Friday, December 21, 2012

హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలు ---డేవిడ్,



మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో సుమారు 700 తెగలకుచెందిన 9 కోట్ల మందికి పైగా ఆదివాసులు జీవనం సాగిస్తున్నారు. వీరిలో 92 శాతానికి ప్రధాన జీవనాధారం అటవీ భూములే. మన రాష్ర్టంలో 30 తెగలకు చెందిన ఆదివాసులు, మరో ఐదుతెగలకు చెందిన మైదాన ప్రాంతవాసు లు- 60 లక్షల మందికి పైగా 9 జిల్లాలోని షెడ్యూలు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాజ్యాంగ పరంగా షెడ్యూలు 5,6లలో ప్రత్యేక రక్షణలు కల్పించిన ఆది వాసుల జీవనం నేడు పెనుసంక్షోభాన్ని ఎదుర్కొంటు న్నది. మైదాన ప్రాంత షావుకార్ల, వడ్లీవ్యాపారుల మోసాలకు, అన్యాయాలకు, దోపిడీ దౌర్జన్యాలకు, ఫారెస్టు అధికారుల వేధింపులకు గురౌతూ ఆదివాసులు మనుగడకోసం, మెరుగైన జీవనంకోసం పోరాతున్నారు. 

ఈ సమస్యలన్నింటికీ తోడు వేలాది, లక్షలాది ఎకరాల అటవీ భూములను పరిశ్రమల స్థాపన పేరిట, ప్రాజెక్టుల నిర్మాణం పేరిట, గనుల తవ్వకం పేరిట బడా, బహుళజాతి, కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టటం ద్వారా వారిని అడవుల నుండి శాశ్వతంగా దూరం చేసేందుకు పాలకులు పూనుకున్నారు. ప్రభుత్వాలులు గత ఆరున్నర దశాబ్దాలుగా చేపడుతున్న విధానాల ద్వారా ఆదివాసులకు కల్పించామన్న రక్షణలన్నింటినీ గత రెండు దశాబ్దాలుగా ఒక్కొక్కటిగా తొలగించివేస్తున్నారు.

శ్రీకాకుళ గిరిజన రైతాంగఉద్యమానంతరం అటవీ ప్రాంతంలో ఆదివాసుల భూమిహక్కును నామమాత్రంగానైనా పరిరక్షించే 1/70 చట్టాన్ని రాష్ర్టప్రభుత్వం చేసింది. ఈ చట్టాన్ని నీరుగారుస్తూ వచ్చిన ప్రభుత్వాలన్నీ, అటవీ భూములను గిరిజనేతర భూస్వాముల పరం చేయడంతో పాటు, పెద్దఎత్తున బడా పారిశ్రామిక సంస్థలకు కట్టబెడుతూ వచ్చాయి. ఆదివాసుల స్వయంపాలనలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ 1996లో ‘పంచాయితీరాజ్‌ గిరిజన ప్రాంతాల విస్తరణ చట్టం’ (పెసా) తెచ్చింది. 15 సంవత్సరాల తర్వాత ఇటీవల ప్రభుత్వం దాని అమలుకు నిబంధనలు రూపొందించడంలోనే- ఆదివాసుల హక్కుల అధికారాలను పంచాయితీలకు, మండల పరిషత్తులకూ కట్టబెట్టింది. 

తద్వారా ఆదివాసుల అటవీభూములను అన్యాక్రాంతంచేసే చర్యలను వేగవంతం చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారమే లక్షఎకరాల అటవీభూములను ఆక్రమించుకుని అనుభవిస్తు న్నారని ప్రభుత్వం నియమించిన గిర్‌గ్లానీ కమిటీ వెల్లడించేసింది. కోనేరు రంగారావు భూ కమిటీ ఆదివాసుల భూముల దురాక్రమణను ప్రధానంగా ప్రస్తావించింది. ప్రపంచీకరణ విధానాలను అమలుచేయటం ప్రారంభమైన తర్వాత అదివాసుల జీవనం ‘పెనం మీదనుండి పోయ్యిలో పడిన’ చందం అయ్యింది. 

విదేశీ, సామ్రాజ్యవాద బడా కంపెనీలు విచ్చలవిడిగా అడవులలోని భూగర్భ, ఉపరితల సహజ సంపదలన్నింటినీ కొల్లగొట్టు కెళ్ళేందుకు పాలకులు అన్నిరకాల అనుమతు లూ ఇచ్చివేస్తున్నారు. విద్యను అందని ద్రాక్షగా మార్చి కార్పొరేటీకరించిన పాలకులు మరో చేత్తో విద్యాహక్కు చట్టం చేసిన విధంగానే; వైద్యాన్ని ఖరీదైన అంగడిసరుకుగా మార్చిన పాలకులే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాలతో భ్రమలు కల్పిస్తున్నట్లుగానే; ఆహార భద్రతచట్టం అంటూనే ఆదివాసుల హక్కులన్నింటినీ హరించి వేస్తున్న పాలకులు, ఆదివాసీహక్కుల చట్టం-2006 పేరిట మరో చట్టాన్ని ముందుకు తెచ్చారు.

అటవీ ఉత్పత్తులు సేకరించి సంతల్లోనో, ఐటిడిఏ ద్వారానో అమ్ముకుంటూ, పోడు వ్యవసాయం చేసుకుంటూ సాప్రదాయక ఆదివాసుల జీవనం సాగిస్తూ వస్తున్నారు. తాము వ్యవసాయంచేస్తున్న ప్రాంతంలో భూసారం తగ్గాక మరో ప్రాంతాన్నెంచుకొని వ్యవసాయం చేయటమనే పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు. అయితే వీరు సాగుచేసుకుంటున్న అటవీ భూములకు చట్టబద్ధ పట్టాలను, వాటిపై మరొకరి ఆధిపత్యాన్ని ఎరగరు. 

పాలకులు తీసుకువచ్చిన ఆదివాసీ హక్కుల చట్టం వీరికి అదనంగా హక్కులు కల్పించకపోగా, సాంప్రదాయకంగా అడవిపై సంక్రమించిన హక్కులను హరించివేయటానికే మరోరూపంలో పూనుకున్నది. ఒక్కో ఆదివాసీ కుటుంబానికి 5 ఎకరాల నిర్దిష్ఠ, నిర్ణీత అటవీ భూమిపై ప్రభుత్వ పట్టానిచ్చి, వారిని శాశ్వతంగా అక్కడివరకే కట్టడి చేయబూనుకోవడం ఈచట్టం అసలు ఉద్దేశ్యం. తద్వారా పాలకులు, మిగిలిన అటవీ భూములన్నింటినీ యథేచ్ఛగా దోపిడీ వర్గాలకు కట్టబెట్టేందుకు చట్టపరంగా వెసులుబాటు పొందే ఆలోచన దీని వెనుక దాగిఉంది.

సమతా కేసులో సుప్రీంకోర్టు 1/70ని పునరుద్ఘాటిస్తూ ఏజన్సీ ప్రాంత భూములను గిరిజనేతరులకు ఇవ్వరాదని పేర్కొన్నది. పాలకులు ఈ తీర్పును నీరుగార్చుతూ వచ్చారు. ఏజన్సీ ప్రాంత భూములు ప్రభుత్వ ఆధ్వర్యంలో వినియోగిస్తున్నట్లుగా నాటకమాడి జిందాల్‌ వంటి వివిధ సంస్థలకు కట్టబెడుతూ వస్తున్నారు. ఈ విధానాలకు, చర్యలకు వ్యతిరేకంగా తీవ్రనిర్బంధాన్ని, అణచివేతలను ఎదుర్కొంటూ దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ముందుకు సాగుతున్నారు. ఒరిస్సాలోని కళింగ నగర్‌లో తమ భూములను ఆక్రమించి నిర్మిస్తున్న టాటా ఉక్కు కర్మాగార స్థాపనను నిరసించిన ఆదివాసులపై ప్రభుత్వం కాల్పులు జరిపి 12 మందిని బలిగొంది.

‘పోస్కోకు ‘వేదాంత’ కోసం అటవీ భూఆక్రమణలకు వ్యతిరేకంగా ఆదివాసులు పోరాటం సాగిస్తున్నారు. మన రాష్ర్టంలోని విశాఖ జిల్లా చింతపల్లి ఏజన్సీలోని బాక్సైట్‌ గనుల తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కన్నెధారకొండ మైనింగ్‌ లీజుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 9 మండలాల పరిధిలోని 276 ఆదివాసీ గ్రామాలకు చెందిన లక్షాయాభైవేల మందిని నిర్వాసితుల్ని చేసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఉభయగోదావరి, ఖమ్మం జిల్లాల్లోని ఆదివాసులు బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ‘ఆడవికి ఆడవి’, ‘భూమికి భూమి’ నినాదంతో ఉద్యమిస్తున్నారు.

ఆదివాసుల జీవనాన్ని ఈ విధంగా విధ్వంసం చేయడంతో పాటు, వారి సంస్కృతిని, జీవన విధానాన్ని కూడా కనుమరుగుచేసేందుకు పాలకులు విష సాంస్కృతిక దాడిని తీవ్రం చేశారు. గత రెండు దశాబ్దాల కాలంలో సామ్రాజ్యవాద సాంస్కృతిక మాధ్యమాలను ఆదివాసుల మధ్యకు జొప్పిస్తున్నారు.ఆధునిక సౌకర్యాల పేరిట, విద్యుత్తు వెలుగుల మాటున వినోదం, విజ్ఞానం బదులుగా వస్తు వ్యామోహ సంస్కృతితో ముంచెత్తుతున్నారు. టీవిలను, సెల్‌ఫోన్లను ఆదివాసులకు కూడా అందుబాటులోకి తేవడమే వారి అభివృద్ధికి నిదర్శనంగా పాలకవర్గ మేధావులు పేర్కొంటున్నారు. 

ఆగస్టు 15, జనవరి 26ల సందర్భంగా మువ్వన్నెల జెండాలను ఎగురవేసి దళిత, పీడిత, తాడిత ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యంగా గొంతుచించుకొనే పాలకులు, ఆదివాసీల సంక్షేమానికి చేపడుతున్న విధానాలు, చర్యలు శూన్యమని స్పష్టమవుతున్నది. ఆదివాసుల విద్య, వైద్యం, సంక్షేమం కోసం కేటాయించిచే నిధులనుకూడా కుదించివేస్తున్నారు. రాష్ర్ట బడ్జెట్‌లో గిరిజన సబ్‌ప్లాన్‌క్రింద 6.6 శాతం నిధులను ఖర్చుచేయాలి. కానీ కేటాయించిన నిధులనైనా వెచ్చించకుండా ఇతరేతర పద్దులలోకి దారి మళ్ళిస్తున్నారు. 

ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆదివాసుల్లో 50 శాతం మందికి కనీస పౌష్ఠికాహారం అందడం లేదు. మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత, పౌష్ఠికాహార లోపం కారణంగా పురిట్లోనే ప్రాణాలు విడుస్తున్న పసిబిడ్డల సంఖ్య అత్యధికంగా ఉంది. ప్రతి వెయ్యి మంది శిశువులకు శిశు మరణాలు150 నుండి 250 వరకూ ఉంటున్నాయి. అత్యధిక ఆదివాసీ గ్రామాల్లో నేటికీ కనీస వైద్య సదుపాయం కానీ, తగిన డాక్టర్లు, వైద్య సిబ్బంది, పరికరాలు, మందులు, వసతి సౌకర్యాలు కానీ అందుబాటులో లేవు.

1999లో విశాఖ ఏజన్సీలో విషజ్వరాల బారినపడి 3 వేల మందిి పైగా జనం మరణించిన సంఘటనపై నాటి మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ డా వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషన్‌ ప్రభుత్వానికి అందజేసిన నివేదికను పాలకులు ఏనాడో పాతిపెట్టేశారు. ఈ సంవత్సరం జులై నాటికే విశాఖ ఏజన్సీలోనే 100 మందికి పైగా ఆదివాసులు మరేరియా, డయేరియా, కామెర్లవ్యాధులతో చనిపోయారు. గత సంవత్సరం విజయనగరం జిల్లాలోనే 4 వేలమంది ఆదివాసులు మరేరియా బారిన పడ్డారు. ఇప్పటికే ఈ ఏడాది ఆదివాసీ ప్రాంతాల్లో 280 మంది డెంగ్యూ, మలేరియా వ్యాధులకు గురయ్యారు. 

ఫాల్సీఫారమ్‌ మలేరియా మెదడుకు సోకి మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ నాటికీ అదివాసుల్లో అక్షరాస్యత 16 శాతానికి మించలేదు. సంక్షేమ హాస్టళ్ళు నరక కూపాలను తలపిస్తున్నాయి. ఇప్పు గిరిజన సంక్షేమహాస్టళ్ళను, గురుకుల పాఠశాలలను కుదించి వేస్తున్నారు. గురుకుల ఆదివాసీ పాఠశాలల్లో ఆడపిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. వీరిపై వేధింపులు, లైంగిక దాడులు, దౌర్జన్యాలు సర్వసాధారణమయ్యాయి. ఇటీవల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నిరోధిస్తుందని చెబుతూ ‘గర్దాసిల్‌’ అనే టీకాను గురుకుల పాఠశాలలో చదువుకునే ఆదివాసీబాలికలపై ప్రభుత్వ ప్రోద్బలంతో ప్రయోగించారు. అత్యంత ప్రమాదకరమైన ఈ అనైతిక ఔషధప్రయోగాల ఫలితంగా వీరిలో కొందరు మరణించగా అనేకమంది ఔషధ పరీక్షల దుష్ఫలితాలనెదుర్కొంటున్నారు.

అదివాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కుదించి వేస్తున్నారు. ఎలాంటి హక్కులు, భద్రత లేని తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతుల్లో మాత్రమే కొన్నైనా అవకాశాలు కల్పిస్తున్నారు. గత 10 సంవత్సరాలలో 15 వేల అదివాసుల పోస్టులు వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయలేదు.ఆదివాసీ యువకులకు ఈ మధ్యకాలంలో ఎమైనా ఉద్యోగాలు కల్పించారంటే అవి పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యగాలు మాత్రమే!ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసుల పోరాటాలను ఏఎఫ్‌ఎస్‌పిఏ వంటి క్రూర చట్టాలతో పాలకులు అణయివేయ చూస్తున్నారు. అస్సాంలో ఆదివాసుల గుడిసెలను ఏనుగులతో తొక్కిస్తే, గుత్తికోయల గ్రామాలను మన రాష్ర్టంలో తగులబెట్టించే ఫాసిస్టు చర్యలకు పాల్పడుతున్నారు. 

devid
‘గ్రీన్‌హంట్‌’ పేరిట పోలీసు, సైనిక బలగాలను మోహరిస్తున్నారు. నక్సలైట్లను అణచి వేసేందుకోసం ‘సాల్వజుడుం’ పేరిట ఆదివాసుల నుండే ప్రత్యేక బలగాలను రూపొందించి, శిక్షణ, ఆయుధాలుఇచ్చి వారిని ప్రయోగిస్తున్నారు.ఆదివాసీ ప్రాంతా ల వారు దోపిడీ వ్యవస్థపై పోరాటం ఎక్కుబెట్టకుండా అనేక ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. సమస్తవనరులనూ కొల్లగొట్టేనిమితం మానవరహి త అడవులుగా మార్చేందుకు పూనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ పోరాట యోధులు బిర్సాముండా మొదలు కొమురంభీం వరకూ సాగించిన సమరశీల పోరాట స్ఫూర్తిని ఆదివాసీ ఉద్యమాలు స్వంతం చేసుకోవాలి. అటవీ భూముల సేకరణకు వ్యతిరేకంగా ఆదివాసులు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సాగిస్తున్న ఉద్యమాలను ఇతర పీడిత వర్గాల సమన్వయంతో సాగించాలి

Namasete Telangana Telugu News Paper Dated : 22/12/2012

No comments:

Post a Comment