Monday, January 28, 2013

దళిత, బహుజనులకు అవమానం ఆషిశ్‌ నంది వ్యాఖ్యలు By Dr Darla Venkateswarlu



దళిత, బహుజనులే అవినీతిపరులని ప్రముఖ రచయిత ఆషిశ్‌నంది జైపూర్‌ సాహితీ ఉత్సవాల్లో బహిరంగంగా వ్యాఖ్యానిం చడాన్ని తీవ్రంగా ఖండించాలి. ఒక రచయి తగా, ఒక కళాకారుడిగా కాకుండా దళిత, బహుజనుల రక్తాన్ని ప్రయోగశాలలో పరీక్షించి వచ్చిన నిర్థారితఫలితాలాధా రంగానో, వాదోప వాదాలన్నీ పరిశీలించిన ఆధారాలతో న్యాయ మూర్తి తీర్పు చెప్తున్నట్లుగానో- కేవలం దళిత, బహుజనులే నేరస్థులన్నట్లు ఆయన మాట్లాడారు. అదే సాహితీసభలో అంతకు ముందుకూడా ప్రముఖ దళిత, బహుజన మేధావి ఆచార్య కంచె ఐలయ్య రాసినపుస్తకావిష్కరణను వ్యతిరేకించాలని కొంతమంది నిరసన జరిపినట్లు వార్తలు వచ్చాయి.వీటినన్నింటి నీ దళిత, బహుజన కవులు, రచయితలు జాగ్రత్తగా గమనించాలి. ఈదేశంలో దళిత, బహుజనులకు చదువుకొనే అవకాశాన్ని ఎప్పుడి చ్చారనేది తెలిసీ, తెలియనట్లు మాట్లాడే ఇలాంటి వారిని ఏమనాలి? దళితులు అవినీతి పరులనీ, నేరస్థులనీ అనడా నికున్న ఆధారాలేమిటి? న్యాయస్థానాల్లో వచ్చే తీర్పుల్నో, పోలీస్‌ స్టేషన్లో నమో దయ్యే కేసుల్నో వాటికి ఆధారాలుగా తీసుకొనేవాళ్ళని రచయితలుగా, కళాకా రులుగా, మేధావులుగా గుర్తించాల్సిన పనేలేదు. 

ఆషిశ్‌ నంది- సిపిఎం అధికారంలో ఉన్నప్పుడు అని కూడా ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. రాజ్యాంగ పరంగా తప్పనిసరి పరిస్థితుల్లో సిపిఎం వాఉ రిజర్వేషన్‌ ప్రకారం సీట్లుకేటాయించినా, తమ సిద్ధాంతాల ప్రకారం కులాన్ని గుర్తంచరని ఈ రచయితకు తెలియదా? ఇదేనా ఈయనకున్న అవగాహన? కులాన్ని గుర్తించని సైద్ధాంతిక పాలనలో ఉన్న రాష్ట్రాన్ని కులపరంగా చూడ్డంలోనే వాళ్ళ కుల దృష్టి స్పష్షంగా కనిపిస్తుంది.ఇప్పటికే సమాజంలో దళిత, బహుజనులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. తరతరాలుగా అణచివేత, పీడనల ఫలితంగా ఒక హక్కుగా పొందుతున్న రిజర్వేషన్లు; వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలు- సక్రమంగా అమలు జరుగుతున్నాయో లేదో కూడా తెలుసు కోకుండానే ఇతరకులాల వాళ్ళు దళిత, బహుజనులపై అకారణమైన ద్వేషభావాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకనే ‘మావిశ్వాసంపై శవపంచాయితీ చేసి/ మా ప్రార్థనా మందిరాలపై పంచనామా చేసి/ మా కన్యా స్త్రీలపై మానభంగం చేసింది...’ ఎవరని కవులు (తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌, పరివర్తన నిజం, 2008 పుట: 33) ప్రశ్నించారు. 

అశిష్‌ నంది చేసిన వ్యాఖ్యలు మా హృదయాల్ని తీవ్రంగా గాయం చేస్తున్నాయి. ‘ఇది కండకావరమో/ వారసత్వపు అహంకారమో/ భయంకర మానసిక రోగమో/ మా లోని మానవత్వపు జింక పిల్లను/ మీ పైశాచిక మృగత్వం వేటాడుతోంది’ అని మా కవి గరికిపాటి మణీందర్‌ ( సిలువై శాంతి కపోతం) లో వ్యధాకులితుడైనట్లుంది.ఇటువంటప్పుడు ఓ కవి (వనపల్లి సుబ్బయ్య) ‘వర్ణాశ్రమ ధర్మాన్ని చాప కింద నీరులా/ నాలుగు దిక్కుల్లో విషమై కక్కుతున్న/ వెయ్యి పడగల హిందూ కాల నాగులు/ గుండెల్లో శూలాల్ని దించేది ఉన్మాదం/ గుడిసెల్లో ప్రేమలు పంచేది ప్రబోధం/ భజన చేసినంత సులువు కాదు/ కుష్ఠు రోగులకు సేవచేయడం/ పసిపిల్లల సజీవ దహనాలు/ ఫాదరీల హత్యలు/ ఏ యుద్ధనీతి?/ ఏ రాముని ధర్మం?’ అని ఆషిశ్‌ నంది వంటి వాళ్ళని నిలదీసి ప్రశ్నించాలి. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో దళిత, బహుజనులను ఎవరు అవమానించినా వాళ్ళకి తగినబుద్ధిచెప్పడానికి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.

Surya Telugu News Paper Dated : 29/1/2013 

No comments:

Post a Comment