Monday, November 11, 2013

ఉసురు తీస్తున్న స్వార్ధ రాజకీయాలు! By డేవిడ్


ఆత్మహత్యలూ పోరాట రూపమేనా?

ఆందోళన కలిగిస్తున్న బలిదానాలు 
పోరాడి ఒరిగిన తెలంగాణ వారసత్వం 
కారకులు ఉద్యమ నేతలా, పాలకులా? 
మెడలు వంచాలి తప్ప మరణాలు కాదు! 



తెలంగాణ నినాదమే కీలకమైన నేటి సందర్భంలో ఆత్మబలి దానాలు కొనసాగడం పలువురిని విషాదపరుస్తోంది. ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ తల్లి తన బిడ్డల్ని కోల్పోతు న్నది. బంగారు భవిష్యత్తును వదులుకొని విద్యార్థి, యువత తృణప్రాయంగా తమ ప్రాణాల్ని వదులు కుంటు న్నారు. ప్రాణాల్ని- శత్రువును ఎదిరించే యుద్ధ భూమిలోనే పోరాడుతూ వదలాలి. విలువైన ప్రాణాల్ని చంపుకోవడం వల్ల శత్రువుకు అవకాశమిచ్చినట్లవుతుంది. తెలంగాణ ప్రజల పోరాటం ఈనాటిది కాదు. భూమి కోసం, భుక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన ఘనత ఈ ప్రజలది. చరిత్రలో వీరోచిత పోరాట గాథలు కోకొల్లలు. దొరలు, జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఇక్కడి ప్రజల త్యాగాలు వెల కట్టలేనివి. షేక్‌ బందగీ, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ- భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తికోసం పోరాడి నేలకొరిగారు. అటువంటి వారసత్వం తెలంగాణ ప్రజలది. సందర్భం వేరుకావచ్చు కాని, నిరంతర ప్రవాహంగా సాగుతున్న ఉద్యమాలు తెలంగాణ ప్రజల ఆర్తిని చూపిస్తున్నాయి. 



నేటికి ప్రజల ఆకాంక్షలు తీరలేదు. వనరుల పరాయూకరణలో ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బ్రతుకీడుస్తున్నారు. ఈరోజు ఉద్యమంలో ఆత్మహత్యలు సాగుతున్నాయంటే కారణం నేటి రాజకీయ నాయకుల వైఖరి, వందల కోట్లు డబ్బులు ముట్టజెప్పి తెలంగాణను అడ్డుకుంటున్న ఆంధ్ర పెత్తందార్లదని స్పష్టంగా తెలుస్తుంది. ఇంత ఉద్యమం నడుస్తున్నా, బలిదానాలవుతున్నా కొందరు తెలంగాణ రాజకీయ నాయకులు తమ పదవులను వదలకుండా కూర్చుంటున్నారు. పోరాటం ద్వారా తెలంగాణ సాధించుకోవచ్చు అనే బలమైన విశ్వాసాన్ని ప్రజలలో కల్పించడం లేదు. 
ప్రపంచ చరిత్రలో తెలంగాణ ప్రాంతానికి చెందిన పోరాటాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణలో జరిగిన ప్రతి పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదే. ఒకనాడు బాంచన్‌ నీ కాల్మొక్త అన్న బక్కోనితో బందూకు పట్టించిన తెలంగాణ నేల గత కొంత కాలంగా ఆత్మహత్యల నేలగా మారిపోతుంది. ఒకనాడు దొరకు ఎదురుతిరిగి పోరాడిన నేల నేడు నైరాశ్యంతో ఆత్మహత్యలతో నిండిపోతుంది. ప్రపంచంలో ఎక్కడ పోరాటం జరిగినా అక్కడి ప్రజలు తమ శక్తి వంచన లేకుండా పోరాడి నేలకొరిగారే తప్ప ఎవరూ నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ప్రపంచంలో ఎక్కడా కానరాదు.



కానీ ఒక్క తెలంగాణలోనే అన్యాయానికి ఎదురు నిలిచి పోరాడాల్సిన యువతీ యువకులు ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. నాటి వీరోచిత తెలంగాణ నేడు ఆత్మహత్యల తెలంగాణగా ఎందుకు మారింది? నాడు అన్యాయానికి ఎదురు తిరిగిన యువత నేడు ఎందుకు ఆత్మహత్యలను ఆశ్రయిస్తోంది? ఈ ఆత్మహత్యలకు కారకులు ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులదా లేక ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న పాలకులదా అనేది ఆలోచించాలి.సామాజిక శాస్త్రవేత్త ఇమైల్‌ దుర్క్‌హైమ్‌- ఆత్మహత్యలు మూడు రకాలుగా జరుగుతాయని చెబుతాడు. మొదటిది - అత్మాభిమానం దెబ్బతినడం వలన, వ్యవస్థ తనకు ఏమీచేయదు అనే ఒక మానసిక స్థితికి లోనై ఆత్మహత్య (ఇగోయిస్టిక్‌ సూసైడ్‌) వైపు మొగ్గుతారని, ఇక రెండోవది అల్ట్రూస్టిక్‌ సూసైడ్‌- అంటే పరహిత బలవన్మరణాలు. నా చావుతోనైనా ఈ పరిస్థితి మారాలని ఒక స్థితికి లోనై చేసుకునే బలవన్మరణాలు. 



మూడవది అనోమియా సూసైడ్స్‌- ఈ రకమైన ఆత్మహత్యలు తనను తానూ ఆత్మ బలిదానం చేసుకోవడమే కాకుండా, తన ఆత్మహత్యలకు కారణమైన వారినికూడా బలితీసుకునే విధంగా ఉంటాయి. నేడు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు రెండో రకానికి చెందిన ఆత్మహత్యలుగా గుర్తించవచ్చు. తమ మరణం ద్వారా నైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరి ఈ ప్రాంతంలో దాదాపు 12 వందల మంది యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ వ్యవస్థమీద, తన మీద నమ్మకంలేని వ్యక్తులు ఇటువంటి రూపాలను ఎంచుకుంటారు. 
2009 డిసెంబర్‌ నుండి ఇప్పటి వరకు జరిగిన ఆత్మహత్యలను ఒసారి గమనించించే ఒక ఆశ్చర్యకరమైన, ఆందోళన కలిగించే అనేక నిజాలు మనకు తెలుస్తాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు కోసం 1969లో జరిగిన పోరాటంలో దాదాపు 370 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా, ఏ ఒక్కరూ ఆత్మహత్మకు పాల్పడలేదు. అందరూ పోరాడుతూనే, పోలీసుల కాల్పులకు, దెబ్బలకు, చిత్ర హింసలకు గురై చనిపోయారే తప్ప ఒక్కరూ ఆత్మహత్య చేసుకోలేదు.



2009 నుండి జరుగుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, దానికి నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకుంటున్న శక్తులు ఒక విచిత్రమైన పరిస్థితిని తీసుకొని వచ్చాయి. 2009 డిసెంర్‌లో తెలంగాణకోసం, హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌ నుంచి మినహాయించాలని కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడానికి ప్రయత్నించడంతో, ఆయన ఆత్మహత్య చేసుకునైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తానని ఆసుపత్రిలో ప్రకటించారు. అదే సమయంలో తెరాస ఎమ్మేల్యే హరిష్‌రావు కేసీఆర్‌ను ఆరెస్టు చేయడానికి ప్రయత్నిస్తుంటే- తన ఒంటిపై కిరోసిన్‌ పోసుకుం టానని పోలీసులను బెదిరించారు. ఇటు వంటి సందర్భంలో తమకు దిశా నిర్దేశం చేయాల్సిన నాయకులే ప్రభుత్వాల, పోలీసుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఉద్యమాన్ని నడిపించాల్సింది పోయి, ఆత్మహత్మలకు ప్రయత్నించడంతో నాయకత్వాన్ని గుడ్డిగా నమ్మి పోరాట బాట పట్టిన తెలంగాణ యువతీ యువకులూ ఆదే మార్గాన్ని పట్టారు. కేసీఆర్‌, హరీష్‌రావు కేవలం ప్రభుత్వాన్ని, పోలీసులను నిలువరించడానికే ఆత్మహత్య నాటకం ఆడి ఉండవచ్చు. 



కానీ తెలంగాణ యువతీ యువకులు దానిని సీరియస్‌గా తీసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. దీక్షా శిబిరం వద్ద కేసీఆర్‌, హరీష్‌రావ్‌ ఒంటిపై కిరోసిన్‌ నాటకం ఆడిన కొద్దిసేపటికే ఎల్బినగర్‌లో శ్రీకాంత్‌ చారి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ప్రాణత్యాగం చేశాడు. వేణుగోపాల్‌ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంటల్లో మాడిపోయాడు. సువర్ణ శరీరం దివీ అయి మండింది. వరంగల్‌ జిల్లాలో చెరుకు అంజయ్య విద్యుత్‌ తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకు న్నాడు. అదే జిల్లాకు చెందిన జాగోత్‌ సోమ్లా నాయక్‌ చెట్టునుంచి దూకి ఆత్మహత్మకు పాల్ప డ్డాడు. కానిస్టేబుల్‌ కిష్టయ్య తుపాకితో కాల్చుకొని చనిపోయాడు. ఇట్లా ప్రతి జిల్లాలో వందలాది మంది యువతీ యువకులు నైరాశ్యంతో తమ ప్రాణాలను అర్పించారు. దీనికి కారణం ఎవరంటే స్పష్టంగా ఉద్యమ నాయకత్వమే అని చెప్పవచ్చు. ప్రపంచంలో ఎక్కడా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నాయకులు ఇటువంటి పోరాట రూపాలను ప్రజలకు అందించరు. కేవలం ఒక్క తెలంగాణ రాజకీయ నాయకులే ఈ పోరాటరూపానికి దారి చూపారు. 



నిజానికి తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేక పోరాట చరిత్ర ఉన్నది. తరతరాలుగా తమ శ్రమనంతా ధారపోసి దున్నుకుంటున్న భూమిపై, పండించిన పంటపై తమకే హక్కు దక్కాలని బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా, వారికి మద్దతుగా ఉన్న నైజాంకు వ్యతిరేకంగా గోండు రాజు రాంజీ మూడు రోజులు రోజులపాటు వీరోచితంగా పోరాడి ఉరికంబాన్ని ముద్దాడిన నేల తెలంగాణది. తన చిన్న సైన్యం బ్రిటిష్‌ వారిని, నైజాంను ఓడించలేదని తెలుసు, అయినా వారికి లొంగదలచుకోలేదు. తన ప్రాణం పోయే వరకూ వీరోచింగా పోరాడాడు. ఇది ఈ ప్రాంత ధిక్కార చరిత్ర. ఏ నేలలో గోండు రాంజీ బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాడో అదే నేలలో ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కొమురం భీం 85 సంవత్సరాల తర్వాత పంట కొసం, భూమి కోసం, గోండు సంస్కృతి పరిరక్షణ కోసం- కొత్త పోరాటరూపంతో ముందుకొచ్చాడు. పంట మీద, భూమి మీద, సంస్కృతి సాంప్రదాయాల మీద- ఈ రాజ్యం మీద ఎవరికి అధికారముంటుందో వాడికే సర్వ హక్కులు కాబట్టి, 



అంతిమంగా ఈ పోరాటం ‘మాగోండు రాజ్యం మాక్కావాలి’ అనే నినాదంతో పన్నెండు గోండు గూడేలను ఏకంచేసి జోడెం ఘాట్‌ కేంద్రంగా బ్రిటిష్‌ వారికి, నైజాంకు వ్యతిరేకంగా వీరోచితమైన పోరాటం నిర్వహించి వీరమరణం పొందాడు కోమురం భీం. ఇదీ తెలంగాణ ధిక్కారమంటే! అయితే తెలంగాణ, దక్కన్‌ గత వెయ్యి సంవత్సరాలుగా ఈ నేలమీద హక్కు తనదే అని ప్రకటన చేస్తూనే ఉన్నది. ఈ ప్రకటనలో భాగమే, ఈ స్వయం నిర్ణయాధికారంలో భాగమే, ఈ ధికార్క సంప్రదాయంలో భాగమే- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కంటే ముందే 30, 40 సంత్సరాల పాటు అనేక మంది చరిత్రకెక్కని మహాయోధులు పోరాటం చేశారు. 1857లో హైదరాబాద్‌లో నైజాంకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన తుర్రెబాజ్‌ ఖాన్‌, మోల్వీ అల్లావుద్దీన్‌ వంటి యోధులు కనిపిస్తారు. నైజాం నియంతృత్వ పాలనను ఎదిరించి తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం స్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు ఏకమై 1946 నుండి 1951 వరకు వీరోచితంగా పోరాటం నడిపిన చరిత్ర ఈ తెలంగాణది. 



పండించిన పంటను బలిసిన దొర విసునూరు రామచంద్రారెడ్డి దోచుకోవడానికి ప్రయత్నిస్తే, దొర సైన్యాన్ని ఎదిరించి పంటను కాపాడుకున్న చాకలి ఐలమ్మ పోరాట గడ్డ ఈ తెలంగాణ. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో రజాకార్లను ఎదిరించారనే సాకుతో 11 మంది యువకులను చెట్టుకు కట్టేసి కాల్చి చంపడానికి ప్రయత్నిస్తుంటే రజాకార్లను తన్ని తరిమి ఆ యువకుల ప్రాణాలను కాపాడిన మాదిగ ముత్తమ్మ ధీరత్వం తెలంగాణ. పండించిన పంటను భూస్వామి లాక్కోవడానికి ప్రయత్నిస్తే, పోరాడి ప్రాణమిచ్చిన ముస్లిం యువకుడు బందగీ అమరత్వం గావించిన నేల ఈ తెలంగాణ. దొర పొలంలో వెట్టిచాకిరి చేస్తున్న మహిళలు, తమ పిల్లలకు పాలివ్వడానికి అనుమతికోరితే, పాలు ఉన్నాయోలేవో ఒక పాత్రలో పిండి చూపించమన్న దొరను తన్ని తరిమేసిన గొల్ల సత్తెమ్మ ధిక్కారస్వరం తెలంగాణ. ఇట్లా వేలాది మంది ప్రజలు కుల, మత భేదాలు లేకుండా పోరాడిన రక్తంతో తడిసిన నేల తెలంగాణ. అట్లాంటి వీరోచిత తెలంగాణ గత కొంత కాలంగా ఆత్మహత్మల నిలయంగా మారిపోయింది. 



ఒకనాడు పోరాటానికి నాయకత్వం వహించిన వాళ్ళు- బాంచన్‌ నీ కాల్మొక్త అన్న బక్కోనితో బందూకు పట్టించి దోపిడీ దొరలను తన్ని తరిమేస్తే, నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారు మాత్రం తమ రాజకీయ జిమ్మిక్కులతో తెలంగాణ యువతీ యువకుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ, వారీలో నైరాశ్యాన్ని నింపుతూ ఆత్మహత్యలకు పాల్పడేలా పురికొల్పుతున్నారు. తెలంగాణ వీరగడ్డను నేటి తెలంగాణ నాయకత్వం బొందల గడ్డగా మార్చివేసింది. 2009 నుంచి నేటి వరకు జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది యువతి యువకులు పిట్లల్లా రాలిపోతున్నారు. తెలంగాణ అమరుల ఆత్మఘోషకు కారణం ముమ్మాటికి తెలంగాణ నాయకత్వమే. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆ ప్రాంతంలోని ఉద్యమ సంస్థలు, యూనివర్సిటీ విద్యార్థులు రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా క్రియాశీలంగా ఉండి పోరాటాన్ని నడిపి చూపించారు.



విద్యార్థుల పోరాటాన్ని, నిబద్ధతను చూసిన తెలంగాణ పల్లెలు యూనివర్సిటీ విద్యార్థులనే తమ నాయకత్వంగా భావించి ఉద్యమంలో ముందుకు దూకారు. కానీ విద్యార్థులు ఉద్యమంలో ముందుండి పాల్గొంటే తమ భవిష్యత్తు రాజకీయాలకు ప్రమాదమని గ్రహించిన తెలంగాణ రాజకీయ పాలకవర్గ పార్టీలు జాక్‌ల పేరుతో ఏకమై, ప్రలోభాలు కల్పించి ఉద్యమాన్ని విద్యార్థుల చేతులోంచి లాక్కున్నారు. ఒక నాడు యూనివర్సిటీలకు వచ్చి ప్రమాణాలు చేసిపోయిన రాజకీయనాయకులు క్రమంగా తమ వైపు విద్యార్థులను తిప్పుకునేలా చేసుకున్నారు. ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా ఆర్ట్‌‌స కాలేజీలో లక్షలాదిమందితో బహిరంగ సభ నిర్వహించిన విద్యార్థులే- తరువాత రాజకీయ పార్టీల చుట్టూ ప్రదిక్షణలు చేసే స్థితికి, వారి పిలుపులకు స్పందించే స్థితికి చేరుకున్నారు. 



చైతన్య వంతమైన మేధావులుగా తెలంగాణ పోరాట వారసత్వాన్ని ప్రజలకు వివరించి వారిని పోరాలమార్గాన పట్టించాల్సిన విద్యార్థులు నైరాశ్యానికి గురై ఆత్మహత్మలు చేసుకుంటే, వారిని ఊరేగించి ఇంకా ఆత్మహత్యలు చేసుకునేందుకు పరోక్షంగా కారకులయ్యారు స్వార్ధపర నేతలు. తెలంగాణ ప్రజానీకమంతా తమ ఆశలను విద్యార్థుల మీద వారి పోరాటాల మీద ఉంచుకుంటే, తెలంగాణ విద్యార్థులు మాత్రం పాలక వర్గ రాజకీయ పార్టీల చుట్టూ తిరుగుతూ పోరాటాన్ని తప్పు దారి పట్టించారు.తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్మలకు రాజకీయ పార్టీలు ఎంత బాధ్యతనైతే వహిస్తాయో విద్యార్థులు, ఉద్యోగస్థులు కూడా అంతే బాధ్యత వహించాలి. ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఈ ప్రాంత విద్యార్ధులు, యువకులు నిరాశతో ఇంకా ఇంకా ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండాలంటే. ఇప్పటికైనా తెలంగాణ ధిక్కార స్వరాన్ని, పోరాట వారసత్వాన్ని యువతీ యువకుల్లో నూరిపోయాలి. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనుకాకుండా ఈ ప్రాంత సబ్బండ వర్ణాలు తమకు వారసత్వంగా వచ్చిన పోరాట రూపాన్ని ప్రదర్శించి పాలకుల మెడలు వంచాలి తప్ప మరణం వైపు వెళ్ళకూడదు.

Surya Telugu News Paper Dated: 12/11/2013 

No comments:

Post a Comment