Saturday, October 19, 2013

చిన్న రాష్ట్రాలూ పెద్ద కులాలేకనా? By ఉ.సా.,


చిన్న రాష్ట్రాల ఏర్పాటు- వికేంద్రీకృత అభివృద్ధికి, పరిపాలనా సౌలభ్యానికి మాత్రమే గాక బడుగు వర్గ చిన్న కులాల అభ్యున్నతికి కూడా తోడ్పాటునిస్తుందని డా బి. ఆర్‌. అంబేడ్కర్‌ ప్రతిపాదించిన సమగ్ర దృక్ఫధంలో, ప్రాంతీయ కోణంతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఏ కోణం ఆవశ్యకత ఆ కోణానికి ఉన్నా, ప్రాధాన్యతా క్రమం లో ఏ అంశం ప్రధానంగా ముందుకొస్తే ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సివచ్చినా, ఏ అంశా నికి ఆ అంశాన్ని పాక్షిక అంశంగా చూడకుండా వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీ లించే సమగ్ర దృక్ఫధం అవసరం అని ఆనాడే (1950-55) నొక్కి చెప్పినది ఆధునిక అభ్యుదయ నవ భారత రాజ్యాంగ నిర్మాత డా బి. ఆర్‌. అంబేడ్కర్‌ ఒక్కరే అంటే అతిశయోక్తి కాదు. కానీ అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని ఓ అక్షయ పాత్రగా భావించి, ఆ పాత్రలో నుండి ఎవరికి కావలసిన అంశాన్ని వారు స్వీకరి స్తున్నారు

తప్ప అందులోని సమగ్ర దృక్ఫధాన్ని ఎవరూ స్వీకరించడం లేదు. అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని కులానికి, అందులోను అస్పృశ్య కులాలకి, మళ్లీ వాటిలో తను ఏ ఉప కులానికి చెందనవాడో ఆ ఉపకులానికి పరిమితం చేసే సంకుచిత సాంప్రదాయ అంబేడ్కర్‌ వాదులు ఆయన సమగ్ర దృక్పధాన్ని అసమగ్ర దృక్ఫధంగా కుదించారు. భారత జాతీయ సమైక్యత, సమగ్రతల పేరిట భారత జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చిన కాంగ్రెస్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సోకాల్డు భారత జాతీయవాదులు ఆయన చెప్పిన భారత సంయుక్త‚ రాష్ట్రాల సమాఖ్య వాదాన్ని స్వీకరించకుండా పక్కన పెట్టారు. ఆ దృక్ఫధం భారత జాతీయ సమైక్యతను దెబ్బతీసే, సమైక్య భారతావనిని విచ్ఛిన్నంచేసే దృక్పధంగా వక్రీకరించి అఖండ భారత్‌ వాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. స్వదేశీ స్వధర్మ స్వరాజ్‌ పేరిట మత ధర్మరక్షణ ముసుగులో మనుధర్మ రక్షణ కోసం మత ప్రాదిపదికపై హిందూ హిందుయేతర రెండు జాతుల సిద్ధాంతాన్ని సృష్టించి, జాతీయ తత్వాన్ని అగ్రకుల తత్వంగా, మత తత్వంగా భ్రష్ఠు పట్టించారు. 

విశాలాంధ్రలో ప్రజారాజ్యం, విశాల భారతావనిలో సమాఖ్య రాజ్యం అని ప్రవచించిన (పుచ్చలపల్లి సుందరయ్య వంటి) కమ్యూనిస్టులు హిందూ హిందు యేతర రెండు జాతుల సిద్ధాంతంలో భాగంగా హైదరాబాద్‌ (తెలంగాణ) ఫ్యూడల్‌ సంస్థానాన్ని పాకిస్థాన్‌లో కాకుండా హిందూస్థాన్‌లో, భారత యూనియన్‌లో విలీనం చేయడానికి పరోక్షంగా తోడ్పాడ్డారు. అంతేకాదు ఇండియా సంయుక్తరాష్ట్రాలను భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా పునర్వవస్థీకరించాలనే వాదనతో ఒకే భాష, ఒకే రాష్ర్టం- అనే నినాదంతో వలసాంధ్ర వాదానికి తోడ్పడే సమైక్యాంధ్ర విశాలాంధ్ర ధృక్ఫధానికి ‚ పట్టంకట్టారు. ఒకే భాష, ఒకే రాష్ర్టం అనే ఆ నినాదమే నేటి కుహనా సమైక్యాంధ్ర రణన్నినాదంగా మారింది. సమైక్యాంధ్ర పేరిట తెలంగాణ‚ వ్యతిరేక, సీమాంధ్ర ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. ఆ ముసుగులో అగ్రకుల తత్వాన్ని చొప్పించి చిన్న రాష్ట్రాల ఏర్పాటును సహితం పెద్ద కులాల ఆధిపత్యం లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

‚అందుకు భిన్నంగా, ఓ పెద్ద రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ- ఆంధ్ర రాష్ట్రాలుగా విభజిస్తే సాపేక్షికంగా అవి రెండూ చిన్న రాష్ట్రాలే అవుతాయి కనుక, అంబేడ్కర్‌ చెప్పిన చిన్న రాష్ట్రాల వాదాన్ని భౌగోళిక తెలంగాణ వాదులు బలపరుస్తున్నారు. అలాగే ఇది కేవలం ఒక పెద్ద రాష్ట్రాన్ని రెండు చిన్న రాష్ట్రాలుగా విభజించడం మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ పేరిట1956 లో బలవంతాన విలీనమైన తెలంగాణ (హైదరాబాద్‌), ఆంధ్ర రాష్ట్రాలు మళ్లీ యథాపూర్వ వేరు వేరు రాష్ట్రాలుగా ఏర్పడడమేనని కూడా వాదిస్తున్నారు. గత 56 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన వలసాంధ్ర పెత్తందారీ శక్తులు తెలంగాణ ప్రాంతంతో పాటు, సీమాంధ్రలోని ఉత్తరాంధ్ర , రాయలసీమ తదితర వెనుకబడిన ప్రాంతాల ప్రాంతీయ అసమానతలను తొలగించాల్సిన బాధ్యతను విస్మరించాయి. ఆ విధంగా సమైక్యాంధ్రలో సమగ్రాభివృద్దిని, సమానాభివృద్ధిని సాధిస్తామని వాగ్దానం చేసిన పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కిన కారణంగానే ప్రత్యేక తెలంగాణ వాదం తలెత్తిందని చెప్తున్నారు.

తెలంగాణలోని హైదరాబాద్‌ నగరంపై,‚ సాగునీటి సదుసాయం ఉన్న వివిధ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలపై వలసాంధ్ర పెత్తందారీ తనానికి పాల్పడిన అగ్రకుల పెట్టు బడి దారీ శక్తులవల్లనే దగాపడ్డ‚ తెలంగాణలో ప్రత్యేక తెలంగాణవాదం తలెత్తిందని వాదిస్తున్నారు. ఆ రకంగా సమైక్యాంధ్ర అనైక్యాంధ్రగా మారటానికి సీమాంధ్ర వలన పెత్తందారీ శక్తులే మూలకారకులైనా, ఆ సత్యాన్ని కప్పిపుచ్చి- ప్రత్యేక తెలంగాణ వేర్పాటు వాదులు, కాంగ్రెస్‌ అవకాశవాదులు ఇరువురు కుమ్మకై తెలుగు జాతి సమైక్యతకు చిచ్చుపెట్టారని కట్టుకథలు చెప్పి సామాన్యాంధ్రుల్లో, సీమాంధ్రలో ప్రాంతీయ విద్వేషతత్వాన్ని రెచ్చగొడుతున్నారు. సీమాంధ్ర ప్రాంతీయ తత్వాన్ని తెంగాణ వ్యతిరేక ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు భూమికగా మార్చుకుంటున్నారు. కానీ, దగాపడ్డ తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడడం- సమైక్యాంధ్రను విచ్ఛిన్నంచేసే విచ్ఛిన్నకర వేర్పాటువాదం కాదని వాదిస్తున్న తెలంగాణ వాదులు అంబేడ్కర్‌ చెప్పిన చిన్న రాష్ట్రాల వాదాన్ని ఆశ్రయిస్తున్నారు. 

ఆనాడు అంబేడ్కర్‌ చెప్పినట్లు భాషా ప్రయుక్త రాష్ర్టమంటే- ఒక భాష మాట్లాడే ప్రజందరినీ ఒక రాష్ర్ట (భౌగోళిక సరిహద్దుల) పరిధిలోకి తీసుకురావాలన్నది ఒక అర్థమైతే, ఒక భాష మాట్లాడే ప్రజలకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉండవచ్చునన్నది మరొక అర్థం- అని చెప్పిన అంబేడ్కర్‌ వాదానికి రెండు అర్థాలున్నాయి. ఇందు లో ఒక అర్థాన్నే తీసుకొని రెండవ అర్థాన్ని విస్మరించి- ఒకే భాష, ఒకే రాష్ర్ఠం- అనే‚ నినాదం ఇచ్చిన భాషాప్రయుక్త వాదుల వక్రభాష్యం వల్లనే ఈనాడు ఆంధ్రప్రదేశ్‌ విడిపోవాల్సివస్తోందన్న మాట. ఒక భాషా రాష్ఠ్రానికి ఒకే భాష తప్పనిసరి కావచ్చు గాని, ఒక భాషకి ఒకే రాష్ర్టం తప్పని సరి కాదని, చారిత్రక, ప్రాంతీయ ప్రత్యేక కారణాల రీత్యా ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవచ్చని ఆనాడే (1950- 55) అంబేడ్కర్‌ చెవినిల్లు కట్టుకొని చెప్పినా వినకుండా పెడచెవిన పెట్టిన ఫలితంగానే ఈ చారిత్రక తప్పిదం జరిగింది. 
కొన్ని వందల సంవత్సరాలు ప్యూడల్‌ రాచరిక వ్యవస్థలో మగ్గిన తెలంగాణ ప్రాంతం, సర్కారాంధ్ర కంటే చారిత్రక వెనుకబాటు తనానికి గురై ఉంది.

రాయల సీమ దత్త మండలం కూడా కోస్తా ఆంధ్రా కంటే వెనుకబడి ఉంది. ఆధునిక బ్రిటిష్‌ సర్కార్‌ పాలన క్రింద ప్రయోజనం పొందిన కోస్తా ఆంధ్ర- తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల కంటే ఆధునికంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతీయ అభివృద్ధిని సామాజిక అభివృద్ధిగా మలచుకున్న అగ్రకుల ఆధిపత్య శక్తులు బ్రిటిష్‌ వలన వాదుల ప్రభావంతో కోస్తాంధ్రా వలన వాద శక్తిగా రూపాంతరం చెందాయి. 1956 లో ఆంధ్రప్రదేశ్‌ అవతరించి 56 యేళ్లు దాటినా నేటికీి కొనసాగుతున్న ఈ మూడు ప్రాంతాల ప్రాంతీయ వ్యత్యాసాల వాస్తవికత (మూడు చేతుల బొమ్మ) ‚ సమైక్యాంధ్ర చిత్ర పఠాన్ని చిధ్రం చేస్తోంది. అందుకో భవిష్యత్తు దృష్టితో అరవై ఏళ్ల క్రితం అంబేడ్కర్‌ చెప్పిన మాట నేటి వర్తమాన చరిత్రకి వర్తించే చారిత్రక సత్యంగా కాల పరీక్షలో నెగ్గి మార్గ దర్శకంగా మారింది. కుహనా భారత జాతీయ వాదుల, భాషా రాష్ర్ట వాదుల అవకాశవాదం కాల దోషంపట్టి కాల గర్భంలో కలిసిపోయింది. 

ఈ దృష్టితో ఆనాడు‚ అంబేడ్కర్‌ ఏమన్నారో పరిశీలిద్దాం- ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తెలుగు జాతి (జాతీయ) సమైక్యతకు, భారత సంయుక్త రాష్ట్రాల సమాఖ్య దృక్పధానికి చేటు తెస్తుందని అంటున్న ఈనాటి సమైక్యాంధ్ర వాదుల్లాగానే, ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు భారత జాతీయ సమైక్యతకు చేటు తెస్తుందని బ్రాహ్మణీయ హిందూ భారత జాతీయ వాదులు వాదించారు. ఆనాడే వారి అవకాశ వాదాన్ని పూర్వ పక్షం చేస్తూ- అమెరికా సంయుక్త రాష్ట్రాల సమాఖ్య దృక్పధాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అంబేడ్కర్‌ ప్రతిపాదించారు. అంతేకాదు, భారత సంయుక్త రాష్ట్రాలను భాషాప్రయుక్త రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించాలని, ఒకే భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ర్టంలో ఉండాలని వాదించిన ఆనాటి భాషారాష్ర్ట వాదుల అవకాశవాదాన్ని కూడా ఖండించారు. ఒకే భాష మాట్లాడే వారందరని ఒకే రాష్ర్ట పరిధిలోకి తెచ్చే సందర్భంలో ప్రాంతీయ వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకోవాలని, అలా తీసుకోవడం సమాఖ్య (ఫెడరల్‌) దృక్పధానికి మరింత మేలు చేస్తుందే కాని, కీడు చేయదని స్పష్ఠం చేశాడు.

ఆయన ఏమన్నాడో ఆయన మాటల్లలోనే- భారత సంయుక్త రాష్ట్రాల సమాఖ్య రాజ్యాంగం విజయవంతంగా పనిచేయడానికి భాషాప్రయుక్త రాష్ట్రాలు మరింత ప్రాదేశిక సమతుల్యతతో ఉండడం అవసరం. ప్రాదేశికమైన ప్రాంతీయ అసమానతలు మరీ ఎక్కువగా ఉన్నట్లుయితే అవి వెనుక బడిన ప్రాంతాల వారిలో అనుమానాన్ని, అసంతృప్తిని కలిగించడమే కాక ఫెడరల్‌ స్ఫూర్తి విచ్ఛిన్నమైపోయే దుష్పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే ప్రాదేశిక ప్రాంతీయ సమతుల్యత ఆవశ్యకతని సార్వజనీనంగా సర్వత్రా అందరూ గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల ఫెడరల్‌‚ రాజ్యాంగాల్లో పెద్ద రాష్ట్రాల (ప్రాబల్య ప్రాంతాల) ప్రాబల్యాన్ని హద్దులో ఉంచి అదుపుచేయడానికి పలు జాగ్రత్తలు తీసుకున్నారు.... అలాగే పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న రాష్ట్రాల ఏర్పాటును సర్వత్రా స్వాగతించారు. 

ఫెడరల్‌ రాజ్యా ంగ సెనెట్‌లో‚ చిన్న పెద్ద తేడా లేకుండా (చిన్న రాష్ట్రాలను చిన్న చూపు చూడకుండా) ప్రతి రాష్ట్రానికి సమాన (హోదా) ప్రాతినిధ్యాన్ని కల్పించారు (పేజీలు 192, 193, భాషా ప్రయుక్త రాష్ట్రాలు). ఈ ఆలోచనతోనే అంబేడ్కర్‌ 1955లో మహారాష్ర్ట, యుపి, ఎపి, బీహార్‌ తదితర పెద్ద రాష్ట్రాల ఏర్పాటును చిన్న రాష్ట్రాలుగా వ్యవస్థీకరించాలని సూచించారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌కు సారథ్యం వహించన ఫజల్‌ ఆలీ కూడా హైదరాబాద్‌ (తెలంగాణ) రాష్ఠ్రాన్ని ఆంధ్రరాష్ర్ఠంతో వెంటనే విలీనం చేయకుండా కొంతకాలం సొంత కాళ్ల మీద నిలబడి అభివృద్ధి చెందనివ్వాలని సిఫారసు చేశారు. 

ఈ నేపథ్యంలో నుంచి చూసినప్పుడు ఈనాడు ప్రత్యేక తెంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ ఆచరణ రూపం దాల్చడమంటే, ఆంధ్రప్రదేశ్‌ అనే ఒక పెద్ద రాష్ఠ్రాన్ని తెంగాణ- ఆంధ్ర అనే రెండు చిన్న రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించడమే. మరో రకంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ పేరిట 1956లో బలవంతాన విలీనమైన తెలంగాణ, ‚ఆంధ్ర రాష్ట్రాలను మళ్లీ యథాపూర్వ వేరు వేరు రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడమే. అందుకే తెంగాణ వాదులు అంబేడ్కర్‌ ప్రతిపాదించిన చిన్న రాష్ట్రాల వాదాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు వత్తాసు పలికే వాదంగా ప్రచారం చేస్తున్నారు. కాని అంబేడ్కర్‌ సమగ్ర దృక్పధం అనే అక్షయపాత్రలో నుంచి ఎవరికి వాటంగా ఉన్నదాన్ని వాళ్లు వాడుకున్నట్లే తెలంగాణ వాదులు కేవలం భౌగోళిక తెలంగాణ వాదానికే పరిమితం అవుతున్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వికేంద్రీకృత అభివృద్దికి, పరిపాలన సౌలభ్యానికి మాత్రమే కాక బడుగు వర్గ చిన్న కులాల అభ్యున్నతకు కూడా తోడ్పాటు ఇస్తుందని అంబేడ్కర్‌ చెప్పిన మూడు విషయాల్లో చిన్న కులాలకు తోడ్పాటు అనే మూడవ విషయాన్ని ఉద్దేశ్య పూర్వకంగానే మినహాయిస్తున్నారు. 

అంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాలకు తోడ్పాటుగా మారడం తెలంగాణ ప్రాంత వెలమ, రెడ్డి, బ్రాహ్మణీయ అగ్ర కులాధిపత్య శక్తులకు ఏ మాత్రం ఇష్టం లేదన్న మాట. తెలంగాణ రాష్ర్ట సాధన కోసం జరిగిన ఉద్యమంలో చోదక శక్తిగా పనిచేసి, అత్యధికంగా ఆత్మ బలిదానాలకు పాల్పడిన బహుజన శక్తుల్ని వెనక్కి నెట్టి కొత్తగా ఏర్పడే 29వ రాష్ర్టమైన తెలంగాణ రాష్ర్టంపై అగ్రకుల ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవాలని చూస్తున్నారన్న మాట. ప్రాదేశిక సమాన అభివృద్ధి కోసం, భౌగోళిక తెంగాణ సమాన అవకాశాల కోసం సామాజిక తెలంగాణ- అని నినదించిన అంబేడ్కర్‌ వాదులు తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో సామాజిక తెలంగాణ వాదాన్ని ప్రతిష్ఠించడంలో ఎందుకు విఫలం అవుతున్నారో పునరా లోచించుకోవలసిన సమయం ఆసన్నమైంది. 

విచిత్రమేమిటంటే అంబేడ్కర్‌ వాదం అనే అక్షయ పాత్రలో నుంచి భౌగోళిక తెలంగాణ వాదులు సామాజిక సమతుల్యత అంశాన్ని విస్మరించి, తమకు వాటంగా ఉండే ప్రాదేశిక సమతుల్యతాంశాన్ని స్వీకరించారు. అలాగే వలసాంధ్ర అగ్రకుల పెట్టుబడి దారీ, పెత్తందారీ శక్తులు హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయాలని చెప్పిన అంబేడ్కర్‌ అభిప్రాయాన్ని వాటంగా వాడుకుంటున్నారు. అంబేడ్కర్‌ చెప్పిన వికేంద్రీకృత అభివృద్ధికి విరుద్ధంగా హైదరాబాద్‌ రాజధానీ నగరాన్ని కేంద్రీకృత విధ్వంసక అభివృద్ధికి నమూనాగా మార్చిన వలసాంధ్ర పెట్టుబడి దారీ శక్తులు, హైదరాబాద్‌ని దేశానికి రెండవ రాధానిని చేయాలని చెప్పడం విడ్డూరం.
హైదరాబాద్‌తో సహా 10 జిల్లాల తెలంగాణ ప్రాంతం తెలంగాణవారి స్వపరిపాలనాధికారం క్రిందికి పోవడాన్ని సహించలేని వలసాంధ్ర పెట్టుబడిదారులు, తమకు దక్కని హైదరాబాద్‌ను తెలంగాణ వారికి కూడా దక్కనీయకుండా చేయడానికే ఈ పన్నాగం పన్నారు. హైదరాబాద్‌ ను దేశానికి రెండవ రాజధానిగా చేయాలని అంబేడ్కర్‌ ఏ చారిత్రక సందర్భంలో చెప్పాడో ఆ సందర్భాన్ని కప్పిపచ్చాలని చూస్తున్నారు.

ఆంగ్లేయ పాలకులు ఢిల్లీని ఒక రాజధానిగా, సిమ్లాని మరో రాజధానిగా చేసుకున్నట్లే భారత పాలకులు ఢీల్లీతో పాటు హైదరాబాద్‌ని మరో రాజధానిగా చేసుకుంటే పరిపాలనా సౌలభ్యం రీత్యా ఉత్తరాది రాష్ట్రాలకు ఒక రాజధాని, దక్షిణాది రాష్ట్రాలకు మరో రాజధాని అందుబాటులో ఉంటాయని చెప్పారు. అందుకు తగిన అన్ని అర్హతలు కలిగినదిగా అప్పటికే హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందిందని స్పష్టం చేశాడు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రప్రభుత్వం ఫజల్‌ ఆలీ కమిషన్‌ను నియమించిన చారిత్రక సందర్భంలో 1955లో అంబేడ్కర్‌ వ్యక్తంచేసిన ఆ అభిప్రాయాన్ని ఆనాడు స్వీకరించ కుండా, హైదరాబాద్‌ నగరాన్ని సీమాంధ్రాకి రాజధానిగా మలచుకున్న వలసాంధ్ర పెట్టుబడి దారులు ఈనాడు దానిని దేశానికి రెండవ రాజధానిగా చేయాలని వాదించడం- వారి అవకాశ వాదానికి వరాకాష్ఠ అని చెప్పక తప్పదు. ఇటు భౌగోళిక తెలంగాణ వాదులు, అటు వలసాంధ్ర సమైక్యాంధ్ర వాదులు అంబేడ్కర్‌ వాదాన్ని తమకి అనుకూలమైన సమయానుకూల వాదంగా మలచుకుంటుంటే, ఫూలే, 

అంబేడ్కర్‌ల వాదులమని చెప్పుకునే బడుగువర్గ బహుజనశక్తులు ప్రత్యేక తెలంగాణ వాదులను, సమైక్యాంధ్రవాదులను ఆశ్రయించే ఆశ్రీత వాదులుగా ఎందుకు మారేరో పునరాలోచించుకోవలసిన సమయం ఆసన్నమైంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాలకు తోడ్పాటుగా మారనీయకుండా చిన్న రాష్ట్రాలపై సహితం అగ్రకుల పెద్దకులాల వారే ఆధిపత్యం చెలాయించే దుస్థితి దాపురించడానికి బడుగు వర్గ బహుజన శక్తుల స్వయంకృత ఆపరాధ పాత్ర ఎంతఉందో సమీక్షించుకొని ఇప్పటికైన అప్రమత్తం కావడం అవసరంSuryaa Telugu News Paper Dated : 16/10/2013 

No comments:

Post a Comment