Wednesday, January 23, 2013

స్పందనల్లో సమానత్వమేది! - సూరేపల్లి సుజాత



నిర్భయ, దామిని, అమానత్ అన్న పేదు అనేక పట్టణ ప్రాంతాలతో పెనవేసుకుపోయింది. ఈ దేశంలోని ఎంతోమంది చదువుకున్నోళ్లకు ఆమె పేగు బంధమైన చెల్లి, అక్క, ఒక బిడ్డ. ఇక్కడ స్త్రీలపై అత్యాచారాలు అతి మామూలు విషయం. అధికారిక లెక్కల ప్రకారం ప్రతి పద్నాలుగు నిముషాలకి ఒక అత్యాచారం జరుగుతోంది. కుల, మైనారిటీలపై ఒకరకంగా జరిగితే, భూములు, అడవులు, ఆదివాసీల జీవితాలపై మరొక రకంగా అత్యాచారం జరుగుతుంటుంది. ఏది ఏమైనా నిర్భయ ఒక శిక్షకి పేరు అయింది. 

వివక్షకి వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి చిరునామా అయింది. యువత ఆగ్రహానికి ప్రతిరూపం అయింది. మధ్య రాత్రి మహిళలతో మార్చ్ చేయించింది. మారుమూల పట్టణాలలో మానవహారాలు తయారు చేసింది. ఆమె బ్రతుకు దేశానికి ఒక జీవన్మరణ సమస్య అయింది. నిర్భయ పేరు జ్యోతి సింగ్ పాండే అని ఈ మధ్యనే తెలిసింది. ఢిల్లీ వంటి పెద్ద పట్టణంలో స్నేహితునితో సినిమా చూసి వస్తుండగా, ఎవరూ లేనిచోట, నిశీధి రాత్రి మగ మృగాల అమానుష దాడికి బలైపోయింది చెల్లి. 

అవును ఏ కులం అయితే ఏంది? గత ఇరవై రోజుల్లో ఎన్నో బలవన్మరణాలు జరిగాయి, అత్యాచారం చేసి అమానుషంగా చంపిన నేరాలు వెలుగుచూసేది కొన్ని మాత్రమే. ఇంకా న్యాయం జరిగేది ఎప్పుడో, ఎన్నడో. ఇవన్నీ షరామామూలే కదా? మీడియా ఎప్పుడూ పెద్దగా పట్టించుకోదు, ప్రతిపక్ష పార్టీలు అన్ని పట్టించుకుంటాయి వాళ్ళ ఉనికి కోసం. ఎందుకో ఒక్కసారి పాత జ్ఞాపకాలు చుట్టముట్టాయి. కులాలు, మతాలూ అందులోని వైరుధ్యాలపై అంతర్మథనం మొదలైంది. ఒక స్త్రీగా ఆవేదన చెందుతూనే దళిత స్త్రీలకూ, కొన్ని వర్ణాలకు, వర్గాలకు, జాతులకు ఈ దేశంలో జరుగుతున్న అవమానం, వివక్షతపై జరిగిన అన్యాయం పీడిస్తూనే ఉంది. 

మహారాష్ట్రలోని ఖైర్లాంజి సంఘటన కళ్ల ముందు కదులుతుంది. కుంబి కులస్తులు ఒక చిన్న ప్రాణి, ప్రియాంక బోత్మాంగె, యవ్వనంలోకి అప్పుడే కోటి కలలతో అడుగు పెడుతున్న చెల్లి బట్టలూడదీసి ఊరంతా నగ్నంగా ఊరేగించి, తోడబుట్టిన వాళ్లతో అత్యాచారం జరిపించమని బలవంతపెట్టింది. వక్షోజాలు నరికివేసి... అంగాంగం ఛిద్రం చేసి చంపేసింది. ఇది పట్టపగలు జరిగింది. ఆడా, మగా సమక్షంలో, ఊరు ఊరంతా సాక్ష్యం. భూమి హక్కు కోసం పాకులాడిన ఆ దళిత రైతు పిల్లల్ని అతి నిర్దాక్షిణ్యంగా, కిరాతకంగా ఊరివాళ్ళందరి ముందు అత్యాచారం చేసి చంపారు. మూడు నాలుగు రోజులు దాకా ఎక్కడా మీడియాలో వార్త రాలేదు. వచ్చినా అది పెద్ద స్పందన కాలేదు. 

ఆ తరువాత కొన్ని దళిత సంఘాలు, కొద్దిమంది ఇతరులు మీద వేసుకుని పోరాటం చేశారు. ఇక ఇదే కోవలో కారంచేడు, చుండూరు, వేంపెంట, పాదిరి కుప్పం, మొన్నటి లక్షింపేట కూడా చూడొచ్చు. ఈ అసభ్య సమాజం ఎందుకో స్పందించదు. అది దళితుల సమస్య, వాళ్ళు పుట్టిందే చంపబడడానికి, సేవలు చేయడానికి, బానిసలుగా బతకడానికి. లక్షింపేట మీడియాలో కూడా బాగానే వచ్చింది కానీ ఎందుకో దళితులు కానివాళ్ళని పెద్దగా కదలించలేకపోయింది. 

అవును అది దళితుల సమస్య. నిర్భయ విషయంలో గొంతెత్తిన యువతకి ఈ అంశం పెద్దగా పట్టి ఉండే అవసరం లేదు, వారిని కూడగట్టే సంఘాలు, వ్యక్తులకు కూడా పెద్దగా రుచించకపోయి ఉండవచ్చు. అవును, అమ్మాయి కదా, స్త్రీ కదా ఏ కులం అయితే ఏంది అనే సమాజం ఇక్కడ ఎందుకో స్పందించలేదు. అవును వీళ్ళూ మనుషులే కదా, వాళ్ళు చేసింది బ్రతుకు పోరాటమే కదా అని అనుకోలేదు. వేలకొద్దీ యువత బారికేడ్లను ఛేదించుకుని, న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టమని అడగలేదు. 

ఎవరిది ఈ సమాజం? ఎవరు స్పందిస్తున్నారు? ఎవరికి స్పందిస్తున్నారు? తొలుస్తున్న సమస్య... న్యాయం అన్యాయాల మధ్య నిరంతరం ఘర్షణకి తెరతీస్తున్న సమస్య. ఇప్పుడు దళిత స్త్రీల వార్తలు, వాకపల్లిల ఆదివాసీ స్త్రీల అత్యాచారాలు పట్టిపీడిస్తున్న సమస్యలు. గుజరాత్‌లో నిండు గర్భిణీ గర్భాన్ని నిలువునా చీల్చివేస్తే, మతం మత్తులో మునిగి స్పందించని దేశం మనది. ఇవన్నీ రాత్రి ఎక్కడో జరిగిన నేరాలు కావు, తాగి మత్తు మైకంలో జరిగిన తప్పులు కావు. సభ్య సమాజం అన్ని పోరాటాలను అదే దృష్టితో చూడగలదా? సినీ నటి ప్రత్యూష కేసు ఏమైంది? అని ఆ తల్లి ఇంకా మొత్తుకుంటూనే ఉంది. 

అయేషా కేసులో ఒక అమాయకమైన సత్యాన్ని పట్టుకొని మన ముందు దోషిగా నిలబడితే కూడా చూస్తూనే ఉన్నాం మౌనంగా. అవును, ముందే చెప్పినట్టుగా అత్యాచారాలు రకరకాలు. కొన్ని మంచివి కొన్ని చెడువి, కొన్ని న్యాయమైనవి, కొన్ని అన్యాయమైని. కొన్నింటికి స్పందిస్తాము, కొన్నింటికి అంతగా స్పందించం. ఈ తేడాలు మాట్లాడితే మనం మరొక అన్యాయం చేసిన వారం అవుతాం. కులవాదులం, మతవాదులం, మితవాదులం అవుతాము. కానీ నిజాలు, నిగూఢంగా దాగి ఉన్న అర్థాలను మాట్లాడుకొని మనల్ని మనం చూసుకొనే సందర్భం ఇది. 

నిజాలెప్పుడూ పచ్చిగా, చేదుగానే ఉంటాయి. కులం, మతం సందర్భం ఎప్పుడూ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగానే ఉంటుంది. స్త్రీల సమస్య ఎప్పుడూ, అందులో అంటరాని స్త్రీల సమస్య మాట్లాడుకోలేనంత నిశ్శబ్దాన్ని ఆవరించి ఉంటుంది. అది దళిత సంఘాలకైనా, బయటివారికైనా... స్త్రీలంటేనే అంటరాని వారు అందులో అంటరాని స్త్రీలు అధమాధమం. స్త్రీల సమస్యలు, పేద, దళిత, ఆదివాసీ, మైనారిటీల సమస్యల పట్ల మీడియా దృక్పథం ఏమిటి? కార్పొరేట్ వ్యవస్థలుగా ఉన్న వాటికి మార్కెట్ తప్ప మానవత్వం ఉంటుందా? 

నిర్భయ చావుబతుకుల మధ్య దేశం కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఇదే సమయంలో మహిళలపై అనేక అత్యాచారాలు జరిగాయి. కరీంనగర్ కోహెడలో గీత అనే మరొక చెల్లి నిర్బంధించబడి క్రూరాతిక్రూరంగా, అమానుషంగా చంపబడి పత్తి చేలల్లో విసిరివేయబడ్డది. పేద అమాయకులైన గౌడ కులానికి చెందిన తల్లిదండ్రులు, సభ్య సమాజంలో పెద్దగా స్పందన లేదు. 

అక్కడో, ఇక్కడో చిన్నాచితక సంఘాలు రోజూ న్యాయం చేయండి అని కీచు గొంతుతో అరుస్తున్నాయి. ఎప్పుడూ పెద్ద పేపర్లో మొదటి పేజీలో రాలేదు. ఇది ఢిల్లీ సంఘటన కంటే అమానుషం. అక్కడ రాజకీయ పార్టీలు కుల సంఘాలు మాట్లాడవు, జై తెలంగాణ వినిపించదు, రైట్, లెఫ్ట్ పనిచేయదు, కనీసం అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు పలకరించడానికి కూడా రారు. 

ఇక్కడ ప్రస్తావించదలచుకున్నది రెండు విషయాలు. ఒకటి స్త్రీలు అన్నా, వెనుకబడ్డ, అంటరాని కులాల వారన్నా ఇంత కసి, ద్వేషం ఎందుకు? అమానుషంగా, హింసించి, కొరికి, నరికి, ముక్కలు చేసి, శరీరాన్ని ఛిద్రం చేయాలన్న ఆలోచనలకి బీజాలు ఎక్కడ పడ్డాయ్? ఒకడు బట్టలు సరిగా వేసుకోలేదు అంటాడు, మరొకడు స్త్రీ ఉన్నదే భర్తకి సేవ చేయడానికి అంటాడు, ఇంకొకడు అర్థరాత్రి బయట తిరిగితే అంతే అని తీర్పు చెబుతాడు. ఆడపిల్ల రెచ్చగొడితే మగవాడు రెచ్చిపోతాడు అంటాడు, మరొకడు పనికిమాలినది మంచిగా బ్రతిమిలాడి ఉంటే, అన్నా అని నోరారా పిలిచి ఉంటే వదిలిపెట్టే వారు కదా అని జోస్యం చెబుతాడు. 

చివరాఖరికి అంతా ఆడవారి తప్పే, వారు నిమిత్తమాత్రులు, మగ మహారాజులు, అమాయక చక్రవర్తులు, స్త్రీలకూ ఒకలాగా పురుషులకి ఒకలాగా స్పందిస్తాం. దళిత స్త్రీలు, పురుషులను చేతబడి నెపంతో బహిరంగంగా చెట్టుకి కట్టేసి, నిట్టనిలువునా కాల్చేస్తే, పళ్ళు పీకేసి, నాలుక కోసేసి, కండ్లు పీకేస్తే చలించం కదా? దళితులు హక్కులు అడిగిన నేరానికి శిక్షగా నరికి పోగులు పెట్టి బస్తాల్లో కట్టి పడేస్తారు, న్యాయమే కదా, ఆ కులం వారు అనుభవించాల్సిందే. 

ఇదెక్కడి న్యాయం? ఒక హింసను సమర్థిస్తూ మరొక హింసకు గొంతెత్తే వారంతా సూడో ఉద్యమకారులే అని అనాల్సి వస్తుంది. ఒకే నేరానికి ఇద్దరికీ ఒకే శిక్ష పడనంతకాలం, ఒకే నేరానికి ఒకే స్పందన ఉండనంత కాలం ఈ అంతరాల దొంతరలు కలవరపెడుతూనే ఉంటాయి. మహాత్మాజ్యోతి బాఫూలే స్త్రీ, శూద్ర, అతిశూద్ర ముగ్గురూ పీడనకి గురికాబడుతున్నారు, వారిని విముక్తి చేయాలి, పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని జీవితాంతం కులాలకి, మతాలకి అతీతంగా సావిత్రిభాయి ఫూలేతో కలిసి పనిచేసి సమానత్వ విలువలను భావితరానికి అందించారు. 

ఆ తరువాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ అందరి స్త్రీల హక్కుల గురించి రాసి, దానిని అదే అగ్రకుల స్త్రీవాదులు, వారికి వంతపలికే వారే వ్యతిరేకిస్తే తన పదవికి రాజీనామా కూడా చేశారు. ఆ నాయకులు అన్నవాళ్ళు మానవత్వం, సమానత్వ పునాదుల మీద మార్గనిర్దేశం చేస్తే ఇప్పుడు మార్గాలు 'మా' కులాలు, మతాలు అన్న నిర్వచనాలతో నడుస్తున్నాయి. ఉద్యమాలు మీ ఉద్యమాలు, మా ఉద్యమాలుగా చీలిపో 

తున్నాయి. మానవత్వం మరుగున పడుతుంది. మనుషులలో, సమాజంలో మరింత వ్యత్యాసం పెరుగుతుంది. ఇది భిన్న కులాలు, మతాలు, సంస్కృతులు, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే భారతదేశానికి అంత మంచిది కాదు. రేపటి తరానికి ఈ వైపరీత్యాలు అర్థం కాకపోతే ఎవరికి వారుగానే మిగిలిపోవాల్సి వస్తుంది. 

పిల్లల మెదళ్ల నిండా కులం, మతం, మదం చొప్పిస్తూ ఇలాంటి సంఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే అవి తాత్కాలికమే. క్షణికావేశా ఉద్యమాలు ఎక్కువ నిలబడవు. ఉగ్గుపాలతో కులాన్ని, మతాన్ని, స్త్రీలపై హింసని పట్టిస్తున్న కుటుంబాలని, సమాజాలని మార్చేదాకా ఈ నీచ సంస్కృతి ఆగదు. అందులో ముఖ్యంగా పోలీసు వ్యవస్థలని సమూలంగా మార్చేదాకా ఈ నేరాలు ఆగవు. మనం కోరుకున్న శిక్షలన్నీ కూడా మళ్ళీ అమాయకులను బలిపెట్టడానికే. 

- సూరేపల్లి సుజాత
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రచయితల వేదిక

Andhra Jyothi Telugu News Paper Dated: 23/1/2013 

No comments:

Post a Comment