Sunday, October 27, 2013

కర్షక మథనం (''చదువుకోగానే సరిపోతుందా... ఉద్యోగం రావద్దూ'') By డాక్టర్‌ నాగరాజు అసిలేటి


apr -   Mon, 28 Oct 2013, IST
మనమంతా హైటెక్స్‌ను చూసి ముచ్చట పడటమే కాదు పల్లెల్లో, గ్రామాల్లో, గూడేల్లో ఉన్న లోటెక్స్‌ను కూడా చూడగలగాలి. అప్పుడే వాళ్ల కష్టాలు, కన్నీళ్లు అర్థమవుతాయి. శాస్త్ర, సాంకేతిక రంగాలు నానాటికి మనిషి కంటే వేగంగా వృద్ధి చెందుతుంటే, దాన్ని అందుకోలేక, అందించేవారు లేక అవస్థ పడుతున్నవారు ఎందరో. అలా అవస్థ పడేవారిలో పేర్కొనదగ్గ వర్గం రైతులు. తగిన వసతులు, వనరులు, సౌకర్యాలు లేకపోయినా సేద్యాన్నే నమ్మి వరదలతోనే కాదు, చీడలతోనే కాదు, జీవితంతో కూడా పోరాడిన ఓ సాధారణ రైతు గాథను తెలుసుకుందాం.
గూడెంలోకి వేగంగా వచ్చిన కారు వెంకయ్య ఇంటిముందు ఆగింది. అందులోంచి ఆరుగురు ఆజానుబాహువుల వంటివారు దిగారు. వారు చూడటానికి కుస్తీపోటీల కోసం దేహాన్ని పెంచారేమోనన్నట్లు ఉన్నారు. వాళ్లను చూడగానే వెంకయ్య పై కండువా సర్దుకుంటూ వణుకుతూ ఇంటిలో నుంచి వెళ్లి వాళ్లముందు నిలబడ్డాడు.
వారి మధ్య జరుగుతున్నది మామూలు సంభాషణ కాదు. కొన్ని హెచ్చరింపులు, ఇంకొన్ని బెదిరింపులు అనే సంగతి చూసినవారికి ఇట్టే అర్థమవుతుంది.
కిటికీలోంచి ఆ దృశ్యాన్ని చూస్తున్న మంగమ్మకు ఆ ఆరుగురూ అప్పుడప్పుడూ వెంకయ్య మీదకు చేతులు లేపడం, వేళ్లతో హెచ్చరిం చడం మామూలే. కనుక విషయాన్ని పసిగట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. వెంకయ్య వాళ్లకేదో నచ్చజెప్పి అప్పటికి పంపించేసి ఇంట్లోకి వచ్చాడు. అతడి ఆందోళన, భయాలను గుర్తించిన మంగమ్మ ''ఎవరయ్యా ఆళ్లు? నిన్ను తలో మాటా ఇట్టమొచ్చినట్టు మాట్టాడుతుంటే నువ్వు బొత్తిగా నోరు మెదపవే?'' అంది.
ఎవరో కాదే అప్పులోళ్ళు. ఏటా పొలానికని, పిల్లల చదువులకని తెచ్చిన రుణం, దానికి వడ్డీ కలిపి ఆరు లచ్చలయిందట. ఎప్పుడు కడతావని అడగటానికొచ్చారు'' అన్నాఉడ.
అందుకామె ''మరి నువ్వేమన్నావ్‌?'' అంది.
''ఏమంటాను.. త్వరలోనే తీరుత్తానని చెప్పాను..'' అన్నాడు.
వెంకయ్యలో ఆందోళన ఏ మాత్రం తగ్గలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కంగారు, ఆదుర్దా, భయం ఇంకా ఎక్కువవుతున్నాయి.
ఇంతలో మళ్లిd వ్యవసాయం పనులు రానే వచ్చాయి. విత్తనాలు, నాట్లు, ఎరువులు, కోతలు, నూర్పిళ్లకు మళ్లిd అప్పు తేనే తెచ్చాడు. ఒకపక్క ఆరు లక్షల అప్పు అలాగే వుంది. మళ్లిd అప్పు తెచ్చాడు. పంట చేతికొచ్చింది.
ఎంతో కొంత అప్పు తీర్చొచ్చు అనుకునే లోపు మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు ప్రకృతి భీభత్సం సృష్టించడంతో ఆ గూడెమంతా జలమయమైపోయింది. దాంతో వెంకయ్య గుండె జారినంత పనై గత అనుభవాల పాఠాలను నెమరు వేసుకొని మెల్లగా తేరుకున్నాడు. అతడికిలాంటి విషాదాలు కొత్తేమీ కాదు. ఎప్పుడూ జరిగే తంతే. పంట చేతికొస్తుందని ఆశ పడటం. అందుకోసం అప్పు చేయడం, ఆ అప్పు తీరకపోగా, పంట పండకపోవడమో లేదా పండిన పంట వరదకు బలైపోవడమో జరిగి ఇంకా, ఇంకా అప్పుల్లో కూరుకుపోతుంటాడు.
పోనీ కలిసిరావడంలేదని వ్యవసాయాన్ని వదిలించుకుంటాడా అంటే అదీ చేయడు. ''తాతల నాటి నుండీ సేద్యమే మా వృత్తి'' అంటాడు.
వెంకయ్యకు ఈ మధ్య సరిగా నిద్రపట్టడం లేదు. తిండి సహించడం లేదు. మనిషి బాగా చిక్కిపోయి పాడైనట్లు స్పష్టంగా కనబడుతున్నాడు.
పక్క గూడెంలో ఓ ఆసామి అప్పు ఇస్తానని చెప్పి రమ్మంటే దాన్ని పుచ్చుకునేందుకు వెళుతున్నాడు వెంకయ్య.
దారిలో ఆ గూడేనికే చెందిన చదువుకున్న యువకుడు కనిపించి పలకరించాడు.
దాంతో వెంకయ్య తనఅప్పులగోలంతా ఏకరువు పెట్టాడు. చివరగా ''మీరు బాగా సదివి ప్రయోజకులు అవ్వాలి. మంచి ఉద్యోగాలు సంపాదించాలి'' అన్నాడు.
అంతా విన్న యువకుడు ''చదువుకోగానే సరిపోతుందా... ఉద్యోగం రావద్దూ'' అంటూ తన నిరుద్యోగ సమస్యను వెంకయ్య ముందు మొరపెట్టుకున్నాడు.
''ఎంత చదివినా ఏం ప్రయోజనం, ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఏం లాభం, ఉద్యోగాలు రావాలంటే లంచాలివ్వాలి. లంచాలిచ్చి ఉద్యోగం సంపాదించే స్తోమత మా దగ్గర లేదు. చూస్తే నీదీ నాదీ ఒకే సమస్యలా ఉంది. మన సమస్యకు కారణం డబ్బు. మనకు లేనిది డబ్బు. కావలసింది డబ్బే. ఆ డబ్బును సునాయాసంగా సంపాదించడానికి పేపరులో ఒక ప్రకటన చూసా! నీకు ఇష్టమైతే, వస్తానంటే నిన్ను తీసికెళ్తా.. నేను వెళ్తున్నా..'' అంటూ తను చూసిన ప్రకటన గురించి చెప్పాడు.
''ఏంటయ్యా?'' అర్థంగాక విడమర్చి చెప్పమన్నట్టు అడిగాడు వెంకయ్య.
''పట్నంలో ఓ కోటీశ్వరుడికి కిడ్నీల అవసరం ఉందట. దాతలు కావాలని కోరుతున్నారు. మనం గనుక కిడ్నీ ఇస్తే పది లక్షలు కళ్ల చూడొచ్చు'' అన్నాడు యువకుడు.
అందుకు వెంకయ్య ''ఎన్నాళ్లు వ్యవసాయం పని చేసి పది లక్షలు సంపాదించగలం? పైగా మొన్న వచ్చినోళ్లు ఈసారి కచ్చితంగా అప్పు చెల్లించకపోతే నా మీద అఘాయిత్యం చేస్తారు. కాబట్టి వాళ్ల బారి నుండి తప్పించుకోవాలన్నా, పది లచ్చలు సంపాదించాలన్నా నువ్వు చెప్తోన్న ఈ దారి తప్ప మరో గతి లేదనిపిస్తోంది. కచ్చితంగా యల్దాం.. ఆలస్యం చేయొద్దు.. ఎల్లుండే యల్దామా?'' అన్నాడు.
అలా వాళ్ళిద్దరూ పట్టణానికి వెళ్లడానికి నిర్ణయించుకున్న తర్వాత అప్పుకోసం బయల్దేరిన వెంకయ్య వెనుదిరిగి తన ఇంటికి వెళ్ళాడు. అలాగే ఉద్యోగ వేటకు వెళ్లాల్సిన యువకుడు అది ఆపేసి ఇంటికి చేరుకున్నాడు.
వెంకయ్య, భార్య మంగమ్మతో ''ఎల్లుండి పట్నం యల్తున్నాం, సంచిలో బట్టలు సర్దు.. ఓ జమీందారు దగ్గర పని వుంది.. పెద్ద మొత్తమే ముట్టచెబుతాడంట'' అన్నాడు.
వెంకయ్యకు నిద్రలో కూడా పట్నం వెళ్తున్నట్లు, డబ్బులు సంపాదించినట్లు కలలు వచ్చాయి.
నిర్ణయించుకున్న రోజు రానే వచ్చింది. యువకుడు, వెంకయ్య కలిసి పట్నానికి బయల్దేరారు. కోటీశ్వరుడిని కలుసుకున్నారు. అన్ని విషయాలూ మాట్లాడుకున్నారు. ముగ్గురూ కలిసి ఓ పెద్ద హాస్పిటల్‌కు చేరుకున్నారు. కిడ్నీస్‌ మ్యాచ్‌ అవడంతో ఆపరేషన్లు జరిగాయి.
యువకుడిది, వెంకయ్యది చెరో కిడ్నీ తీసి కోటీశ్వరుడికి అమర్చారు డాక్టర్లు. కోటీశ్వరుడు ఇస్తానన్న సొమ్ము చెరో పది లక్షలు వారికిచ్చాడు.
కొన్ని రోజుల తరువాత నిస్సత్తువుగా, బలహీనంగా ఊరికి బయల్దేరారు. పైకి ఏమీ తేడా కనబడకపోయినా లోపల శుష్కించుకుపోయిన శరీరాలతో యువకుడు, వెంకయ్య వారి వారి ఇళ్లకు చేరారు.
పొరుగూరిలో పని వుందంటూ వెళ్లొచ్చిన వెంకయ్యను భార్య మంగమ్మ ఆప్యాయంగా ''ఏమయ్యా బాగుండావా? యాలకి తిండి పెట్టాడా లేదా ఆ జమిందారు? అట్టా అయిపోయావేంటి?'' అని పలకరించింది.
''తానానికి నీళ్లెడతా.. తానం చేద్దువుగాని పద'' అంది.
స్నానం చేసేందుకు వెళ్లడానికి చొక్కా విప్పిన వెంకయ్యను చూసి మంగమ్మ నిశ్చేష్టురాలైపోయి విలపిస్తూ ''ఏంటయ్యా అది?'' అని అడిగింది.
అందుకు వెంకయ్య ''ఏమీ లేదే.. జమిందారుకు కిడ్నీ ఇచ్చా, పది లచ్చలు ఇచ్చాడు. మనం ఏళ్ల తరబడి సేద్యం చేసినా ఎన్నేళ్లకి పది లచ్చలు కూడబెడతామో తెలీదు. అవసరానికి కిడ్నీ ఇచ్చి ఒక్క చెనంలో లచ్చలు సంపాయించా... ఇదేదో బాగుంది.. పగలంతా పొలం పనులతో కొట్టుకు చచ్చేకంటే అవయవాలు అమ్ముకోవడమే నయంలా వుంది. పొలంలో ఒడ్లు పండినట్టు పేదోళ్ల ఒంటో కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె.. పదేపదే పుట్టుకొస్తే బాగుండు.. మనలాంటి పేదోల్లంతా బేషుగ్గా బతికేయొచ్చు'' అన్నాడు వెంకయ్య తన నీరసాన్ని ఎంతమాత్రం బయటపెట్టకుండా.
మంగమ్మకు జరిగింది చాలా పెద్ద ఘోరమని అర్థంకానేలేదు.
ఇక అప్పుల బెంగ లేదంటూ వెంకయ్య సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ వెంకయ్య, మంగమ్మ నిద్రలోకి జారుకున్నారు.
యథాప్రకారం పొద్దున్నే లేచిన మంగమ్మ, ''ఏమయ్యా... వెలుగురేకలొస్తున్నాయి.. లేవవా?'' అంది.
ఉహూ వెంకయ్య లేవనేలేదు.


Andhra Prabha Telugu News Paper Dated: 28/10/2013 


No comments:

Post a Comment