Sunday, October 20, 2013

పెద్ద రాష్ట్రాలు- పెద్ద కులాలు By ఉ.సా,


రాష్ట్రాల ఏర్పాటులో సావూజిక అంశాలు 
సీవులో ప్రధాన అగ్రకులంగా రెడ్లు 
కోస్తాలో కవ్ము కుల ఆధిపత్యం 
తెలంగాణలో వెలవు, రెడ్ల ప్రాబల్యం 
అణిగి వుణిగి ఉంటున్న బడుగు కులాలు
అన్ని భాషా రాష్ట్రాలో అగ్రకులాధిక్యతే 
ప్రజాస్వావ్యు ప్రయోజనాలు నిష్ఫలం 

భాషా రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను నెరవేర్చేటప్పుడు ఆ రాష్ర్ట భౌగోళిక ప్రాదేశిక అంశంతో పాటు, ఆ ప్రదేశానికి సంబంధించిన ప్రజల సామాజిక స్థితిగతుల అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి అంబేడ్కర్‌ ఆలోచనలను పరిశీలిస్తే ఈ సమగ్ర దృక్పథం ఆవశ్యకత ఏమిటో స్పష్టంగా అర్ధమవుతుంది. ‘భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో ఆ భాషా రాష్ర్టం స్వ యం పోషకంగా మనగలుగు తుందా? అనే అంశాన్ని మొదగా పరిశీలించాలి. తదుపరి రెండవ అంశంగా ఆయా (పెద్ద, చిన్న) రాష్ట్రాల ఏర్పాటుకి సరిపడినంత భౌగోళిక విస్తీర్ణం, తగినంత జనాభా నిష్పత్తి ఉన్నాయా అనే అంశాల్ని పరిశీలించాలి. మూడవ అంశంగా ఆ రాష్ట్ర జనం ఏఏ కులాలకు చెందినవారో, ఆ కులాల పొందిక, ప్రభావం వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో, ఆ ప్రాంతపు అస్తిత్వం యొక్క సాంసృ్కతిక ప్రత్యేకత ఏమిటో పరిశీలించాలి’ అంటారు నవభారత రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్‌. అంబేడ్కర్‌. 

‘దేశ మంటే మట్టి కాదోయ్‌ మనుషులోయ్‌’ అన్నట్లు భారత దేశమైనా, ఆంధ్రప్రదేశమైనా ప్రాదేశిక అంశాన్నే గాక మానవ సమాజానికి సంబంధించిన సామాజిక అంశాల్ని కూడా పరిణలోకి తీసుకోకపోతే, దేశభక్తి- ప్రాదేశిక స్వాతంత్య్రానికే పరిమితమై దేశ ప్రజల స్వాతంత్య్రాన్ని విస్మరిస్తుంది. అలాగే భాషా రాష్ర్ట వాదుల భాషాభిమానం భాషారాష్ట్రాల ఏర్పాటుకే పరిమితమై, ఆయా రాష్ట్రాల ప్రజల బాగోగుల సంగతి విస్మరిస్తుంది. పెద్ద రాష్ట్రాల సంగతే కాదు చిన్న రాష్ట్రాల సంగతైనా అంతే. అందుకే పెద్ద, చిన్న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమగ్రదృష్టితో పరిశీలించిన అంబేడ్కర్‌ ఆలోచనలు అంత శాస్త్రీయతను, ఆచరణీయతను సంతరించుకొన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద రాష్ట్రాలు పెద్ద కులాల విషయంలో ఆయన చేసిన సాధారణ విశ్లేషణ ఏమిటో పరిశీలిద్దాం. అలాగే భాషారాష్ర్టం పేరిట వివిధ ప్రాంతాల్ని విశాలాంధ్రలో విలీనం చేసిన ఆంధ్రప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ర్టం విషయంలో స్వయంగా ఆయన చేసిన ప్రత్యేక విశ్లేషణని ప్రత్యేకంగా పరిశీలిద్దాం. 

‘భాషా ప్రయుక్త (పెద్ద) రాష్ట్రాల్లో ఒకటి రెండు ప్రధాన కులాలు అగ్రకులాలుగా, మరికొన్ని ఇతర కులాలు అధిక సంఖ్యాక ప్రాబల్య కులాలుగా పెద్ద సంఖ్యలో ఉంటాయి. అలాంటి ప్రధాన అగ్రకులాలపై, ఇతర అధికసంఖ్యాక ప్రాబల్య కులాలు- ఆ రెండింటిపై అల్పసంఖ్యాక అస్పృశ్యకులాలు ఆధారపడి, అణిగిమణిగి ఉండే కుల వ్యవస్థ సర్వ సాధారణ వ్యవస్థగా అన్ని భాషా రాష్ట్రాల్లో కొనసాగుతుంటుంది’ అన్నారు. ఈ సాధారణత్వానికి ఆంధ్రప్రదేశ్‌ మినహాయింపు కాదు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌ భాషా రాష్ర్టంలో కోస్టల్‌ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతీయ సాంస్కృతిక ప్రత్యేకతలో వైవిధ్యం ఉంది. ఈ వైవిధ్యాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లోని కులాల పొందిక, ప్రభావాలు కూడా విభిన్నంగా ఉన్నాయి. రాయలసీమలో రెడ్డి కులం ప్రధాన అగ్రకులంగా ఆధిపత్యం చలాయిస్తున్నది. కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలపై కోసాంధ్ర కమ్మ కులం ప్రధాన అగ్రకులంగా ఆధిపత్యం చలాయిస్తున్నది. ఇక తెలంగాణ ప్రాంతంలో ఉన్న కులాలపొందిక మరోవిధంగా ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వెలమ కులం అగ్రకులంగా గుత్తాధిపత్యం చలాయిస్తుంటే, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో రెడ్డి కులం మరో అగ్రకులంగా గుత్తాధిపత్యం చలాయిస్తోంది. వలసాంధ్రకులంగా తెలంగాణకి వలసవచ్చిన కమ్మ అగ్రకులస్థులు తెలంగాణ అంతటా గణణీయంగానే ఉన్నారు. 

తెలంగాణలో ఉన్న వెలమ కులం, రాయలసీమాంధ్రలో ఏ ప్రాంతంలోనూలేదు. తెలంగాణ-ఆంధ్ర రెండు ప్రాంతాలను పోల్చిచూస్తే రాయలసీమలో ప్రధానంగా, ఇతర కోస్తా జిల్లాల్లో పాక్షికంగా ఉన్న రెడ్డి అగ్రకులం తెలంగాణలో కూడా ప్రధాన అగ్రకులంగా ఉండటంతో రెండు ప్రాంతాల కలయిక వలన దాని అగ్రకుల సంఘటిత శక్తి రెట్టింపయ్యింది. తెలంగాణ, ఆంధ్ర వంటి చిన్న రాష్ట్రాల విలీనం వల్ల ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ పెద్ద రాష్ర్టంలో, భౌగోళిక వైశాల్యంతో పాటు రెడ్డి అగ్రకులం జనాభా నిష్పత్తి, దాని సంఘటిత శక్తి కూడా ప్రబలంగా పెరిగిపోయి అది అత్యంత శక్తిమంతమైన ఆధిపత్యకులంగా పరిణమించింది. అలాగే తెలంగాణలో తిష్ఠ వేసిన వలసాంధ్ర కమ్మ కులం, వెలమ కులంతో చేతులు కలిపి రెడ్డి అగ్రకుల గుత్తాధిపత్యానికి గట్టి పోటీదారుగా మారింది. 

ఆ రకంగా ప్రాంతాల వారీ, కులాలవారీ పొందికను బట్టి, పోటీని బట్టి భాషా ప్రయుక్త రాష్ర్టం పేరిట వివిధ ప్రాంతాల్ని విశాలాంధ్రలో విలీనం చేసిన తొలిభాషా రాష్ర్టంగా ఆంధ్రప్రదేశ్‌ పెద్ద రాష్ట్రాన్ని ఓ ఉదాహరణగా తీసుకుని సామాజిక విశ్లేషణ చేసిన అంబేడ్కర్‌ ‘ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్‌నే తీసుకొంటే ఆ భాషా ప్రయుక్త (పెద్ద) రాష్ర్టంలో రెడ్డి, కమ్మ వంటి రెండు ప్రధాన అగ్రకులాలు వివిధ ప్రాంతాల్లో గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయి. వ్యవసాయం, వ్యాపారం, ఉన్నతోద్యోగాల్లాంటి ముఖ్యరంగాలపై ఆ రెండు ప్రధాన అగ్రకులాలే ఆధిపత్యం చలాయిస్తున్నాయి. అధిక సంఖ్యాక ఇతర వెనుకబడిన కులాలకు, అల్ప సంఖ్యాక అస్పశ్య కులాలకు చెందిన బడుగువర్గ చిన్న కులాలవారు అగ్రకులాధిపత్య (పెద్ద) కులాలపై ఆధారపడి అణగిమణిగి బ్రతుకు ఈడుస్తున్నారు...

...ఇలాంటి భాషా ప్రయుక్త (పెద్ద) రాష్ట్రాల్లో చిన్నకులాలవారు తమ అభ్యున్నతికి, సాధికారికతకి (ఈ అగ్రకులాధిపత్యశక్తులను ఎదిరించి) ఆస్కారం ఉందని ఆశించేందుకు ఏం మిగిలింది? తాము స్వయంగా (రిజర్వేషన్లు లేకుండా) శాసనసభకు ఎన్నిక కాగలమని చిన్న కులాల వారు ఆశించగలరా (రిజర్వేషన్లులేని బడుగువర్గ బిసి కులాల వారికి రాజ్యాధికారంలో కనీస ప్రాతినిధ్యమైనా లభిస్తున్నదా?)! ప్రభుత్వ ఉద్యోగాల్లో (ఉన్నతోద్యోగాల్లో బిసిలు 5 శాతం మించడం లేదు) తమ వాటా తాము పొంది ఈ సమాజంలో తమకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని నిలబెట్టుకోగలమని వారాశించగలరా? తమ ఆర్థిక ప్రగతి కోసం ఆ భాషా ప్రయుక్త (అగ్ర కులాధిపత్య పెద్ద) రాష్ర్ట ప్రభుత్వం శ్రద్ధ వహించగలదని వారు విశ్వసించగలరా? ఈ రకమైన దుస్థితి నెదుర్కొంటున్న బడుగువర్గ చిన్న కులాల వారి సామాజిక స్థితిగతుల్లో సామాజిక మార్పు తీసుకురాకుండా, కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచడమంటే దాని అర్థం ప్రధాన అగ్రకులాధిపత్య శక్తులకు ఆయా భాషా రాష్ట్రాల్లో స్వపరిపాలనాధికారం కట్టబెట్టటమే అవుతుంది. అప్పుడు అలాంటి రాష్ట్రాలను కేవలం (ప్రాదేశికంగా) భాషా ప్రయుక్తరాష్ట్రాలు అనేకంటే (సామాజికంగా) ఆంధ్రప్రదేశ్‌ని రెడ్డి (కమ్మ) రాష్ర్టమని, పంజాబ్‌ని జాట్‌ రాష్ర్టమని, మహారాష్ర్టని కున్బీ మరాఠా రాష్ర్టమని అంటే బాగా అర్థమవుతుంది’ అని భాషారాష్ట్రాల అగ్రకుల బాగోతాన్ని బట్టబయలు చేశారు. 

అందుకే అంబేడ్కర్‌కి భాషా ప్రయుక్త రాష్ట్రాల, పెద్ద రాష్ట్రాల ఏర్పాటు పట్ల అంత సదాభిప్రాయంలేదు. కుల వ్యవస్థ ప్రబలంగా ఉన్న భారతదేశంలో సామాజిక సమతుల్యత గురించి పట్టించుకోని భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల భాషాతత్వం అగ్రకులతత్వానికి మారు పేరుగా పరిణమిస్తుందన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ తెలుగుభాషా రాష్ట్రాన్ని కమ్మ రాష్ర్టం లేదా రెడ్డి రాష్ర్టం అని అనాల్సివస్తుందన్నారు. భాషా రాష్ర్ట ఏర్పాటు వల్ల ఒనగూడే ప్రాదేశిక ప్రజాస్వామ్య ప్రయోజనాన్ని ఈ అగ్రకుల సామాజిక నిరంకుశాధిపత్యం నిష్పయోజనంగా మార్చుతుందన్నారు. ఆయన అన్నట్టే తెలుగు రాష్టమ్రంటే- కమ్మ దేశంగా, రెడ్డి దేశంగా, తెలుగు దేశం పార్టీ అంటే కమ్మ అగ్రకుల శక్తుల కొమ్ముగాసే కమ్మదేశం పార్టీగా, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే రెడ్డి కాంగ్రెస్‌ పార్టీగా, రెడ్డి అగ్రకుల శక్తుల కొమ్ముగాసే పార్టీగా మారడమే అందుకు నిదర్శనం. అందుకే బడుగు వర్గ చిన్న కులాల హక్కులకు భాషారాష్ట్రాల ప్రభుత్వాల్లో కన్నా కేంద్ర ప్రభుత్వంలోనే ఎక్కువ రక్షణ ఉంటుదని అంబేడ్కర్‌ భావించి దళితుల హక్కులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా కట్టుదిట్టమైన రక్షణ కల్పించాడు. 

అభివృద్ధిని వికేంద్రీకరించడంతో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరించాలని వాదించే నికార్సయిన ప్రజాస్వామ్యవాది అంబేడ్కర్‌, బడుగువర్గ దళిత కులాల హక్కుల రక్షణ భాద్యత కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంచక తప్పదని భావించాడంటే భాషారాష్ట్రాల ముసుగులో నిరంకుశాధిపత్యం చలాయించే ప్రాంతీయ అగ్రకుల శక్తుల ధాష్ఠీకాన్ని ఎంతగా అభిశంసించాడో అర్థమవుతుంది. అలాగని భాషా ప్రయుక్తరాష్ట్రాల ఏర్పాటులో ఇమిడి ఉన్న ప్రజాస్వామ్య సూత్రం ఎడల తన సూత్ర బద్ధ వైఖరిని ఎన్నడూ విడనాడలేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకత గురించి ఆయన చెప్పినంత గొప్పగా మరే భాషా రాష్ర్ట వాదీ చెప్పలేదంటే అతిశయోక్తి కాదు. ‘ఒక జాతికి చెందిన తామంతా ఒక భాషా మాట్లాడే సజాతీయులం అనే భావనలేని మిశ్రమ భాషా రాష్ట్రాల్లో, ఒక భాష మాట్లాడే వారి పట్ల మరొక భాష మాట్లాడే వారు పరభాషా విద్వేష్వాన్ని, వ్యతిరేకతని కలిగి ఉంటారు.

అందువల్ల ఒకే భాష మాట్లాడే సజాతీయ భావనలేని మిశ్రమ భాషా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం సరిగా పనిచేయలేదని చరిత్ర చాటి చెబుతోంది. కనుక బొంబాయి, మద్రాసు, కలకత్తావంటి మిశ్రమ భాషా రాష్ట్రాల్లో కంటే ఏక భాషాప్రయుక్త రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం మరింత మెరుగ్గా పని చేయగలుగుతుంది’ అని స్పష్టంచేశాడు. కనుక భాషా రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన వ్యతిరేకం కాదు. ఆ మేలిముసుగులో అగ్రకులా ధిపత్య శక్తులు, అధికార దుర్వినియోగంతో అన్యాయానికి, అణచివేతకి పాల్పడకుండా హద్దుల్లో ఉండడానికి ఖచ్చితమైన కొన్ని అదుపాజ్ఞలతో సామాజిక సమతుల్యతను (చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌) కాపాడేలా తగిన చర్యలను తీసుకోవాలన్నాడు. అలాగే అస్పృశ్య అల్ప సంఖ్యాక చిన్న కులాల హక్కుల పరిరక్షణకు ప్రత్యేకమైన రక్షణ చర్యలు (సేఫ్‌గార్డ్‌‌స) తీసుకోవాలన్నారు. 

అంతేకాదు అధికారంలో, అభివృద్ధిలో బడుగువర్గ చిన్నకులాలకు వారి జనాభాకి తగిన ప్రాతినిధ్యాన్ని, భాగస్వామ్యాన్ని కల్పించే విధంగా సమ్మళిత అభివృద్ధితో కూడిన భౌగోళిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పినప్పుడే భాషా ప్రయుక్త రాష్ట్రాలతో కూడిన భారత సంయుక్త రాష్ట్రాల సమాఖ్య బాగుపడుతుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం లభించి, ఓటు విషయంలో అందరూ సమానులే అనే రాజకీయ సమానత్వం లభించినా (కుల-వర్గ), సామాజిక- ఆర్ధిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. సాంఘిక, ఆర్ధిక, రాజకీయ సామాజిక న్యాయంతో ఈ సామాజిక అన్యాయాన్ని సామాజిక అసమానతల్ని సత్వరమే రూపుమాపి సామాజిక సమతుల్యత సాధించకపోతే ఎంతో శ్రమకోర్చి రూపొందించుకున్న మన దేశ ప్రజాస్వామ్యం అగ్రకుల ధనిక సామ్యంగా భ్రష్ఠు పట్టిపోతుం దని-రాజ్యాంగాన్ని పార్లమెంటుకు సమర్పించే సమయంలోనే మన దేశ రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. 

సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో అవినీతిమయమైన నేరపూరిత రాజకీయాల నుండి దేశ రాజకీయ రంగాన్ని ప్రక్షాళనం చేయాలని డిమాండ్‌ చేస్తున్న సోకాల్ట్‌ ప్రజాస్వామ్య వాదులు అందుకు మూలమైన బ్రాహ్మణీయ హిందూ మత తత్వ అగ్రకుల ధనిక స్వామ్యాన్ని రాజకీయాలనుండి ప్రక్షాళన చేయాలని మాత్రం నేటికీ కోరడం లేదు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం, విశాల భారతావనిలో సమాఖ్యరాజ్యం అని ఆదర్శాలు వల్లించిన ఆనాటి కామ్రేడ్లు సైతం భారత సంయుక్త భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో లౌకిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని సోషల్‌ జస్టిస్‌ సోషలిజాన్ని విస్మరించి విశాలాంధ్ర పేరిట అగ్రకుల వలసాంధ్ర పెట్టుబడిదారీ, పెత్తందారీ రాజ్యాలు నెలకొల్పిన కమ్మ, రెడ్డి కామ్రేడ్లుగా మారారు.

Suryaa Telugu News Paper Dated: 20/10/2013 

No comments:

Post a Comment