Sunday, June 3, 2012

మతరాజకీయం చెల్లదు---సిలువేరు హరినాథ్తెలంగాణ ప్రాంతంలోజరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక నామినేషన్ల ఘట్టం ముగిసి పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉప ఎన్నికలు ఒక ఎత్తు అయితే.., తెలంగాణలో జరుగుతున్న ఎన్నిక ఒకటి ఒక ఎత్తు. ఏ నియోజ వర్గంలో లేనన్ని నామినేషన్లు పరకాల బరిలో 20కి పైగా దాఖలయ్యాయి. పరకాల ఉప ఎన్నిక ఆంధ్ర వలసవాద పెత్తనానికి, తెలంగాణ వాదానికి మధ్య జరుగుతున్న పోరాటంగా తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చాలి. 

జగన్ శిబిరంలో ప్రధాన నా యకురాలిగా ఉన్న కొండా సురేఖ నిజానికి ఎవరికి మద్దతుగా రాజీనామా చేశారు? తెలంగాణ వాదం కోసమా?లేక ఆంధ్ర పెత్తనానికి మద్దతుగా పార్లమెంటులో ప్లకార్డుతో ప్రదర్శన చేసిన జగన్ కోసమా? తెలంగాణ కోసమే నేను రాజీనామా చేశానని పదేపదే చెప్పుకుంటున్న సురేఖ తనకు రాజకీయ జీవం పోసిన రాజశేఖర్‌డ్డి ఆత్మసాక్షిగా తన చేదు నిజాన్ని బయట పెట్టగలరా? లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే తన ప్రచార కార్యక్షికమాల్లో ఏ ఒక్క తెలంగాణ నినాదం కనపడదు. ఆ ప్రాంత తెలంగాణ పోరాట యోధుల బొమ్మలు కనపడవు. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రాజశేఖర్‌డ్డి, జగన్ ఫోటోలు మాత్రమే కనబడుతుంటాయి. ఇది దేనికి నిదర్శనం.ఆంధ్ర పెత్తందారుల అంటకాగడం కాదా? తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతుంటే, తెలంగాణ ప్రజల ఆత్మబలిదానాలు కొనసాగుతుంటే, తెలంగాణ ప్రజలు క్షోభతో కుమిలిపోతుంటే కొండా దంపతులు మాత్రం తెలంగాణ ప్రాంతాన్ని వదిలి పెట్టి రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగిన జగన్ యాత్రలో ఆనందోత్సాహాలతో పాల్గొనడం నిజం కదా! అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మాయని మచ్చగా మానుకోట ఘటన ఒకటి. ఆ సందర్భంలో ఆంధ్ర పార్టీ నేత జగన్ మానుకోటకు తన అంగబలంతో బయలుదేరినా తెలంగాణ వాదుల ప్రతిఘటనకు తలొగ్గక తప్పలేదు. ఆ సంఘటనలో తెలంగాణవాదులకు సమైక్యవాదులకు జరిగిన పోరులో తెలంగాణవాదులపై ప్రత్యక్షంగా కాల్పులు జరిపి పలువురిని తీవ్రగాయాలకు గురిచేసింది కొండా దంపతులు కాదా! తెలంగాణవాదాన్ని నిర్వీర్యం చేయడంలో తన అనుచరులతో తెలంగాణ ప్రజలను భయవూబాంతులకు గురిచేయడం నిజం కాదా! ఇంతగా తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొండా దంపతులకు పరకాల ప్రజలు ఎలా ఓటు వేయాలి.

ఇక తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే లేకుంటే చచ్చేది మేమే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నినాదంతో కాకుండా అభివృద్ధి జపంతో రంగంలోకి దిగింది. ప్రకటించిన తెలంగాణను ఆపిన సత్తా సీమాంధ్ర నాయకులకు ఉంటే కనీసం దానిని ప్రతిఘటించే సత్తా కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లేకుండాపోయింది. అలాంటిది తెలంగాణ తెచ్చే సత్తా కాంగ్రెస్ నాయకులకు ఉందా? లేదు కాబట్టే బలమైన తెలంగాణ నినాదంతో కాకుండా అభివృద్ధి పేరుతో జపం చేస్తున్నారు. నిజానికి తెలంగాణ ప్రజానీకానికి అభివృద్ధి కంటే ముందు తెలంగాణ స్వరాష్ట్రమే ముఖ్యమని చెప్పాలి. ఎందుకంటే 2009 నుంచి జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో నిర్విరామంగా తెలంగాణ ప్రజానీకం భాగస్వాములై ఉన్నారు. ఉద్యమంలో ఎన్ని కష్టాలుఉన్నా ఓర్చుకొని స్వరాష్ట్ర కోసం పోరాటమే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించలేదనే చెప్పాలి. తెలంగాణ ప్రజలకు కావాల్సింది రాజకీయ నాయకుల పదవీ త్యాగం కాని ఏ కాంగ్రెస్ నాయకుడు ఆ సాహసానికి ముందుకు రాలేదు. అంటే నాయకులకు పదవీ, సంపాదనే ముఖ్యం తప్ప ప్రజల మనోభావాలు కాదన్నమాట. తెలంగాణలో దాదాపు ఎనిమిది వందలకు పైగా ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్‌పార్టీ, పోరాట పటిమను పక్కనబెట్టి అభివృద్ధే ముఖ్యమంటే దేనికి సంకేతం! అంటే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణకు వ్యతిరేకమనే భావన తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాన్ని పరకాల ప్రజలు తిప్పికొట్టక తప్పదు. 

ఇక 1999 లో కాకినాడ తీర్మానంలో ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదంతో ప్రజల ముందుకు వచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ‘బీజేపీ తర్వాత తీర్మానాన్ని తుంగలో తొక్కింది. నాటి నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకునే వరకు తెలంగాణ నినాదానికి దూరంగా ఉన్న బీజేపీ తన ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోయింది. ఇప్పుడు అధికారం కోసం తెలంగాణ నినాదాన్ని భుజానవేసుకోక తప్పలేదు. అయితే అన్ని పార్టీలు తెలంగాణ నినాదంతో పనిచేస్తుంటే బీజేపీ మాత్రం తన ప్రధాన ఎజెండా అయిన మత ప్రచారాన్నే కొనసాగిస్తున్నది. అది మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలతోతన లోగట్టును బయటపెట్టి హిందూ ముస్లింల మధ్య విబేధాలకు దారి తీసేలా కారణం అయింది. అయితే అలాంటి ప్రచారమే పరకాలలో పునరావృత్తం చేయాలని పక్కా ప్రణాళికతోనే ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో నిలిపింది. అయితే ఈ ఎత్తుగడలు ఏమేరకు పనిచేస్తాయనేది అనుమానమే. పరకాల నియోజకవర్గ పరిధిలో 85 శాతం పైగా ఎస్సీలు, బీసీలు, మైనారిటీ ప్రజలు ఆయా పార్టీలను అనుసరిస్తారే తప్ప బీజేపీని కాదని గ్రహించాలి. తెలంగాణవాదమే ఏకైక లక్ష్యం గా పరకాల ప్రజలు భావిస్తున్నారు. అందువల్ల బీజేపీ తమను ఏమాత్రం ప్రభావితం చేయలేదని ప్రజలు ముక్త కంఠంతో నినదిస్తున్నారు. 

పదకొండు సంవత్సరాలుగా నిర్విరామంగా ‘తెలంగాణ’ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ప్రజల ముంగి ట్లో ఉన్న పార్టీ తెరాస. రాష్ట్ర సాధనలో ఉన్న అంకితభావం ప్రజలపై అపార నమ్మకాన్ని కలిగించిందని చెప్పవచ్చు. అనేక ఒడుదొడుకులను సవాళ్ళను ఎదుర్కొని పార్టీ బలోపేతం అయింది. కేసీఆర్ దీక్షతో ఉద్యమాన్ని పతాక స్థాయిలో తీసుకపోవడం వల్ల ప్రజలు టీఆర్‌ఎస్ పక్షాన నిలుస్తున్నారనేది సత్యం. గతంలో రాజీనామా చేసిన పార్టీ నాయకులందరిని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించిన తీరే దానికి నిదర్శనం. అదేకాకుండా సాంస్కృతికంగా, శాస్త్రీయంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గళమెత్తింది కూడా తెరాసయే. తెలంగాణలో ఐక్యకార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేసి తెలంగాణ వాదాన్ని ప్రతి గడపకు చేరేలా ప్రయత్నం, తెలంగాణ వ్యతిరేకులను నిలదీసిన తత్వం, సకలజనుల సమ్మెలో భాగస్వామ్యం వంటి అంశాలు టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అవకాశం ఉన్నది.తెలంగాణ వాదాన్ని ప్రతిపార్టీ తన పల్లవిగా పాడటం వల్ల, ప్రజలకు ఏ పల్లవిని ఎన్నుకోవాలనేది కత్తిమీద సాములాంటిదే. అయితే.. పోరాటంలో మొదటినుంచీ అగ్రభాగాన ఉంటున్న వరంగల్ ప్రజానీకం ఎవరు అసలైన తెలంగాణవాదులో గుర్తించగలిగే చైతన్యం ఉన్నవారే. ఇప్పటి దాకా అనేక పరిణామాలు ఇదే విషయాన్ని సూచించాయి. మానుకోట, రాయినిగూడెంలలో వరంగల్‌జిల్లా ప్రజలు ఆంధ్ర వలస పెత్తనాన్ని ఎదుర్కొని తమ చైతన్యాన్ని ప్రపంచానికి చాటారు. ఆంధ్ర వలస పెత్తందారులు, తెలంగాణ ద్రోహులు తెలంగాణ గడ్డమీద కాలుమోపడానికి వీలులేదని ప్రకటించారు. వలసవాదులు, తెలంగాణ వ్యతిరేకులు ఎన్ని జిత్తులు, ఎత్తులు వేసినా పరకాల ప్రజలు తిప్పికొడతారు. అంకిత భావంతో తెలంగాణకోసం పోరాడుతున్న వారికి పరకాల ప్రజలు పట్టం కడతారు.

-సిలువేరు హరినాథ్ తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేష

Namasete Telangana News Paper Dated : 04.06.2012 

No comments:

Post a Comment