్న పార్శ్వాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ? ఈ పరిశోధన ద్వారా పశ్చిమ దేశాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా?

పశ్చిమ దేశాలు ఏం నేర్చుకుంటాయని కాదు, నా మొదటి లక్ష్యం నేనేం నేర్చుకుంటున్నానో అది ముఖ్యం. అది వొక వ్యక్తిగా, రచయితగా నాకు తక్షణ అవసరం. నా చుట్టూ వాళ్లకి దాని ద్వారా నేనేం చెప్పగలనన్నది రెండో అవసరం. ముస్లిం సమాజాల స్వభావం గురించి పశ్చిమ దేశాలే కాదు, మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా వున్నాయి. ముఖ్యంగా, ముస్లిం సమాజాలు సంకుచితం అనే అపోహ చాలా మందిలో వుంది. ముస్లిం సమాజాలు అభ్యుదయం వేపు చూడడం లేదన్న నిరంతర విమర్శ వుంది. ముస్లిం సమాజాల్లో వున్న అనేకత్వాన్ని చెప్పడానికి సూఫీజమ్ బాగా వుపయోగపడుతుంది -ఎందుకంటే- ముస్లింల వాస్తవ పరిస్థితి చెప్పేది వాళ్ల సూఫీ చరిత్ర మాత్రమే! ? ఈ పరిశోధన ద్వారా పశ్చిమ దేశాల కేంద్రిత అవగాహనను విభేదించే పరిశోధక అంశాలను మీరేమైనా స్పృశించారా?

మొత్తంగా ఈ పరిశోధన అంతా పశ్చిమ-కేంద్రిత అవగాహనతో విభేదించడమే. స్థానికత అనే వాదంలోనే ఆ విభేదం వుంది. స్థానిక సాహిత్యాల/సంస్కృతుల అధ్యయనం కేవలం వొక భాషకి సంబంధించిన విషయం కాదు. అది ఇంకో స్థాయిలో సైద్ధాంతిక/రాజకీయ ప్రకటన కూడా. వివిధ అంతర్జాతీయ పత్రికలలో/సంకలనాల్లో నా వ్యాసాలు చదివితే- ఇది నేనెలా చేశానో అర్థమవుతుంది. ఈ వ్యాసాల్లో కొన్నీటిని తెలుగులోకి అనువదించడానికి మిత్రులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఈ ప్రయత్నం చెయ్యడం అంటే తెలుగులో ఆ సైద్ధాంతిక పరిభాషని కూడా నిర్మించడమే! దానికి ముందు పశ్చిమ-కేంద్రిత పరిశోధన నించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా వున్నాయి. పరిశోధనా పద్ధతి, విశ్లేషణ, ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కునే దారి మనకి ఇంకా అంత స్పష్టంగా లేదు.

? గడిచిన కొన్ని దశాబ్దాలుగా వర్తమాన మేధో సమాజం యూరప్ కేంద్రకంగా ఒక తిరుగులేని స్థితిలో ఉంది. దానికి కౌంటర్‌గా మధ్య ప్రాచ్యం, లాటిన్ అమెరికాలో జరిగిన (ఎడ్వర్డ్ సైద్, ఫాన్నోస్) ప్రత్యామ్నాయ మేధో స్రవంతి దక్షిణ ఆసియా నుండి రాలేకపోవడానికి, మన బుద్ధిజీవుల/మేధో వైఫల్యం ఉందని భావిస్తున్నారా? అలా జరగకపోవడానికి కారణాలు ఏమయి ఉంటవి అని అనుకుంటున్నారు?

సంఘర్షణ అనేది కేవలం సమాజాల్లో జరిగినంత మాత్రాన్న సరిపోదు. మేధో సమూహాలు ఆ సంఘర్షణలో పాల్గొన్నప్పుడే దానికి సరిదీటు అయిన సాహిత్యమూ, సిద్ధాంత చర్చా జరుగుతుంది. దక్షిణాసియా దాకా ఎందుకు గానీ, తెలుగు సమాజానికే పరిమితమయి మాట్లాడితే- పబ్లిక్ ఇంటలెక్చ్యువల్స్ మనకి లేరు. తెలుగులో అలా నిలబడేది వొక్క బాలగోపాల్ మాత్రమే. అయితే, గుండె లోతుల్లోంచి లేదా మేధో లోతుల్లోంచి మాట్లాడే బుద్ధిజీవిని తట్టుకునే శక్తి తెలుగు సమాజానికి ఎంత వుందో ప్రశ్నార్థకమే. మనకి ఆలోచించే వాళ్లంటే భయం. ఆలోచన పెరుగుతుందంటే భయం.

అందుకే, మన చర్చలు చాలా మటుకు ఉద్వేగ స్థాయికి మాత్రం వెళ్లి, కవిత్వంలో చతికిలబడ్తాయి. కవిత్వాన్ని చిన్న చూపు చూడడం కాదు, మరీ పెద్ద చూపు చూడడం వల్ల మన మేధో ప్రపంచం చిన్నదయిపోతున్నదని నా బాధ. మన మేధో వికాసానికి అదొక అడ్డంకి. ఆలోచనల్ని కూడదీసుకునే శక్తి లేని చోట సమూహాల్ని సమీకరించే శక్తి కూడా వుండదు. ఈ విషయంలో మన కంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటివి చాలా నయం. వాళ్ల మేధో వికాసం, సాహిత్య వికాసం మనకి వొక నమూనా కావాలి. పాకిస్తాన్ స్త్రీవాద కవయిత్రులూ, బంగ్లాదేశ్ ముస్లిం రయితలూ ఏం చేస్తున్నారో వొకసారి గమనించాలి. మనకి ఆ తులనాత్మక దృష్టి పెరిగితే తప్ప మనకి మనంగా ఏం చెయ్యాలో తెలియదు.

రెండు: మన ప్రతిఘటన ఉద్యమాలలో వొక నిలకడ లేదు. రాజ్య హింస మీద ఇప్పటికీ మన ప్రతిఘటన బలహీనంగానే వుంది. తెలంగాణతో సహా వివిధ అస్తిత్వ ఉద్యమాలు నిజానికి ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా నడవడం లేదు. వొక వేపు కార్పొరేట్ శక్తుల విష కౌగిలిలో చిక్కుకొని వున్నాం కూడా. ఇంకోవేపు అగ్రవర్ణ ఆధిపత్యం కొనసాగుతూనే వుంది. ఇక మిగిలిన అరకొర బుద్దిజీవులు నిశ్శబ్దంలోకి వెళ్లిపోతున్నారు లేదా ఉద్దేశపూర్వక మౌనం ప్రకటిస్తున్నారు. వొక విధమైన కృత్రిమ మేధో వాతావరణం మధ్య నిజమైన బుద్ధిజీవి నిజానికి భయంకరమైన వొంటరితనాన్ని అనుభవించే స్థితి తెలుగునాట వుంది.

మూడు: అంచుల నించి వస్తున్న అభిప్రాయాల మీద మనకి చిన్న చూపు. అంటే, వొక కొత్త అభిప్రాయాన్ని దళితులో, స్త్రీలో, ముస్లింలో, పల్లె నించి వచ్చే బుద్ధిజీవులో వ్యక్తం చేసినప్పుడు దాన్ని సీరియస్‌గా తీసుకునే సహనం ఇంకా మనకి రాలేదు. అదే అభిప్రాయం పట్టణ ప్రాంతాల అగ్రవర్ణాలు వ్యక్తం చేస్తే జయహో అంటున్నాం. ఈ ధోరణి మనలోని బానిసతత్వాన్ని, పరాధీనతని, వ్యక్తిత్వ లేమిని చెప్తుంది.

? ఇలాంటి ప్రతిఘటన లేకపోవడానికి ఈ దేశ సామాజిక పరిస్థితి, ఈ దేశ రాజకీయ వ్యవస్థకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది? దానికి ప్రత్యామ్నాయ ప్రతిఘటన సాహిత్య రూపాలు తీసుకొని రావడంలో దళిత బహుజన వైఫల్యం ఉందని అనుకుంటున్నారా?

ప్రజల్లో నిజమైన ప్రతిఘటన వుంది. దాన్ని గుర్తించినా ముందుకు తీసుకువెళ్లే రాజకీయ వాతావరణం మనకు లేదు. ఇక మన ప్రతిఘటన సాహిత్య రూపాల మీద కూడా మన చదువుల ప్రభావం వుంది. మన చదువులు, మన మేధోలోకం ఇంకా వలసవాద చట్రంలో వున్నాయి. ఆ చట్రం నించి బయట పడే శక్తి ఇంకా మనకి రాలేదు. విశ్వవిద్యాలయాలు మాత్రమే ఈ పని చేయాలని అనుకోవడం మన పొరపాటు. అలాగే ఎంతకాలం ఈ బ్రాహ్మణ పండిత వర్గాల్ని తిట్టుకుంటూ కూర్చుందాం. మన పరిస్థితికి ఇతరుల కంటే మనమే బలమైన కారణం. మనల్ని మనమే ముందు నిందించుకోవాలి. బ్రాహ్మణ అని కాదు కానీ, అగ్రవర్ణ అంటాను. వాళ్లలో వున్న ఐక్యత ఇంకెక్కడా లేదు. అలాగే, కుడిపక్షం ఎప్పుడూ ఐక్యంగా వుంటుంది. వామపక్షం చీలికలు పీలికలయి పోతూ వుంటుంది. విశ్వవిద్యాలయాలలో అగ్రవర్ణ ఆధిపత్యం ఇంకా వుంది. మైనారిటీలు, అణగారిన వర్గాలు తమ లోపలి బలహీనతల్ని గుర్తించి, తమ బలాన్ని పెంచుకునే శక్తి సంపాదించుకోవాలి.

? మీరు అమెరికాలో అధ్యాపకుడిగా మారాక మీ ఆలోచన/అవగాహన/మేధో శ్రమలో అస్తిత్వ రాజకీయాలలో ఏ మార్పులు గ్రహించారు? అధ్యాపకుడిగా పనిచేస్తూ వుండడం వల్ల కొత్త తరం సంవేదనలూ, అనుభవాలూ, ఆలోచనలూ నాకు తెలుస్తున్నాయి. అట్లాగే నా తరగతి గదుల్లో భిన్న దేశాల భిన్న సంస్కృతుల విద్యార్ధులు వుండడం వల్ల ఆ భిన్నత్వం నా ఆలోచనల్ని తప్పనిసరిగా మారుస్తుంది. నా విద్యార్థులు నా నించి ఎంత నేర్చుకుంటున్నారో నేనుగా చెప్పలేను గాని, ప్రతి విద్యార్థి నించీ నేను నేర్చుకుంటూనే వుంటాను. అధ్యాపకుడయినా, వ్యక్తి అయినా నిరంతరం ఆ విద్యార్థి స్థితిలో వుండాలి అనుకుంటా. అందువల్ల మీ లోపల పీఠాలు ఏమైనా నిర్మితమవుతూ వుంటే, అవి వెంట వెంటనే కుప్పకూలిపోతాయి వాటికి అవే! ఇందులో చాలా మేధో శ్రమ వుంటుంది. మీ అస్తిత్వం నిరంతరం ప్రశ్నల మధ్య వూగిసలాడడమూ వుంటుంది. ఇది మేధో ఆరోగ్యానికి చాలా మంచిది. వొక్క ప్రశ్న కూడా పుట్టని రోజు నేను నిలవ నీరయిపోయినట్టే లెక్క. వొక కవితలో రాసుకున్నట్టు 'ఎక్కడో వొక చోట గడ్డ కట్టుకుపోలేను.'

అఫ్సర్

Andhra Jyothi Telugu News Paper Dated: 17/12/2012 

No comments:

Post a Comment