Monday, June 11, 2012

పొంతన లేని ఐలన్న దార్శనికత - డా.చెరుకు సుధాకర్



'నేను హిందువు నెట్లయిత?' అని ఐలన్న (కంచ ఐలయ్య) ప్రశ్నించినప్పుడు, అనేక మౌలిక అంశాలను ప్రశ్నిస్తున్న గొల్ల కుర్మ మేధావిని చూసి మురిసిముక్కయినోన్ని. ఎదురీతలో ఉసా, శివసాగర్, బిఎస్ రాములు, ఐలయ్య వ్యాసాలకు స్పందించి, సమాజాన్ని చూడడానికి అంబేడ్కర్ దార్శనికత అవసరమే అని రూఢీకి వచ్చి ఆ పనిలో కుల-వర్గ పోరాటాల జమిలికి జముకులు వేస్తున్న బిడ్డలకు ఊపిరి ఉన్నదాక సహాయ సహకారాలందించి సహానుభూతితో బతకాలనుకున్నవాణ్ని. ఐలన్న 'టిఆర్ఎస్‌కు కాంగ్రెస్ వరం' వ్యాసం (జూన్ 6, ఆంధ్రజ్యోతి), అంతకు ముందు కొన్ని వ్యాసాలు చదివినాక ఎందుకో ప్రజలకు, పరస్పర సంఘర్షణలకు, సంఘటనలకు అనేకానేక అంశాలను సంబంధం లేకుండానే ఏదంటే అది రాసే పొంతనలేని దార్శనికతను తారీఫ్ చేయాల్సిందే ననిపిస్తుంది. 

గత రెండున్నర సంవత్సరాలుగా ఆకులు - అలములు తినే స్థితికి ఉద్యమం పుణ్యమాని తెలంగాణ ప్రజలు వచ్చారని ఐలన్న అన్నారు. రెండున్నర సంవత్సరాల ముందు బంగారు పళ్లెంలో పంచభక్ష్య పరమాన్నాలు తిన్నరా ఐలన్న? విషపు గడ్డలు తిని అదిలాబాద్ రైతులు ఆకలి తీర్చుకున్నది గుర్తుకులేదా? గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు పెడితేనే కాదా పాలమూరు వలసకూలి ఆకలిచావుబారిన పడకుండా బతికి బయటపడింది? 

అర్ధాకలి పుణ్యమే కదా, మొగ్గం ఉరిపగ్గమయ్యింది? కాడి వల్లకాడయ్యింది. 'ఈ స్థితికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి' -మంచి మాట రాసిండ్రు ఇయ్యాల కాకపోతే రేపైనా తెలంగాణ బిడ్డల్ని ఆర్థికంగా, రాజకీయంగా సకల రంగాలలో, సకల రీతిలో ఏమార్చిన సోనియాగాంధీ ప్రభుత్వం ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. 2009 డిసెంబర్ 9 తరువాత ఉద్యమాలు విందు భోజనాలుగా మారినాయా? ఈ రెండున్నర ఏళ్లలో లష్కర్‌లో గాని, జనగామలోగాని ఏ జన సమూహంలో గాని ఎన్నడన్న జనం బంతిలో కూసొని బువ్వ తింటే చెయ్యి కడిగి ఉంటే జరుగుతున్న కార్యక్రమాలను ఒక చెయ్యేసి సహకరించి ఉంటే అవి విందు భోజనాలో 'సమిష్టి కృషితో ఉడికిన చెలిమి కుండలో వడ్లో అర్ధమయ్యి ఉండేది. అయినా అంటీ ముట్టనట్లు ఉండి మంట పెట్టే రాతలు రాసే అంటువ్యాధి ఎప్పటి నుండి సోకింది ఐలన్నా? 

కెసిఆర్‌ను తిడితివి, టిఆర్ఎస్‌ను తిడితివి, కోదండరాంను తిడితివి, జెఎసిని తిడితివి. ఒకలు వేములవాడ రాజన్న సన్నిధిలో ఉద్యమ సంపాదనతో మోకరిల్లిండ్రని అంటివి. ఇంకొక్కలు భద్రాచలంలో అంటివి. ఒకలు 'లక్ష్మి' ఏడ ఉంటే ఆడ వాలుతరంటివి. ఎవ్వల్ని మోస్తే, ఎవ్వరిపై కూస్తే తెలంగాణ వస్తదో చెప్పవ్ గాక చెప్పవ్. క్యాంపస్‌లో పోరగాల్లతో కలిసి లడాయిల షరీకయ్యితవేమో అనుకుంటే అకడమిక్ పని ఉందంటవ్. ఎట్ల చెయ్యాలో చెప్పు అంటే తిట్ల పురాణం ఇప్పుతవ్. 

ఇంత ఉద్యమంలో ఊగులాడేటోనికి ఇడుపుల పాయను ఎట్లా నిలువరించాలనో 'ముడుపులపాయ'ను ఎట్ల చిల్లగొట్టాలనో తెలియదా ఐలన్న. ముడుపులపాయకు అంత మహాత్యముంటే ఇడుపులపాయల చీఫ్‌కు పరకాలను ఎంతకు కొంటాడో చెప్పమనరాదు. వశమైతదా సూద్దాం- 'ఓట్లు ఎందుకు పంచాయితీ లెందుకు?' ఐలన్నా 'ఉద్యమ క్యాపిట్' యాభైవేల కోట్ల నుండి ఇంకా చాలా పైకి పోతది. 

కళ్లు మూసినా తెరిచినా వెయ్యిమంది పోరగాల్ల బలిదానాల గోసనే ప్రాణం అవిసేటట్లు చేస్తుంటే పిడికెడు మంది స్వార్థపరుల్ని 'భూతద్దంలో పెట్టి భూతదయ' చూపెట్టకు ఐలన్నా! చచ్చిన పోరడి చివరి కరస్పర్శతో పోస్టుమార్టమ్ వాసనతో ముక్కుపుటాలు రగిలిపోతుంటే శత్రువుతో కరచాలనం చేస్తున్నట్లు స్వరచాలనమ్ చాలుగాని ఐలన్న- చెప్పు- దొంగల్ని అవకాశవాదుల్ని కాదని నిఖార్సయిన ఉద్యమానికి ఎక్కడ ఎప్పుడు పునాది వేద్దామో- ఆ పునాది రాస్తాలో జీతంరాళ్లని కాదని వాటికి మించి వచ్చే ముడుపు జీతాలు కాదని ఐలన్న వెనుక నడవడానికి అన్ని క్యాంపులు, క్యాంపస్‌లు సిద్ధంగానే ఉన్నాయి. 

ఎందుకో ఐలన్నకు టిఆర్ఎస్ ఏది చేసినా కాంగ్రెస్ మ్యాండేట్ ఇచ్చినట్లు కనబడుతుంది. కాంగ్రెస్, టిఆర్ఎస్ హాట్‌లైన్ అంతా ట్యాప్ చేసినట్లు మాట్లాడుతాడు ఐలన్న. చిన్న జేఏసీలు పిలుపునిచ్చినా బంద్‌లెందుకు జయప్రదమవుతాయని ఓయు జేఏసీ, ఇతర సంఘాల జేఏసీలను చిన్న చేసి మాట్లాడుతావ్. కాంగ్రెస్- టిఆర్ఎస్‌తోపాటు అన్ని జేఏసీలను కొనివేసిందా? అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసానికి నిరసనగా విద్యార్థి జేఏసీ పిలుపునిస్తే అన్ని పార్టీలు ఫాలో కావల్సి వచ్చినందుకు దళిత, బహుజన మేధావిగా ఇంకా వాళ్లను అస్సెర్ట్ చేసుకొని మాట్లాడవలసిన ఐలన్న- చిన్నగా చేసి మాట్లాడటం ఎట్లా తగునో చెప్పు? 

మహబూబాబాద్‌లో అయినా, నకిరేకల్‌లో అయినా రాళ్ల వర్షం కురిపిస్తే టిఆర్ఎస్ ఖాతాలో పడిందని ఏది చేసినా ఆ ఖాతాలోనే జమ అవుతుందని బాధపడే ఐలన్న- ఎవ్వరి ఖాతాలో వెయ్యమంటారో చెప్పండి. తెలంగాణ రావటానికి ఆ ఖాతా పనికొస్తే నాపై పెట్టిన అమలులో లేని పిడియాక్ట్ తరువాత నాసాతో అనుభవించిన బాధనంతా వాళ్ల ఖాతాలోనే వేస్తాను. అకౌంట్ నెంబర్ చెప్పండి. మా దాంట్లో అందరూ సుద్దపూసలే అని మేము అనలేదు. మేమే తీస్‌మార్‌ఖాన్‌లమని అంటలేము. సరిచేయాలని ఉంటే వెన్నపూస మనసుతోని వెన్నుపూస సరిజెయ్యాల కాని కారంపూసతో కళ్లల్లో కంప దింపినట్లు, పగోడు సంబురపడేటట్లు ఎందుకే ఈ రాతలు- ఐలన్న! 

ఐలన్న మాట్లాడడానికి రాసుకోవడానికి ఎంత పరుశంగానైనా ముందుకు రావొచ్చు. ఒక ఉద్యమం యాభైఏండ్ల తండ్లాట తరువాత కొలిక్కి రావడానికి సానుకూల కార్యక్రమం ఏమిచేస్తే బాగుంటుందో అని ఆలోచించి, ఆచరణకు బాటలు వేస్తే సామాజిక ఉద్యమకారులుగా దార్శనికులుగా మనల్ని ప్రజలు అనుసరిస్తరు. గౌరవిస్తరు కాని శాపనార్ధాలు, విపరీత అర్ధాలు, అర్థ సత్యాలు, పూర్తి అసత్యాలు మన గౌరవాన్ని, మన తీవ్రమైన అంతరంగీక విశ్లేషణను ఉన్నతీకరించవని మీ చేయి పట్టుకొని నడిచిన చిన్నవాడుగా చెబుతున్నాను. 

పంజాబ్‌లో ఒలికిన రక్తానికి ఇంత మూల్యం ఎందుకంటే వాళ్లు ఒక దేశాన్నే అడిగారు కనుక అని సమర్ధించుకోవచ్చు. ఒకనాడు ఉన్న రాష్ట్రం, ఒకనాడు ఉన్న దేశం ప్రజలు గగ్గోలు పెడుతున్నా సమైక్యత పేరుమీద ఖబ్జాకు గురికాబడిన రాష్ట్రం- ఇప్పుడునా నేల, నా భౌగోళిక తెలంగాణ కావాలంటేనే ఇంత హింస అవసరమా? తెలంగాణకు పంజాబ్‌తో ఏమి పోలిక? వస్తుందన్న తెలంగాణ రాకపోతే ఉసిర్లలెక్క ఉసురులు రాల్చుకున్న తెలంగాణలో 'బింద్రన్‌వాలా'లు ఎందుకు పుడుతరు ఐలన్న? పురాణంలో తలనరికిన వానికి ఏనుగుతల పెడితే వినాయకుడైనాడేమో గాని, చర్వితచరణ వర్తమానంలో బతికి ఉండగా బింద్రన్‌వాలా తలకాయ అంటిస్తమంటే మేము ఒప్పుకోము. ఐలమ్మలు పుట్టిన గడ్డన కొనసాగుతున్న బలిదానాల బిడ్డలతోనే తల్లడిల్లిపోతున్నం. అర్‌కీస్ అయినా ముందు ముందు ఒక్కడు చావొద్దు. 

ఇప్పుడు మీరు బాధపడుతున్నంత వింత స్థితి ఏమీ లేదు. ఎవరు కొందామన్నా అమ్మకానికి అంత అగ్గువకు, సగ్గువకు ఎవరు లేరు. రాజ్యం కోసం మొరిగే లైసెన్స్‌డ్ తుపాకితో 369 మందిని, సైలెన్స్ తుపాకితో వెయ్యిమందిని పోగొట్టుకున్న తెలంగాణ స్పష్టంగానే 2014కు పోకముందే కాంగ్రెస్ మెడలు వంచి మెడపై కత్తిపెట్టి తెలంగాణ తెచ్చుకుంటుంది. వస్తే ఇట్లాంటి తెలంగాణనే రావాలే అని గుది గుచ్చుకోకుండా వచ్చే తెలంగాణలో ఎట్ల మనోళ్లకు మంచి చెయ్యాలని సోంచాయించాలని ఐలన్నను కోరుతున్నాను. 

- డా.చెరుకు సుధాకర్
టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు
Andhra Jyothi News Paper Dated : 12/06/2012 

No comments:

Post a Comment