Wednesday, October 9, 2013

అసలు వైకల్యం ఎవరిది? By Sakshi Sampadakiyam


అంతర్‌దృష్టి లేకపోవడం అంధత్వం కంటే అధమమైనదని విఖ్యాత రచయిత్రి హెలెన్ కెల్లర్ అంటారు. మన పాలకులకు అలాంటి లోచూపు లోపించింది కనుకనే వికలాంగులకు ప్రభుత్వోద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్లు కల్పించే పద్దెనిమిదేళ్ల నాటి చట్టాన్ని ప్రభుత్వాలన్నీ అమలు చేసి తీరాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. ఉద్యోగాల్లో ఇచ్చే కోటా 50 శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టే ఆదేశించింది గనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అమలుచేయడం సాధ్యంకాదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు తోసిపుచ్చారు. అలాగే, గుర్తించిన కొన్ని పోస్టుల్ని మాత్రమే వికలాంగులకు కేటాయించాలని 2005లో కేంద్ర ప్రభుత్వం ఒక మెమో ద్వారా చేసిన సూచనను కూడా న్యాయమూర్తులు తిరస్కరించారు. గ్రూప్ ఏ, గ్రూప్ బీ పోస్టులకు కూడా వికలాంగ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని వారు తెలిపారు.
 
 ఖాళీ అయిన మొత్తం పోస్టుల సంఖ్యలో 3 శాతం వికలాంగులకు కేటాయించాలితప్ప, ఎంపికచేసిన కొన్నింటిని మాత్రమే వారికి ఇస్తామనడం న్యాయబద్ధం కాదని స్పష్టంచేశారు. సాంకేతిక అభివృద్ధి పర్యవసానంగా వైకల్యం ఉన్నవారు సైతం ఇతరులతో సమానంగా అన్ని పనులనూ చేయగలిగే పరిస్థితులు వచ్చాయని... ఇలాంటి పరిస్థితుల్లో వారికి పరిమితులు విధించాలని చూడటం సరైన విధానం కాబోదని వారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కారణంగా కంటిచూపు కరువైనవారికి లేదా పాక్షికంగా చూపుదెబ్బతిన్నవారికి... వినికిడిలోపం ఉన్నవారికి... సెరిబ్రల్ పాల్సీ వ్యాధిగ్రస్తులకు ఇకపై ఒక్కోశాతం చొప్పున ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ... ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రభుత్వ సంస్థల్లోనూ అలాంటివారికి ఇకపై ఉద్యోగావకాశాల్లో కోటా ఉంటుంది.
 
 దేశ జనాభాలో వివిధ రకాల వైకల్యంతో బాధపడుతున్నవారి సంఖ్య 2.1 శాతం ఉంటుందని 2001 జనాభా లెక్కలు చెబుతున్నాయి. 2011 జనాభా గణాంకాల్లో వికలాంగులకు సంబంధించిన వివరాలు ఇప్పటికింకా లభ్యంకాలేదు గానీ వారి శాతం జనాభాలో 5నుంచి 6 శాతం ఉండొచ్చని ఒక అంచనా. మన ప్రణాళికా సంఘం, ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగాల లెక్క ప్రకారం ఇది 10 శాతం వరకూ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ ఎంతవరకూ సరైనవో చెప్పలేం. ఎందుకంటే... జనాభా లెక్కలు సేకరించేవారికి, ఇతరత్రా సర్వేలు చేసేవారికి వైకల్యానికి సంబంధించి ప్రత్యేక అవగాహన కల్పించకపోతే సరైన గణాంకాలు లభ్యంకావు. కనుక మన జనాభా లెక్కలు వెల్లడించే సంఖ్యను మించి వికలాంగులు ఉండే అవకాశం లేకపోలేదు.
 
 అధికారిక గణాంకాలను గమనించినా మన దేశంలో వికలాంగుల సంఖ్య కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ! వికలాంగుల్లో అధికశాతంమంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారూ, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నవారే. బిడ్డ కడుపులో ఉండగా తల్లికి సరైన పోషకాహారం అందకపోవడంవల్లా... తల్లిదండ్రులకు ఆరోగ్యంపై అవగాహన కొరవడటంవల్లా, పోలియో, మశూచి వగైరా అంటువ్యాధులవల్లా, రకరకాల ప్రమాదాలవల్లా వైకల్యం సంభవిస్తుంది.  సమాజానికి చోదకశక్తిగా ఉండవలసిన ప్రభుత్వాలు ఇలాంటివారి బాధ్యతను స్వీకరించి ఆదుకోవాల్సి ఉంటుంది. అది వాటి బాధ్యత. కానీ, ఏవో పైపై చర్యలు తప్ప ప్రభుత్వాలేవీ వికలాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషిచేయడంలేదు. వికలాంగుల సంక్షేమానికి సంబంధించిన చేపట్టే పథకాల్లో కూడా ఏకరూపత లేదు. ఒకచోట ఉండే సంక్షేమ పథకం మరో రాష్ట్రంలో లభించదు.
 
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వికలాంగుల సంక్షేమానికి సంబంధించి ఎన్నో చర్యలు తీసుకున్నారు. వికలాంగులకు అంతక్రితం నెలకు రూ.75 మాత్రమే పింఛనుగా ఇవ్వగా, అధికారంలోకి వచ్చినవెంటనే దాన్ని ఆయన రూ. 200కు పెంచారు. 2007లో దాన్ని రూ. 500 చేశారు. వైకల్యాన్ని బట్టి దీన్ని పెంచే ఏర్పాటుకూడా చేశారు. వికలాంగుల సంక్షేమం కోసమని ప్రత్యేక నిధిని ఏర్పర్చడం, వేర్వేరు గృహ పథకాల్లో వారికి ప్రాధాన్యతనివ్వడం, ఉన్నత చదువులు చదివే వికలాంగులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లించడం... బధిర, మూగ పిల్లలకు లక్షల రూపాయలు ఖర్చయ్యే కాక్లియర్ ఆపరేషన్లను ఆరోగ్యశ్రీద్వారా ఉచితంగా చేయించడంవంటి ఎన్నో చర్యలకు ఆయన శ్రీకారం చుట్టారు. కానీ, ఆయన కనుమరుగయ్యాక అలాంటి సంక్షేమ కార్యక్రమాలు మందగించాయి. పింఛన్ల పంపిణీ సక్రమంగా లేకపోవడంవల్ల ప్రతి నెలా వికలాంగులకు అగచాట్లు తప్పడంలేదు. వైకల్యం శాతాన్ని తగ్గించి చూపి పింఛన్లు తొలగించడమూ మొదలైంది. దాదాపు 2 లక్షలమంది ఈరకంగా అనర్హులయ్యారు.
 
 ప్రభుత్వాలు ఇలా వికలాంగుల సంక్షేమానికి క్రమేపీ తూట్లు పొడుస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పు ఆశావహమైనది. రాజ్యాంగంకిందగానీ, మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారంగానీ వికలాంగుల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉండగా... ఎన్నడో 1995లో రూపొందించిన వికలాంగుల చట్టం ఇంతవరకూ అమల్లోకి రాకపోవడం సిగ్గుచేటైన విషయం.
 
 ఉద్యోగమనేది నిజంగా ఒక యోగం. అందునా వికలాంగులకు అది అందరికన్నా మించిన జీవితావసరం. ఒకరిపై ఆధారపడే స్థితిని తప్పించే ముఖ్యావసరం. కానీ, ప్రభుత్వాలు తమ అచేతనత్వంతో అలాంటివారందరికీ 18 ఏళ్లపాటు ఆ యోగాన్ని దక్కకుండా చేశాయి. ప్రజల ద్వారా అధికారంలోకొచ్చే ప్రభుత్వాలు నిజానికి తమంతతామే ఇలాంటి సమస్యలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా... అందుకు భిన్నంగా సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని చెప్పాల్సివచ్చింది. ఇకనైనా పాలకులు తాము ఎంతగా మొద్దుబారుతున్నామో, బండబారుతున్నామో తెలుసుకోవాలి. ఎలాంటి వైకల్యం తమను ఇలా మార్చిందో గుర్తెరగాలి. గుర్తించి సరిదిద్దుకోవాలి.
 

No comments:

Post a Comment