Thursday, January 10, 2013

దళితులపై కపట ప్రేమ --Sampadakiyam


రాష్ట్రంలో దళితుల స్థితిగతులు అత్యంత దయనీయమని సాక్షాత్తు జాతీయ ఎస్సీ కమిషనే అభిశంసించింది. ఎస్సీల అభివృద్ధిపై కాంగ్రెస్‌ది వాగాడంబరమేనని తేల్చిపారేసింది. దారిద్య్రం, అక్షరాస్యత, అత్యాచారాలు ఇలా చాలా చాలా విషయాల్లో జాతీయ స్థాయి కంటే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఘోరమని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై ప్రతి ఆర్నెల్లకోసారి తప్పనిసరిగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం నిర్వహించాల్సి ఉన్నా భేటీ జరిగి మూడేళ్లు దాటిందని కమిషన్‌ తప్పుబట్టింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధతపై ఇటీవల ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో సిఎం కిరణ్‌ కుమార్‌ను అంబేద్కర్‌, పూలేలతో పోల్చి మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కీర్తించారు. ఎస్సీ, ఎస్టీల ఉద్ధరణకే పుట్టారని భజన చేశారు. అట్రాసిటీ చట్టం అమలు సమీక్షకు మూడేళ్లయినా సమావేశం పెట్టడానికి సిఎం తీరిక చేసుకోలేక పోయారన్న ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ పునియా ప్రకటనపై ముఖ్యమంత్రి, ఆయన వందిమాగదులు సిగ్గు పడాలి. దళితులు, గిరిజనుల విషయంలో కాంగ్రెస్‌కు మొదటి నుంచీ రాజకీయంగా సొమ్ము చేసుకునే యావే. హామీలతో ఆకర్షించాలన్న రంధి తప్ప ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఏకోశానా లేదు. సబ్‌ప్లాన్‌పై అసెంబ్లీలో చర్చ చూసినా అంతే. ఎస్సీ, ఎస్టీలు, సంఘాలు, మేధావులు కలిసికట్టుగా ఉద్యమించగా, ఆ పోరాటాలను బొత్తిగా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి, ఆయన సన్నిహితులు తమకు తాముగా చట్టబద్ధతకు ముందుకొచ్చాం, ఎవరి ఒత్తిడీ లేదని ఆత్మవంచనకు పాల్పడ్డారు.
ఎపిలో దళితుల పరిస్థితి అధ్వానంగా ఉందని పునియా మాత్రమే కాదు, నిరుడు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి ముకుల్‌ వాస్నిక్‌ సైతం కుండబద్దలు కొట్టారు. దళితులపై అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మూడో స్థానంలో ఉందని వాస్తవాలను కళ్లకు కట్టారు. తాజాగా ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ దళితులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తూర్పార పట్టారు. ఆయన సమీక్ష ప్రకారం ఎపి దళితుల్లో 80 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువనున్నారు. జాతీయ స్థాయిలో పేదరికంపై జరిపిన సర్వేలో 68 శాతం మంది పేదలుండగా, ఇక్కడి దళితుల్లో 80 శాతం మంది పేదలున్నారు. దళితుల జనాభా 16.2 శాతం కాగా ఏనాడూ నిధుల కేటాయింపు తొమ్మిది శాతానికి మించలేదు. ఉద్యోగ నియామకాల్లోనూ సరిగ్గా రిజర్వేషన్లు పాటించిన దాఖలాలు లేవు. పేదరికాన్ని బట్టి అక్షరాస్యత, అక్షరాస్యతను బట్టి సామాజిక చైతన్యం ఉంటుందనేది తాత్విక భావన. ఇక్కడి దళితుల్లో అక్షరాస్యత జాతీయ సగటు కంటే తక్కువుండటానికి కారణం పేదరికమేనని వేరే చెప్పనవసరం లేదు. మదోన్నత్త నేరస్తులకు చట్టాలు చుట్టాలవు తున్నందున దళితులపై అత్యాచారాలు పెచ్చుమీరుతున్నాయి. అట్రాసిటీ కేసులను నెల రోజుల్లో విచారించాల్సి ఉండగా, ఏళ్ల తరబడి సాగదీస్తుండటంతో నేరస్తులు అవలీలగా తప్పించుకుంటున్నారు. నమోదైన కేసుల్లో దర్యాప్తులు పూర్తయి, కోర్టు విచారణ వరకూ వెళ్లేవి చాలా తక్కువ. ఆ రకంగా వెళ్లిన వాటిలో కూడా ఏడు శాతం లోపు కేసుల్లోనే నిందితులకు అరకొర శిక్షలు పడుతున్నాయి. పోలీస్‌స్టేషన్ల దాకా వెళ్లనివి, ఒక వేళ వెళ్లినా నయానో భయానో బాధితులను లోబరుచుకొని మాఫీ చేయించుకుంటున్నవీ కోకొల్లలు. దళితులకు అన్యాయం జరుగుతున్న ఈ వ్యవహారాలలో ఆర్నెల్లకోసారి పర్యవేక్షించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన ముఖ్యమంత్రి ఏళ్ల తరబడి సమావేశం నిర్వహించలేని స్థితిలో ఉన్నారంటే దళితులను రక్షిస్తున్నారో, భక్షిస్తున్నారో అర్థమవుతుంది. 'ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా' అని ముఖ్యమంత్రి బాటలోనే కింది స్థాయి అధికారులు ఇంకా నిర్లిప్తంగా ఉన్నారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో కుల వివక్ష వ్యతరేక సమరశీల పోరాటాల ఫలితంగా జస్టిస్‌ కొత్తపల్లి పున్నయ్య కమిషన్‌ ఏర్పడింది. అయితే ఆ కమిషన్‌ సిఫారసుల్లో చాలా వరకూ అటకెక్కాయి. కుల వివక్ష రూపుమాపడానికి నెలకోసారి రెవెన్యూ, పోలీస్‌, సంక్షేమ అధికారులు గ్రామాల్లో పర్యటించాలన్న సూచనను పట్టించుకున్న నాథుడు లేడు. ఆ సిఫారసు అమలు జరిగితే బాణామతి, చేతబడి, చిల్లంగి పేర హత్యలు జరిగేవి కావు. రెండు గ్లాసుల పద్ధతి, దేవాలయాల్లోకి నిషేధం వంటివి ఇంకా చాలా ఉండేవి కావు. ఎస్సీలు తమ గోడు చెప్పుకునేటట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఉండాలని పున్నయ్య చెప్పారు. కానీ కమిషన్‌కు ఛైర్మనే లేక నాలుగేళ్లయింది. ఛైర్మన్‌ను ఎందుకు నియమించలేదని పునియా నిలదీసినా సర్కారులో చలనం లేదు. ప్రభుత్వ వాలకం తెలుసు కనుకనే సబ్‌ప్లాన్‌ చట్టబద్ధతపై ప్రభుత్వం ఎంతగా స్వంత డబ్బా కొట్టుకున్నా అమలుపై దళితుల్లో అనుమానాలు వెంటాడుతున్నాయి. అసెంబ్లీలో సబ్‌ప్లాన్‌ చట్టబద్ధత బిల్లు ఆమోదమైన కొద్ది రోజుల్లోనే ఎవిఎంల భద్రత కోసం సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించడంలోనే సర్కారు చిత్తశుద్ధి తేలిపోయింది. ఆ జీవో రద్దు చేయాలని దళితులు నెత్తీనోరు కొట్టుకున్నా చీమ కుట్టినట్టయినా లేదు. భూ పంపిణీ ప్రచారార్భాటం తప్ప వాస్తవంగా ఎస్సీలకు ఒనగూరిందేమీ లేదు. యాంత్రీకరణ వల్ల వ్యవసాయ కార్మికులుగా ఉన్న దళితులు ఉపాధి కోల్పోతున్నారు. కౌలు రైతుల్లో అత్యధికంగా ఉన్న ఎస్సీలను ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో దగా చేస్తోంది. నిధుల్లేక ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వట్టి పోయింది. ప్రచారార్భాటం, కల్లబొల్లి కబుర్లు కాకుండా దళితుల అభివృద్ధికి సర్కారుకు చిత్తశుద్ధి కావాలి. లేకపోతే ఆ వర్గాలపై వలకబోసేది కపట ప్రేమేనని అనుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ కమిషన్‌ అభిశంసనతోనైనా సర్కారు కళ్లు తెరుస్తుందా? 
Prajashakti Dated : 09/1/2013

No comments:

Post a Comment