Saturday, June 2, 2012

అస్తవ్యస్త సంస్కర్తలు! - రంగనాయకమ్మ


'మార్క్స్ గతి తార్కిక భౌతిక వాదం, అంబేద్కర్ కుల నిర్మూలన ఉద్యమం, జమిలిగా భారతదేశ విప్లవానికి రహదారులు వేయాలని (కేజీ సత్యమూర్తి) తపన పడ్డాడు. రంగనాయకమ్మకు సమాధానంగా రాసిన 'అంబేద్కర్ సూర్యుడు' అనే తాత్విక విశ్లేషణతో కూడిన పుస్తకంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాడు' (వివిధ, ఏప్రిల్ 30). 


'అంబేద్కర్ సూర్యుడు' పుస్తకం, నా పుస్తకానికి సమాధానం అని, నేను ఆనాడూ అనుకోలేదు; ఈనాడూ అనుకోవడం లేదు. అయితే మార్క్సునీ-అంబేద్కర్‌నీ కలపడం, గొప్ప 'తాత్విక విశ్లేషణ'గా ఆ వ్యాసం వర్ణించింది కాబట్టి ఆ అంశం మీదే నేను చెప్పదల్చుకున్నాను. మార్క్సిజాన్ని ఎవరి కిష్టమైనట్టు వాళ్ళు మార్చేసి, దాన్ని దేశీయ మార్క్సిజంగానో, జాతీయ మార్క్సిజంగానో చెయ్యాలని ప్రయత్నించే అస్తవ్యస్త సంస్కర్తల్లో, కేజీ సత్యమూర్తి కూడా ఒకరు. మార్క్సు చెప్పిన మార్క్సిజం అయితే, దోపిడీవర్గ సంబంధాల్నీ, దోపిడీ శ్రమ విభజననీ, యజమాని వర్గంపై శ్రామిక వర్గం చేసే పోరాటం ద్వారానే తీసివెయ్యాలంటుంది. 



ఆ సిద్ధాంతం ప్రకారం అయితే, శతృ వర్గాలు గల ఏ దేశంలో అయినా, శ్రామిక వర్గ విముక్తికి, ఆ వర్గ పోరాటమే ప్రధాన సూత్రం. దేశాల్లో వుండే ఏ ప్రత్యేక సమస్య పరిష్కారం అయినా, ఆ ప్రధాన సూత్రానికి లోబడి, మౌలిక పరిస్థితులు మారి, జరగవలసిందే. శ్రామిక వర్గ పోరాటం వల్ల, దోపిడీ వర్గం కూడా స్వంత శ్రమలతో జీవించే ఉత్పత్తిదారులవుతారు. యజమానీ శ్రామిక సంబంధాలు అంతరిస్తాయి. ఇలా చెప్పే మార్క్సు సిద్ధాంతాన్ని, దోపిడీ వర్గం తిరస్కరిస్తుందంటే, ఏమీ ఆశ్చర్యం వుండదు. కానీ, భారతదేశపు శ్రామిక వర్గంలో ప్రధాన భాగం అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, తదితర బృందాలన్నీ కూడా 'శ్రమ దోపిడీ నించి బైట పడ' మని ప్రేమతో చెప్పే సిద్ధాంతం వేపు మొహాలు తిప్పకపోవడమే అసలైన ఆశ్చర్యం! 



ఆ బృందాలు అలా వుండడానికి కారణం, వాటి నాయకులు వాటికి నేర్పిందీ, నేర్పుతున్నదీ అదే! ఆ నాయకుల లక్ష్యం, బూర్జువీకరణే! దోచుకుంటూ బతికే మార్గంలోకి ఎదగాలనేదే! అది కాకపోతే, మార్క్సిజం పట్ల వ్యతిరేకతకి వేరే అర్థం ఏదీ వుండదు. ఆ బృందాల నాయకులకు, అమలులో వున్న కమ్యూనిస్టు పార్టీల ప్రవర్తనలు నచ్చకపోతే ఆ నాయకులే మార్క్సిజాన్ని అధ్యయనం చేసి, వారే ఆ సంఘాలు పెట్టుకుని, వారే తమ విప్లవ లక్ష్యం ద్వారా, తమ బృందాలకు నేర్పుకోవచ్చు! మార్క్సిజం అనేది ఉనికిలో ఉన్న పార్టీల సొత్తే కాదు. 



అంబేద్కర్ లాంటి నాయకుణ్ణి తీసుకుంటే, ఆయన దగ్గిర విరుద్ధ సిద్ధాంతాలు లేవు. ఉన్నది ఒకే ఒక్క సిద్ధాంతం. అది, మార్క్సిజం పనికిరాదు, దానికి పోవద్దు! సత్యమూర్తి వంటి నాయకుణ్ణి తీసుకుంటే ఆయనది ఒకే ఒక్క సిద్ధాంతం కాదు; విరుద్ధ సిద్ధాంతాలు! ఒక పక్క - అంబేద్కర్ బోధించిన మార్క్సిజం వ్యతిరేకతా, ఇంకోపక్క - మార్క్సిజం వల్ల దొరికే ఆకర్షణని వదులుకోలేని బలహీనతా! ఇటువంటి నాయకులు, అంబేద్కర్ లాగ మార్క్సిజాన్ని పూర్తిగా పోగొట్టుకోలేరు. అప్పుడేం చేస్తారంటే, ఒక తెలివైన మార్గం ఏదో కనిపెడతారు. ఈ దేశంలో అయితే, అంబేద్కర్‌నీ, మార్క్సునీ, కలిపే మార్గం! లేదా, ఎవరికైనా కావాలంటే, అందులోకి గాంధీని కూడా కలపవచ్చు! రెండో మూడో పేర్లు కలిపి రాసెయ్యడం మనం చేద్దాం; చెయ్యగలం. 



అయితే అవి కలుస్తాయా? కలపగలమా? మార్క్సు సిద్ధాంతం ఏమిటి? -దోపిడీ శ్రమ సంబంధాల రద్దు! శ్రామిక వర్గ పోరాటం, హింస కాదు. అది, యజమాని వర్గం శ్రమ దోపిడీ కోసం చేసే హింసని ఆపే మార్గం! అది, శ్రామిక వర్గానికి ఆత్మరక్షణ! వర్గ సంబంధాలలో ఏర్పడే ఏ ప్రత్యేక సమస్యా, శ్రామికవర్గ పోరాటం ద్వారా తప్ప, వైరుధ్య పరిస్థితులు మారితే తప్ప, అంతం కాదు. దీనికి మతాలు లేవు. ఇది భౌతిక వాదం. 



అంబేద్కర్ సిద్ధాంతం ఏమిటి? - వర్గ పోరాటాలూ అవీ వద్దు! సంస్కరణలు వున్నాయి. కులాలు వద్దు! మతం అవసరమే. దాన్ని మార్చుదాం! మొదట కులాలు రద్దయ్యాకే వర్గాల వేపు చూద్దాం! గాంధీ సిద్ధాంతం ఏమిటి? -పారిశ్రామికవేత్తల జోలికి పోవద్దు! ఆస్తులన్నిటికీ వారే ధర్మ కర్తలు! (ట్రస్టీలు!) శ్రామికుల్ని దయగా చూసే ట్రస్టీ షిప్పు చాలు! ఇక కులాల సంగతా? అస్పృశ్యత ఒక్కటీ వద్దులే గానీ కులాలకే ం, అవి అలాగే వుంటాయి. కుల వృత్తులన్నీ ఎప్పట్లాగే. చాకలి మనిషి చాకలి పనీ, పాకీ మనిషి పాకీ పనీ, బ్రాహ్మణ మనిషి బ్రాహ్మణ పనీ! అది ఎంత మంచిది! హిందూ మతానికేం, అద్భుతం! కాకపోతే, రాముణ్ణీ అల్లానీ కలిపి పాడదాం! పోరాటాలా? వద్దు! అవి హింస. ప్రభుత్వానికైతే పోలీసులూ, సైనికులూ, చాలా అవసరం. 



అది హింసకాదు. వర్గ పోరాటాలా? అది ఘోర హింస! ఇప్పుడు, ఈ 3 సిద్ధాంతాల్నీ, పోనీ రెంటినైనా, కలిపెయ్యాలి. కలిపేద్దాం! కలుస్తాయా? అంబేద్కర్ సిద్ధాంతం, గాంధీకి వ్యతిరేకం; మార్క్సుకి వ్యతిరేకం. గాంధీ, అంబేద్కర్‌కి వ్యతిరేకం! మార్క్స్‌కి వ్యతిరేకం. మార్క్సు, ఆ ఇద్దరికీ వ్యతిరేకం. వర్గసామరస్యాలూ, సంస్కరణలూ చెప్పే వాళ్ళందరికీ వ్యతిరేకం! బుద్ధుణ్ణి కూడా తీసుకుంటే -అది, 'అష్టాంగ మార్గం'. అది అన్నిటికీ నిరుపయోగం. 



ఆ సిద్ధాంతాల్లో వైరుధ్యాలేమిటో తెలిసిన వాళ్ళకి వాటిలో ఏ రెంటినీ కలపడం సాధ్యం కాదని తెలుస్తుంది. అప్పుడేం చెయ్యాలి ఆ తెలిసిన వాళ్ళు? గాంధీని తీసి పారెయ్యొచ్చు. అది శుద్ధ దండగ! అంబేద్కర్ నుంచి 'కులాల రద్దు' అంశాన్ని తీసుకోవాల్సిందే. కానీ, ఆ రద్దు, శ్రమ సంబంధాల్లో మార్పు కోసం జరిగే వర్గపోరాటం ద్వారానే సాధ్యం. అడుగు కులాల వారందరి ఆర్థిక పరిస్థితులు మారక ముందే వాటి రద్దు జరగదు. 



విషయాల్లో ఒక తర్కం ఉంటుంది. ఆ తర్కం ప్రకారమే ఐక్యతలూ, అనైక్యతలూ ఏర్పడతాయి. 'శ్రామిక వర్గ పోరాటాల ద్వారానే ప్రత్యేక సమస్యల విముక్తి' అనే సూత్రంతో, 'మొదట కులాల రద్దు జరిగాకే వర్గాల విషయం చూడాలి' అనే సూత్రం కలవడం ఎలా సాధ్యం? కానీ, సత్యమూర్తి వంటి మేధావులకు ఏదైనా సాధ్యమే. తర్కాలూ, గిర్కాలూ అక్కరలేదు. ఆయన ప్రకారం అంబేద్కర్‌నీ, మార్క్సునీ, కలిపెయ్యవచ్చు. ఆ రెంటినీ ఒకే సిద్ధాంతం చెయ్యవచ్చు. అప్పుడు మార్క్సిజం మారితే మారుతుంది. పోరాటాలు పోతే పోయి, సామరస్యాలు విస్తరిస్తే విస్తరిస్తాయి. మార్క్సిజాన్ని, 'దేశీయ మార్క్సిజం'గా మార్చవలసిందే. అది మన దేశ అవసరం. 



అంటే, మార్క్సిజం అనేది, జర్మనీలో జర్మనీ వాళ్ళ మార్క్సిజం, ఇంగ్లండులో ఇంగ్లండు వాళ్ళ మార్క్సిజం, ఫ్రాన్సులో ఫ్రాన్సు వాళ్ళ మార్క్సిజం, అలాగే ఇక్కడ భారత వాళ్ళ మార్క్సిజం! దేశాల్ని బట్టీ, ప్రాంతాల్ని బట్టీ మార్క్సిజం, వర్గ పోరాటాన్ని వదిలేస్తుంది. అంబేద్కరూ, బుద్ధుడూ, మార్క్సూ కలిసింది మన దేశీయ మార్క్సిజం అవ్వాలి! గాంధీ భక్తులైతే 'గాంధీని కూడా కలపాలి' అంటారు! సాయిబాబా భక్తులైతే, 'బాబాని కూడా!' ఎంత తెలివైన ఐక్యతలు ఇవి! వీటిని విదేశాల్లో ఎప్పుడో చేసేశారు! ఇక్కడే సత్యమూర్తి ఆలస్యంగా, తెలివిగా, మార్క్సిజాన్ని దేశీయ మార్క్సిజం చేశాడు. 



కానీ ఆయన, ఆ తెలివిని, తెలివి తక్కువగా ప్రదర్శించాడు. బుద్ధుణ్ణీ, అంబేద్కర్‌నీ, మార్క్సునీ-సరిసమానుల్ని చేసి, 'దోపిడీ పీడనల్లేని సమాజాన్ని కాంక్షించిన స్వాప్నికులు, తత్వ చింతనా పరులు, ఈ త్రిమూర్తులు' అని వర్ణించి, అంబేద్కర్‌ని ఒక్కడినే 'సూర్యుణ్ణి' చేశాడు! ('అంబేద్కర్ సూర్యుడు'లో. ఆ 3 ఫోటోల పేజీకి, పేజీ నంబరు లేదు). 'బుద్ధుడూ, అంబేద్కరూ కాంక్షించింది, దోపిడీ పీడనల్లేని సమాజాలనా?' అనే ప్రశ్నని వదిలేస్తాను. దాని జోలికి పోను. కానీ, ఆ ముగ్గురూ ఒకే రకం చింతనాపరులైతే, సరిసమాన త్రిమూర్తులైతే, అంబేద్కర్ ఒక్కడే 'సూర్యుడు' ఎలా అవుతాడు? సత్యమూర్తి ప్రకారం, బుద్ధుడు ఏమవ్వాలి? -రెండో సూర్యుడు కావద్దూ? మార్క్సు ఏమవ్వాలి? మూడో సూర్యుడు కావద్దూ? ముగ్గుర్నీ సమానంగా త్రిమూర్తుల్ని చేసి అంబేద్కర్‌ని ఒక్కణ్ణే 'సూర్యుడు' అంటే ఈ ప్రశ్నలన్నీ రావూ? 



పోనీ, 'ముగ్గురూ సూర్యుళ్ళే' అంటే, 'భూమికి ముగ్గురు సూర్యుళ్ళా? పోనీ ఇద్దరు సూర్యుళ్ళా?' అనే ప్రశ్నలు రావూ? తప్పో ఒప్పో, 'ముగ్గురూ సూర్యుళ్ళే' అని ఎందుకు అనలేదు? కాన్షీరామ్ లాంటి, మాయావతి లాంటి, దళిత నాయకులైతే, వారి దృష్టిలో అంబేద్కర్ తప్ప మార్క్సు వుండడు కాబట్టి, అంబేద్కర్‌ని సూర్యుడు అనడం, వాళ్ళ ప్రకారం సరిపోతుంది. కానీ, సత్యమూర్తి చెప్పుకున్న ప్రకారం సత్యమూర్తి ఒకే పక్ష మేధావి కాడు. త్రిపక్షాల మేధావి! 



సూర్యుడైన అంబేద్కర్‌ని, సూర్యుడుకాని బుద్ధుడి తోటీ, సూర్యుడు కాని మార్క్సు తోటీ, ఎలా సమానం చెయ్యగలడు? కాబట్టి, సత్యమూర్తి ఏం చేసి వుండవలసిందంటే, అంబేద్కర్‌ని, మిగతా ఇద్దరి కన్నా పైన పెడితేనే, అతడు సూర్యుడు కావచ్చు! సమాజాన్నంతా వెలుగుతో నింపే సూర్యుడు అంబేద్కరే! ఆయనికి ఈ పక్కా, ఆ పక్కా నించోడానికి బుద్ధుడూ, మార్క్సూ పనికివస్తే రావచ్చు! అలా చెప్తే అంబేద్కరు ఒక్కడే సూర్యుడు కావచ్చు! 



సత్యమూర్తి, ఒక కమ్యూనిస్టు పార్టీని వదిలేస్తే వదిలెయ్యవచ్చు. కానీ కమ్యూనిస్టు అవగాహన కన్నా అస్త్తిత్వ అవగాహననే ప్రధాన లక్ష్యం చేసుకున్నాడు. అస్తిత్వ బృందాలన్నీ వేరు వేరు సెక్ట్‌లు. ఎవరి సమస్య వారిది. ప్రత్యేక సమస్యల మీద ప్రత్యేక ఉద్యమాలు అవసరమే, న్యాయమే. అయితే, ఏ అస్తిత్వ బృందం అయినా, తన సమస్యకు కోరే పరిష్కారం ఏమిటి? -బూర్జువీకరణే! మార్క్సిజం నించీ వర్గ స్పృహని తీసివేసేది బూర్జువీకరణ. బూర్జువాలం అవ్వాలి! బూర్జువా పాలకులం అవ్వాలి! అలా అయ్యే దళిత మేధావికి, అది మంచిదే. కానీ, ఒక దళితుడు పెట్టుబడిదారుడిగా ఎదిగితే, వెయ్యి మంది దళితుల్ని తన కార్మికులుగా నిలబెట్టి, వాళ్ళని దోచుకుంటూ బతకడం ఆ గొప్ప దళితుడికి ఆనందమే. సెక్ట్ ఉద్యమాలు కోరేదంతా, ఆ ఎదిగే దళితుడి లక్ష్యమే. 



అస్తిత్వ సెక్ట్ ఉద్యమకారులు, మొత్తం సమాజంలో తమ పాత్ర ఏమిటో, తమ స్థానం ఎక్కడో, పట్టించుకోరు. తమ అస్తిత్వ బృందం కూడా అసమాన శ్రమ సంబంధాల్లో బందీయై వున్నట్టు గ్రహించరు. తమ బృందం స్వతంత్ర బృందం అయినట్టూ, తమ సమస్య విడి సమస్య అయినట్టూ, తమకు పరిష్కారం విడిగా దొరుకుతుంది అన్నట్టూ, కలలు కంటారు. భూమి, తనచుట్టూ తను తిరుగుతూనే, సూర్యుడి చుట్టూ తిరుగుతూ వుంటుంది. అది ప్రకృతి సూత్రం. అలాంటి సూత్రం, ప్రతి అస్తిత్వ బృందానికీ వుంది. ప్రతి బృందం, తన సమస్యల చుట్టూ తను తిరుగుతూనే, అదే కాలంలో తన వర్గ స్పృహ చుట్టూ కూడా తను తిరగాలి. 



లేకపోతే ఏ అస్త్తిత్వ బృందాన్నీ ఏ అస్తిత్వ సూర్యుడూ రక్షించలేడు. అంబేద్కర్ సూర్యుడు దళిత కులాలకు కల్పించిన రిజర్వేషన్ల వెలుగు ఎంత కాలం? శాశ్వితంగానా? అయితే, అడుగు కులాలు కూడా శాశ్వితంగా ఉండవలసిందే కదా? కులాలు వుంటేనే కదా, రిజర్వేషన్లు వుండేది? కానీ రిజర్వేషన్లు కూడా ఒక వివక్ష. అది, ఆత్మ గౌరవ రాహిత్యం. వాటిని తాత్కాలిక ఉపశమనంగా మాత్రమే భావించి, అవి లేకుండానే దొరకవలసిన శాశ్వితమైన మార్పుని కోరవద్దా? లేకపోతే రిజర్వేషన్లనే శాశ్వితంగానూ, వాటి కోసం అడుగు కులాలనే శాశ్వితంగానూ నిలుపుకోవాలనా? 



రిజర్వేషన్లు తాత్కాలిక ఉపశమనమే అయితే, కుల విధానంలో, ఆ తర్వాత జరగవలసిన శాశ్విత పరిష్కారం ఏమిటి? - పరిష్కారం కులాంతర వివాహాలే అని అందరికీ తెలుస్తుంది. అయితే, ఆ కులాంతర వివాహాలు జరిగే మార్గం ఏమిటి? - ఆ మార్గం తెలియాలంటే, ఇప్పటికే జరిగిన కనీసం ఒక 100 కులాంతర వివాహాల్ని పరిశీలించి (అంబేద్కర్ చేసుకున్న కులాంతర వివాహంతో సహా) అవి ఏ కారణాల వల్ల జరిగాయో ఆ కారణాలని పట్టుకోవాలి. కులాంతర వివాహాలు నిరభ్యంతరంగా జరగడానికి ఏ పరిస్థితులు అవసరమో, ఆ పరిస్థితుల్ని సమాజం నిండా ఏర్పరిచే మార్గమే కులాల రద్దుకి శాశ్వత పరిష్కార మార్గం అవదూ? 



మార్క్సిజాన్ని దేశీయ మార్క్సిజంగా మార్చే మేధావులు ఒకరో ఇద్దరో కాదు, కమ్యూనిస్టు పార్టీల నిండా కూడా వున్నారు! ఆ మధ్య, పుచ్చలపల్లి సుందరయ్యగార్ని 'మార్క్సిస్టు గాంధీ'గా చేసిన వ్యాసం ఒకటి చదివాను. మార్క్సిస్టుకీ, గాంధీకీ ఏమిటి పొంతన? సుందరయ్య గారు ఫలానా రకపు నిరాడంబరుడైతే, గాంధీ అటువంటి నిరాడంబరుడా? 'గాంధీని నిరాడంబరంగా వుంచడానికి చాలా ఖర్చవుతూ ఉంటుంది' అని సరోజినీ నాయుడు అన్న మాటలు ఆ వ్యాసకర్త చదవలేదా? 



భగత్ సింగ్ ఉరిశిక్షకి, గాంధీయే ముఖ్యకారణం అని తెలీదా? మహాత్మా గాంధీ, ఆడ పిల్లల్ని నగ్నంగా తన పక్కలో పడుకో బెట్టుకుని, 'నా బ్రహ్మచర్యానికి పరీక్ష చేసుకుంటున్నాను' అనే నీతి సూత్రాలు చెప్పాడని ఆ వ్యాసకర్త చదవలేదా? ఏ రకంగా, ఏ కోణంలో, గాంధీ ఆదర్శనీయుడు? సుందరయ్యని గాంధీగా మార్చడం, సుందరయ్యకి ఏ రకంగా సన్మానం? కమ్యూనిస్టు పార్టీల వాళ్ళు నిజంగా సిగ్గులు వదిలేశారు. 'నవ్వి పోదురు గాక మాకేటి సిగ్గు?' అని మొండికెత్తి పోయారు. 



తమ ప్రారంభోత్సవాల్లోకీ, మీటింగుల్లోకీ, బూర్జువా మంత్రు ల్ని సాదరంగా, గౌరవంగా, పిలుస్తారు. ఏం లేదు, ఇవన్నీ మార్క్సిజాన్ని, బూర్జువా మార్క్సిజంగా మార్చిన లక్షణాలే! కార్మిక జనం, బూర్జువా కమ్యూనిస్టుల్ని సహిస్తూ వుంటే, శ్రామిక వర్గానికి దొరికేది, దేశీయ మార్క్సిజమే, జాతీయ మార్క్సిజమే. అంటే ఏం లేదు, బూర్జువా పాలకులు దయగా అనుమతించే చట్టబద్ధ మార్క్సిజమే. దానితో ఎప్పటికీ ఎక్కడి వాళ్ళం అక్కడే వుంటాం. అస్తిత్వ బృందాలన్నీ అడుగు శ్రమల్లోనే, ఆడ వాళ్ళంతా వంటిళ్ళలోనే! 



ఏ సూర్యుడూ, ఎవర్నీ రక్షించలేడు! చూద్దాం, మార్క్సిజాన్ని బూర్జువాగా మార్చాక, సూర్యుడు ఏం చేస్తాడో! 



- రంగనాయకమ్మ
Andhra Jyothi News Paper Dated : 15/05/2012 

No comments:

Post a Comment