Sunday, December 15, 2013

ఏదిరా సమ ఐక్యత ? By కృపాకర్ మాదిగ


ఒరే లడాయి నాధ్
సమ ఐక్యత లేని ఈ సమైక్య జూద మేందిరా ?
మా బతుకు బాస యాసలకు
ఈ తాటాకు కమ్మలు కట్టుడేందిరా?
ఎవరి సొత్తు ? ఎవరి గుత్త ? సబ్బండ సత్త?

ఏ వూళ్ళో నన్నా..
మా మాదిగ , మాలోళ్ళని
మీ రచ్చ బండల మీన కూసో బెట్టుకుంటిరా?

ఏ వూళ్ళో నన్నా..
మీ కులపోళ్ళ ఇళ్ళ సందున
మా కొంపల్ని కట్ట నిస్తిరా?

ఏ వూళ్ళో నన్నా..
మీ ఏలాది ఎకరాల మజ్జెన
మాకొక సెంటు కుంటన్నా వుండనిస్తిరా?
ఏ వూళ్ళో నన్నా..
మా పిలగాళ్ళకి మీ పిల్లల్ని ముడేస్తిరా?
పోనీ,మా పిల్లల్నేమన్న మీకాపురాల్లో
కలిపేసుకుంటిరా?

ఏ వూళ్ళో నన్నా..
సేపిచ్చుకున్న శాకిరీకి
గవ్ముంటు కూలీరేట్లు ఎప్పుడైనా కట్టిస్తిరా?

కూలికి బిల్సుక పోనీకి మా వాడల్లోకి వచ్చినపుడు
మంచాలు, అరుగుల మీంచి మేం లేసినం..
మిమ్మల్ని కూసోమని మర్యాదనిచ్చినం..

చేసిన కూలికని మీ ఇళ్ళ ముందుకొస్తే..
మమ్మల్ని బైటే నిలబెడ్తిరే!
కట్టెలు పగలేపిచ్చి
కట్టుమడి కాడ వూడ్పిచ్చి
నీళ్ళు, నిప్పులు మోపిచ్చి
ఎట్టి పనులు సేపిచ్చి
కూలియ్యక, రేపు మాపని తిప్పిస్తిరే..!

అగ్గురారం, ఆచారి పాలెం
రెడ్డిజిల్లా, నాయుడిపేట
మోటుమాల, మాదిగోనికుంట
వూరు-వాడని వేరు జేస్తిరి!

మా ‘వెలి’ గుంపుల బతుకు వేరు
పనిముట్ల పలుకు వేరు
పనికత్తెల కట్టు వేరు
ఆకాంక్షల తీరు వేరు
ఇళ్ళు,బళ్ళు, గుళ్ళు, నీళ్ళు
ఆఖరికి వల్లకాళ్ళూ మీయి మీవే! మాయి మావే!
కంచం, మంచం పొత్తు కలవనీయని కాడ
మమ్మల్ని నిండా నలగదొక్కిన కాడ
మీ ‘సమైక్యం’పై ‘సపరేటు ’ బండపడ!
ఏదిరా ‘సమ ఐక్యత’ జాడ ? యాడ?


-కృపాకర్ మాదిగ
9948311667 
Namasete Telangana Telugu News Paper Dated : 16/12/2013 



No comments:

Post a Comment