Thursday, October 10, 2013

9/12, 30/7, 3/10... ఇంకో రెండు తారీఖులు కావాలి --ఎన్. వేణుగోపాల్,

తెలంగాణ మళ్లీ ఒకసారి సంబురపడుతున్నది. 2009 డిసెంబర్ 9న, 2013 జూలై 30న ఎంత సంబురపడిందో 2013 అక్టోబర్ 3న కూడా అంత సంబురపడుతున్నది. అయితే ఈ సంబురం నిలవాలన్నా, బలపడాలన్నా ఇంకో రెండు తారీఖులు కూడా గడవవలసి ఉన్నది. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొంది చట్టం అయ్యే తారీఖు ఒకటి, ఏ ఇబ్బందులూ లేకుండా పది సంవత్సరాలు గడిచి ఉమ్మడి రాజధాని అనే గుదిబండ తొలగిపోయే తారీఖు ఒకటి. ఆరెండు తారీఖులూ సక్రమంగా నమ్మకంగా కుదిరేదాకా తెలంగాణ తారీఖు మారుతుందనే నమ్మకం లేదు. (తారీఖు అనే ఉర్దూ మాటకు తేదీ అనే అర్థంతోపాటు చరిత్ర అనే అర్థం కూడా ఉన్నది. తెలంగాణ విషయంలో రోజు మారి రోజు రావడం అనే తారీఖు మార్పు మాత్రమే కాదు, చరిత్ర మార్పే జరగవలసి ఉంది).

అయితే ఆ రెండు తారీఖులు అంత సులభంగా వచ్చేటట్టు లేవు. వచ్చినా తెలంగాణ సమాజం ఆకాంక్షిస్తున్నట్టుగా వస్తాయో లేదో అనుమానంగా ఉంది. అందువల్ల ఆ రెండు తారీఖులు వాస్తవరూపం ధరించేదాకా తెలంగాణ సమాజం నిరంతర జాగరూకత వహించవలసిన అవసరం పెరుగుతున్నది. 


మొదటి తారీఖుకు ఇప్పటికి ఇప్పుడు నాలుగైదు అవరోధాలున్నాయి.మంత్రివర్గ ఉపసంఘం తనకు ఇచ్చిన ఆరు వారాలలో బిల్లు ను తయారు చేస్తుందా అనేది మొదటిది. ఆ బిల్లును తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేస్తుందా, ఏవైనా కొత్త మెలికలు పెడుతుందా అనేది రెండోది.ఆ బిల్లును అందుకున్న వెం టనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారా, రాష్ట్ర శాసనసభ అభివూపాయా ల కోసం వెంటనే పంపుతారా అనేది మూడోది. ఆ పని ఎంత త్వరిత గతిన జరిగినా ఒక వారం పడుతుంది. శాసనసభ అభివూపాయాలు చెప్పడానికి కనీసం రెండు వారాలు గడువు ఇచ్చినా మొత్తం ఇవాళ్టి నుంచి తొమ్మిది వారాలు పడుతుంది. ఆ తర్వాత గాని ఆ బిల్లు పార్లమెంటు ముందరికి పోదు.


పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ - డిసెంబర్‌లలో జరగడం ఆనవాయితీ. ఆ లెక్కన అవి ఇప్పటి నుంచి నాలుగు వారాల తర్వాత మొదలై పన్నెండు వారా లు గడిచేటప్పటికి ముగుస్తాయి.అందులో తొమ్మిది పది వారాలు పైన చెప్పిన పనులకే పట్టేటట్టయితే, ఇక బిల్లు ప్రవేశపెట్టడానికి ఒక వారం మిగిలినా గొప్పే. ఆ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత దానికి అన్ని పక్షాలూ మద్దతు ఇస్తాయా, మెజారిటీ వచ్చి అది చట్టంగా మారుతుందా అనేది మరో అవరోధం. బిల్లులో ఏవైనా మెలికలు పెట్టినట్టయితే వాటిని కారణంగా చూపి ఏ రాజకీయ పార్టీ అయినా తమ మద్దతు ఉపసంహరించుకుంటే బిల్లు ఆమోదం పొందకపోతే ఎట్లా అనేది మరొక సందేహం. కనుక వెంటనే బిల్లు తయారు చేసి పార్లమెంటు ముందుకు తీసుకుపోవాలని తెలంగాణ సమాజం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచవలసి ఉంది.
ఉమ్మడి రాజధాని అనేది హైదరాబాదులో ఆస్తులు ఉన్నవారికి, శాసనసభ్యులకు, సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనకరం కావచ్చుగాని, ఆ ప్రాంత ప్రజలకు నష్టదాయకం. వారు ఏ చిన్న పనికైనా రెండువందల కిలోమీటర్లు మరొక రాష్ట్రంలో ప్రయాణించి తమ రాజధానికి రావలసి ఉంటుంది. చరివూతలో ఎక్కడా ఎప్పుడూ తమ భూభాగానికి ైట ఇంతదూరంలో రాజధాని ఉన్న ప్రజలు లేరు.
Telangana_3


నిజానికి బిల్లు తయారీకి ఎక్కువ సమయం అవసరంలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసినప్పుడు తయారైన ఆంధ్రా స్టేట్ యాక్ట్ 1953 సంగతి వేరు గాని, ఆ తర్వాత వచ్చిన బాంబే రీఆర్గనైజేషన్ యాక్ట్ 1960, పంజాబ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 1966, నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ (రీ ఆర్గనైజేషన్) యాక్ట్ 1971, మధ్యవూపదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2000, ఉత్తరవూపదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2000, బీహార్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2000 దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. 
ఒకటి రెండు సెక్షన్ల తేడాలు, పదాల తేడాలు, ఆయా రాష్ట్ర ప్రత్యేకతల కోసం కొన్ని సెక్షన్లు తప్ప మొత్తం చట్టాన్ని కొత్తగా తిరగరాసిన దాఖలాలు లేవు. అంటే ప్రస్తుత ఆంధ్రవూపదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2013 తయారు (పాత చట్టం ప్రతి తీసుకుని దానిలో అవసరమైన చోట మార్పులు, కొత్తగా ప్రవేశపెట్టవలసిన కొన్ని సెక్షన్లు చేర్పు) చేయడానికి పెద్ద శ్రమ అవసరం లేదు. కానీ మంత్రివర్గ ఉపసంఘానికి ఇచ్చిన విధివిధానాల జాబితా చూస్తే కోతిపుండు బ్రహ్మరాక్షసి లాగ గెలుకుతారేమోనని, అందువల్ల ఎక్కువ సమయం తీసుకుంటారేమోనని అనుమానించడానికి ఆస్కారం ఉన్నది. అలాగే సుప్రీంకోర్టులో వివాదంలో ఉన్న, మూడు లక్షల మంది ఆదివాసులను నిర్వాసితులను చేసే, అన్నిటికన్న మిన్నగా తెలంగాణ వాటాగా బచావత్ ట్రిబ్యూనల్ నిర్ధారించిన గోదావరి జలాల్లో గణనీయమైన భాగాన్ని కొల్లగొట్టే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే పని కూడ ఈ విధివిధానాలలో ఉంది. రెండు రాష్ట్రాల హైకోర్టులను, గవర్నర్లను హైదరాబాదులోనే ఉంచే ప్రతిపాదన ఉంది. పౌరుల రక్షణ, ప్రాథమిక హక్కుల రక్షణ వంటి అనవసరమైన అంశాలు కూడా ఉన్నాయి. కనుక ఈ మంత్రివర్గ బృందం పని తీరు మీద, అది తయారు చేసే బిల్లు మీద తెలంగాణ సమాజం వెయ్యి కళ్లతో జాగరూకత వహించవలసి ఉంది. 
ఇక రెండో తారీఖు, ఉమ్మడి రాజధాని మూర్ఛబిళ్ల తొలగిపోయే తేదీ, పది సంవత్సరాల తర్వాతది గదా అని అజాక్షిగత్త, నిర్లక్ష్యం వహిస్తే తెలంగాణ మరింత నష్టపోవలసి వస్తుంది. అసలు ఉమ్మడి రాజధాని అనే భావనే అర్థరహితమైనది. దేశంలో 1953 లో మొదటి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 2000లో చివరి రాష్ట్రాల విభజన జరిగినంతవరకూ ఎప్పుడూ ఉమ్మడి రాజధాని అనే ఊసేరాలేదు. ఎంత చిన్న పట్టణాలనైనా రాజధానులుగా ప్రకటించారు. కేవలం పంజాబ్, హర్యానాల విషయంలోనే చండీగఢ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా, పది సంవత్సరాల కోసం ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఇప్పటికి నలభై ఆరు సంవత్సరాలు గడిచిపోయినా ఆ పది సంవత్సరా లు ముగియలేదు. అలా పది సంవత్సరాలు అనే మాట చండీగఢ్ విషయంలో లాగ హైదరాబాద్ విషయంలో దైవాధీనం కాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే, ఆ గడువు వారమంటే ఏడు రోజులేనా అన్న ఆజాద్ యథాలాపపు మాటా కావడానికి వీలులేదు. 
ఉమ్మడి రాజధాని భావన అర్థరహితమైనదని చెప్పడానికి మరో రెండు కారణాలున్నాయి. ఒకే నగరంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తాయన్నప్పుడు, ఆ నగరం మీద ఏ రాష్ట్ర ప్రభుత్వపు అధికారం ఉంటుందనే ప్రశ్న వస్తుంది. రాజ్యాంగం ప్రకారం దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ సమాన ప్రతిపత్తి ఉంది గనుక ఆ నగరం మీద ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారం ఉండడానికి వీలులేదు. అంటే అది మూడోవారి చేతిలో, కేంద్రం చేతిలో ఉండే కేంద్రపాలిత ప్రాంతం కావడానికి మార్గం సుగమమవుతుంది. చండీగఢ్ అనుభ వం చెప్పేదదే. అంటే ఉమ్మడి రాజధాని అనేది కేంద్రపాలిత ప్రాం తంగా మార్చడానికి దొడ్డిదారి అన్నమాట. ఈ పది సంవత్సరాలలో చక్రం తిప్పి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్పించుకుని తమ అక్రమ ఆస్తులు పరిరక్షించుకోవాలని కోస్తా, రాయలసీమ పెట్టుబడిదారులు కుట్రలు పన్నుతూ ఉండవచ్చు. 
ఇక ఉమ్మడి రాజధాని అనేది హైదరాబాదులో ఆస్తులు ఉన్నవారికి, శాసనసభ్యులకు, సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనకరం కావచ్చుగాని, ఆ ప్రాంత ప్రజలకు నష్టదాయకం. వారు ఏ చిన్న పనికైనా రెండువందల కిలోమీటర్లు మరొక రాష్ట్రంలో ప్రయాణించి తమ రాజధానికి రావలసి ఉంటుంది.చరివూతలో ఎక్కడా ఎప్పు డూ తమ భూభాగానికి బైట ఇంతదూరంలో రాజధాని ఉన్న ప్రజలు లేరు. ఈ అన్ని కారణాల వల్ల హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ప్రకటించడాన్ని అడ్డుకోవాలి. ఒకవేళ ప్రకటించినా, ఆ నిర్ణీత వ్యవధి వరకూ జాగరూకతతో ఉండాలి.
మొత్తం మీద అక్టోబర్ 3 కేంద్ర మంత్రివర్గ నిర్ణయం తెలంగాణ సమాజపు ఆకాంక్షను పూర్తిగా తీర్చలేదు. తెలంగాణ సమాజం మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని పెంచింది. 

-ఎన్. వేణుగోపాల్

Namasete Telangana News Paper Dated: 06/10/2013

No comments:

Post a Comment