Sunday, December 16, 2012

ఫ్యూడలిజం పూజలో విప్లవకారులు - కంచ ఐలయ్య



ఎం.ఎల్ రాజకీయాల నుంచి వచ్చిన ఏ వ్యక్తిని మందలిచ్చినా ఇప్పుడు తెలంగాణ తప్ప మరోటి మాట్లాడే పరిస్థితి లేదు. ఇక్కడి దొరల మీద ఈగ వాలితే వారు కాల్చి చంపేంత కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ వచ్చినా, రాకున్నా తెలంగాణ పోరాటం ఆపొద్దు అంటున్నారు. భూస్వాముల పార్టీలకు ఓట్ల సమీకరణ మాజీ నక్సలైట్లే చేస్తున్నారు. ఇప్పుడు విప్లవం అనే పదం అర్థమే పూర్తిగా మారిందా? 

తెలంగాణకు విప్లవగడ్డ అని పేరుంది. క్లాసికల్ మార్క్సిజం పోరా ట రూపంలో ఇక్కడే ముందు పరీక్షకు పెట్టబడింది. 1969లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చాక మావోయిజం మౌలిక సిద్ధాంతాన్ని కేంద్రీకరించి పరీక్షకు పెట్టింది ఇక్కడే. శ్రీకాకుళంలో వర్గశత్రు నిర్మూలనకు తొలిరూపం ఇచ్చినా 1979-80లో సిరిసిల్ల, జగిత్యాల పోరాటాల్లో మావో రూపొందించిన వైరుధ్యాల సిద్ధాంతాన్ని బలంగా ఆచరణలో పెట్టే ప్రయత్నం ఒకటి జరిగింది. రష్యా విప్లవంలో ప్రధాన వైరుధ్యం కార్మిక వర్గానికి బూర్జువా (పెట్టుబడిదారీ) వర్గానికి మధ్య ఉంటుందని లెనిన్ సూత్రీకరించగా, మూడవ ప్రపంచ దేశాల్లో ఫ్యూడలిజం అంతమై పెట్టుబడి అభివృద్ధి చెందలేదు కనుక ఇక్కడ ప్రధాన వైరుధ్యం ఫ్యూడల్ దోపిడీదారులకూ రైతాంగంతో సహా విశాల ప్రజానీకానికి మధ్య ఉంటుందని మావో చెప్పాడు. అందువల్లే భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటాన్ని తెలంగాణలో మావోయిస్టులు ప్రారంభించారు.

ఆ పోరాటం 1969 తెలంగాణ ఉద్యమం వచ్చి చల్లారినాక నడిచింది. ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌లో వెలమ భూస్వాములు కరుడుకట్టిన భూస్వాములుగా ఉన్నందువల్ల ఆ ప్రాంతపు బ్రాహ్మణులతో పోరాటంలోకి వచ్చారు. ఈ పోరాటం నుంచి మల్లోజుల కోటేశ్వరరావు, పులి అంజయ్య, నల్లా ఆదిరెడ్డి, కోనెపురి సాంబశివుడు (పుల్లయ్య) వంటి వారు ఈ ప్రాంతం నుంచి పి.డబ్ల్యు.జి. రాష్ట్ర కమిటీ సెక్రటరీలు అయ్యారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ పోరాటం వల్లనే ముప్పాల లక్ష్మణరావు ఆ పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ అయ్యాడు. పుల్లారెడ్డి గ్రూపుకు రాజన్న నాయకుడైందీ ఆ పోరాటాలు చెయ్యబట్టే. ఒకవేళ 1969 తెలంగాణ ఉద్యమం తరువాత తెలంగాణ వెనుకబాటుతనానికి ఇక్కడి భూస్వాములు బాధ్యులని అంచనాకు రాకుంటే ఆ పోరాటం ఎందుకు చేసినట్టు? ఆంధ్ర పెట్టుబడిదారులే ఈ ప్రాంత, రాష్ట్ర వెనుకబాటుతనానికి కారణమని సీరియస్ అంచనా వేసి ఉంటే ఈ ప్రాంతంలో రైతాంగ విప్లవం, గ్రామాలను విముక్తి చేసి, పట్టణాలను ఆక్రమించుకునే సిద్ధాంతం అసలు సరిపడదు గదా! ఆ ప్రాంతపు వెలమ దొరల నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమం 2001లో ప్రారంభమైంది.

అప్పటి నుంచి అన్ని మావోయిస్టు గ్రూపులు ఇక్కడి ప్రధాన వైరుధ్యం తెలంగాణ ప్రాంతం (భూస్వాములతో సహా) ఆంధ్ర ప్రాంతం మధ్య ఉన్నదనే వాదన ముందుకు తెచ్చారు. ఇది ఏ మావో సిద్ధాంతంలో భాగం? ఈ వైరుధ్యం ఎప్పుడు మారింది? ఒకనాడు నక్సల్‌బరీ పోరాటంలో భాగంగా జగిత్యాల సిరిసిల్ల పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాలు ఉత్తర తెలంగాణ అంతా విస్తృతంగా పాకాయి. ఈ పోరాటాల్లో వందలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ యువకులు/యువతులు ప్రాణాలకు తెగించి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ ప్రాంతపు భూస్వాములు పన్నిన కుట్రలో భాగంగా ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. సిరిసిల్ల, జగిత్యాల పోరాటాలు ఏ కుల భూస్వాములకు వ్యతిరేకంగా జరిగాయి? వెలమ, రెడ్డి భూస్వాములకు వ్యతిరేకంగానా? రాజ్య నౌకర్లైన పోలీసులతో ఇక్కడి యువతకు శత్రుత్వం ఎందుకు తలెత్తింది? వాళ్ళు భూస్వాముల రక్షకులుగా ఉన్నారనే కదా!

ఖమ్మం అడవులు మొదలుకొని ఆదిలాబాద్ అడవుల్లో తుపాకులు భుజాన పెట్టుకొని దళాలు తిరిగింది ఈ భూస్వాములను చంపడానికే కదా! మొత్తం నక్సలైట్ పోరాటాల్లో దాదాపు 6,000 మంది చనిపోతే దాదాపు 5,500 మంది తెలంగాణకు చెందినవారే కదా? తెలంగాణ వెనుకబాటు తనానికీ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భూమి, భుక్తి లేకపోవడానికి ఆంధ్ర పెట్టుబడిదారులు కారకులై ఉంటే ఆనాడు అర్బన్ గొరిల్లా యుద్ధాలు చేసి హైదరాబాద్‌లో పెట్టుబడిదారులను చంపాల్సి ఉండింది కదా! ఆదిలాబాద్ నుంచి ఖమ్మం (ఇప్పుడు కేసీఆర్ చంకలోని న్యూడెమోక్రసీ ఖమ్మం అడవి ప్రాంతంలో ఉండేది) దాకా అడవుల్లో మాటుగాసి తెలంగాణ ప్రాంతపు భూస్వాముల మీద తుపాకులెందుకు ఎక్కుపెట్టినట్టు? వారి ఏజెంట్లు అయిన పోలీసులతో ఎందుకు తలపడినట్టు! అంతమంది యోధులను ఆ పోరాటంలో ఎందుకు కోల్పోయినట్టు!

2001లో కె. చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టాక మావోయిస్టుల మౌలిక సిద్ధాంతం ఎట్లా మారింది? 'రావు' అని ఇక్కడి వెలమ దొరలకు, కొంతమంది బ్రాహ్మణులకు తగిలించుకున్న పేరు ఏనాడు తెలంగాణ ప్రాంతానిది కాదు. అది మహారాష్ట్ర నుంచి దిగుమతి అయిందని మహారాష్ట్రలోని దేశ్‌ముఖుల, భూస్వాముల పేర్లు బట్టి చూస్తే సులభంగా అర్థమవుతుంది. మహాత్మా ఫూలే పేరు 1827లోనే జ్యోతిరావు గోవిందరావు. ఆనాటి తెలంగాణలో రావు అనే పేర్లు ఎవరికీ ఉన్న దాఖలాలు లేవు. అదే విధంగా 'రెడ్డి' అనే పేరు రాయలసీమ నుంచి దిగుమతి అయిందనీ తెలుసు మనకు. వేమన పేరు వేమారెడ్డి అని ఉన్నప్పుడు ఇక్కడ ఏ కాపుకూ రెడ్డి అని పేరు ఉన్న దాఖలాలు లేవు. ఈ పేర్లతో పాటు ఆ భూస్వామ్య దోపిడీ కూడా ఇక్కడికి దిగుమతి అయింది. ఈ రెడ్లు, రావులు మౌలికంగా ఫ్యూడల్స్. క్యాపిటలిజం కంటే ఫ్యూడలిజం ప్రధానమైంది కనుక ఆనాడు ఆంధ్రా రెడ్డి, రావుల కంటే తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రెడ్డి, రావులు ఎక్కువ శత్రువులు అనే అవగాహనతో ఆ పోరాటం సాగింది. ఇది ఆనాటి మావోయిజం. క్యాపిటలిజం కంటే ఫ్యూడలిజం ఎక్కువ ప్రమాదకరమైందని మావోయిజం అవగాహన కూడా.

ఇప్పుడది పూర్తిగా మారింది. తెలంగాణ రెడ్డి, రావులు, తెలంగాణ విశాల ప్రజల మిత్రులు, ఆంధ్ర పెట్టుబడిదారులు ప్రధాన శత్రువులని అన్ని నక్సలైట్ ఆర్గనైజేషన్లు తెలంగాణ, ఆంధ్ర మధ్య వైరుధ్యం ప్రధాన శత్రువైరుధ్యం అని చెబుతున్నారు. ఇప్పుడు హైదరాబాదులో ఉన్న ఆంధ్ర పెట్టుబడిదారులను తరిమికొట్టాలంటే తెలంగాణ ఫ్యూడల్స్‌తో ఐక్యసంఘటన కట్టి (నిజానికి సంలీన సంఘటన) ఈ ప్రాంతాన్ని ఆంధ్ర పెట్టుబడిదారుల నుంచి విముక్తి చేయాలనేది ఈనాటి మావోయిజం. 1969 నాటికి సీపీఐ, సీపీఎం నుంచి బయటికొచ్చిన కామ్రేడ్స్ అందరికీ ఇదే అవగాహన ఉంటే ఆంధ్ర కొండపల్లి సీతారాంరెడ్డి నాయకత్వంలో సిరిసిల్ల, జగిత్యాల పోరాటం ఎందుకు మొదలెట్టినట్టు! ఆనాటి నుంచే ప్రత్యేక తెలంగాణపోరాటమొక్కటే చేసిఉంటే పులి అంజయ్య, మారోజు వీరన్న, నల్లా ఆదిరెడ్డి, చంద్రమౌళి వంటి గొప్ప భూస్వామ్య వ్యతిరేకుల్ని కోల్పోయే వారం కాదు కదా!

వీరందరూ ఆ పోరాటంలో చనిపోయి ఉండకపోతే దేశాన్నే మార్చే నాయకులయ్యేవారేమోకదా? తెలంగాణ ఫ్యూడల్స్ స్వభావం, స్వరూపం ఏమైనా మారిందా అంటే 'కర్రు కాల్చి వాతపెడతం', 'చాకలి-మంగళి వేశాలెయ్యొద్దు' అనే రావు, రెడ్ల భాష ఉద్యమాల్లోనే ఉంది కదా! ఏం మారింది. ఈ మొత్తం తెలంగాణ ఉద్యమంలో 'దొరల బంగ్లాలో' మాజీనక్సలైట్లు, ప్రజా సంఘాల నాయకులు- గాయకులు తప్ప ఎవరున్నారు? దొరల ఉపన్యాసాలకు ముందు ధూంధాం పాటలు పాడుతూ బట్టలిప్పుకొని అర్ధనగ్నంగా ఎగిరే వారం తా ఏ సిద్ధాంత భూమికలో పుట్టి పెరిగారు? ఈ భూస్వాముల్ని రేపొచ్చే ఎన్నికల్లో అదే సిరిసిల్ల, జగిత్యాల్లో (పోరాటగడ్డల్లో) గెలిపించబొయ్యేది ఎవరు? భూస్వామ్య శక్తులకు విశాల ప్రజల మధ్య ఉండే ప్రధాన మావోయిస్టు వైరుధ్యం హైదరాబాద్‌లో మారిందా, అడవుల్లోనే మారిందా?

నక్సల్‌బరీ పోరాటం చుట్టూఉన్న జర్నలిస్టులు, పౌర హక్కుల నాయకులు, మేధావులు బంజారాహిల్స్ బంగ్లాల్లోనే విముక్తి మార్గముందని చెబుతున్నారు. ఈ మార్పు ఎవరి రచనల ద్వారా వచ్చింది? నా ఆట తెలంగాణ; నా పాట తెలంగాణ, నా మాట తెలంగాణ అని సెల్‌ఫోన్ల మీద, టీవీలల్లో, పత్రికల్లో రోజూ వింటుంటే తెలంగాణలో పుట్టిన వాడెవ్వడూ, నేను విశ్వమానవున్ని, నేను ప్రపంచ కార్మికున్ని, అంటేనే చంపెయ్యాలనే పిచ్చి ఉన్మాదుల్ని మావోయిస్టులు ఎందుకు తయారుచేస్తున్నారు? ఎం.ఎల్ రాజకీయాల నుంచి వచ్చిన ఏ వ్యక్తిని మందలిచ్చినా ఇప్పుడు తెలంగాణ తప్ప మరోటి మాట్లాడే పరిస్థితి లేదు. ఇక్కడి దొరల మీద ఈగ వాలితే వారు కాల్చి చంపేంత కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తెల ంగాణ వచ్చినా, రాకున్నా తెలంగాణ పోరాటం ఆపొద్దు అంటున్నారు. భూస్వాముల పార్టీలకు ఓట్ల సమీకరణ మాజీ నక్సలైట్లే చేస్తున్నారు. దానికోసం రోడ్ల మీద పోరాటం వాళ్ళే నడుపుతున్నారు. జనం చీమల పుట్టల్లా రోడ్లమీది కొచ్చిండ్రని ఒక విప్లవకారుడు రాస్తే, జనం తెలంగాణ కోసం వంద సీట్లు గెలిపించాలని మరో విప్లవకారుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు విప్లవం అనే పదం అర్థమే పూర్తిగా మారిందా?

ఈ మొత్తం డ్రామా తెలంగాణ పవిత్ర ఫ్యూడలిజాన్ని కాపాడడానికే కదా! తెలంగాణ ఫ్యూడలిజానికి వ్యతిరేక పోరాటం పుట్టిందని చెప్పిన పాట, దాని స్వరూపం ఏమాత్రం మారక ముందే రాష్ట్రాన్ని విడగొట్టైనా, ఇక్కడి భూస్వాముల్ని తొందరగా అధికారంలోకి తేవాలని ఎందుకు చెబుతుంది? టీఆర్ఎస్ పుట్టినాక తెలంగాణ ప్రాంతంలో వారి అసలు విప్లవ కార్యక్రమం ఒక్కటి కూడా లేకుండా పోయింది. విప్లవకారులు ఎంతో మందిని చంపించిన జానారెడ్డి, కేసీఆర్‌లు ఏర్పాటు చేసిన జేఏసీ అనే ఫ్యూడల్ సంస్థలో విప్లవకారులంతా హుషారుగా, పట్టుదలతో పనిచేస్తున్నారు. తెలంగాణ పేరుతో మావోయిజం బీజేపీతో అలాయి, బలాయిలా ఉంటుంది. ఇక్కడో గుజరాత్ జరిగేదాకా నిద్రపట్టే పరిస్థితి లేదు. ఎవరిదో ఒకరిది రక్తం చూస్తే తప్ప సూర్యుని గురించి కవిత్వం రాయలేని కవిలా, విప్లవ వాదం కూడా ఏదో ఒక రకంగా ప్రజల చావు కోరుకుంటే ఎట్లా? 1969లో చెన్నారెడ్డితో చేతులు కలిపి నినదించారు. ఆయన ఆ నినాదం ఆపేస్తే విప్లవకారులు కూడా ఆపేసారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణే ఏకైక లక్ష్యం అని ముడుపులపాయ పార్టీ పెడితే విప్లవగ్రూపులన్నీ 'అవును తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యమని' కట్టిన గజ్జె ఇప్పకుండా ఎగురుతున్నాయి. 

మావోయిజానికీ, ఈ ఫ్యూడల్ ఉద్యమానికి సంబంధమేమిటి? ప్రపంచ సిద్ధాంతాలన్నిటినీ పక్కకు పెట్టి ఇక్కడ ఉద్యమ ఉద్యోగుల్ని తయారుచేసే కార్యక్రమం మావోయిస్టులకేమైనా ఉందా? ప్రత్యేక తెలంగాణ 1969 ఉద్యమంతో రాలేదు. ఇప్పుడు జరిగే ఉద్యమంతో రాదని మావోయిస్టులకు తెలువకపోయినా ఇంట్లో ఉన్న కేసీఆర్‌కూ తెలుసు, జైల్లో ఉన్న జగన్‌కు తెలుసు, నడుస్తున్న నాయుడికి తెలుసు, నిద్రపోతున్న కిరణ్‌కూ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమస్య చుట్టూ ప్రజల్ని ఇంకా తిప్పడమంటే పవిత్ర ఫ్యూడలిజానికి పూజ చెయ్యడం తప్ప మరేమీ కాదు. ఈ చండేశి యాగంలో ఇంకెంతమంది బలికావాలో అందరికన్నా ముందు ఈ ప్రాంతపు మావోయిస్టులు చెప్పాలి. ఏ సిద్ధాంత ప్రాతిపదికన విప్లవ సంఘాలన్నీ ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారో చెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉంది.

విప్లవకారులకు సిద్ధాంత అవగాహన లేకపోతే ఆ పార్టీల్లో యువకులు చేరి ప్రాణాలెందుకు కోల్పోవాలో కూడా చెప్పాలి. లెనిన్ చెప్పినట్లు విప్లవకారునికి ముందు సిద్ధాంతం ఉంటుంది, తరువాత దాని ఆచరణ ఉంటుంది. వేలాది ప్రాణాలు ఫ్యూఢలిజం వ్యతిరేక పోరాటంలో బలిగావడానికి కారకులైన విప్లవకారులు ఇప్పుడు అదే ఫ్యూడలిజం పూజచేస్తే ఇక ప్రాంతాన్ని కాదు, దేశాన్ని కూడా ఎవరూ కాపాడలేరు. ఇప్పుడు నడుస్తున్న తెలంగాణ ఓట్ల పోరాటానికీ, నోట్ల పోరాటానికీ మీ అండ ఎలా ఉంటుందో చెప్పండి

- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త
Andhra Jyothi News Paper Dated: 16/12/2012

1 comment:

  1. అధికారం అనే మాయజాలం లో దళితులు , బహుజనులు సిద్దాంతాలను , వర్గాలను తాకట్టు జాతి ప్రయోజనాలను కాదు అని స్వప్రయోజనాలకు బానిసల గా మారటం ఆత్మహత్య లాంటిదే .ఒక్కప్పటి పోరాట యోధులు, ప్రజలు తమ బుజాల కెత్తుకుని మోసిన నాయకులు నేడు చరిత్ర హీనులు అవుతున్నారు . పెట్టుబడిదారి నాయకత్వం లో సమిధలు అవుతున్నారు

    మీ రచన వాళ్ళకు చెంపపెట్టు లాంటిది సర్

    ReplyDelete