Friday, November 29, 2013

నవ ‘భారత రత్న’ (మహాత్మా ఫూలే) By ఉ.సా


మహాత్మా ఫూలే ఆధునికారంభ కాలంనాటి భవిష్యత్తు కాల దార్శనికత కాల పరీక్షలో నెగ్గి ఆధునికానంతర కాలంలో సైతం మన దేశ బడుగు వర్గ బహుజనులకు క్రాంతి దర్శిగా, దేశీయ లౌకిక సామాజిక ప్రజాస్వామ్య శక్తులకు స్ఫూరిదాయకంగా నేటికీ మార్గనిర్దేశం చేస్తోంది. నవంబర్‌ 27న ఫూలే 123వ వర్ధంతి సందర్భంగా ఆ మహాత్ముని పాత్రను ఓసారి సంస్మరించుకుందాం. ఆనా డు మహాత్మా ఫూలేే తాను జీవించిన కాలం (1827-90) నాటి సమ కాలీన ఆధునిక ప్రపంచగమ నాన్ని గమనించి, ఆ కాలం తెచ్చిన జ్ఞానోదయ మహోదయాన్ని సమర్ధవంతంగా ఆకళింపు చేసుకొన్నాడు. ప్రగతిశీల లౌకిక ప్రజాస్వామ్య హేతుబద్ధ ఆధునిక ప్రాపంచక దృక్పథంతో ఆనాటి మన దేశ కాల స్థితిగతులకు ఆధునికతను అన్వయించడంలో సృజనాత్మక, చరిత్రాత్మక పాత్ర నిర్వహించాడు. 

తాను ఆకళింపు చేసుకొన్న ఆధునిక ఆలోచనా లోచనాలతో నవభారత నిర్మాణానికి నాందిపలికాడు. అందుకే ఆ నవభారత పితామహుడు మహాత్మ ఫూలే మనదేశ వినీలాకాశంలో ఆధునిక వైతాళిక ధృవతారగా నేటికీ వెలుగొందు తున్నాడు. 1855లో ఫూలే రాసిన నవయుగ నవభారత రత్న లాంటి ‘తృతీయ రత్న’ నాటికే ఆ చరితార్ధుని ఆధునిక తాత్త్వికతకి చారిత్రక సాక్ష్యాధారంగా నిలుస్తుంది.ఇప్పటికి (2013) 158 ఏళ్లక్రితం 1855లో మహాత్మా ఫూలేే మరాఠీ మాతృభాషలో, వ్యవహారిక పరిభాషలోరాసిన ‘తృతీయ రత్న’ నాటిక నేటికీ ఇంగ్లీషు లింకు భాషలోకి, మిగతా దేశ భాషల్లోకి తర్జుమా కాకపోవడంతో ఈ మహోన్నత ఆధునిక తాత్త్విక రచన సందేశం అందాల్సిన వాళ్లకి, అందాల్సిన సమయంలో అందకుండా పోయింది. ఈ లోటు పూడ్చే విధంగా ఇప్పుడు ఈ గ్రంథాన్ని తెలుగులో తేవడం జరిగింది.ఫూలే రచనల్లో ‘గులాం గిరి’ ముఖ్యమైన రచనే అయినా, అంతకంటే గొప్ప రచనగా పేర్కొనదగిన ‘తృతీయ రత్న’ ఆ ప్రాముఖ్యతను సంతరించుకోలేకపోయింది. 

1855లో ఫూలే తొలిరచనగా ‘తృతీయ రత్న’ ప్రచురితమైన 18 ఏళ్ల తర్వాత, 1873లో ప్రచురితమైన ‘గులాంగిరి’ ఎంత ప్రామాణికమైనదైనా, అంతకంటే ముందే దానికి తాత్త్విక భూమికను సమకూర్చిన ‘తృతీయరత్న’ అంతకంటే తలమానికమైనది. బ్రాహ్మణీయ వైదికార్య వేదవేదాంగ వర్ణాశ్రమ చారిత్రక మూలాలను వెలికి తీసే హేతుబద్ధ చారిత్రక దృక్పథంతో తన సమకాలీన సామాజిక స్థితిగతులను వాస్తవికంగా అంచనా వేసిన ‘గులాంగిరి’ ఇతివృత్తం సిద్ధాంత అవగాహనకు సంబంధించినది. ఆధునిక ప్రాపంచిక దృక్పథాన్ని అలనాటి మనదేశ పరిస్థి తులకు సృజనాత్మకంగా అన్వయించి, అప్పటి దేశకాల స్థితిగతుల దశాదిశ నిర్దేశం చేసిన ‘తృతీయ రత్న’ ఇతివృత్తం ఆధునిక తాత్త్విక దృక్పథానికి సంబంధించి నది. ఏ సిద్ధాంత అవగాహనకైనా, మరే అవగాహనకైనా తాత్త్విక భూమికే తలమానికం. కనుక బ్రాహ్మణేతర సిద్ధాంత గ్రంథమైన ‘గులాం గిరి’ ప్రామాణికమైనదైతే, భారతదేశ ఆధునిక తాత్త్వికతకి అద్దంపట్టే ‘తృతీయ రత్న’ దానికి తలమానిక మైన దవుతుంది.

1855లో మహాత్మా ఫూలే రాసిన ‘తృతీయ రత్న’ లేదా తృతీయ నేత్ర అనే నాటిక ఆయన తొలి రచనగా పరిగణ పొందుతున్నా మూఢాచార గాఢాంధకార చీకట్లను పారద్రోలిన పొద్దు పొడుపు లాంటి ఆ జ్ఞాననేత్ర రచనకంటే ముందే- 1848లోనే తొలికోడి కూతలాంటి మేలుకొలుపుతో ఆయన తన బ్రాహ్మణేతర సామాజిక విప్లకార్యాచరణకు అంకు రార్పణ జరిపాడు. భారత దేశంలోనే, దేశ చరిత్రలోనే తొట్టతొలి సారి ఫూలే సావిత్రి భాయి ఫూలేే దంపతు లిద్దరూ శూద్రాతి శూద్ర బాలబాలికల కోసం ప్రప్రథమ ప్రాథమిక పాఠశాలలు తెరిచారు. ‘తృతీయ రత్న’ నాటికలోని ముఖ్యపాత్రలైన పాటిల్‌- జోగాభాయి భార్యాభర్త లిరువురిని అలాటి వయోజన విద్యాలయాల్లో చేర్చడంతోనే ఆ నాటికకి ముగింపు పలికారు. అందుకే ఫూలే తన ‘తృతీయ రత్న’ నాటికకి ‘తృతీయ నేత్ర’ అని కూడా మరో పేరు పెట్టారు.తృతీయ రత్న లేదా తృతీయ నేత్ర నాటికలో మహాత్మఫూలే నిక్షిప్తంచేసిన రెండు ముఖ్యాంశాల్ని ప్రస్తావించుకోవాలి.

ఇందులో ఫూలే రెండురకాల తృతీయ ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించాడు. బ్రాహ్మణీయ హిందూ పునరుద్ధరణ వాదులకు (రివైవలిస్టులు), సంస్కరణవాదులకు (రిఫామిస్టులు) భిన్నంగా బ్రాహ్మణేతర హిందూయేతర బహుజన సామాజిక విప్లవ (రెవల్యూషనిస్టు) ప్రజా పంథాని తృతీయ ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిం చాడు. తదుపరి బ్రిటిష్‌ రాజ్‌కి, హింద్‌ స్వరాజ్‌కి భిన్నంగా ‘స్వతంత్ర బహుజనరాజ్‌’ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించాడు. జీవితాన్ని బట్టే చైతన్యం ఉంటుందని ఫూలే జీవితాచరణ చెప్పకనే చెబుతోంది. ఇది తన జీవితం ఒడిలో నేర్చుకొన్న జీవితానుభావం, జీవితావసరం. అభ్యుదయవాదులైన అగ్రవర్ణ మార్క్సిస్టులకు విప్లవం అవసరం కాదు, ఆదర్శం. ఫూలేకి ఆదర్శమే కాదు, అవసరం. అగ్రవర్ణ నేషనలిస్టులకు అది ఆదర్శం కాదు, అవసరమూ కాదు. కారణం వారి జీవితం కుల పీడనకు గురైన పీడిత కులం కాదు.

బడిలో కలిసి చదువుకోవడం వలన ఓ బ్రాహ్మణ విద్యార్థితో ఏర్పడిన స్నేహ సంబంధంతో- 1848లో అతని వివాహానికి హాజరైనప్పుడు జరిగిన అవమానకరమైన సంఘటన బ్రాహ్మణిజంతో రాజీలేని పోరాటానికి ఫూలేేని పూర్తిగా సంసిద్ధం చేసింది. అట్టడుగు పాదాల నుండి పుట్టిన శూద్రులు అగ్రవర్ణాల వారి పాదాల దగ్గర బానిసల్లా పడి ఉండే గులాం గిరి చేయకుండా, శూద్ర ధర్మాన్ని అతిక్రమించి బ్రాహ్మణుల పెళ్ళి ఊరేగింపులో పాల్గొని- అగ్రకుల దురహం కారులు- ‘బ్రాహ్మలందరి కంటే వెనక నడువ్‌, లేదా వెనక్కి వెళ్ళిపో’ అని శాసించిన అవమానకరమైన సంఘటన ఫూలేేలో స్వాభిమాన చైతన్యా నికి నాంది పలికింది. ఆధునిక వ్యక్తిగత స్వేచ్ఛా, సమాన త్వాలను కులం నియం త్రిస్తుం దనే సత్యం జీవిత ఆచరణలో బైటపడి జ్ఞానోద యమైంది. కులవ్యవస్థని, కుల నియంత్రణని దెబ్బతీయకుండా, కుల అంతస్థుల్ని కూలదోసే కుల విప్లవ పోరాటాన్ని నిర్మించకుండా ఆధునిక ఫలాలు అందరికీ సమానంగా అందవన్న సత్యం అనుభవంలోకి వచ్చింది. జీవితాచరణలో వచ్చిన ఈ అనుభవమే ఫూలే సత్యశోధక విప్లవాత్మక ఆలోచనా విధానానికి ప్రేరణనిచ్చింది. అగ్రవర్గాలకు ఊడిగం చేయటమే శూద్రుల విధఇని, అందువల్ల విద్యా విజ్ఞానం, ఆస్తి, అధికారం వారికి నిషేధం అని, ఈ విధి నిషేధాల ఆంక్షల్ని అతిక్రమిస్తే శిక్షకు గురికాక తప్పదని మనుధర్మం శాసిస్తుంది.

‘విధి నిషేధాల శిక్షాస్మృతి మనుస్మృతి’ శాసించే ఈ అనుశాసనంతో ఈ బ్రాహ్మలు శూద్రాతి శూద్రులను శాసించడం లేదా? అనే మౌలికమైన ప్రశ్నని పాత్రోచిత సంభాషణల ద్వారా ఫూలే లేవనెత్తుతాడు. ఈ మౌలిక ప్రశ్నకు సమాధానంగా ‘మనుధర్మ ధిక్కారం ధర్మధిక్కారం కాదు, అధర్మ ధిక్కారం’, అని ‘బ్రాహ్మణధిక్కారం దైవధి క్కారం కాదు, అదైవ ధిక్కారం’ అనే బ్రాహ్మణేతర సామాజిక విప్లవ చైతాన్యాన్ని రగిలిస్తాడు. ఇది తొలిమెట్టు. ఇలా నాలుగు స్థాయిల్లో బ్రాహ్మణేతర సామాజిక విప్లవ చైతన్యాన్ని పెంపొందించటం కోసం ‘బోధించి, పోరాడి, సమీకరించేందుకు’ ఈ నాటికను ఆచరణాత్మక సాధనంగా చేసుకొన్నాడు. తదుపరి ఈ దృక్పథాన్ని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓ సందేశాత్మక నినాదంగా మార్చాడు. మహాత్మా ఫూలేని తన గురువుగా గౌరవించిన అంబేడ్కర్‌ సార్వజనీన మత లక్షణం లేకపోవటమే కాదు, అసలు మత లక్షణమే లేని ‘సనాతన ధర్మ’ నిజానికి మతమే కాదన్నాడు అని చాటిచెప్పాడు. సార్వజనీన ఆధ్యాత్మిక మత ధర్మానికి విరుద్ధమైన ఈ సంకుచి తత్వానికి బ్రాహ్మణిజమే మూలకారణం అని ఎత్తి చూపుతాడు. 
ఈ మత ధర్మమే మనుధర్మానికి మూలాధారమని ఫూలే స్పష్టంచేస్తాడు. 

బ్రాహ్మణులకు అద్వితీయ అగ్రజాత్యాన్ని కట్టపెట్టటం కోసమే బ్రాహ్మణులను దైవ సమానులను చేశారని చెపుతాడు. బ్రాహ్మణీయ అగ్రవర్ణాలకు ఊడిగం (గులాంగిరి) చేయడం కోసమే శూద్రులను రెండుకాళ్ల పశువులుగా ద్వితీయ స్థానానికి, అతిశూద్రులను పశువులకంటే హీనంచేసి తృతీయస్థాయికి నెట్టారంటారు. అలా ఈ వర్ణాశ్రమ బ్రాహ్మణిజం- ఎవరి వర్ణాన్ని బట్టి వారు, ఎవరికి వారు తమ వర్ణ ధర్మాన్నే స్వధర్మంగా భావించి స్వచ్ఛందంగా అనుసరించే స్వచ్ఛంద బానిసత్వాన్ని నెలకొల్పిందని తేల్చి చెప్పారు. దాన్నే గులాంగిరి అని పేర్కొన్నారు. చాతుర్వర్ణాశ్రమ సనాతన ధర్మాన్ని రక్షించే అనుశాసనమే మను శాసనం అని చెప్పాడు. ఇక మనుధర్మాన్ని ధిక్కరిస్తే శంభూకునిలా శిరచ్ఛేదం చేయడానికి ఇది ప్రాచీన యుగం నాటి రామరాజ్యం కాదన్నాడు. శూద్రాతిశూద్రుల తలకాయల్ని ఏనుగులచేత పుచ్చకాయల్లాగా తొక్కించటానికి ఇది మధ్యయుగాల నాటి బ్రాహ్మణీయ పీష్వా రాజుల రాజ్యంకాదన్నాడు. 

చట్టంముందు, విద్యముందు అందరూ సమానమే అని చెప్పే రూల్‌ ఆఫ్‌ లా పాటించే ఆంగ్లేయుల ప్రభుత్వం మధ్యయుగాల నాటి రాచరిక రాజ్యం కాదని, అది ఆధునిక యుగమని చెప్పి వారికి జ్ఞానోదయాన్ని కలిగించాడు. ఒక్క మాటలో విద్యా విజ్ఞాన ఆధునిక జ్ఞానోదయా లతో పాటు పౌరసమాజానికి సంబంధించిన సాంఘిక, సాంస్కృతిక, భావజాల రంగాల్లో బ్రాహ్మణేతర భావ విప్లవ మహోద్యమమే శూద్రాతిశూద్ర బహుజనులను మేల్కొల్పుతుందని ఈ నాటిక చాటి చెబుతుంది. దురాచారాల్ని రూపుమాపే హేతుబద్ధ ఉద్యమం, సాంస్కృతిక పునర్జీవనోద్యమం, బ్రాహ్మణ మతానికి ప్రొటెస్ట్‌ తెలిపే పొటెస్టాంట్‌ ఉద్యమం- నిర్మించిన ఫూలే బ్రాహ్మణేతర భావజాల విప్లవ పోరాటమే- సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక విప్లవ పోరాటానికి తాత్విక భూమికను సమకూర్చింది. ఫూలే స్థాపించిన సత్యశోధక సమాజ్‌ బడుగు వర్గ బహుజనుల పురోగతి కోసం, ప్రగతి కోసం, సాధికారత కోసం- సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక న్యాయ పోరాటానికి శంఖంపూరించింది. అందుకే ఆయన్ని సామాజికన్యాయ పితామహు డిగా చరిత్ర రికార్డు చేసింది. కనుక తృతీయ రత్న లాంటి తృతీయ నేత్ర నాటికను బ్రాహ్మణిజంపై బ్రాహ్మణేతర బహుజనుల తిరుగుబాటుగా అభివర్ణించవచ్చు.
నేడు మహాత్మా ఫూలే వర్ధంతి

Surya Telugu News Paper Dated : 27/11/2013 

No comments:

Post a Comment