Monday, June 11, 2012

కుల నిర్మూలన ఎలా? - డా.డి.ఎల్.విద్యరంగనాయకమ్మ 'అస్తవ్యస్త సంస్కర్తల'కు ప్రతిస్పందిస్తూ డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు 'విప్లవవాదులు ఎవరు మరి?' అని ప్రశ్నించారు. ఆయన తన వ్యాసంలో 'నిచ్చెన మెట్ల వ్యవస్థ'లో అగ్రకులాల వారు 'దోపిడీ చేసేవారు' అనీ, 'నిమ్న కులాల వారు' దోపిడీకి గురయ్యే శ్రామికులు అని, ఇండియాలోని వర్గాలని విశదీకరించారు. అగ్రకులాలు అనుకునే వారిలో కూడ ఆర్థికంగా బాగా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే అటువంటి వాళ్ళు నిమ్న కులాల వారిలోనే అధికంగా ఉన్నారన్నది వాస్తవం. కాబట్టి ఈ విభజనని పెద్దగా వ్యతిరేకించనవసరం లేదు. 

రెండు వర్గాల్ని గుర్తించినప్పుడు వర్గ పోరాటమే జరగాలి కదా. ఆ వర్గ పోరాటం ఎలా జరగాలన్న అవగాహనలో ఉన్నారు డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు? 'రిజర్వేషన్ల' వల్ల, 'వర్ణాంతర వివాహాల' వల్ల కులాలు పోతాయన్నది సత్యమే కాని పాక్షిక సత్యం; కొంతే పరిధి ఉన్న సత్యం. ఇది కాక, ఇంకా ఏదైనా సిద్ధాంతం కాని, పోరాట నిర్మాణాలు కాని దళిత ఉద్యమానికి ఉంటే రచయిత వివరించాలి వ్యాస పరంపరల ద్వారా. న్యాయ పోరాటాల గురించి తెలుసుకోవడం ఓ విజ్ఞాన సముపార్జన, ఓ ఆనందం. 

కుల నిర్మూలనకి మాకు తెలిసిన మార్గాలు మూడు. అవి: రిజర్వేషన్లు; కులాంతర వివాహాలు; దోపిడీ రహిత సమాజం. 'కుల నిర్మూలనే అంతిమ లక్ష్యం' అంటున్నారు రచయిత. 'దళిత సమస్య పరిష్కారానికి అంబేద్కర్ మాత్రమే సరిపోతారు, అందుకు ఎవరి సిద్ధాంతాల కోసమో ఎదురు చూసి అడుక్కోవలసిన స్థితిలో లేదా భావ దారిద్య్రంలో దళితులు లేరు' అని అన్నారు. అంటే 'మార్క్సిస్టు సిద్ధాంతం అవసరం లేదు' అనడమే కదా! లేదా 'ఇక దోపిడీ రహిత సమాజం, శ్రమ సంబంధాల్ని పూర్తిగా మార్చెయ్యడం ప్రస్తుత దశ కానప్పుడు దాని గురించి చర్చ చెయ్యడం అనవసరం' అంటున్నారు కాబట్టి రిజర్వేషన్లు, 'వర్ణాంతర వివాహాల' ద్వారా కుల నిర్మూలన చేసేసి, అప్పుడు దోపిడీ రహిత సమాజం వైపు దృష్టి పెడతారన్న మాట. 

నిచ్చెన మెట్ల కులాలే వర్గాలన్నారు! 'కుల నిర్మూలనే' దోపిడీ నిర్మూలన అవదా? 'కుల నిర్మూలన' తర్వాత మళ్ళీ తర్వాత దశలో 'దోపిడీ రహిత సమాజం' గురించి చర్చ ఎందుకు? 'రిజర్వేషన్లు', 'వర్ణాంతర వివాహాల' ద్వారా ఎంత వరకూ 'కుల నిర్మూలన' సాధ్యమవుతుందో చూడవలసివుంది. 'కుల నిర్మూలన'కి ఇంకా ఏవైనా ఇతర మార్గాలు ఉంటే వివరించమని రచయితకి మనవి చేసుకొంటున్నాను. 

'రిజర్వేషన్ల' మార్గాన్ని పరిశీలిద్దాం. దళిత సమస్య పరిష్కారానికి 'బుద్ధుడు చాలడు! అంబేద్కర్ చాలడు! మార్క్సు కావాలి' అన్న రంగనాయకమ్మ పుస్తకం చదివితే దళిత సమస్య పరిష్కారానికి రిజర్వేషన్ల పరిధి ఏమిటి? అన్న ఆలోచన వస్తుంది. రంగనాయకమ్మ బుద్ధుడు చాలడు! అన్నారు; పనికి రాడు అనలేదు. హేతుబద్ధంగా ఆలోచించడం నేర్పే వరకే బుద్ధుడి పరిధి. 'అంబేద్కర్ చాలడు!' అన్నారు, అంబేద్కర్ పనికిరాడు అనలేదు. 'సమానత్వానికి ఎంతో దూరంగా, ఒక దుస్థితిలో ఉన్న వాళ్ళకి, రక్షణ కోసం ఏర్పాటు చేసేవి ఈ రిజర్వేషన్లనేవి. అంబేద్కర్ ప్రవేశ పెట్టిన రిజర్వేషన్ల పద్ధతి దళిత-బహుజనులకి మహా ఉపకారం చేసింది. 

అది విస్మరించ లేని సత్యం. అదొక మైలురాయి. ఒక్క మైలురాయి దగ్గరే ఆగిపోతే గమ్యం చేరలేరు. దానికి తాత్కాలికమైన కొంత పరిధి మాత్రమే ఉంది. దళిత సమస్యని పరిష్కరించడానికి అది సంపూర్ణమైన పద్ధతి కాదు. రిజర్వేషన్లని ఇంకా విస్తృత పరిచేందుకు ఇంకో రెండు సంస్కరణలు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగాలకే పరిమితమై ఉన్న రిజర్వేషన్ విధానాన్ని 'ప్రైవేటు రంగాలకి కూడా విస్తరిస్తే దళిత-బహుజనులకి చదువుల్లో , పదవుల్లో , ఉపాధుల్లో ఇంకా ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. రెండో సంస్కరణ-ఒకసారో, రెండు సార్లో రిజర్వేషన్లని ఉపయోగించుకొని ఉన్నత స్థాయిని సాధించిన వారిని, ఇక తర్వాత రిజర్వేషన్లకి అనర్హుల్ని చెయ్యడం. 

ఆ అవకాశాలు ఎప్పుడూ రిజర్వేషన్ల సదుపాయాన్ని పొందని దళిత-బహుజనుల దరికి వస్తాయి. ఈ రెండు సంస్కరణల ద్వారా ఎక్కువ మంది 'దళిత బహుజనులు' విద్యావంతులు, ఉద్యోగస్తులూ, సాంఘిక స్థాయిని పెంచుకున్న వాళ్ళూ అవుతారు. 'దళిత -బహుజనులు' మొత్తం అందరూ ఆ స్థాయిని చేరుకోవడానికి ఈ 'బూర్జువా ఆర్థిక వ్యవస్థ' అడ్డుగా నిలుస్తుంది. ఉన్న ఉపాధులే తగ్గి పోతూ ఉంటే, రిజర్వేషన్ సంస్కరణలు దళిత -బహుజను లందరికీ ఉపాధులు కల్పించలేవు. అప్పుడు 'దళిత -బహుజనుల'లో కూడా సాంఘికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవర్గం, అధమంగా ఉన్న వర్గం అని రెండు వర్గాలు ఏర్పడక తప్పదు. 

వర్ణాంతర వివాహాల విషయాన్ని చూద్దాం. రిజర్వేషన్ల వల్ల ఆర్థికంగా, సాంఘికంగా ఉన్నతి సాధించిన దళిత-బహుజనులకు, ఆర్థికంగా, సాంఘికంగా ఉన్నతంగా ఉన్న అగ్రకులాల వారి కి మధ్య వర్ణాంతర వివాహాలు సాధ్యమవుతాయి. ఆర్థికంగా సాంఘికంగా తక్కువ స్థాయిలో ఉన్న అగ్రకులాలు, అలాగే ఆర్థికంగా సాంఘికంగా తక్కువగా ఉన్న దళిత-బహుజన కులాల మధ్య కూడా అక్కడక్కడ వర్ణాంతర వివాహాలు జరగవచ్చు. పురాణ కాలాల్లోనే వర్ణాంతర వివాహాల దాఖలాలు ఉన్నాయి. 

ఉదాహరణకి 'వశిష్ఠుడు-అరుంధతి'. అక్కడక్కడా అడపాదడపా వర్ణాంతర వివాహాలు జరగడంతోటే కులాలు పోయి, 'కుల నిర్మూలన' జరిగే లాగుంటే వశిష్ఠుడి కాలానికి కుల నిర్మూలన జరిగిపోవాలి కదా! యవ్వన మోహంలో కులాన్ని కాదని ఎవరో అక్కడక్కడ వర్ణాంతర వివాహాలు చేసుకోవడం కుల నిర్మూలనికి ఉపయోగ పడదు. ఆ వివాహాలు లెక్కకు మించి ఎక్కువ సంఖ్యలో జరిగితేనే 'కుల నిర్మూలన' జరుగుతుంది. అలా జరగాలంటే కులాన్ని ధిక్కరించగలిగే హేతు వాద జ్ఞానం కావాలి. 

అది, సాంకేతిక విజ్ఞానంతో పాటు సమాజ జ్ఞానాన్ని కూడా అందించగలిగే సమగ్ర విద్యా విధాన ం వల్లే సాధ్యం. అంటే అందరికీ మంచి చదువులు ఉండాలి. చదువులు ఉండాలంటే డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే అందరికీ ఉపాధులుండాలి. అందరికీ ఉపా ధి కల్పించే పూచీ ప్రస్తుత వ్యవస్థ, ఆ వ్యవస్థకి ప్రాతినిధ్యం వహిం చే ప్రభుత్వం పడగలవా? అలాంటి పూచీలేని రాజకీయ విధానంతో విస్తృతంగా వర్ణాంతర వివాహాలు ఎలా జరుగుతాయి? 

'కుల నిర్మూలన' ఎలా జరుగుతుంది? సాంఘికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారిలోనయినా, అలా లేనివారిలో నయి నా, వర్ణాంతర వివాహాలు జరగాలంటే కులాలని పాటించని, హేతువాద సంస్కరణ దృష్టి లేక పోతే ప్రేమలూ కలగవు, పెళ్ళి ళ్ళూ జరగవు. అవి ఎక్కువగా జరిగి కుల నిర్మూలన జరగాలంటే ముందు జరగవలసింది దోపిడీ నిర్మూలన (దోపిడీ రహిత సమాజ స్థాపన). రిజర్వేషన్లు చేస్తున్న పని దళిత-బహుజనుల్లో కొందరికి 'క్లాస్'ని మార్చడం. 'క్లాస్' ఒకటయినప్పుడు, కొన్ని వర్ణాంతర వివాహాలు జరుగుతున్నాయి. రంగనాయకమ్మ అడిగేది అదే. రిజర్వేషన్ల కోసం మీరు మీ చిన్న కులాలనే ఉంచుకోదలుచుకున్నారా? లేక 'కుల నిర్మూలన' కోరుకుంటున్నారా? అని. 'కుల నిర్మూలననే' కోరుకుంటే మార్క్సిజాన్ని కోరుకోండి అని.

డాక్టర్ వెంకటేశ్వర్లు చెబుతున్న 'నూతన ప్రజాస్వామిక సంబంధాల'గురించి చూద్దాం. 'సమస్త అగ్రకుల ఆధిపత్య రంగాలను క్రింద కులాల వారికి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 'నూతన ప్రజాస్వామిక శ్రమ సంబంధాలని అమలులోకి తీసుకురావడం' వారి పోరాటా ల ద్వారా జరుగుతుందని అంటున్నారు. అవును, గట్టి పోరాటాల ద్వారా కొందరు 'దళిత-బహుజనులకి' మాత్రం అగ్రకుల ఆధిపత్య రంగాలు అందుబాటులోకి రావొచ్చు. తర్వాత వాక్యంలోనే ఇంకా ఏమంటారంటే 'ఇతర అన్ని అవకాశాల్లో వారి జనాభా ప్రకారం అగ్రకులాలకు రిజర్వేషన్లు కల్పించడం'. 

ఇప్పుడు దళిత-బహుజనులకు' రిజరేష్వన్లు ఎందుకు అవసరమయ్యాయి? ముందే చెప్పుకున్నట్టు వాళ్ళు సమానత్వానికి చాలా దూరంగా, ఒక దుస్థితిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం'. ఈ రిజర్వేషన్లు ఎలా వచ్చేయి? వాళ్ళు చేసిన పోరాటాల వల్లే వచ్చాయి. ఎవ్వరూ హృదయం ద్రవించిపోయి వారికి సాయం చెయ్యలేదు. సరి కదా అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ రిజరేష్వన్లలో కూడా సమానత్వం రాలే దు. సమానత్వం సుదూరంలోనే ఉండి, ఇంకా పోరాటాల్ని ఆహ్వానిస్తోంది. 'దళిత-బహుజనులు' ఈ పోరాటాల తర్వాత ఏం చేస్తారు? 'అగ్రకులాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తారట'. 

అంటే ఇప్పటి అగ్రకులాల వాళ్ళు, కొన్నాళ్ళకి నిమ్న కులాల వాళ్ళు, అంటే ఈనాటి అగ్రకులాల వాళ్ళ రిజర్వేషన్ల కోసం కొన్ని శతాబ్దాలు పోరాటాలు చేస్తే, వాళ్లకి రిజర్వేషన్లు కల్పిస్తారన్న మాట. పరిస్థితులు తారుమారు అవడమా నూతన ప్రజాస్వామిక సంబంధాలు అంటే ? 'నూతన ప్రజాస్వామిక సంబంధాలు' అంటే- 'ఇక దోపిడీరహిత సమాజం, శ్రమ సంబంధాలని పూర్తిగా మార్చెయ్యడం. ప్రస్తుత దశ కానప్పుడు, దాని గురించి చర్చ చెయ్యడం అనవసరం' అని వ్యాసకర్త అన్నారు. ఈ రకంగా దళితోద్యమం జరిగితే ప్రస్తుత చర్చగా కాదు కదా, ఎన్ని యుగాలయినా 'దోపిడీ రహిత సమాజం' సిద్ధించడం కాదు సరికదా చర్చగా కూడా రాదు. 'కుల నిర్మూలనా' జరగదు. 

సమాజానికి సహజ అవసరాలయిన శ్రమల్ని చేయని పెట్టుబడిదారులూ, ఇప్పుడు శ్రమ చేద్దామన్నా ఉపాధి దొరకని నిరుద్యోగులు, ముష్టి వాళ్ళూ, వేశ్యలూ, బైరాగులూ, బాబాలూ, ఖైదీలు, రౌడీల వగైరాలంతా పనిలోకి రావడంతో 'పెట్టుబడిదారుడు- వేతన బానిస' అన్న సంబంధం పోవడాన్ని 'శ్రమ -సంబంధాలలో మార్పు' అంటారు. అందరూ (ఒక్కరికి కూడా మినహాయింపు లేకుండా) ఉన్న త విద్యలు అభ్యసించి, అందరూ అన్నిరకాల శ్రమల్నీ చెయ్యడాన్ని 'కమ్యూనిస్టు శ్రమ విభజన' అంటారు. అప్పుడు వర్గ నిర్మూలనతో వారి కుల నిర్మూలన 'కూడా జరుగుతుంది. దోపిడీరహిత సమాజ ఆవిర్భావం జరిగిన కొద్ది వ్యవధిలోనే 'కుల రహిత సమాజం' ఏర్పడ్డానికి కావలసిన పునాదిని ఏర్పరచుకోవడానికి ఇప్పుడు పోరాటాలు జరగాలి. 

రంగనాయకమ్మ గారు ఇతర పుస్తకాల్లో అన్నట్టు, కమ్యూనిస్టు, కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు దేశం, కమ్యూనిస్టు సిద్ధాంతం ఒకటి కాదు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని మనసా, వాచా, కర్మణా అమలు జరిపే వాడు కమ్యూనిస్టు . శాస్త్రి, శర్మ, చౌదరి, రెడ్డి అని కుల భేదాల్ని కాని, మతభేదాల్ని కాని ఇష్టపడే వాడెవ్వడూ, అనుష్ఠించే వాడెవ్వడూ కమ్యూనిస్టు కాదు. అలాంటి కమ్యూనిస్టులే (కమ్యూనిస్టులు కాని కమ్యూనిస్టులు) దళిత-బహుజనులపై ఆధిపత్యం చెలాయించే వాళ్ళయితే, వాళ్ళ నుంచి విడిపోయి, నిజమైన కమ్యూనిస్టు దృక్పథంతో ఓ పార్టీ పెట్టుకుని ఉద్యమం సాగించాలి. 

'దళిత ఉద్యమం' నుంచి కమ్యూనిజాన్ని తీసి పారేస్తే 'దళిత ఉద్యమం'నిస్త్రాణమై పోతుంది. 'దళిత ఉద్యమాని' కే కాదు, సమానత్వం కోసం చేసే ఏ ఉద్యమానికైనా కమ్యూనిస్టు సిద్ధాంతమే వెన్నెముక. మార్క్స్‌ని అంగీకరించడం అంటే అంబేద్కర్‌ని అవమానించడం అవదు. అది అంబేద్కర్ పరిధిని అంగీకరించడం, ఆయన చేసిన కృషిని, చేకూర్చిన ప్రయోజనాల్నీ స్వీకరించడమే. కుల నిర్మూలన వైపు చిత్తశుద్ధితో నిజమైన ప్రయాణం సాగించడమే అవుతుంది. ఎప్పటికైనా అది ఆ గమ్యానికి చేరుస్తుంది. 

అరిస్టాటిల్ గొప్పవాడే . అప్పటికి ఉన్న సకల శాస్త్రాలలోనూ నిష్ణాతుడు. అరిస్టాటిల్ పరిధిని అంగీకరించక , ఆయన్ని మించి ఆలోచించడం తప్పు అనుకున్న కాలం అంతా చరిత్రలో 'అంధయుగం'గా మిగిలింది. అంబేద్కర్ గొప్పదనానికైనా అదే పరిమితి. అరిస్టాటిల్ కాలం తర్వాత అంధయుగాన్ని చెరిపివేసినా చరిత్రలో అరి స్టాటిల్ పాత్ర చెక్కుచెదర లేదు. అంబేద్కర్ పరిమితిని అంగీకరించినంత మాత్రాన చరిత్రలో అంబేద్కర్ పాత్ర చెక్కు చెదరదు. 

- డా.డి.ఎల్.విద్య
Andhra Jyothi News Paper Dated : 12/06/2012 

No comments:

Post a Comment