Saturday, November 9, 2013

జానపద సంస్కృతికి ప్రతీక (ఎల్లమ్మ చిందు) By నాగన్న



ఎల్లమ్మ చిందు-యక్షగాన చరివూతకే ఒక చెరగని చిరునా మా. నిజామాబాద్ జిల్లా జానపద కళలకు నిలు సాక్ష్యం. తెలంగాణ ప్రజాకళా సంస్కృతికి ప్రతీక. ఆమె ఆది జాంబవంతుని సంతతి. తన జాతి కళారూపమైన చిందు యక్షగానాన్ని దేశనలుమాలలా వ్యాపింప చేసిన ఖ్యాతి ఎల్లమ్మకే దక్కింది.ఎల్లమ్మ పుట్టింది కుద్దిచిన్నాపురం, స్థిరపడింది హందాపురం. నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఈరెండు గ్రామాలు మొదటిది ఆర్మూర్ వెంబడి, రెండవది బోధన్‌లో..ఈ ఎల్లమ్మ జన్మించింది. ఈమె మొదటి పేరు సరస్వతి.బాసరలో పుట్టిందట.అందుకే చదువుల తల్లి సరస్వతిదేవి అని పేరుపెట్టారట. ఎల్లమ్మ వాళ్ల నాన్న నబీసాబ్‌కు కంటిచూపు పోయిందట. సకినం చూస్తే ఎల్లమ్మ దేవుడని తేలిందట.అప్పుడు నబీసాబ్ తన బిడ్డకు ఎల్లమ్మని పేరు పెట్టి ఆదేవత పేరుమీదనే జోగుకు ఇడుస్తానని మొక్కుకున్నాక చూపు వచ్చిందట. అన్నట్లుగానే తన బిడ్డకు ఎల్లమ్మని పేరుపెట్టి జోగిని చేసిండు నబీసాబ్. అప్పటి నుంచి సరస్వతి పేరు స్థానంలో ఎల్ల మ్మ అనే స్థిరపడింది. ఆ తర్వాత కుద్దిచిన్నాపురంలోనే ఎక్కయ్య అనే అయ్యోరు ఎల్లమ్మకు అక్షరభ్యాసం చేశాడు. ఆ తర్వాత వాళ్ల తాత,నాన్నల దగ్గర పెద్దబాలశిక్ష నేర్చుకుంది. ఆనాడు చిందుమేళలో పిల్లలకు చిన్నప్పటి నుంచే బాగోతం నేర్పేవారు. ఇదే సంప్రదాయంతో నాలుగేళ్ల వయసులోనే ఎల్లమ్మకు వాళ్ళ తాత పులింటి బాబ య్య ఎల్లమ్మ మొఖానికి రంగేసి బాలకృష్ణుని వేషం కట్టించి బాగోతం లో దింపిండ ట. అప్పటి నుంచి ఎనిమిదేళ్ల వరకు బాలకళాకారిణిగానే వేషాలు కట్టింది. పదకొండేళ్ల వరకు చిన్న చిన్న పాత్రలతోపాటు చెలికత్తె, రంభ, చిత్రాంగి వేషాలు వేసింది. ఎల్లమ్మకు 14ఏళ్ల వయస్సులో దగ్గరి బంధువు సైదులతో పెళ్ళి అయింది. కానీ ఎల్లమ్మకు ఎప్పుడు బాగోతం మీద ధ్యాసే తప్ప భర్తతో కాపురం చేయాలనే ఆలోచనలేదు. ఏదైనా కొత్త ఆట చూస్తే 24గంటలు మనసులో దాన్నే మననం చేసుకుంటూ ఉండేది. దీంతో భర్తతో కూడివుండే బాధ్యత నెరవేర్చలేక తండ్రితో మాట్లాడి రామవ్వ అనే తన తోడబుట్టిన చెల్లెల్ని భర్త సైదులుకిచ్చి పెళ్ళి చేసింది. అప్పటికి ఎల్లమ్మకు పదహారేళ్లు. సాటి వేషాల నుంచి మేటి వేషాలు వేసే అవకాశం వచ్చింది. ఆడ,మగ రెండు రకాల వేషాలు వేసింది. తాను ధరించిన ప్రతి పాత్రను ఎంతో పట్టుదలతో సాధన చేసి వాటికి వన్నెతెచ్చింది. ఇక చిందుమేళ ఆట భాగోతాలలో ప్రధానమైంది జాంబవ పురాణం.జాంబవంతుడు వారి వంశవృక్షానికి మొదటివాడనే నమ్మకంతో మొదట దానినే ప్రదర్శిస్తారు.‘జాంబవంతుని పెద్ద భార్య పిల్లలు మాదిగలైతే, చిన్న భార్యపిల్లలం మేము’ అంటుంది ఎల్లమ్మ.

జాంబపురాణంలో అత్యంత ఆసక్తికరంగా సాగే సన్నివేశం జాంబవంతునికి, బ్రాహ్మణునికి సాగే వాద ప్రతివాదం. ‘తాలిం గా లింగా లింగా తాలింగా లొల్లయ్యలో’ అంటూ జాంబవంతుడు పాడుతూ ఉంటే బ్రాహ్మణుడు నన్ను అంటకు ముట్టకు అంటూ దూరం దూరం పోతువుంటే జాంబవంతుడు వెంటబడుతూ ఉంటాడు. సమాజంలో మనుధర్మ చాతుర్వర్ణ వ్యవస్థకన్న భిన్నమైన మరోవ్యవస్థ ఉన్నట్టు జాంబవంతుని వాదనలో తెలుస్తుం ది. ఆదిమ కాలంలో వృత్తులు ఏర్పడ్డ పరిణామ క్రమ చరిత్ర కనిపిస్తుంది. ఈ చిందు యక్షగానంలో ఇంతటి కళావూపతిభ చరిత్ర కలిగిన ఒక కళాకారిణిని గుర్తించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు.ఆమె బాల్యంలో మొదట కట్టిన బాలకృష్ణుడి వేషం నుంచి చివరికి వేసిన కుంతీ వేషం వరకు 70 ఏళ్లకు పైగా కళా పోషణలో జీవించింది ఎల్లమ్మ. తన కళావూపదర్శనల ద్వారా పల్లె నుంచి ఢిల్లీ దాకా సాంస్కృతిక జైతయాత్ర సాగించింది ఎల్లమ్మ. చిందు కళాభివృద్ధి కోసం ఎల్లమ్మ తన నిండుయవ్వనాన్ని హరతి కర్పూరంలా అర్పించింది. 2005 నవంబర్ 9న కన్నుమూసింది. జీవితమంతా కళామ్మతల్లి సేవకే అంకితమై అసువులు బాసిన ఆ అమరకళాకారిణికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? నేటి సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడటం తప్ప. 
-పి. నాగన్న
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
( చిందు ఎల్లమ్మ వర్ధంతి సందర్భంగా...)

Namasete Telangana Telugu News Paper Dated: 09/11/2013 

No comments:

Post a Comment