Saturday, June 2, 2012

రంగనాయకమ్మకు పాఠం - బి.ఎస్.రాములు



ఇటీవల కెజి సత్యమూర్తి చనిపోయిన తర్వాత కొందరు ఎలిజిలు రాస్తే,రంగనాయకమ్మ ఆయన రాసిన 'అంబేద్కర్ సూర్యుడు' పుస్తకాన్ని విమర్శిస్తూ 'అస్తవ్యస్త సంస్కరణలు' అనే వ్యాసం (15 మే, ఆంధ్రజ్యోతి) రాశారు. సత్యమూర్తి రాసిన ఆ పుస్తకం రంగనాయకమ్మ రాసిన 'బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు - మార్క్స్ కావాలి' అనే పుస్తకానికి పూర్తిస్థాయి జవాబుగా రాసిన సిద్ధాంత గ్రంథం. సత్యమూర్తి బతికున్నప్పుడు ఆమె ఆ పుస్తకానికి జవాబు రాయలేదు. 

జవాబు రాయాల్సిన అవసరం వుందని కూడా భావించలేదు. ఆ పుస్తకం తన పుస్తకానికి జవాబు అని ఇప్పటికీ అనుకోలేదట. అయినా ఆయన చనిపోయాక ఆ పుస్తక అంశాలను, సత్యమూర్తిని విమర్శిస్తూ ఆ వ్యాసం రాశారు. సత్యమూర్తి బతికున్నప్పుడు రాయకుండా చనిపోయాక వెంటనే రాయడం ఎందుకు? ఇంకో ఏడాది తర్వాత రాయవచ్చు కదా! ఏం సంస్కారం ఇది? 

రంగనాయకమ్మకు అందని జవాబును ఇప్పటికైనా, ఎప్పటికైనా ఇవ్వడం అవసరమే. సత్యమూర్తి అర్థం చేసుకున్న ఆచరించిన మార్క్సిజం, వగైరా ఏమిటో కూడా తెలుసుకోవడం అవసరం. రంగనాయకమ్మ, సత్యమూర్తి తులనాత్మక అధ్యయనం ద్వారా సైద్ధాంతిక, ఆచరణాత్మక విశ్లేషణ, విమర్శ చేయడం అవసరం. 

మార్క్స్ అవసరాన్ని సత్యమూర్తి నిరాకరించలేదు. అయితే రంగనాయకమ్మ తన పుస్తకం పేరు సూచించే భావానికి విరుద్ధంగా 'బుద్ధుడు అక్కర్లేదు, అంబేద్కర్ అక్కర్లేదు - మార్క్స్ ఒక్కడే చాలు' అనే అర్థం వచ్చే విశ్లేషణ, విమర్శ చేశారు. పుస్తకం పేరు బుద్ధుడు, అంబేడ్కర్‌తో మార్క్స్, మార్క్సిజం అవసరమని పుస్తకంలో రాశారని అర్థం ఇస్తుంది. బుద్ధుడు, అంబేడ్కర్‌తో పాటు మార్క్స్, మార్క్సిజం అవసరం ఎంతైనా వుంది. నిజానికి బుద్ధుడు, ప్లేటో, అరిస్టాటిల్, హెరాక్లిటస్, కణాదుడు, సాంఖ్యం, ఏసుక్రీస్తు, ఆచార్య నాగార్జున, ఆదిశంకరాచార్య, మహ్మద్ ప్రవక్త, మాగ్నాకార్టా, గురునానక్, కబీర్, 

గురు రవిదాస్, యూరప్‌లోని రినైజాన్స్, బంగారం కోసం, భారతదేశం కోసం యూరప్ రాజ్యాలు చేసిన సముద్ర మార్గాల అన్వేషణ, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాలలో వలసల స్థాపన, తద్వారా సాగిన యూరప్ పారిశ్రామిక విప్లవం, ఆ క్రమంలో జర్మనీలోని కాంట్ హెగెల్, ఫ్యూర్‌బా, అటు తర్వాత రికార్డో, థామస్ పెయిన్, జ్యోతిబా ఫూలే, ఫ్రెంచ్ రివల్యూషన్, బ్లాంకిస్టులు, మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, స్టాలిన్, అంబేడ్కర్, మావో అనే క్రమంలో ఆమె పుస్తకం రాయాలి. అది చారిత్రక, ఆర్థిక, సామాజిక, తాత్విక, విప్లవ, ఉద్యమ పరిణామ క్రమాలను సమగ్రంగా పరిశీలిస్తూ రాసినప్పుడే అది సమకాలీనతను, సమగ్రతను సంతరించుకుంటుంది. దీన్నే హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ అని, హిస్టరీ ఆఫ్ ఎవల్యూషన్ అని, రివల్యూషన్ అని రకరకాల పేర్లతో వివరిస్తారు. 

ఈ ప్రపంచ పరిణామం ఆమెకు తెలుసో లేదో తెలియదు. మార్క్సిజం పేరిట ఆయా దేశాల్లో సాగిన ఉద్యమాలు, వారి అనుభవాలు కలుపుకొని స్థల కాలాల నిర్దిష్ట పరిస్థితుల్లో కొన్ని సూత్రీకరణలు అదనంగా చేసుకుంఊట వస్తున్నారు. వాటిని కొందరు అంగీకరించారు. కొందరు అంగీకరించలేదు. కొందరు మార్క్స్ దగ్గర ఆగిపోతే, కొందరు లెనిన్ దగ్గర, కొందరు మావో దగ్గర ఆగిపోతారు. ఆయా కాలాల్లో వారి సమకాలికులు, సహచరులు వీరి సూత్రీకరణలకు భిన్నంగా అనేక కోణాలను సూత్రీకరించారు. అయితే వారు అధికారంలో లేరు. అధికారంలో ఉన్న వారివే ఆయా ప్రబుత్వాల తరఫున ప్రపంచ భాషల్లోకి అనువదించి అందించారు. 

రష్యా, చైనా, క్యూబా, ఇటలీ, వియత్నాం, తూర్పు యూరప్ దేశాలు, అమెరికా, ఆఫ్రికా, ఇండియా, నేపాల్, ఇరాన్ వంటి దేశాల్లో ఎక్కడికక్కడ తమకు అందిన మార్క్సిస్టు సాహిత్యం మేరకు తమ ప్రాంత సమాజ పరిణామాల అవసరం మేరకు సామాజిక న్యాయం కోసం, సామాజిక మార్పు కోసం, వ్యవస్థ పునర్‌నిర్మాణం కోసం, నూతన వ్యవస్థ ఏర్పాటు కోసం ఇలా అనేక దశల్లో కార్మికవర్గ దృక్పథాన్ని, మార్క్సిజాన్ని, దాని వెలుగును తమ అవసరాల మేరకు స్వీకరిస్తూ వుంటారు. కొన్ని తమవైన ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగానే సూత్రీకరణలు చేసుకుంటారు. ఒక ఆచరణ ఒక అనుభవాన్ని ఇస్తుంది. 

ఆ ఆచరణ నుండి పుట్టే అనుభవం వారి సొంతం. ఆ అనుభవం నూతన సూత్రీకరణలకు దారి తీయవచ్చు. ప్యారిస్ కమ్యూన్ అనుభవం నూతన సూత్రీకరణలకు దారి తీసింది. జార్ రష్యా విప్లవం అనుభవం నూతన సూత్రీకరణలకు దారితీసింది. ఇలా ఆచరణలో అనుభవాలు నూతన జ్ఞానాన్ని సంపాదించుకుంటాయి. మార్క్సిజం అనేది ప్రతి ఒక్కరికి అధ్యయనం ద్వారా అందుతున్న పరోక్ష జ్ఞానం. వారి ప్రత్యక్ష ఆచరణ ద్వారా కలిగే జ్ఞానం కూడా వుంటుంది. అది పరోక్ష జ్ఞానాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తుంది. తన అనుభవం ఇచ్చే ప్రత్యక్ష జ్ఞానంతో ఆయా పరోక్ష జ్ఞానం కూడా వుంటుంది. 

అది పరోక్ష జ్ఞానాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తుంది. తన అనుభవం ఇచ్చే ప్రత్యక్ష జ్ఞానంతో ఆయా పరోక్ష జ్ఞానం సిద్ధాంతాలను, సూత్రీకరణలను మార్చుకుంటారు. విభేదిస్తారు. కొత్త సూత్రీకరణలను చేస్తుంటారు. ఇలా ఎవరి అధ్యయన స్థాయిననుసరించి, ఆచరణ స్థాయి ననుసరించి వారి వర్గ చైతన్యం అనుసరించి నూతన ఆచరణ, నూతన సూత్రీకరణలకు, ఆ సూత్రీకరణ ద్వారా నూతన ఆచరణకు అనగా నూతన వ్యూహం, ఎత్తుగడలు, కార్యక్రమాలు, నూతన ఉద్యమ నిర్మాణాలకు రూపం ఇస్తుంటారు. ముందుకు సాగుతుంటారు. వారిని ఆగిపోయినవారో, విభేదించేవారో మార్క్సిస్టులు కారని వారిది మార్క్సిజం కాదని అంటుంటారు. 

అలా రకరకాల పార్టీలు, ఉద్యమ సంస్థలు, సామాజిక సంస్థలు ఉద్యమాలను ఎలా చేయాలి? ఏ వర్గాల్లో సమీకరించాలి? ఎక్కడ సమీకరించాలి? ఏ వర్గాలను సమీకరించాలి? పేదల్లోనా? మేధావుల్లోనా? రచయితల్లోనా? మొదలైన ప్రాధాన్యతలు ఎక్కడికక్కడ మార్చుకుంటున్నారు. వీటికి అతీతంగా కూడా స్థూలంగా మార్క్సిస్టు దృక్పథం, మెథడాలజీని అంగీకరిస్తూ తమ రంగాల్లో పనిచేసే వాళ్లు కూడా ఉంటారు. రంగనాయకమ్మ కొన్ని దశాబ్దాలుగా ఈ కోవకు చెందిన ఒక మార్క్సిస్టు కావచ్చు. ఆమె మార్క్సిస్టు అవునా? కాదా? ఏ స్కూల్ ఆఫ్ థాట్ మార్క్సిస్టు, ఫెమినిస్టు అనేది ఆమె తేల్చుకోవాలి. 

మనకు చెప్పాలి. ఆమె ఆచరణ ఆమె చెబుతున్నదానికి అనువుగా వుందా? అనేది కూడా చూడాలి. ఆమె ఈ ప్రభుత్వాలను బూర్జువా ప్రభుత్వాలని, బూర్జువా యంత్రాంగమని విమర్శిస్తుంటారు. తమకు నచ్చనివారిని బూర్జువాల తొత్తులు, బూర్జువాలుగా మారదల్చుకున్నారని, పెటి బూర్జువాలని, ఈ బూర్జువా వ్యవస్థను కొనసాగిస్తూ నిలబెడుతున్నారని విమర్శిస్తుంటారు. రంగనాయకమ్మ వర్గం ఏమిటి? ఆమె కార్మికవర్గ మేధావా? కార్మికవర్గ రచయిత్రా? అది ఆమె స్పష్టం చేయాలి. అలా స్పష్టం చేసిన తర్వాత ఆమె వ్యక్తిగత జీవిత ఆచరణతో తులనాత్మకంగా పరిశీలించి బేరీజు వేసి అంచనాకు రావాలి. 

రంగనాయకమ్మ ఈ బూర్జువా వ్యవస్థలోని సకల సౌకర్యాలను, అభివృద్ధిని వినియోగించుకుంటున్నారు. ఈ బూర్జువా విద్యావిధానాన్ని అందుకొని ఆమె, ఆమె పిల్లలు ఎంతోకొంత ఇదే వ్యవస్థలో ఆర్థికంగా, కీర్తిపరంగా సప్త సంపదల్లో, సప్త ఐశ్వర్యాల్లో కొన్ని సాధించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బూర్జువా వ్యవస్థలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక అభివృద్ధిని, సౌకర్యాలను, ఆధునిక విద్యను తాము కూడా అందుకోవాలని, అది అందని వాళ్లు కోరుకుంటూ ఉద్యమిస్తారు. 

పోరాటాలు చేస్తారు. వ్యక్తిగత ఆస్తిగల వ్యవస్థలో ఆస్తిపరులు ఎలాగైనా ఎదుగుతారు. రెక్కలు తప్ప ఏమీ లేని పేదలు తాము ఆత్మగౌరవంతో ఎదగడానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు సామాజికన్యాయం తమకు అందాలని, ఇప్పుడు రంగనాయకమ్మ వంటి కొందరికే అందుతున్నాయని, మాక్కూడా అందాలని కోరుకుంటున్నారు. ఇది తప్పా? నేరమా? దానికి మద్దతుగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులనో, మరికొన్ని సిద్ధాంతాలనో ఆసరా తీసుకొని పోరాటం చేయడం, డిమాండ్ చేయడం నేరమా? ప్రజలకు అలా తమకు నచ్చిన పద్ధతిలో ఆధునిక అభివృద్ధిలో వాటా కోరుకోవడం నేరమా? అదే నేరమైతే కార్మికులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కూలీలు, విద్యార్థులు చేసే పోరాటాలన్నీ, డిమాండ్లన్నీ నేరమే అవుతాయి. 

అయితే ఆధునిక అభివృద్ధిలో అత్యధిక వాటాను సగటు పౌరునిగా అందుకుంటున్న రంగనాయకమ్మకు వాటి కోసం చేసే పోరాటాలను, ఉద్యమాలను, డిమాండ్లను అస్తవ్యస్త సంస్కరణలు, సంస్కరణవాదాలు, అస్తిత్వవాదాలను విమర్శించే హక్కుందా? మీరు పెటీ బూర్జువా బతుకు బతుకుతూ ఇతరులు అలాంటి బతుకు కావాలని కోరుకుంటే విమర్శిస్తారా? మీ అభివృద్ధిలో వాటా కోరితే అది అందుకునే మార్గాలకు విప్లవం చేయాలి. 

కాని మీరు మాత్రం మార్క్సిస్టు మేధావులుగా, పెటీ బూర్జువాలుగా సకల సౌకర్యాలను ఈ బూర్జువా వ్యవస్థలో అనుభవిస్తూ పేరు సంపాదించుకోవాలి. మీ పేరు మీకొక వ్యక్తిగత ఆస్తిగా నిలిచిపోవాలి. రంగనాయకమ్మ అనే అస్తిత్వం కోల్పోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కార్మికవర్గం, కష్టజీవుల గురించి మీరేమైనా రాశారా? ఇప్పటివరకూ రాసింది కేవలం మీ పెటీ బూర్జువా, మధ్యతరగతి గురించి మాత్రమే! మీ జీవితం పెటీ బూర్జువా జీవితం. 

మీరు రాసింది పెటీ బూర్జువా మధ్యతరగతి జీవితం. మీరు మార్క్సిస్టులు ఎలా అయ్యారు? ఎప్పుడు అయ్యారు? మార్క్సిజం పేర్కొనే ప్రజల గురించి మీ ఫిక్షన్‌లో రాయకుండా పెటీ బూర్జువా సెక్షన్‌లో రచయిత్రిగా నిలబడి వారి ద్వారా మీ మద్దతు దారులను సాధించుకొని ఈ అభివృద్ధిని కాస్తయినా అందుకోవాలని కోరే వారి మీదికి రకరకాల పదజాలంతో విరుచుకు పడతారా? మీ రచనలు చదువుతున్న పాఠకులు ఎవరో వారి వర్గమేమిటో ఎప్పుడైనా సర్వే చేశారా? అందులో కార్మికవర్గం ఎంతమేరకు వున్నారు? మిమ్మల్ని విమర్శించేవారు రాకపోవడానికి ప్రధాన కారణం మీలాంటి జీవితాలు జీవిస్తున్నవారే మీ రచనలు చదివి మీ అభిమానులుగా మారడం! 

- బి.ఎస్.రాములు
సామాజిక తత్వవేత్త

Andhra Jyothi News Paper Dated : 29/05/2012 

No comments:

Post a Comment