Thursday, May 1, 2014

హంతకులను నిర్దోషులంటే ఎలా? By జాన్‌వెస్లి


Posted on: Thu 01 May 05:36:54.618275 2014

          న్యాయమూర్తులు చివరకు బాధితులు అనుమానించినట్లుగానే చుండూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను రద్దుచేస్తూ తీర్పునిచ్చింది. వెంటనే వారిని విడుదల చేయాలని ఆదేశించింది. గతంలో కొందరు న్యాయమూర్తులు డబ్బులు తీసుకుని అక్రమంగా బెయిల్‌ ఇచ్చిన కేసులను పరిశీలిస్తే ఈ తీర్పులో కూడా అలాంటివి జరిగాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు, కులం, మతం ప్రభావాలకు న్యాయమూర్తులు అతీతం కాదని పలు తీర్పులు వ్యక్తం చేస్తున్నాయి. సామాజిక దృక్పథం కల్గిన వారినే న్యాయమూర్తులుగా నియమించాలన్న నిబంధనలు లేకపోవడం ఇలాంటి పరిస్థితులకు ప్రధాన కారణం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో స్టే తీసుకుని అప్పీలుకు వెళ్లాలి. అన్ని రాజకీయపార్టీలు సైతం చుండూరు దళితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. 
            అగ్రకుల ఉన్మాదంతో వందల మంది వేటకొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులు, బరిసెలతో చుండూరు దళితులను వేటాడి పోలీసుల సమక్షంలోనే ఎనిమిది మందిని దారుణంగా నరికి చంపి గోనెసంచుల్లో కుక్కి కాలువలో పడేసిన ఘోరమైన హత్యాకాండకు లోకమంతా సాక్ష్యమే. అయినా నేరస్తులంతా నిర్దోషులేనని హైకోర్టు తీర్పునివ్వడం హంతకులను సైతం విస్మయానికి గురిచేసింది. హత్యలు జరిగిన వెంటనే బంధువులు ఫిర్యాదు చేయలేదని, ఏ వ్యక్తిని ఏ క్షణాన చంపారో నిక్కచ్చిగా సాక్షులు సమయం చెప్పలేదని, వికలాంగుడు కూడా వెంటాడి ఎలా హత్య చేస్తాడని, ఈత రానివాడు కాలువ ఎలా దూకుతాడని 'కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు' వితండ వాదనలు చేసి కేసును కొట్టివేసింది. క్రింది కోర్టు ఈ కారణాలను పరిగణనలోకి తీసుకోకుండానే శిక్షలు విధించడం తప్పని భావించింది. నిందితులందరినీ వెంటనే విడుదల చేయాలని, జరిమాన వసూలుచేసి ఉంటే తిరిగి చెల్లించాలని జస్టిస్‌ యల్‌ నర్సింహారెడ్డి, జస్టిస్‌ యంకె జైశ్వాల్‌ ధర్మాసనం తీర్పు నిచ్చింది. మరి హంతకులెవరో నిర్థారించాల్సిన బాధ్యత కోర్టుకు లేదా? కనీసం నేరస్తులను శిక్షించడానికి తగిన ఆధారాలు చూపలేని పోలీసులు, అధికారులు, పాలకులపై అయినా శిక్షలెందుకు వేయలేదు? ఈ తీర్పు అన్యాయం అని చెప్పడానికి న్యాయశాస్త్ర కోవిదులేమీ అక్కరలేదు. రచ్చబండ పంచాయితీలు చేసే వారైనా చెప్పేస్తారు. గంటల తరబడి మారణకాండ జరిగిన ఘటనపై సంవత్సరాల తరబడి జాప్యం చేసి హత్య చేసిన సమయం నిక్కచ్చిగా చెప్పడం అమాయకులైన దళితులకు సాధ్యమేనా? పోలీసుల ముందే హత్యలు జరుగుతుంటే వెంటనే పిటిషన్‌ ఇవ్వలేదని న్యాయమూర్తి ప్రశ్నించడం భావ్యమేనా? ఈ తీర్పు అగ్రకులోన్మాదులకు, హంతకులకు మరింత ఊతమివ్వగా దళితులు, పేదలకు న్యాయస్థానాలపై ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా కోల్పోయేదిగా ఉంది. ప్రభుత్వం, పోలీసులు, పాలకులు చివరకు న్యాయస్థానాలు సైతం ధనికులు, పేదల మధ్య సమస్యలు వస్తే అవి ధనికుల వైపే ఉంటాయని, అగ్రకులాలకు, దళితులకు మధ్య వైరుధ్యం వస్తే అవి అగ్రకులాల వైపే ఉంటాయని మరోసారి నగంగా రుజువైంది. దళితుల మాన, ప్రాణాల రక్షణకై కలిసొచ్చే శక్తులను కలుపుకొని ప్రతిఘటించి పోరాడేందుకు సన్నద్ధం కావలసిన పరిస్థితులకు నెట్టబడుతున్నాయి.
   తరతరాలుగా అణచివేతకు గురవుతున్న దళితుల్లో ఫూలే, అంబేద్కర్‌ ఆలోచనలు, అభ్యుదయవాదుల కృషి వల్ల సామాజిక చైతన్యం పెరుగుతోంది. గుంటూరు జిల్లా చుండూరు దళితులు సైతం అగ్రకులాల దౌర్జన్యాలను ప్రశ్నించడం, ఎదిరించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య చిన్న చిన్న ఘటనలు జరిగాయి. పోలీసులకు ముందే తెలియజేసినా తగిన చర్యలు తీసుకోలేదు. కాలు కింద చెప్పులా ఉండాల్సిన దళితులు తమనే ఎదిరించే స్థాయికి వస్తారా అంటూ చుండూరు, మున్నంగివారి పాలెం, మోదుకూరు, వలమనేరు గ్రామలకు చెందిన రెడ్లు, కాపులు ఏకమై దళితులపై దాడికి పథకం వేశారు. 1991 ఆగస్టు 6 ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో మారణాయుధాలతో పోగయ్యారు. ఇది గమనించిన దళితులు వెంటనే పోలీసులకు తెలియజేసినా తగిన బలగాలను సమీకరించుకోలేదు. పైగా దళితులు ఐక్యంగా ఉండి దాడులను ప్రతిఘటించకుండా దళితవాడ నుంచి పురుషులనంతా పోలీసులే తరిమేశారు. చెదిరిపోయిన వారిని వెంటాడి దారుణంగా హత్యచేశారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మారణహోమం జరగడంతో దళితవాడ శ్మశానంగా మారింది. ఇందుకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులు. మూడురోజుల తరువాత గాని శవాలు నదిలో ఎక్కడ ఉన్నాయో వెతుక్కోలేని పరిస్థితులు ఉన్నాయంటే ఎంతటి భయానక పరిస్థితి నెలకొన్నదో స్పష్టమవుతుంది. హంతకులు పోలీసుల ముందే మారణాయుధాలతో తిరుగుతున్నా వాటిని స్వాధీనం చేసుకోలేదు. కనీసం అరెస్టులు కూడా చేయలేదు. హత్యలు చేస్తున్నా అడ్డుకోలేదు. ఈ మారణకాండ వారి సమక్షంలోనే జరిగినా సాక్షులుగా ఎఫ్‌ఐఆర్‌లో కూడా నమోదు చేయలేదు. పోలీసు స్టేషన్‌లోకి వచ్చి పోలీసులను హత్యచేస్తే ఫిర్యాదు వేరేవాళ్లు ఇవ్వాలని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ఉంటారా! మరి ఇక్కడ ఎందుకు చేయలేదు? బాధితులు, సాక్షులు చెప్పిన వివరాలను సైతం సరిగా నమోదు చేసుకోలేదు. కానీ న్యాయం కోసం దళితవాడలో నిరహారదీక్షలు చేస్తున్న దళితులపై కాల్పులు జరిపి దళిత నాయకుడు, ఘటనకు ప్రత్యక్ష సాక్షి అనిల్‌కుమార్‌ను పోలీసులే కాల్చిచంపారు. హంతకులపై మాత్రం పోలీసుల తుఫాకులు పని చేయలేదు. రాష్ట్రవ్యాప్త ఆందోళన ఫలితంగా చివరకు డిసెంబర్‌ 1 నుంచి చుండూరు ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది. 179 మంది నిందితులపై విచారణ జరిపి 70 మంది సాక్ష్యాలను తీసుకుంది. చివరికి 2007 జులై 31న చుండూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనీల్‌ తీర్పును వెల్లడించారు. నిందితుల్లో 21 మందికి జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమాన, 35 మందికి ఒక సంవత్సరం జైలు, రూ.2 వేలు జరిమాన విధిస్తూ మిగతా వారందరినీ సరైన ఆధారాలు లేవనే పేరుతో విడిచిపెడుతూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఇరు వర్గాలూ హైకోర్టుకు వెళ్లగా 2007లో న్యాయమూర్తులు యల్‌ నర్సింహారెడ్డి, యంకె జైశ్వాల్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులుగా సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం, రఘునాథ్‌లను నియమించింది. విచారణ ప్రారంభం నుంచీ న్యాయమూర్తులు బాధితులకు, న్యాయవాదులకు సహకరించలేదని విమర్శలు వచ్చాయి. విచారణకు ఒక వారం సమయం ఇవ్వాలని బాధితుల తరపు న్యాయవాది కోరినా ఇవ్వలేదని, సాక్ష్యాలు వినేందుకు కూడా అయిష్టత వ్యక్తం చేశారని బాధితులు ఆరోపించారు. ఈ న్యాయమూర్తుల వల్ల తమకు న్యాయం జరగదని అవిశ్వాసం వ్యక్తం చేస్తూ బాధితులు, బాధితుల తరపు న్యాయవాదులు పిటిషన్‌ వేయగా వారిపై కోర్టుధిక్కారం కేసు వేసేందుకు న్యాయమూర్తులు పూనుకుని తరువాత విరమించుకోవడం గమనార్హం. న్యాయమూర్తులు చివరకు బాధితులు అనుమానించినట్లుగానే చుండూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షలను రద్దుచేస్తూ తీర్పునిచ్చింది. వెంటనే వారిని విడుదల చేయాలని ఆదేశించింది. గతంలో కొందరు న్యాయమూర్తులు డబ్బులు తీసుకుని అక్రమంగా బెయిల్‌ ఇచ్చిన కేసులను పరిశీలిస్తే ఈ తీర్పులో కూడా అలాంటివి జరిగాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు, కులం, మతం ప్రభావాలకు న్యాయమూర్తులు అతీతం కాదని పలు తీర్పులు వ్యక్తం చేస్తున్నాయి. సామాజిక దృక్పథం కల్గిన వారినే న్యాయమూర్తులుగా నియమించాలన్న నిబంధనలు లేకపోవడం ఇలాంటి పరిస్థితులకు ప్రధాన కారణం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో స్టే తీసుకుని అప్పీలుకు వెళ్లాలి. అన్ని రాజకీయపార్టీలు సైతం చుండూరు దళితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. దళిత, ప్రజాసంఘాలు ఐక్యంగా తీర్పులో ఉన్న లోపాలను, ప్రభుత్వ వైపల్యాలను ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. ఇందుకు కలిసొచ్చే వారందరి సహకారం తీసుకుని ఐక్యంగా పోరాడాలి. బాధితులకు అండగా సుప్రీంకోర్టులో ప్రైవేటు అప్పీలుకు వెళ్లాలి.
-  జాన్‌వెస్లి
(వ్యాసకర్త కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి) 

Prajashakti Telugu News Paper Dated: 1/05/2014 

No comments:

Post a Comment