Thursday, May 1, 2014

అగ్రకుల దురహంకారానికే హైకోర్టు ఓటు By డాక్టర్‌ శ్రీనివాసరావు చొప్పర


Posted on: Thu 01 May 02:39:55.269521 2014

            మరోవైపు ప్రభుత్వం సైతం ఈ కేసు విచారణ పట్ల దుర్మార్గమైన నిరాసక్తతనూ, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి దోషుల ప్రయత్నాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహకరించింది. ప్రత్యేక కోర్టుకు జడ్జిగా నియమించబడ్డ జస్టిస్‌ డాక్టర్‌ ప్రభాకరరావును ముద్దాయిల ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఒంగోలుకు బదిలీ చేసింది. ఇంతకూ ముద్దాయిల ఫిర్యాదు ఏమిటంటే 'హతుల సామాజిక వర్గానికి చెందిన జడ్జి ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు', కాబట్టి ఆయనను బదిలీ చేయాలనేది వారి ఫిర్యాదు. హంతకులు ఊహించి మాత్రమే చేసిన ఆరోపణ ఆధారంగా అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు వారికి వంతపాడాయి. ఏ సామాజిక వర్గానికి చెందిన జడ్జి ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు అన్న ఫిర్యాదు న్యాయబద్ధమైందిగా తోచిన ప్రభుత్వానికి హైకోర్టులో ఆ న్యాయసూత్రం ఎందుకు వర్తింపజేయలేదు?
          అందరూ శాఖాహారులైతే బుట్టలో రొయ్యలెలా మాయమయ్యాయి అన్నది ఒకనాటి ప్రశ్న. అందరూ నిర్దోషులైతే చుండూరు మారణకాండకు దోషులెవరు అనేది నేటి మిలీనియం ప్రశ్న. పట్టపగలు పోలీసు సమక్షంలో నరమేధం సృష్టించి ఎనిమిది మంది దళితులను నరికిచంపి, అనేకమందిని తీవ్రగాయల పాల్జేసి, కాళ్లూచేతులూ తెగ్గొట్టి చుండూరు దళితవాడను వల్లకాడు చేసిన నరహంతకులు అంతా నిర్దోషులైతే మరి దోషులెవరు? ఈ నెల 22వ తేదీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ చుండూరు నరమేధంపై ఇచ్చిన తీర్పు అగ్రకుల దురహంకారాన్ని పచ్చిగా సమర్థించడమే కాకుండా, ఈ వ్యవస్థ పైన, వ్యవస్థలో భాగస్వాములైన పోలీసు, న్యాయ, కార్యనిర్వాహక వర్గాలపై గతంలో వేసిన అనేక ప్రశ్నలే మళ్లీ తలెత్తుతున్నాయి. అనుమానాలు బలపడుతున్నాయి. నాడు కారంచేడు విషయంలో హైకోర్టు ఏ సాంకేతిక లోపాలనైతే ఎత్తిచూపి కేసు కొట్టివేసిందో, నేడు అవే అంశాలను చూపి ప్రత్యేక కోర్టు 21 మందిపై విధించిన యావజ్జీవ శిక్షను, 35 మందిపై విధించిన ఒక సంవత్సరం శిక్షను హైకోర్టు రద్దు చేస్తూ వారెవ్వరూ దోషులు కారని ప్రకటించింది. క్రింది స్థాయిలో ప్రాసిక్యూషన్‌ (విచారణ తీరు, సాక్షులను ప్రవేశపెట్టడంలో సంబంధిత సిబ్బంది) సరిగా జరగలేదని ప్రత్యేక కోర్టు నైతికతపై ఆధారపడింది తప్ప సాక్ష్యాలపై కాదని చెప్పింది. అందుకు రెండు సాక్ష్యాలను (మొత్తం 70 సాక్ష్యాలు) చూపింది. అలా అది మరోసారి అగ్రకుల దురహంకారానికే ఓటు వేసింది. 
           రాష్ట్రంలో ఒకవైపు రాష్ట్రపతి పాలన, మరోవైపు ఎన్నికలు జరుగుతున్న వేళ కోర్టు తీర్పుకు ముహూర్తం పెట్టడంలో గల ఆంతర్యం ఏమిటి? రాష్ట్ర ప్రజలంతా ఎన్నికల గోదాలో ముమ్మరంగా మునిగితేలుతుండగా, ప్రశ్నించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఏదీ లేకపోవడం వల్ల దళితులను ప్రక్కదారి పట్టించవచ్చు, నిరసన అంటూ ఏదీ లేకుండా చేయవచ్చు అనే పథకమే ఇందులో కన్పిస్తుంది. ఎందుకంటే ఏ సామాజిక వర్గమైతే అక్కడ నరమేధం జరిపిందో అదే సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల వెంటనే వ్యతిరేకత వస్తుందనే దానితో ఈ కాలాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ప్రాసిక్యూషన్‌లో ఎన్నో లోపాలు ఉన్నాయని హైకోర్టు తప్పుబట్టింది. అంటే బాధితుల తరపున బలమైన సాక్షులను ప్రవేశపెట్టడంలో, దోషులను నిర్థారించడంలో విఫలమైందని తెలిపింది. నిజానికి ప్రాసిక్యూషన్‌ విఫలం చెందడం కాదు ఒక పథకం ప్రకారమే కేసు నీరుగార్చిందని చెప్పవచ్చు. ఘటన జరిగిన క్షణం నుంచి విచారణ పూర్తి అయ్యేంత వరకు పోలీసు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగానే ఉంది. నాడు ఆగస్టు 6న చుండూరులో పెద్దఎత్తున మోహరించి ఉన్న పోలీసులు దాడిని నిరోధించడానికి గాని, దళితులను కాపాడడానికి గాని ఏ ప్రయత్నం చేయలేదు. దాడి తమ కళ్ల ముందు జరుగుతూ ఉంటే కనీసం ఆ సమాచారం జిల్లా కేంద్రానికి చేరవేయలేదు. మరుసటిరోజు ఉదయం 11 గంటల వరకు పైఅధికారులకు తెలియజేయకపోవడం, అడిగిన వారికి అంతా ప్రశాంతంగానే ఉందని బుకాయించడం దగ్గర నుంచి, ఈ కేసులో ప్రధాన సాక్షి, దళితుల తల్లో నాలుకలా ఉన్న అనిల్‌కుమార్‌ను పోలీసు కాల్పుల్లో చంపివేసేదాకా అంతా ఒక కుట్రపూరితంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. ఇందులో కేవలం ప్రాసిక్యూషన్‌ వైఫల్యం కాదు, లాలూచీ కూడా ఉందని దళితులు ఆనాడే ఆరోపించారు.
               దళిత సంఘాల, ప్రజా సంఘాల, విప్లవ సంఘాల ఆందోళన మేరకు దేశంలోనే మొదటిసారిగా ఘటన జరిగిన చోటే ప్రత్యేక కోర్టు సాధించుకోవడం జరిగింది. ఇది గొప్ప విజయం కాగా విచారణ ఎంతో ఉద్రిక్త వాతావరణంలో జరిగింది. సాక్షులు తమ సాక్ష్యాలు చెప్పడం కత్తి మీద సాము లాంటిదే. వారిపైన అనేక ఒత్తిళ్లు, బెదిరింపులు, మరోవైపు జీవనోపాధి సమస్య, అనీల్‌కుమార్‌ని లాగా కాల్చివేస్తారనే బ్రతుకు సమస్య నడుమ ప్రత్యక్ష, పరోక్ష సాక్షులు 70 మంది ఎంతో సాహసం చేసి తమ సాక్ష్యాలను రికార్డు చేయడం జరిగింది. అయితే ఆ సాక్షులను, వారి సాక్ష్యాలను సక్రమంగా ఉపయోగించుకోవడంలో ప్రాసిక్యూషన్‌ నిర్లిప్తత కనిపిస్తుంది. కేసును నీరుగార్చిన పద్ధతి స్పష్టంగా తెలుస్తుంది.
            మరోవైపు ప్రభుత్వం సైతం ఈ కేసు విచారణ పట్ల దుర్మార్గమైన నిరాసక్తతనూ, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి దోషుల ప్రయత్నాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహకరించింది. ప్రత్యేక కోర్టుకు జడ్జిగా నియమించబడ్డ జస్టిస్‌ డాక్టర్‌ ప్రభాకరరావును ముద్దాయిల ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఒంగోలుకు బదిలీ చేసింది. ఇంతకూ ముద్దాయిల ఫిర్యాదు ఏమిటంటే 'హతుల సామాజిక వర్గానికి చెందిన జడ్జి ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు', కాబట్టి ఆయనను బదిలీ చేయాలనేది వారి ఫిర్యాదు. హంతకులు ఊహించి మాత్రమే చేసిన ఆరోపణ ఆధారంగా అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు వారికి వంతపాడాయి. ఏ సామాజిక వర్గానికి చెందిన జడ్జి ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తాడు అన్న ఫిర్యాదు న్యాయబద్ధమైందిగా తోచిన ప్రభుత్వానికి హైకోర్టులో ఆ న్యాయసూత్రం ఎందుకు వర్తింపజేయలేదు? ఏ సామాజిక వర్గానికి చెందిన వారైతే హంతకులుగా, ప్రత్యేకకోర్టు దోషులుగా శిక్ష విధించిందో అదే సామాజిక వర్గానికి చెందిన జడ్జితో కూడిన ఇద్దరి ధర్మాసనంకు పై న్యాయ సూత్రం వర్తించదా? అగ్రకుల పెత్తందారీ దురహంకారాన్ని విచారించడానికి అగ్రకుల న్యాయ మూర్తుల నియామకం ఎంతవరకు న్యాయబద్దమో హైకోర్టు చెప్పాలి. ఒకవైపు కోర్టులూ, న్యాయమూర్తులూ అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో నిండా మునిగి, కులం కంపు కొడుతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ప్రకటిస్తుంటే, మారణకాండకు తెగబడ్డ సామాజిక వర్గానికి చెందిన వారే హైకోర్టు ధర్మాసనం అధిష్టించినప్పుడు ఇంతకు మించిన తీర్పును ఆశించడం దుర్లభమే అవుతుంది. ప్రత్యేకకోర్టు మొత్తం 70కి పైగా సాక్ష్యాలను విచారించి 219 మందికి గాను 56 మందిని మాత్రమే దోషులుగా తేల్చింది. అయితే హైకోర్టు అందులో ఒకటి, రెండు సాక్ష్యాలను సాకుగా చూపడంలో శిక్షను అనుభవిస్తున్న వారిని రక్షించాలనే యావతప్ప బాధితులకు, వారి సామాజిక వర్గానికి న్యాయం చేయాలనేది ధర్మాసనానికి లేకపోవడం న్యాయ వ్యవస్థకే సిగ్గుచేటు.
1991 ఆగస్టు 6న చుండూరు పల్లెకు అయిన గాయం కంటే నేడు హైకోర్టు తీర్పుతో ఏర్పడిన గాయం మరింత వేదనాభరితం. ఎందుకంటే ఈ వ్యవస్థ పట్ల, న్యాయస్థానాల పట్ల ఇప్పటి వరకు దళితులకున్న దింపుడు కల్లం ఆశను కూడా వమ్ముచేసింది ఈ తీర్పు. విశ్వాస ఘాతుకానికి పాల్పడింది. ఈ తీర్పు వెలువడి నాలుగు రోజులు కావస్తున్నా ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించకపోవడం అత్యంత విచారకరం. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే వెంటనే అప్పీలు చేయాలనే కనీస ప్రకటన చేయకపోవడం దళితుల పట్ల వారికున్న నిబద్ధతను తెలియజేస్తుంది. దళితుల ఓట్లపై ఉన్న శ్రద్ధ వారికి న్యాయాన్ని, రక్షణను కల్పించడంలో లేశమాత్రంగా కూడా లేకపోవడాన్ని ఇది తెలియజేస్తుంది. అందుకే రేపు జరగబోయే ఎన్నికలలో 'నోటా' బటన్‌కి పని చెప్పాలి, విశ్వాసఘాతుకానికి తగిన బుద్ధి చెప్పాలి.
(వ్యాసకర్త కావలి జెబి కళాశాల లెక్చరర్‌)
- డాక్టర్‌ శ్రీనివాసరావు చొప్పర

Prajashakti Telugu News Paper Dated : 01/05/2014 

No comments:

Post a Comment