Monday, May 5, 2014

వైకల్యాన్ని జయించిన మనిషి కథలు (అవిటి కథలు) By గిన్నారపు ఆదినారాయణ,


మనిషిని మనిషిగా ప్రేమించిన నాడే దేశం బాగుపడుతుంది. అలా కాకుండా మనిషిని ద్వేషించిన నాడు సమాజం పతనానికి దారి తీస్తుంది. నేడు సమాజంలో మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే- ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సాహిత్య పరంగా గమనించినట్లయితే- స్త్రీ వాదం, దళిత వాదం, మైనారిటీ వాదం, బి సి వాదం అంటూ ఏర్పడ్డ అస్తిత్వ వాదాలు నేడు ఎవరి అస్తిత్వాని వారు గట్టిగా నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. స్త్రీ వాదం గురించి స్త్రీవాదులు- స్త్రీవాదేతరులు, దళిత వాదం గురించి దళిత వాదులు- దళితవాదేతరులు, మైనారిటి వాదం గురించి మైనారిటీ వాదులు- మైనారిటీవాదేతరులు, బిసి వాదం గురించి బిసి వాదులు- బిసి వాదేతరులు మాట్లాడుతూ, రాస్తూ తమ వాదాలను గట్టిగా చాటిచెబుతున్నారు. మరి ఈ అస్తిత్వ వాదులు- వికలాంగుల అస్తిత్వం గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వికలాంగులకు ప్రత్యేక అస్తిత్వం లేదా? ఉంటే వారి అస్తిత్వాని నిలిపే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ఇలాంటి సందర్భంలో- తెలుగు సాహిత్యంలో అవిటి కథలు-తో వేముల ఎల్లయ్య, సంపంగి శంకర్‌ వికలాంగులపై వచ్చిన సాహిత్యాన్ని వెలికి తీయడం గొప్ప సాహసం. సమాజంలో తమ అస్తిత్వాన్ని, గుర్తింపును నేటికీ వెతుక్కునే వికలాంగులు, సాహిత్యంలో కనిపించే తమ అస్తిత్వాన్ని తాము నిలబడి గుర్తించకపోవడం సామాజికంగా, చారిత్రకంగా సాహిత్యంలో తీరని లోటే.

ఈ సమాజంలో అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల ప్రజలు నివసిస్తునారు. ఎవరికి వారే తమ తమ వర్గాలు, కులాలు, మతాలకు చెందిన వారికి సహాయ సహకారాలు చేసుకుంటున్నారు. వికలాంగులలో కూడా అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాలకు చెందిన వారు ఉన్నారు. అయినా వారిని మాత్రం ఎవరూ పట్టించుకోరు. అంటే వీరు మనుషులు కారా? ఆయా వర్గాలకి, ఆయా కులాలకి, ఆయా మతాలకి చెందినవారు కాదా? మొదటగా మనిషి ఏదో ఒక వర్గ, కుల, మత సమూహానికి చెందినవాడై ఉంటాడు. ఆ తర్వాత ఏదో అవయవ లోపం వల్ల వికలాంగుడుగా ఉండడం జరుగుతుంది. ఆయా వర్గ, కుల, మాతాలకు చెందిన రాజకీయ నాయకులు ఓట్లకోసం వచ్చేటప్పుడు ఎన్నో మాయ మాటలు చెబుతారు. ఓట్లువేసే సమయంలో వికలాంగులకు వాహనాలు ఏర్పాటు చేసి, మాయమాటలతో మభ్యపె ట్టి ఓట్లు వేయించుకుంటారు. ఆ తర్వాత వారి సమస్యలసై అసెంబ్లీలో కాని పార్లమెంట్‌లో కానీ ఏ ఒక్క పార్టీసభ్యుడూ మాట్లాడరు. వికలాంగులకు న్యాయం జరగాలని, వారిని అన్ని రంగాలలో ప్రోత్సహించాలని, తద్వారా వారు కూడా సకలాంగులతో సమానంగా పోటీ పడగలరని ఎవరూ మాట్లాడరు. ఎందుకు? కనీసం వికలాంగుల అవసరాలకు నెలకు సరిపోయేంత పెన్షన్‌ ఏర్పాటు చేయించరు. అధికారంలోఉన్న నాయకులంటే పదవుల సంబరంలో అన్నీ మరచిపోతున్నారనుకుంటే, మరి ప్రతిపక్షాలలో ఉన్న నాయకులు ఏం చేస్తునట్లు?

ఇటీవలి కాలంలో గత కొన్ని సంవత్సరాల నుండి మంద కృష్ణ మాదిగ వికలాంగుల కోసం ప్రత్యేకంగా పోరాడుతున్నారు. వికలాంగుల హక్కుల కోసం ఒక వ్యక్తి పోరాడుతున్నారంటే కనీసం మద్దతు ఇవ్వాలన్న ఆలోచన కూడా ప్రతిపక్ష నాయకులకు లేకుండా పోయింది. మద్దతు ఇవ్వడంవల్ల, ఆ గొప్పతనం సమస్యను మొదలు పెట్టిన వ్యక్తికి పోతుందని ఆలోచించారో, లేక వికలాంగుల కోసం పోరాడడం వల్ల ఏం వస్తుంది అని అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు. నేటి పోటీ ప్రపంచంలో వికలాంగులు సైతం తమ కున్న పరిమిత రిజర్వేషన్లను ఉపయోగించుకొని అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే కన్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన క్రిష్ణగోపాల్‌ సింగ్‌ అంధులలో మొట్ట మొదటగా ఐఏయస్‌ సాధించిన వ్యక్తి. తర్వాత హర్యానా రాషా్టన్రికి చెందిన అజిత్‌ కుమార్‌ ఐఏయస్‌ సాధించి, తాము కూడా అందరితో సమానంగా పోటీ పడగలమని నిరూపించారు. అలాగే నర్తకి సుధారామ చంద్రన్‌, నాట్య మయూరి అన్నపూర్ణ, విలియం క్రోయిజన్‌, ఇరవై ఒక్క మైళ్ళ పొడవున ఉన్న ఇంగ్లీష్‌ చానల్‌ ఈదిన వ్యక్తిగా హరిరామ కోహ్లి, అలాగే యమునా నదిని ఈదిన వ్యక్తిగా దీపా మాలిక మొదలైన ఎందరో వికలాంగులు పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ముఖ్యంగా అంధుల కోసం ప్రత్యేక లిపి తయారు చేసి, అంధులు చదువుకోవాలని ఆశించిన మహానుభావుడు లూయి బ్రెయిల్‌. ఇలా ఇంకా ఎంతోమంది వికలాంగులు చదువుకొని విద్య, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయ, సాహిత్య రంగాలలో పైకెదుగుతున్నారు.

ఇటీవలి కాలంలో సాహిత్య రంగంలో వీరిగురించి- అవిటి కథలు- అనే కథా సంకలనం వెలువడింది. ఇది గర్వించదగిన విషయం. సాహిత్యంలో వికలాంగుల బతుకు చిత్రణ చేసినవారు చాలా అరుదు. అవిటి కథలు కథాసంపుటిలో 25 కథలతో 204 పేజీల నిడివితో మన ముందుంచారు వేముల ఎల్లయ్య ,శంకర్‌ సంపంగి.
ఈ సంపుటిలో కుష్టాది కిష్టయ్య- కథను వేముల ఎల్లయ్య చాల గొప్పగా రాశాడు. ఇందులో కిష్టయ్య కుష్టాది కిష్టయ్యగా మారుతాడు. కిష్టయ్య- నర్సవ్వ భార్యా భర్తలు. కిష్టయ్య మాదిగ కులస్థుడు. వారి తాత ముత్తాతలు నిజాం పాలనలో నిజాంకు చెప్పులు కుట్టి, కచ్చురాలకు మూగలు, పట్టిలు కుట్టి, తుపాకులకు పౌచులు వార్లు కుట్టినందుకు భూమి ఇనాంగా ఇస్తారు. కిష్టయ్య ముత్తాతలు అప్పుడు భూమిని సాగు చేసేవారు. తర్వాత తర్వాత కాపులు, కరణాలు భూమికి శిస్తు కట్టాలని మాదిగలను హింసిస్తారు. తర్వాత కొన్ని రోజులకు కరువు రావడం వల్ల భూమి చేసుకోడానికి ఇబ్బంది పడి అందరూ కూలీలుగా మారుతారు. ఆ భూమిని కాపులు స్వాధీనం చేసుకుంటారు. తర్వాత కొన్ని రోజులకు రోజువారీ పని చేసి చాలీ చాలని తిండి తింటూ కుష్ఠు రోగం వచ్చి అనేక ఇబ్బందులు పడతాడు కిష్టయ్య. కిష్టయ్యకు ఇంటి పేరు మరొకటి ఉన్నా కుష్టి పేరుతో, కుష్టాది కిష్టయ్యగా పిలుస్తారు. తర్వాత కిష్టయ్య పట్నం వచ్చి వికలాంగుల కోసం, కుష్టాదివాళ్ళ కోసం పోరాడి భిక్షగాడిగా మారతాడు. సమాజంలో బీదవారికే అన్ని రోగాలు వస్తాయి. నిమ్న జాతుల వారిని ఇంకా నిమ్నంగా చూడడాన్ని ఈ కథ తెలుపుతుంది.

చూపున్న పాట కథను పతంజలి రాశారు. ఇందులో విశ్వనాథం పోలీస్‌ ఆఫీసరు. రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చే దారిలో రోడ్డు పక్క ఒక గుడ్డివాడు మురళి వాయిస్తూ అడుక్కునేవాడు. ఒక రోజు విశ్వనాథం ఆ గుడ్డి వాని దగ్గర ఆగి నిల్చుంటాడు. ఆ గుడ్డివాడు తన మురళి ద్వారా గద్దర్‌ పాటలు పాడుతుంటాడు. విశ్వనాథం అతని దగ్గరికి వచ్చి- నువ్వు ఈ పాటలు ఎందుకు పాడుతున్నావు, అసలు నువ్వు ఎవ్వరు, ఎక్కడుంటావు, నువ్వు ఈ పాటలే ఎందుకు పాడుతున్నావు, నువ్వు నక్సలైటువా, కమ్యునిస్టువా- అని ప్రశ్నిస్తాడు. నువ్వు ఈ పాటలు పాడద్దు, దేవుడి పాటలు పాడితే ఎక్కువ డబ్బులు వస్తాయి- అని ఉచిత సలహాలు ఇస్తాడు. అసలు మురళి శ్రీ కృష్ణునిది (దేవుడి) కదా! నువ్వు దానితో గద్దర్‌ పాటలు ఎందుకు పాడుతున్నావు అంటాడు. చివరకు- నువ్వు నక్సలైటు- అని ఆ మురళిని కాలు కింద వేసి తొక్కేస్తాడు. నక్సలైట్ల పై ఉన్న కసిని ఆ గుడ్డి వానిపై చూపిస్తాడు. ఒక వ్యక్తికి ప్రజల సమస్యల పై రాసిన పాటలు పాడే హక్కు లేదా? ఇలా బతుకు దెరువు కోసం వచ్చిన గుడ్డివాడి బాధను అద్భుతంగా ఈ కథలో చిత్రించడం జరిగింది.

పెద్దరోగం- కథ కెమరా విజయ్‌ కుమార్‌ రాస్తూ వికలాంగుల్లో సైతం కుల వ్యవస్థ ఉందని తెలియ జేశారు. రవి ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాష్టారు. రవి ప్రతిభను గుర్తించిన రాష్ట ప్రభుత్వం- ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు ప్రకటిస్తుంది. జనాభా లెక్కల సేకరణలో అందరి కంటే ముందుగా తన బాధ్యత పూర్తి చేసినందుకు ఈ అవార్డు ఇస్తుంది. కాని ఆ అవార్డు రవికి ఇష్టం లేదు. జనాభా లెక్కలలో భాగంగా గ్రామంలోని అన్ని ఇండ్లు తిరుగుతాడు. చివరకు ఒక ఆస్పత్రికి వెళ్లి అక్కడి వారందరినీ చూసేసరికి రవికి జాలి వేస్తుంది. చాలా మంది కూడు, గూడు, గుడ్డ లేనివాళ్ళు ఇక్కడే జీవనం గడుపుతున్నారు. దేవుడికి ప్రార్ధన చేస్తూ అక్కడే ఉంటారు. రవి వారి దగ్గరకు వెళ్లి ఒక్కొక్క రోగి పేరు, ఊరు, కులం అన్ని వివరాలు రాస్తూ ఉండగా- మీ కులం ఏమిటి- అని అడిగితే వారు రెండవ కులం, మూడవ కులం అని సంఖ్యా రూపంలో చెపితే రవికి ఆశ్చర్యం కలుగుతుంది. వివరంగా అడిగితే వారు- రెండవ కులమంటే మాల అని, మూడవ కులం అంటే మాదిగ అని చెప్తారు. రవికి అలా ఎందుకు చెబుతున్నారో అర్థం కాలేదు. తర్వాత తర్వాత అందర్నీఅడిగే సరికి అర్ధం అయింది. వికలంగుల్లో కూడా కుల ప్రస్తావన ఉందని, తక్కువ కులం వాళ్ళను అగ్ర కులస్థులు కించపరుస్తూ, హేళన చేస్తారని. అందుకే రాష్ట ప్రభుత్వం ప్రకటించిన అవార్డును తిరిగి వెనక్కి పంపిస్తాడు. ఆసుపత్రిలో జరిగిన సంఘటనను చూసి- కీర్తి కోసమో, అపకీర్తి కోసమో ఈ అవార్డును తిరస్కరించడం లేదు. కేవలం ఆత్మసంతృప్తి కోసమే- అని, కుష్టు కంటే ముందు కులాన్ని నయం చేసే ఆస్పత్రులు ఈ దేశంలో రావాలని, కుల నిర్ములన జరగనిదే ఈ దేశం బాగుపడదని గొప్ప సందేశం తెలియజేశాడు రచయిత.

లచ్చిమి కథను పిట్టల శ్రీనివాస్‌ రాశారు. ఇందులో- ఒక వ్యక్తి అవిటి అయినంత మాత్రాన అన్యాయం న్యాయం అయిపోతుందా- అని ఈకథ ద్వారా చక్కగా ప్రశ్నించారు. లక్ష్మి నల్గొండ జిల్లాకు 20 మైళ్ళ దూరంలో మాడగుల పల్లిలో ఉంటుంది. ఆమె నల్లగున్నా అందమైనది. తల్లి దండ్రులకు ఒక్కతే బిడ్డ. చదువు చిన్నప్పుడే మానేస్తుంది. తర్వాత తాను పెద్దదయ్యేకొద్దీ తమ ఇంట్లో తానే అన్నీ చూసుకుంటోంది, వ్యవసాయానికి సంబంధించిన పనులతో సహా. ఆ ఊరి దొర కొడుకు కన్ను- లచ్చిమి మీద పడింది. ఒక రోజు లచ్చిమి ఒంటరిగా ఉండడం చూసి ఆమెపై అత్యాచారం చేసి, ఎవరికైనా చెబుతుందేమో అని ఆమె నాలుక కోసి వెళ్ళిపోతాడు. లచ్చిమి కొన్నిగంటల తర్వాత స్పృహలోకి వచ్చి, ఆ బాధతో ఇంటికి వెళ్ళలేక అక్కడనుండి రైలు పట్టాల వెంబడి నల్గొండకు వెళ్లి అక్కడ కొంత మంది వికలాంగులతో కలిసి బతుకుతుంటుంది. తర్వాత రాజు అనే అతనితో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి- కోర్టులో దొర కొడుకు పై కేసు వేస్తుంది. దొర కొడుకు- లచ్చిమి మూగది కదా, అది తననేం చేస్తుందిలే అనుకొని దర్జాగా తిరుగుతుంటాడు. తర్వాత కోర్టులో లచ్చిమి మిషన్‌కు నాలుక పెట్టి జరిగిన విషయం అంతా చెబుతుంది. దొర కొడుకు అది చూసి బిత్తర పోతాడు. చివరకు అతనికి శిక్ష వేస్తుంది కోర్టు. తర్వాత, తన మిత్రులైన వికలాంగులతో తన ఇంటికి వెళ్లి, తన మిత్రులందరికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, తన భూమిలో వారికి పనులు చూపి ఉపాధి కల్పిస్తుంది. తల్లి దండ్రులు ముందు బాధపడ్డా, తర్వాత ఆమె చేసే పనులు చూసి సంతోషిస్తారు. ఆమెను అవిటిని చేసినంత మాత్రాన అన్యాయం- న్యాయం అయిపోదు అని వికలాంగుల బాధల గాథƒను చక్కగా చిత్రించడం జరిగింది.

జేజి అనే కథలో భూతం ముత్యాలు తన అనుభవంలో చూసిన సంఘటనను చక్కగా రాశారు. జేజి ఓఅందమైన చురుకైన అమ్మాయి. ఆమెది నల్గొండ జిల్లాకు సమీపంలో ఉన్న బాషగూడ. నల్గొండ ప్రాంతం ఉప్పు నీళ్ళకు ప్రతీక. అక్కడ మొత్తం ఉప్పు నీళ్ళు కావడం వల్ల పిల్లలకు పసితనంలోనే పోలియో వచ్చి, కాళ్ళు- రెక్కలు పనిచెయ్యక పోయేవి. అలాంటి భాదితురాలే జేజి. జేజి బాల్యంలో కొంత బాగానే ఉన్నా, తర్వాత కొన్ని రోజులకు కాళ్ళు పూర్తిగా సన్నబడతాయి. బడికి వెళ్ళడం ఇబ్బంది అయ్యింది. అయినా బడికి ఇబ్బంది పడుతూనే వెళ్ళేది. అక్కడున్న బడి ఒక కుటుంబం లాంటిది. జేజి అంటే ఉపాధ్యాయులకు ఎంతో ఇష్టం. ఎందుకంటే జేజి తెలివికల్ల అమ్మాయి. జేజికి బడిలో ఏదన్నా తిందామన్నా, తాగుదామన్నా భయమేసేది. తింటే మలం వస్తుందని, తాగుతే మూత్రం వస్తుందని, అందుకోసం నడుస్తే ఇబ్బంది అని, తినలేక తాగలేక ఒంటరిగా కుమిలిపోతూ ఉండేది. సమాజంలో ప్లోరిన్‌ వల్ల పోలియోతో బాధ పడుతున్న ఇలాంటి సంఘటన ద్వారా రచయిత హృదయాన్ని కదిలింప జేశారు.
తనే కథ- అనే కథను పుస్తక సంపాదకుడు సంపంగి శంకర్‌ తన ఆత్మకథగా అద్భుతంగా తెలియజేశారు. తాను పుట్టినప్పటి నుండి, అనగా తనకు జ్వరం వచ్చి కాళ్ళు పడిపోయినప్పటి నుండి యస్‌యస్‌సి, ఇంటర్‌, డిగ్రీ, పీజిలో మిత్రులతో, చుట్టుపక్కల వారితో తాను పడ్డ అవమానాలు, పి హెచ్‌డి చదువుతూ నేడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వరకు తాను ఎదుర్కొన్న సమస్యలను, ఆటుపోట్లను చక్కగా వివరించారు. ఈ కథ తన ఆత్మకథగా చెప్పవచ్చు.

ఈ కథా సంపుటిలో ఉంగరం కథను యుసేఫ్‌ ఇంద్రిస్‌, అమ్మత్యాగం కథను కొమ్ము సతీష్‌, గుడ్డివాడు కథను రావులపాటి సీతారామారావు, ఎద్దు చస్తే ఎట్టమ్మా కథను డాశ్రీలత, ఒక తల్లి కథను పటేల్‌ సుధాకర్‌ రెడ్డి, అన్నీ మేమే చెయ్యాలా కథను అక్కినేని కుటుంబరావు, ఎంపు కథను చాగంటి సోమయాజులు, ఖరిదుల్లా పూల దుకాణం కథను సిద్ది, చెంచి అను కథను గూడూరు రాజేంద్ర రావు, ఇంతేనా ఈ బతుకులు కథను ఎ మోహన… మురళి, ప్రత్యామ్నాయం కథను కె. వరలక్ష్మి, ఊహలకే రెక్కలు వస్తే కథను ప్రవహ్లిక, అందని పిలుపు కథను పి జయశ్రీ, కను పాపాలు జిల్లెడుపాలు- కథను రాజేందర్‌ శంకవరవు, ఎదురీత కథను నాగరాజు అసిలేటి, ఉప్పనీరు కథను బోయ జంగయ్య, ఒంటికాలి శివుడు కథను బెజ్జారపు రవీందర్‌, చంద్రునిలో మచ్చలాంటిదే కథను కమలపాటి వెంకట శాంత లక్ష్మి, జ్ఞాన నేత్రం కథను చక్కిలం విజయలక్ష్మి రాశారు. ఈ అన్ని కథల్లో వికలాంగులు ఎదుర్కుంటున్న బాధల గాథలలు, సమాజం వారిని చూస్తున్న విధానం, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను రచయితలు కళ్ళకు కట్టినట్లు చూపారు.

Surya Telugu News Paper Dated: 5/4/2014 

No comments:

Post a Comment