Wednesday, January 23, 2013

రాజకీయ కక్షతోనే అణచివేత - కనీజ్ ఫాతిమా



 రాజ్యాంగ వ్యవస్థలు మతతత్వంతో నిండిపోయాయి. రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఏర్పడిన సంస్థలు దృక్పథలేమి వల్ల కర్త్యవం గ్రహించలేకున్నాయి. వామపక్షం కూడా మత శక్తుల వ్యూహాలను తమకు అనుకూలంగా వినియోగించుకొనే ఎత్తుగడనే అనుసరిస్తుంది. రేటింగ్ కోసమే మీడియా మతం పేరుతో వివాదాన్ని సృష్టించాయని అనుకోకూడదు. మీడియా జాతీయ, రాష్ట్ర స్థాయిలో హిందూత్వ శక్తులు బలపడే విధంగానే మత విద్వేషాలను ప్రసారం చేస్తున్నది నిజం. ఈ విధంగా సకల వ్యవస్థలు, సంస్థల పతనం వల్ల సమాజంలోని అల్ప సంఖ్యాకుల రాజ్యాంగ హక్కులు ప్రమాదంలో పడుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం సమాజం ఒంటరిపాటుకు, వెలివేతకు, అణచివేతకు గురవుతుంది. 

ఇది ముస్లిం సమాజం వరకే పరిమితమై ఆగిపోదు. ఇతర సమాజాలకు వ్యాపించి తీరుతుంది. దేశ భద్రత ప్రమాదంలో పడటమే కాదు, సమాజ పరివర్తన ఆకాంక్షించే కింది కులాల ఉద్యమం నిర్వీర్యమై పోతుంది. ఇక ఆ తర్వాత ప్రజాస్వామ్యం అనే భావనే బతికి ఉండదు. చట్టం పరిధిలో, మైనార్టీ హక్కుల రక్షణ, గుర్తింపు అన్న అంశంలో రెండు ప్రధానమైన ఉద్దేశ్యాలున్నాయి. ఒకటి, ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాన్ని మెజార్టీ వర్గమే నడుపుతుంది. అందువల్ల రాజ్యాన్ని మైనార్టీల పట్ల దౌర్జన్యపూరితంగానూ అణచివేత స్వభావంతోనూ ఉండకుండా నియంత్రించటం. 

రెండు, మైనార్టీలకు ఒక రక్షణ ప్రదేశాన్ని ఏర్పాటు చేయటం. తద్వారా వారి ప్రత్యేకమైన గుర్తింపును భద్రపరుచుకొని జాతీయ అభివృద్ధి, పురోగతికి తోడ్పడతారు. లౌకిక రాజ్యం అని రాజ్యాంగం ప్రకటించి, మైనార్టీలను రక్షించాలని పరోక్షంగా రాజ్యాన్ని ఆదేశించింది నిజమే. అయితే ఆచరణలో రాజ్యం మతాల విషయంలో తటస్థ వైఖరిని అవలంభిస్తుందా? మత మైనార్టీలను రాజ్యం కాపాడుతున్నదా? అక్బరుద్దీన్ ఖైదు నేపథ్యంలో భారత రాజ్యం యొక్క స్వభావం, దాని ప్రవర్తన గురించి రాజ్యాంగ దృష్టి నుంచి ఆలోచిస్తే కొన్ని ప్రశ్నలకైనా సమాధానం దొరుకుతుంది.రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్య సంపూర్ణంగా రాజకీయపరమైంది. 

రెండు మత సమూహాల మధ్య విభేదాలను సృష్టించడానికి వాస్తవాలను వక్రీకరించి ప్రజలకు సమర్పించిన సమస్య. ఇది రాజ్య ప్రాయోజిత కార్యక్రమం. దీన్ని ప్రత్యేకించి పెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు చేశాయి. 2014లో రాబోతున్న ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తున్నాయి. పాదయాత్రలు, ప్రదర్శనలు, బహిరంగ సభలు వంటివి అన్ని పార్టీలు చేపట్టినట్టే ఎంఐఎం కూడా నిర్మల్‌లో ఒక బహిరంగ సభ నిర్వహించింది. 

అందులో ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఉపన్యాసాన్ని సాకుగా తీసుకుని కొంతమంది ఎంఐఎం వ్యతిరేకులు 'విద్వేష ఉపన్యాసం' అని మౌఖిక ప్రచారం చేశారు. ఈ 'విద్వేష ఉపన్యాసం' ప్రచారం వల్ల అనతి కాలంలోనే హిందూత్వ శక్తులు ఈ సమస్యను పట్టుకున్నాయి. గంటా యాభై నిమిషాలున్న అక్బరుద్దీన్ ఓవైసీ ఉపన్యాసాన్ని ముప్పై నిమిషాలకు కుదించి ఎడిట్ చేశారు. అది విన్న సామాన్యుడెవరైనా సరే అధిక సంఖ్యాక సమాజానికి వ్యతిరేకమైన విద్వేష ఉపన్యాసమని తప్పకుండా నమ్ముతారు. 

జాతీయ, స్థానిక మీడియా 'విద్వేష ఉపన్యాసం' ప్రచారం చేస్తూ అక్బరుద్దీన్ కేసు విచారణ నేరుగా ప్రారంభించింది. గతంలో కూడా ఇదే విధంగా మీడియా వ్యవహరించింది. అమాయక ముస్లిం యువకులను చట్టవిరుద్ధంగా ఎత్తుకుపోయి, హింసించి, అరెస్టు చేసి తీవ్రవాదులనే ముద్ర వేసినప్పుడు కూడా మీడియా తీవ్రవాదుల అరెస్ట్ అనే ప్రచారం చేసింది. ఆ తీరులోనే అక్బరుద్దీన్ విషయంలోనూ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. 

కానీ విషాదం ఏమిటంటే తీవ్రవాదులనే ఆరోపణలతో అరెస్టు చేయబడ్డ అమాయకులు నిర్దోషులని నిరూపణ జరిగిన తర్వాత ఇదే మీడియా కనీసం పశ్చాత్తాపం చెందినట్టు కనిపించలేదు. అక్బరుద్దీన్‌ను భారత్ వ్యతిరేకి, మతతత్వవాది అని మీడియా ఆరోపణలు చేసింది. అక్బరుద్దీన్ మొత్తం ఉపన్యాసంలో ఎక్కడా 'హిందువులు' అనే శబ్దమే ఉపయోగించలేదు. అమెరికా ముస్లిం దేశాల్లో తీసుకొస్తున్న సమస్యలు, ముస్లింల మధ్య అది సృష్టిస్తున్న విభేదాల వల్ల సంభవిస్తున్న అనైక్యత సమస్యను లేవనెత్తుతూ సాగింది. 

జాతీయ స్థాయిలో బీజేపీ, ఆరెస్సెస్, వీహెచ్‌పీ, హిందూ వాహినీ వంటి సంస్థలు ముస్లింలను ఊచకోత కోస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారనీ, బాధిత ముస్లిం సమాజాన్నే శాంతి భద్రతల సమస్యకు మూలమనే పద్ధతిలో రక్షణ సంస్థలు నిందిస్తున్నాయనీ, ముస్లింలను హిందూత్వ శక్తుల నుంచి కాపాడకపోగా హిందూత్వ సంస్థలకే పోలీసులు సహకరిస్తున్నారని చెబుతూ హిందూస్థాన్‌లో ముస్లింలు 25 కోట్లు ఉన్నారని, పోలీసులకు చేతకాకపోతే పక్కకు జరిగితే పరిస్థితిని వారే చక్కదిద్దుతారనే భావంతో మాట్లాడారు. 

ఒక వాక్యాన్ని దానికి ముందు చెప్పిన విషయం నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. కానీ సందర్భం నుంచి విడదీసి వందకోట్ల మందిని చంపుతామనే అర్థం తీసి వివాదం సృష్టించారు. హిందూత్వ శక్తులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యను మొత్తం హిందువులకు ఆపాదించటమే ఇక్కడ ట్విస్టు. హిిందువులు కేవలం ఒక మత సమూహం. హిందూత్వం అనేది ఒక భావజాలం. మతతత్వ రాజకీయాలను హింసాత్మక పద్ధతుల్లో వ్యక్తీకరించేవారు హిందూత్వవాదులు. 

అక్బరుద్దీన్ హిందూ దేవుళ్లను అవమానించాడనే మరో ఆరోపణ కూడా చేశారు. కానీ నిజానికి ఆయన రామ్‌జఠ్మలానీ మాటలనే గుర్తు చేశారు. రాముడు అసలు లేనే లేడనీ, ఒక వేళ రాముడుంటే అయోధ్య అతని జన్మస్థలం కాదనీ రామ్‌జఠ్మలానీ అన్నారనీ, రాముడు ఉన్నదీ లేనిదీ నిరూపించాలని హిందూ మతాధిపతులను రామ్ జఠ్మలానీ ప్రశ్నించాడనీ అక్బరుద్దీన్ ఆ ప్రసంగంలో పేర్కొన్నాడు. ఈ ప్రశ్న రామ్‌జఠ్మలానీ అడిగాడు కాబట్టి ఎవరూ ఏమీ అనరనీ, అదే అక్బరుద్దీన్ మాట్లాడితే అరెస్టు చేస్తారని కూడా అక్బర్ అన్నాడు. నిజానికి, మేధావులు ఇప్పటికే చెప్పిన విషయాలను తన మాటల్లో అక్బరుద్దీన్ వ్యక్తీకరించాడు. 

రాముడి ఇతివృత్తం గురించి ఒక రామ్‌జఠ్మలానీయే కాదు జాతీయోద్యమ కాలంలోనే రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్, పెరియార్ రామస్వామి వంటి మహా పురుషులు పెద్ద పెద్ద గ్రంథాలే రాశారు. హిందూ మతానికి చెందిన అనేక మంది పెద్దలు, మతాలకు సంబంధం లేని మానవతావాదులు, చరిత్రకారులు, మేధావులు ఎన్నో పుస్తకాలు రాశారు. కంచ ఐలయ్య లాంటి దళిత మేధావులు దేవుళ్ల ఉనికి గురించీ, వేదాలు, పురాణాల గురించీ మాట్లాడారు. మరి వాళ్లందర్నీ ఎందుకు అరెస్టు చేయలేదు? రాజద్రోహం, రాజ్యం మీద యుద్ధం, దేశ లౌకికత్వానికి ముప్పు వంటి కేసులు పెట్టలేదేమీ? కేవలం వాళ్లు మెజార్టీ మతానికి చెందిన వారు కావటం వల్లే కదా? ఇది కేవలం అక్బరుద్దీన్‌కు సంబంధించిన సమస్యగా లేదు ఇప్పుడు. 

మెజార్టీ రాజ్యం యొక్క వివిధ సంస్థలు విపరీత వాదనలతో అణచివేతను సమర్ధించుకుంటున్నాయి. ఏదైనా ఒక తప్పు మెజార్టీ వర్గం చేస్తే అది తప్పని పరిగణించబడటం లేదు. కానీ అదే తప్పును మైనార్టీ వర్గం చేస్తే అది తప్పని చెప్పటమే కాదు, రాజద్రోహం, అసాంఘిక చర్య, ప్రజాస్వామ్యానికి చేటు, లౌకికత్వానికి పెనుముప్పు అంటున్నారు. 

చార్మినార్ సమస్య నేపథ్యంలో రాష్ట్ర, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నది. ఈ సందర్భంలో ఎంఐఎం పార్టీని అణచివేసేందుకు కాంగ్రెస్ అక్బరుద్దీన్ ఉపన్యాసాన్ని ఒక సాకుగా చూపిస్తుంది. అందువల్ల అంతర్గత విభేదాలను పక్కకు పెట్టి ఈ దేశ నిజమైన భూమిపుత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సమైక్యమై గుర్తింపులను నిలబెట్టుకోవాలి. ఐక్యంగా హిందూత్వ ఫాసిజాన్ని నిలువరించాలి. 

- కనీజ్ ఫాతిమా
సహాయ కార్యదర్శి, సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ

Andhra Jyothi Telugu News Paper Dated : 23/1/2013

No comments:

Post a Comment