Wednesday, November 6, 2013

'సీమ'కు అంబేద్కర్ స్ఫూర్తి - గాలి వినోద్ కుమార్

రాష్ట్ర విభజన జరగనున్న నేపథ్యంలో, సమైక్యాంధ్ర అనే తప్పుడు అవగాహనతో కాకుండా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరుతూ రాయలసీమ విద్యావంతులు ఉద్యమించడం హర్షణీయం. 'ఏ ఉద్యమమైనా తన లక్ష్యం నుంచి పక్కదారి పట్టిందంటే అది విద్యావంతుల తప్పు. దాన్ని సరిచేయాల్సి ంది విద్యావంతులే' అని డాక్టర్ అంబేద్కర్ అన్నారు. మరి సీమాంధ్ర ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సరిచేయాల్సింది, ఈ దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకత పట్ల అవగాహన కల్పించాల్సిందీ విద్యావంతులే. విద్యావంతులైన యువత, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు సంఘటితంగా ఉద్యమించడం ద్వారానే తెలంగాణ రాష్ట్ర కల నిజం కాబోతున్నది. కాగా అటు సమైక్యవాదమైనా, ఇటు ప్రత్యేకవాదమైనా కేవలం సెంటిమెంట్ మీద మాత్రమే నడుస్తున్నాయి. భాష అనే సెంటిమెంట్‌తో మనమంతా తెలుగువారం కాబట్టి బలవంతంగానైనా కలిసుండాలనే సమైక్య సెంటిమెంట్ కానీ, మా ప్రాంతం వెనుకబడింది కాబట్టి విడిపోదామనే బలవంతపు విడివాదం కానీ శాస్త్రీయ పరిష్కారాన్ని అందించవు. సెంటిమెంట్‌లను పక్కనబెట్టి శాస్త్రీయంగా ఏ ప్రాంతానికీ నష్టం లేకుండా విభజన సమస్యకు కేంద్రం పరిష్కారం చూపి ఉంటే సీమాంధ్ర ప్రజలు ఇంతగా ఆందోళన చేసేవారు కాదు.
ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయన్న దూర దృష్టితోనే చిన్న రాష్ట్రాల ప్రవక్త డాక్టర్ అంబేద్కర్ 1954లో మొదటి ఎస్సార్సీ చైర్మన్ జస్టిస్ ఫజల్ అలీకి ఒక లేఖ రాశారు. 'కేవలం భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే అది దేశ అంతర్గత భద్రతకు ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. ఈ దేశంలో వేల సంఖ్యలో వివిధ భాషలు మాట్లాడే కులాలు, ప్రాంతాలు, జాతులు, తెగలు ఉన్నాయి. వారంతా తమ భాష పునాదిగా రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తే దేశం ముక్కలవుతుంది. ఒక రాష్ట్రం, ఒక భాష, రెండు కోట్ల జనాభాతో స్థానిక ప్రజల భాషా సంప్రదాయాలను, సహజ వనరులను పరిరక్షిస్తూ పరిపాలన విభజన కోసం, అన్ని రంగాల్లో 'వాటా' పొందే విధంగా రాష్ట్రాల విభజన జరగాలి. అంతే తప్ప కేవలం 'సెంటిమెంట్' పునాదిగా రాష్ట్ర విభజన జరగరాదు' అని ఆ లేఖలో ఆయన స్పష్టం చేశారు. మరి జాతీయ రాజకీయపక్షాలైన కాంగ్రెస్, బీజేపీకి రాష్ట్రాల విభజన పట్ల శాస్త్రీయ, జాతీయ విధానం లేకపోవడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. ఒకవేళ ఈ రెండు పార్టీలకు జాతీయ విధానం ఉంటే దేశవ్యాప్తంగా 22 వెనుకబడిన ప్రాంతాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లకు ఏనాడో పరిష్కారాన్ని చూపి వుండేవి. పరిపాలనా సౌలభ్యానికి, ప్రజల సమగ్ర అభివృద్ధికి ఉత్తరప్రదేశ్‌ను నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలన్న బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్‌ను జాతీయ రాజకీయపక్షాలు రెండూ అంగీకరించలేదు. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఆ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానాన్ని పట్టించుకోని కేంద్రం ఇప్పుడు దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి పూనుకున్నది. కాంగ్రెస్, బీజేపీలు రెండూ విభజనకు మద్దతిస్తున్నాయి. ఉత్తరాది ఆధిపత్యాన్ని శాశ్వతంగా దక్షిణాదిపై చెలాయించడానికే కాదా? కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికే అయితే రాష్ట్ర విభజన సమస్యను ఇంత జటిలం చేయడం ఎందుకు? మూడుప్రాంతాల నాయకులను కూర్చోబెట్టి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీగానీ ఎందుకు అందించలేకపోతున్నాయి?
ఉత్తర, దక్షిణాది ప్రాంతాల మధ్య సమతుల్యత, పరిపాలనా విభజన జరగాలంటే రాష్ట్రాల విభజన ఉత్తర, దక్షిణాది ప్రాంతాల్లో సమానస్థాయిలో ప్రాతినిధ్యం ఉండే విధంగా జరగాలని డాక్టర్ అంబేద్కర్ 1955లోనే సూచించారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేస్తే తమకు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందని దక్షిణాది ప్రజలు భావించే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ ఒత్తిడికి లొంగిన జస్టిస్ ఫజల్ అలీ, అంబేద్కర్ సూచనలను పెడచెవిన పెట్టారు. ఈ రోజు దేశవ్యాప్తంగా 22 వెనుకబడ్డ ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కొనసాగడానికి ప్రధాన కారణం అంబేద్కర్ సూచనలను మొదటి ఎస్సార్సీ పాటించకపోవడమే. నాటి అంబేద్కర్ సూచనలు నేటి మన రాష్ట్ర విభజన సమస్యకు శాస్త్రీయ పరిష్కారాన్నందించగలవు.
రెండు కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం, ఒక భాష పునాదిగా 8 కోట్లకు పైగా జనాభా కల్గిన ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే తెలంగాణ, కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర నాలుగు రాష్ట్రాలుగా విభజించవచ్చు. కేవలం హైదరాబాద్ మీదనే ఆధారపడకుండా కోస్తాకు విజయవాడ/గుంటూరు/ ఒంగోలు రాజధానిగాను, రాయలసీమకు కర్నూలు/ అనంతపూర్/ తిరపతి రాజధానిగాను, ఉత్తరాంధ్రకు విశాఖపట్నం/ శ్రీకాకుళం/ విజయనగరం రాజధానిగా అభివృద్ధి చెందుతాయి. అలాగే హైదరాబాద్‌ను తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా చేయడంతోపాటు అంబేద్కర్ సూచించినట్టు దేశానికి రెండో రాజధానిగా చేయడం వలన దేశ ప్రయోజనాలు, దక్షిణాది ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరతాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ది చెందుతుంది. ప్రపంచ నగరమైన హైదరాబాద్‌ను పది జిల్లాలకే పరిమితం చేయడంవలన ప్రతిష్ఠ దెబ్బ తిని అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం ఉంది.

ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనార్టీ విద్యార్థి, యువత బలిదానాల నేపథ్యంలో ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్రంపై యువత కోటి ఆశలు పెట్టుకున్నది. ఆ ఆశలు సాకారం కావాలంటే అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య సూత్రాలు, సమసమాజం నిర్మాణం పునాదిగా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. అయితే తెలంగాణ ఉద్యమ నాయకత్వ స్థానంలో అగ్రకులాల వారే ఉన్నారు. రేపు అధికారం వాళ్ళ చేతుల్లోకి పోయే అవకాశం ఉంది. ప్రత్యేక రాయలసీమ ఉద్యమమూ అంబేద్కర్ ఆలోచనలు లేని వర్గాల చేతుల్లో ఉంది. అటు సమైక్య ఉద్యమమూ అగ్రకులాల వారి చేతుల్లో ఉంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాలకు తోడ్పాటు అన్నారు డాక్టర్ అంబేద్కర్. కానీ ఆయన ఆశించిన తోడ్పాటు తెలంగాణ ఏర్పాటుతోనే సాధ్యం కాదు. అందులో సామాజిక న్యాయం కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కేవలం భాష ఒక్కటైనంత మాత్రాన ఒక్క రాష్ట్రంగానే ఉండాలనుకోవడంలో ఔచిత్యం లేదు. ఆంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ అస్తిత్వాలు, యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలు భిన్నంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా ఉన్నవారిలో రాయలసీమకు చెందినవారి సంఖ్య తక్కువేమీ కాదు.
అయినా ఆ ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆంధ్రరాష్ట్ర ఉద్యమానికి రాయలసీమ అందించిన తోడ్పాటు నిర్ణయాత్మకమైనది. అయినా 1953 నుంచి ఆ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది. ఇందులో రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రుల పాత్ర కూడా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దోహదం చేసిన ఒప్పందాలకు కారకులైనవారు, వాటిని ఉల్లంఘించినవారూ అగ్రకులాలకు చెందిన నాయకులే. మరి ఈ కులాల నాయకత్వంలో రేపు ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాలు ఏర్పడినా పెద్దగా ఉపయోగం లేదు. అయితే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంతోనే రాయలసీమ సమగ్ర అభివృద్ధి ముడివడి ఉన్నందున అంబేద్కర్ ఆలోచనలతో బహుజనుల నాయకత్వంలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కొనసాగితేనే ప్రత్యేక రాష్ట్రంతో పాటు సామాజిక న్యాయం రాయలసీమ ప్రజలకు దక్కుతుంది.

- గాలి వినోద్ కుమార్
చైర్మన్, సామాజిక తెలంగాణ జేఏసీ

Andhra Jyothi Telugu News Paper Dated: 07/11/2013 

No comments:

Post a Comment