Thursday, January 10, 2013

బహుజనులారా.. వివేకంతో వ్యవహరిద్దాం! ---ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు



ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రజలందరికీ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలుగా ఒక విన్నపం చేస్తున్నాము. దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తున్న సందర్భంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యల్ని కేంద్రంగా చేసుకొని కొన్ని అగ్రవర్ణ రాజకీయ పార్టీలు హిందూ ముస్లిం విభజనని మరోసారి ముందుకు తీసుకొస్తున్నాయి. ఈ హిందూ ముస్లిం విభజన వల్ల అగ్రకులాలే లాభపడతాయి. అంతే తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎలాంటి ఉపయోగం లేదు. బ్రాహ్మణవాదం (హిందూ మతం) గురించి దాని అహేతుకత గురించి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ వంటి మహానుభావులు అనేకమంది విమర్శనాత్మక గ్రంథాలు రాశారు. దేశవిదేశాల్లో అనేక పరిశోధనలు జరిగాయి. అందువల్ల మతం పేరు మీద జరుగుతున్న ఈ రాజకీయ వ్యవహారమంతా అగ్రవర్ణాలు అధికారంలో రావడానికి చేస్తున్న కుట్రే.

మరోవైపు హిందుత్వవాదులు చేస్తున్న ఈ కుట్ర తెలంగాణ ఉద్యమానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా మతతత్వాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే వ్యాపింప చేస్తున్నాయి. ఈ కుట్రను తెలంగాణవాదులు సరిగా అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు ఈ కుట్రలను తిప్పికొట్టాలి. హిందువులు అనే పేరు మీద తెలంగాణవాదులు మాట్లాడడం కూడా సరైంది కాదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలు హిందువులు కారని 1918 నుంచి చెబుతూనే వచ్చారు. అలాగే 1932లో ఎస్సీలకు ‘కమ్యునల్ అవార్డు’ను ఇందుకోసమే ఇచ్చారని గమనించాలి. 

అక్బర్ విషయంలో బీజేపీ కుట్రపూరితంగా ఎడిట్ చేసి విడుదల చేసిన సీడీలను మాత్రమే మనం నమ్మడానికి వీల్లేదు. బీజేపీ తన మతతత్వ ఎజెండాలో భాగంగా అనేక జిమ్మిక్కులను ప్రయోగిస్తుందని గుర్తించాలి. అందుకని అక్బరుద్దీన్ పూర్తి ప్రసంగపాఠాన్ని విన్న తర్వాత అది సరైందా లేదా అని నిర్ణయించుకోవాలని కోరుతున్నాము. అట్లాగే ఒకవేళ నిజంగానే విద్వేషపూరితంగా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా నేరమేనని మేము భావిస్తున్నాము. తొగాడియా లాంటివాళ్లు ప్రతీసారి చేస్తున్న ఉద్రేకపూరిత, విద్వేషకరమైన ఉపన్యాసాల సంగతేమిటి? బీజేపీ అనుబంధ లేదా మాతృసంస్థలు ప్రతీనెలలో కనీసం రెండు మూడుసార్లు హైదరాబాద్‌లో ఏదో ఒకచోట రెచ్చగొట్టే ప్రసంగాలు, పనులు చేస్తూనే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన రికార్డు వీడియోలు ఇంటలిజెన్స్ డిపార్ట్‌మెంట్ వద్ద ఉన్నాయి. గత రెండు సంవత్సరాలుగా తొగాడియాతో పాటు హిందూత్వ ఉగ్రవాదుల మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు కనీసం దరఖాస్తులు స్వీకరించలేదు. అద్వానీ విద్వేషపూరితంగా తీసిన రథయాత్ర దేశంలో ఐదు వేలమంది చావుకు కారణమైంది. శ్రీకృష్ణ కమిషన్ అద్వానీతో పాటు అనేకమంది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను దోషులుగా ప్రకటించింది. అయినా వారిని అరెస్ట్ చేయలేదు. అట్లాగే గుజరాత్‌లో నరేంవూదమోడీ రెండువేల మంది ముస్లింలను ఊచకోత కోయిస్తే మూడవసారి సీఎంను చేశారు. అంతేకాకుండా నరోడా పాటియాల్‌లో ముస్లింలపై జరిగిన సామూహిక హత్యాకాండ వ్యవహారంలో బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ ప్రమేయముందని సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది. ఇట్లా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా జరిగిన అనేక మత అల్లర్లకు, బాంబు పేలుళ్ళకు బీజేపీ దాని మాతృసంస్థలే బాధ్యులని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. అందుచేత ఎంఐఎంను నిషేధించాల్సి వస్తే బీజేపీతోపాటు హిందూత్వ మతసంస్థలన్నింటినీ నిషేధించాల్సిందే. రాజ్యాంగం పట్ల గౌరవంలేని హిందూ ఉగ్రవాద సంస్థలు దేశభక్తి, దేశభవూదతల గురించి మాట్లాడడం హాస్యాస్పదం.

అక్బరుద్దీన్ వ్యాఖ్యల నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నీ అధికార రాజకీయాలలో భాగమే. ముఖ్యమైన విషయమేమం మనోభావాలు గాయపడ్డాయనే మోసపూరిత చర్చను బీజేపీ తెరమీదకు తెస్తున్నది. మనోభావాలు గాయపడడం అనేది మత విషయంలోనే జరగడం లేదు. కుల వ్యవస్థ ఉండాలని, దానిమీద మాత్రమే సమాజం మనగలుగుతుందని కొంతమంది మత పీఠాధిపతులు టీవీల్లో, సభలు సమావేశాల్లో మాట్లాడుతున్నారు. ఇదంతా కులం పోవాలని కోరుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీల మనోభావాలను దెబ్బతీయడం కాదా?! ముస్లింలు నివసించే ప్రాంతాలను ‘ఉక్షిగవాద తండాలు’ అని కొందరు మతాధిపతులు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ముస్లింల మనోభావాలు గాయపడుతున్నాయి. అందువల్ల మతం పేరుతో విద్వేషం రెచ్చగొట్టే హిందూ మఠాధిపతులపై చర్యలు తీసుకోవాలి.

కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఎంఐఎంను ఒక సాకుగా చూపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లింలను అణచివేయాలని చూస్తున్నాయి. అందుకని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు సంయమనం పాటిస్తూ, వివేకంతో వ్యవహరించాలని కోరుతున్నాము. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువల ద్వారా, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన దృష్టికోణం నుంచి ఈ పరిణామాలను అర్థం చేసుకోవాలని పిలుపునిస్తున్నాం.

-బహుజన రచయితల సంఘం, బహుజన కెరటాలు, 
బహుజన ఎకడమిక్ అండ్ రీసెర్చ్ సెంటర్,అంబేద్కర్ విద్యార్ధి సమాఖ్య, తెలంగాణ మూలవాసీ జేఏసీ, భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్, బహుజన స్టూడెంట్స్ ఫ్రంట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ స్టూడెంట్స్ ఫోరమ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మూలవాసీబహుజన లిబరేషన్ మూవ్‌మెంట్
‘మట్టిపూలు’ ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ రచయివూతుల వేదిక
‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం, 
దళిత్ కెమెరా,టిఎస్‌ఎ, ఇఫ్లూ

Namasete Telangana Telugu News Paper Dated : 11/1/2013

No comments:

Post a Comment